వంటొచ్చా? - SKU
ఈ పేజీ ని పంపండి

మేమంతా ఇక్కడ మొన్న Thanksgiving పండగ చేసుకున్నాం. US లో వాళ్ళు దీనిని నవెంబరు లో చేసుకుంటే, మేము కెనడా లో అక్టోబరు నెలలోనే చేసేసుకుంటాము. ఆ సందర్భం గా మరీ పని ఎక్కువ చేసేస్తూ అస్సలు లైఫు లో టేస్టు లేకుండా పోతోంది.. సరదాగా potluck లంచ్ చేసుకుందాం అన్నారు మా కొలీగ్ కోస్టస్. మాది ఒక బుల్లి ఆఫీసు. అందులో అందరూ తలొక దేశం నుంచీ వచ్చినవాళ్ళం. అందులో ఇద్దరు అమ్మాయిలు తప్ప మిగిలిన వాళ్ళం అందరూ ఒంటరోళ్ళం. కనుక ఒండుకు రమ్మనేసరికి మా అందరికీ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. ముఖ్యం గా నాకు!

"అదేమిటీ పవిత్ర భారతదేశపు ఆడపిల్లవి అయి ఉండి వంట అంటే భయం అంటావేమిటీ?" అనేనా మీ ప్రశ్న?

దానికి ఒక కధ ఉంది. మా అమ్మగారిది అంతా "కట్టే, కొట్టే, తెచ్చే" పద్ధతి. నాన్నగారు పొద్దుటే భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళేవారు. కనుక తొమ్మిదిన్నర కల్లా ఇంట్లో పని అయిపోయేది. ఇప్పుడు నాన్నగారు రిటైర్ అయిపోయినా అమ్మ ఇంకా వంట ఆ టైముటేబుల్ ప్రకారం చేసేస్తూ ఉంటారు.

"ఎందుకే అమ్మా.. తీరిగ్గా చేసుకోవచ్చు కదా.. ఎందుకూ అలా ఎవరో తరుముకొస్తున్నట్టు అలా ఉరుకులూ పరుగులూ పెడతావు?" అని అడిగితే,

"ఆ.. వంటింట్లో అన్నేసి గంటలు కొట్టుకుపోవటం చిరాకు" అని సమాధానం వచ్చేది.

నాదీ అదే అభిప్రాయం. కాకపోతే, కొద్దిగా తేడా. అమ్మ పాపం ఆ చిరాకు వలన త్వరగా వంట తెమిల్చేసి బయట పడితే, నేను చిరాకు అని వంట ఇంట్లోకి అడుగు పెట్టేదాన్ని కాదు. దానికి తోడు చదువు పూర్తవటం తోటే ఉద్యోగం, కంప్యూటర్ క్లాసులూ, ఫ్రెండ్స్, ఈ మిగిలిన వ్యాపకాలతో వంట అనే విద్య ని నేర్చుకోవటం కొంచెం అశ్రద్ధ చేసాను.

అయినప్పటికీ నాకు ఇష్టమైన కొన్ని వంటకాలని చేయటం లో మాత్రం మంచి ప్రావీణ్యమే సంపాదించాను. ఉదాహరణ కి నాకు సేమ్యా ఉప్మా అంటే పిచ్చ ఇష్టం. మా చెల్లెలికి అదంటే ఇష్టం లేదు. మిగిలిన వాళ్ళకీ అ ఉప్మా అంటే పెద్దగా భ్రమ లేదు. కనుక ఎప్పుడైనా చేయమంటే, ఎవరూ తినరు కనుక చేయటానికి అమ్మ అంతగా ఉత్సాహం చూపేవారు కాదు. తప్పదు కనుక నేనే చున్నీ ని బిగించి రంగం లోకి దిగి నేర్చుకున్నాను. వాళ్ళు నాకు చేసి పెట్టకపోగా, నేను చేసినది రుచి చూడకపోగా, నేను తింటుంటే, "అబ్బా.. పాముల్లా ఉండే ఆ ఉప్మా ఎలా తినగలవే బాబూ!?" అని రకరకాల ఎక్స్ ప్రెషన్లు చూపించేవారు. దానితో ఒళ్ళు మండి, వాళ్ళెవరినీ తినమని బ్రతిమాలకుండా, నా ఒక్కదానికోసమే చేసుకొని, నేనొక్కదాన్నే లొట్టలు వేసుకుంటూ తినేసేదాన్ని.

