TV కార్యక్రమాలతో తంటాలు.. - SKU
ఈ పేజీ ని పంపండి

చదువుకునే రోజుల్లో మేం ముగ్గురు అక్కచెళ్ళెళ్ళూ ఒక గదిలో పడుకునేవాళ్ళం. అదే గదిలో టెలివిజన్ కూడా వుండేది. మా అక్కకి చదువుకోవటానికి అన్నీ సరీగ్గా కుదరాలి. రోజూ బోల్డుసేపు చదివేది. తనది Bi.P.C గ్రూప్ కావటం తో ఆ బొమ్మలూ అవీ ఎప్పటికీ ఆ చదవటం పూర్తి అయేది కాదు. ఆ చదివేటప్పుడు తనకి పూర్తిగా ఐడియల్ ఎట్మాస్ఫియర్ వుండాలి.. అంటే అస్సలు శబ్దాలు రాకూడదు.. ఎవరూ గట్టిగా మాట్లాడకూడదు.. నా లాంటి చదువూ సంధ్యాలేని వాళ్ళం కూడా టెలివిజన్ చూడకూడదు. (నేనూ చదువుకోవాలి.. కానీ నాకు పరీక్షల ముందు రోజు తప్ప చదవాలనిపించదు.. ఎలాగూ పరీక్షల్లో నా చుట్టూ కూర్చునే నా friends తెలివైన వాళ్ళు, మంచోళ్ళు.. అర్థమైంది కదూ!) నాకెమో టెలివిజన్ లో వచ్చే నా కిష్టం అయిన సీరియల్స్ కానీ సినిమా పాటలు కానీ మిస్ అవ్వాలంటే ఎంతో బాధ గా వుండేది.

మాకు కాకినాడలో పెద్ద ఏంటెన్నా పెట్టుకుంటే మద్రాస్, శ్రీలంక టెలివిజన్ చానెల్స్ వచ్చేవి. అవి భాష తెలీదు. అయినా నేనూ మా అమ్మగారు కూర్చుని వాటిని చూసేసేవాళ్ళం. అంతటితో ఊరుకునే వాళ్ళం అనుకుంటే మీరు పొరపాటుపడ్డారన్నమాటే. వాటిని తెలుగులో తీసారా? తీస్తే వాటిలో ఎవరు నటించారు. ఎవరి నటన బాగుంది? ఎందులో పాటలు బాగున్నాయి? ఇంక మా విశ్లేషణ మొదలెట్టేవాళ్ళం. ఇది రాత్రి 10 అయినా.. 11 అయినా ముగిసేది కాదు. పాపం మా అక్క సహనాన్ని ఆ విధంగా పరీక్షించేవాళ్ళం.

శాటిలైట్ చానెల్స్ రావటం మొదలెట్టాక కొత్త బాధలు మొదలయ్యాయి. తప్పించుకోలేని చదువులు, తర్వాత ఉద్యోగం వలన నేను టెలివిజన్ చూసేది రాత్రప్పుడే. మధ్యాహ్నం ఇంట్లో అమ్మ, మా చెల్లెలు, మా అమ్మమ్మ వుండేవారు. మా అమ్మమ్మకి పాపం పాత సినిమాలు వేసే ETV చూడాలని కోరిక. మా చెల్లెలు అన్నీ నా ఇష్టాలే దాదాపు.. కనుక బోర్.. అంటూ అవి అస్సలు పెట్టనిచ్చేది కాదు. నాన్నగారు ఈ టైము కి రిటైర్ అయిపోయారు. పాటలు వద్దు ఏదైనా సినిమా పెట్టు అని ఆయన కూడా అమ్మమ్మకి ఓటు వేసేవారు. మా అమ్మగారికి ముద్దుల కూతురు మా చెల్లెలు. దానికి కోపం వస్తే బలయ్యేది తనే అని ఆవిడకి తెలుసు.. అలాగని మా అమ్మమ్మ మనసు నొప్పించలేరు. కనుక..

"పోనీ దానికి కావలసింది పెట్టుకోనీ అమ్మా.. ఈ సినిమా మనం చూసేసాం" అని గోపి (గోడమీద పిల్లి!!) టైపులో చెప్పేవారు.. తనకీ పాత సినిమాలే ఇష్టమైనా!! ఆఖరికి వాళ్ళు ఎదో అగ్రిమెంట్ కి వచ్చేవారు. అటువంటప్పుడు పంతం నెగ్గనివారు ఏం చేసేవారో తెలుసా? కూర్చుని తమకి ఇష్టం లేని సినిమా చూస్తూ.. దానిలో తమకి నచ్చనివి, రెండోవాళ్ళకి నచ్చినవీ చూసుకొని వాటిమీద తమ జోక్స్, లేక వ్యంగ్య వ్యాఖ్యలూ చేసేవారు. మా చెల్లెలు దీనిలో అఖండురాలు. ముఖ్యంగా కళ్ళు మిటకరించి మాట్లాడే గిరిజ, కన్నాంబ, సావిత్రి (కొన్ని సందర్భాలలో) లమీద తను వేసే జోక్స్ వినితీరాలి!! ఒకసారి రామారావు, సావిత్రి గార్లు నటించిన "రక్తసంబంధం" చిత్రం నేనూ వాళ్ళతో కలిసి చూసాను. అందులోని సెంటిమెంట్ సీన్లకి మా అమ్మమ్మ "చలించిపోతుంటే" మా చెల్లెలు వాటిని గురించి వేసిన జోక్స్ ఓ మై గాడ్! నాకు ఇప్పటికీ నవ్వు వస్తోంది. మా అమ్మమ్మా ఊరుకునేది కాదు.. మా చెల్లెలికి ఇష్టమైన డాన్స్ సినిమాలనీ.. వాటిలోని డిస్కొ, బ్రేక్ డాన్స్ లకి తను పెట్టే పేర్లు తక్కువేమీ కాదు. ఒకోసారి ఇటువంటి సందర్భాలలో వారి వేళాకోళాలు శృతి మించి కోపాలలోకి దారి తీసేవి.

ఇంక రాత్రప్పుడు అందరూ వచ్చి టెలివిజన్ వున్న గదిలో భోజనాలు చేసేవాళ్ళం. శాటిలైట్ చానెల్స్ లేని క్రితం 8.00 గంటలకి చిత్రలహరి.. చిత్రహార్.. లేక ఎదో ఒక సీరియల్ వచ్చేవి. ఆ తర్వాత.. అంతరంగాలు.. ఆర్తనాదాలూ.. వగైరా కుంకుడుకాయ రసం సీరియల్స్ రావటం మొదలెట్టాయి. అరగంట మౌనంగా టెలివిజన్ కి కళ్ళప్పగించి చూస్తూ.. మధ్య మధ్యలో వచ్చే పచ్చిమిరపకాయలూ.. పంటి క్రింద రాళ్ళూ చూసుకోకుండా తింటూ.. అవి వచ్చినప్పుడు మా అమ్మగారిని శ్రద్ధగా వంట చేయటం లేదని విమర్శిస్తూ.. గడిపిన ఆ రోజులు ఇప్పటికీ నవ్వు వస్తాయి. అమ్మమ్మ ఎప్పుడైనా సంగీతం కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు ఈ సీరియల్స్ మిస్ అయితే.. మా అమ్మగారు తనకి భోజనం పెడుతూ ఆ రోజు జరిగిన కధ చెప్పేవారు.