ఈ రకం గా నేను ఒక్క మనిషికి ఉప్మా చేయటం లో గొప్ప ఎక్స్ పర్ట్ ని అయిపోయాను. ఒకసారి మా కజిన్ వచ్చినప్పుడు తను తనకి "సేమ్యా అంటే ప్రాణం" అనేసరికి నా లాంటి మనిషి మరొకర్తి దొరికినందుకు తెగ ఖుషీ అయిపోయి ఆ ఉప్మా చేసాను. అయితే, ఒచ్చిన చిక్కల్లా.. నాకు ఒక్క మనిషి కి చేయటం బాగా అలవాటు అయిపోయి ఇద్దరికి చేయటానికి కొంచెం ఇబ్బంది పడి, ఉప్మా ని కొంచెం పాడు చేసను. ఉప్పు విషయం లో కన్ఫూజ్ అయి.

మా నాన్నగారు వెక్కిరించటం లో ఫస్ట్ రకం! ఆయన నా వీక్ నెస్ ని కనిపెట్టేసి, నా వంట గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ కూడా, "మా సూర్య సేమ్యా ఉప్మా మా బాగా చేస్తుంది(ట .. ఆయన రుచి ఎప్పుడూ చూడలేదు కదా!) ఒక్కళ్ళకి అయితే చూసుకోనక్కర్లే! ఇద్దరికీ లేక ఇంకా ఎక్కువ మందికి చేయాలంటే మాత్రం.. అన్ని సార్లు పొయ్యి వెలిగించాల్సిందే!" అని చెప్పటం మొదలెట్టారు. మా నాన్నగారే నాకిచ్చిన మరొక కితాబు ఉంది. అదే, నేను మంచి స్పోర్టీవ్ మనిషిని అని! కనుక ఆయన అలా వేళాకోళాలు ఆడినప్పుడల్లా.. లోపల్లోపల ఉడికిపోతున్నా, పైకి మాత్రం "say cheeze" అన్నట్టు నవ్వేదాన్ని. లేకపోతే నన్ను ఏడిపించటానికి ఆయనకి మరొక కారణం చూపించిన దానిని అవుతాను.

మొత్తానికి జీవిత పాఠం లో వంట అనే చాప్టర్ నేర్చుకోకుండానే కెనడా వచ్చి పడ్డాను. నా ఉద్దేశ్యం ప్రకారం అదొక బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఒకటి రెండు సార్లు పాడు చేస్తే అదే వస్తుంది అనుకున్నాను. ఇక్కడకి వచ్చాక సంవత్సరానికి గానీ నేను పొయ్యి వెలిగించాల్సిన అవసరం రాలేదు. అంటే.. అంతవరకు నా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండటమో, చేసినా, కేవలం పై పై పనులు చేయటమో చేసాను. పై పై పనులంటే, నా వంట చూసి భయపడి, లేక నా వంట గురించి నేను చెప్పిన కధలు విని ఖంగారు పడి, నాకు మిగిలిన పనులు (అంటే, క్లీన్ చేయటం, కూరలు తరగటం లాంటివి) అప్పగించేవారు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఎవరైనా కూరలు తరిగి పెట్టి, వంటింట్లో మనం వంట చేస్తూ చేసిన mess అంత క్లీన్ చేసే వాళ్ళు ఉంటే, వంట చేయటం ఏమన్నా బ్రహ్మ విద్యా?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.