ఇంక అందరూ కలిసి టెలివిజన్ చూసే రాత్రి వేళప్పుడు మాత్రం పెద్ద ఇబ్బందే వచ్చేది. నాకు Sony, MTV, Star చానెల్స్ అంటే ఇష్టం. అందులో వచ్చే సినీ సంబంధమైన కౌంట్ డౌన్లు, ఇతర కార్యక్రమాలు ఎక్కువ చూసేదాన్ని. జీళ్ళ పాకం లా సాగే సీరియల్స్.. అవి ఇంగ్లీష్ అయినా.. తెలుగు అయినా.. హిందీ అయినా నాకు చెడ్డ చిరాకు వేసేవి. మా ఇంట్లో అందరూ ఆ ETV వారి "కళంకిత", "అంతరంగాలు", దూరదర్శన్ "ఋతురాగాలు" (ఈ సీరియల్ మధ్యాహ్నం వచ్చేది.. కానీ మళ్ళీ రాత్రి చూసేవాళ్ళు మా ప్రాణాలు తీయటానికి!! కావేరి పాత్ర చనిపోయేంత వరకూ క్రమం తప్పకుండా చూసిన వాళ్ళలో నేనూ ఒకదాన్ని. తర్వాత దానిని మరీ జీళ్ళపాకం చేసేసారు.) జెమినీ లో ఎవో సీరియల్స్.. వాటి పేర్లు గుర్తు లేదు.. వాటిని తప్పకుండా చూసేవారు. నేను పైన చెప్పిన 3 సీరియల్స్ ని ఆ రోజుల్లో చాలా చిరాకు పడేదాన్ని. నాకు ఇష్టమైన డిటెక్టివ్ సీరియల్స్ అన్నీ రాత్రి ఎప్పుడో వచ్చేవి. అప్పటికి ఈ మిగిలిన చానెల్స్ అందరూ సినిమా మొదలెట్టేవారు. నా కిష్టమైన స్టోరీలు చూడటానికి మిగిలిన వారికి ఇంట్రెస్ట్ లేదు. అందుకని నాన్నగారి వైపునుండీ వచ్చేదాన్ని. ఆయనకీ సస్పెన్స్ ధ్రిల్లర్స్ అంటే ఇష్టం.. నాన్నగారికి నెమ్మదిగా కధ చెప్పేసి.. ఆయనకీ ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ఆయన్ని నేను చెప్పినదానికి Yes అనిపించేదాన్ని. మా చెల్లెలు ఎలాగూ నామీద కోపంగా లేనప్పుడు నేను చెప్పింది వింటుంది. కనుక మిగిలిన మా అమ్మగారు, అమ్మమ్మలని

"ఇంట్లోనే వుంటారుగా.. మధ్యాహ్నం చూసుకోండి.. రాత్రి టెలివిజన్ మాది" అని చెప్పి నా ఇష్టం నెగ్గించుకునేదాన్ని.

ఈ టెలివిజన్ గొడవల టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఒకాయన ఈ టెలివిజన్ వల్ల వచ్చే విచిత్ర పరిస్థితుల గురించి తన అనుభవాలు ఈ విధంగా చెప్పారు.

వాళ్ళ నాన్నగారికి టెలివిజన్ వార్తలు అంటే ఆశక్తిట. వాళ్ళ నానమ్మ గారికి మా ఇంట్లో లాగానే కుంకుడుకాయ రసాలు ఇష్టం ట. నా ఫ్రెండ్ కి .. ఇంకేముందీ.. హిందీ చానెల్స్, అవి ప్రసారం చేసే సినీ సంగీత సంబంధిత కార్యక్రమాలు ఇష్టంట. కానీ.. మా ఇంట్లో లాగ దౌర్జన్యంగా టెలివిజన్ చానెల్స్ ని ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పేయటానికి అక్కడ రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ ఆయన నాన్నగారు, నానమ్మ గారి మధ్య తిరుగుతూ వుండేదిట. వాళ్ళ నానమ్మ గారు 7.00 గంటలప్పుడు టెలివిజన్ లో ఎదో చూస్తున్న వాళ్ళ అబ్బాయితో..

"అబ్బాయ్.. "కళంకిత" మొదలైందా?" అని అడిగేవారుట.

దానికి నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు

"అమ్మా.. ఇంకా టైము 7.00 అయింది అంతే. నువు ఇంకొక గంట సేపు తర్వాత రావచ్చు." అని చెప్పేవారుట. ఆయన చూసే వార్తలు అయిపోయాక ఆవిడకి కావలసిన సీరియల్ వస్తుండగా.. ఆ చానెల్ మార్చి..

"అమ్మా.. నీ సీరియల్ మొదలవుతోంది" అని ఆవిడకి చెప్పేవారుట.

ఆవిడ మళ్ళీ తను చూసేవి చూడటం అయ్యాక.. అబ్బాయ్.. వార్తలు వస్తున్నాయ్.. అని తన కుమారుడికి రిమోట్ అప్పగించేవారుట!

వాళ్ళ నానమ్మ గారు తనకి నచ్చిన సినిమాలు చూసేటప్పుడు వాటిపై తన వ్యాఖ్యలు మొదలెట్టేవారుట. ఆవిడకి ఇష్టమైన జయసుధ, సుహాసినీ ల స్త్రీ వాద డైలాగులు వస్తే చాలా ఆనందించేవారుట. వాళ్ళింటిలో కూడా వున్న వివిధ అభిరుచుల వలన ఆవిడకి ఇంట్రెస్ట్ లేని సినిమా ఏదైనా ఎవరైనా చూస్తున్నప్పుడు.. ఆవిడ కూడా వచ్చి ఆ సినిమా చూసేవారుట. మధ్యలో అడ్వర్టైజ్ మెంట్లు వచ్చినప్పుడు చానెల్స్ మార్చినప్పుడు ఏదైనా తెలుగు సినిమా వస్తున్న చానెల్ పెట్టినప్పుడు.. ఆవిడ ఏ పాత సినిమా అయినా సరే చూసిన మరుక్షణం గుర్తు పట్టేసేవారుట. అక్కడనుంచి మళ్ళీ చానెల్ మార్చబోతుంటే "అబ్బాయ్ ఒక్క క్షణం ఆగు.. ఇప్పుడు మంచి డైలాగ్ వస్తుంది అనో.. లేక ఇప్పుడు మంచి పాట వుంది" అనో చెప్పి చానెల్ మార్చనిచ్చేవారు కాదుట.

ఇంక ఈ సినిమాలూ, సీరియళ్ళూ చూడటం తో సరిపోలేదు. మా ఇంట్లో అద్దెకున్న అందరిళ్ళల్లోనూ టెలివిజన్ లు వున్నాయి. మా ఇంట్లో పనమ్మాయి ఇంట్లో కూడా టెలివిజన్ వుంది. కానీ తను కూడా మధ్యాహ్నం "ఋతురాగాలు" టైము కి వచ్చేసేది. అది వచ్చేది అరగంట. తరువాత.. మా పనమ్మాయి పనులు చేసుకుంటుంటే.. ఆమె దగ్గర కూర్చుని ఆ రోజు జరిగిన కధ, తరువాత "కావేరి" (ఆ కధలో కధానాయకి పేరు) ఏం చేయాలో.. వీటితో మా పెరట్లోని నూతి గట్టుని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ఒక వేదిక చేసేసేవారు. మేము వాళ్ళందరినీ దీని గురించి ఏడిపించేవాళ్ళం. కానీ ఏమాత్రం వీలయినా మేమూ ఆ సీరియల్స్ చూసేవాళ్ళం.. మరి విమర్శించటానికి కనీసం దాని కధ తెలియాలి కదా :-) కానీ ఏవైనా క్రికెట్ మాచ్ లు గానీ.. ఎవరైనా జాతీయ నాయకులు మరణించటం వలన సంతాప దినాలు ప్రకటించబడినప్పుడు కానీ ఈ సీరియల్స్ రానప్పుడు అందరం మామా అభిమాన కార్యక్రమాలు చూడలేకపోతున్నందువలన తెగ బాధ పడిపోయేవాళ్ళం.

ప్రతీ మనిషికీ ఎదో ఒక విష్యంలో అభిరుచి వుంటుంది. అది ప్రక్కవారికి విపరీతం అనిపించవచ్చు. నాకు సినిమాలంటే పిచ్చి.. మరొకరికి సంగీతం అంటే.. మరొకరికి ఆటలంటే.. ఇంకొకరికి మరేదో.. కానీ అందరూ వాటిని చూడవలసిన టెలివిజన్ ఒక్కటే వుంటే మాత్రం నిజంగా ఇబ్బందే!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.