ఇంటివారు.. అద్దెకున్నవారు! - SKU
ఈ పేజీ ని పంపండి

కాకినాడలోని మేము ఉండే ఇల్లు మా అమ్మమ్మది. కనుక, ఇంటి అద్దెలూ, వగైరా విషయాలు అన్నీ అమ్మమ్మే చూసుకుంటుంది. మేము వున్న రెండు పొర్షన్లు కాక మిగిలిన నాలుగు పోర్షన్లు అమ్మమ్మ అద్దెలకి ఇస్తుంది. కానీ అద్దెకి ఇచ్చేందుకు బోలెడు కండీషన్లు, నియమాలూ, నిబంధనలూ! అందులో మళ్ళీ పైన పోర్షన్ కి కొన్ని రిలాక్షేషన్లు! ఎందుకంటే, దానికి వచ్చే అద్దె ఎక్కువ, పైగా, అది మాకు సంబంధం లేకుండా విడిగా వుంటుంది.

ఇంక అమ్మమ్మ నిబంధనల విషయానికి వస్తే...

ఇంట్లో వున్న వాళ్ళు తనతో సఖ్యంగా వుండాలి. Non-vegetarian తినకూడదు, ఎక్కువ నీళ్ళు వాడకూడదు, ఇంటికి ఎక్కువ వచ్చే పోయే వాళ్ళు వుండకూడదు, తనకి వ్యతిరేకంగా గ్రూపులు కట్టకూడదు, తనకి ఆగ్రహం వస్తే, చెప్పిన వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలి!

ఎవరైనా ఈ కండీషన్లు అన్నీ ఒప్పుకుని ఇంటిలోకి అద్దెకి వస్తే, ఇంక వారిని royal treatment తో అదరగొట్టేస్తుంది. వాళ్ళతో రోజూ కూర్చుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ ఇంట్లోవీ, బయటవీ చెప్తూ కాలం గడుపుతుంది. ఒకోసారి మా అమ్మగారు "ఎందుకు వాళ్ళని అనవసరం గా నెత్తికి ఎక్కించుకోవటం?" అని హెచ్చరిస్తూనే వుంటారు. అమ్మ భయపడినట్టుగానే, కొన్నాళ్ళకి అవతల వాళ్ళకీ అమ్మమ్మ కీ మధ్య సరసాలు విరసాలు అవుతాయి. దానికి కారణం పైని నిబంధనలు ఏవైనా అతిక్రమించటమైనా కావచ్చు, లేదా అమ్మమ్మకి నచ్చని వారి మాటల సరళి అయినా కావచ్చు. ఈ రకంగా అమ్మమ్మ కి ఎవరైనా అద్దెకున్న వాళ్ళు ఆగ్రహం తెప్పిస్తే వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమనేయదు. కొన్నాళ్ళు silent war జరుగుతుంది. మా ఇంట్లో అందరం భయపడేది ఈ stage గురించే!

ఈ silent war జరుగుతున్నప్పుడు మేమెవ్వరమూ అవతల వాళ్ళతో మాట్లాడకూడదు. ఇంట్లో పనస కాయైనా, అరటి గెల అయినా కాపుకి వస్తే, వాళ్ళకి ఇవ్వకూడదు, గోరింటాకు, కరివేపాకు, పువ్వుల మొక్కల మీద వాళ్ళు ఏ మాత్రం దురుశుగా ప్రవర్తించినా (ఈ మొక్కల మీద ఇంట్లో అద్దెలకున్న అందరికీ అధికారం వుంది, ఎందుకంటే ఇవి నిత్యావసరాలు) వాళ్ళు ఆ చెట్లకి దూరమవ్వాల్సిందే (ఇటు వంటి పరిస్థితి వస్తే వాళ్ళు తప్పని పరిస్థితి లో వాటిని బయట కొనుక్కునే వాళ్ళు.. అది కూడా తనని అవమానించటానికే చేసారు అని అనుకునేది అమ్మమ్మ), రోజూ ఇంట్లో పూసిన విరజాజి, సన్నజాజి, కనకాంబరం పువ్వుల తో కట్టే దండల్లో భాగం ఇంక వాళ్ళకి ఇవ్వబడదు, వాళ్ళూ, వాళ్ళింటికి వచ్చేవాళ్ళు gate సరిగా వేస్తున్నారా లేదా అన్న విష్యం మరింత నిశితంగా గమనించబడేది, వాళ్ళు రోజుకి నీళ్ళు పట్టుకునే బిందెల సంఖ్య లెక్కింపబడేది (మా ఇంట్లో అందరికీ ఒకటే మునిసిపల్ మంచినీళ్ళ కుళాయి), అంతే కాక ఇంట్లో మిగిలిన అద్దెలకున్న వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడకూడదు. మాట్లాడారా.. అమ్మమ్మ నిష్టూరాలకి గురౌవ్వాల్సిందే. మా పిల్లకాయల్ని అయితే "ఇంటికి సిమ్హాలక్ష్మి, పొరుగ్గి మహాలక్ష్మి" అంటూ మొదలెట్టి ఏ అత్యవసరమైన కారణం చేత వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చిందో తనని సంతృప్తికరమైన వివరణ ఇచ్చేంత వరకూ ఒదిలేది కాదు. మేమెళ్ళి అమ్మ దగ్గర మా గోడు చెప్పుకునే వాళ్ళం. రోలు వెళ్ళి మద్దెలతో చెప్పుకున్నట్టు ఉండేది అప్పుడు పరిస్థితి! పాపం అమ్మ కి కూడా అవతల వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మొఖం తిప్పేసుకోవటం చాలా ఇబ్బందిగా వుండేది. అమ్మమ్మ తో మాటలు లేవు కనుక వాళ్ళు కూడా ఏమైనా కావాలంటే అమ్మమ్మ తరువాత ఇంటికి care-taker కనుక వచ్చి అమ్మని కానీ, నాన్నగారిని కానీ అడిగేవారు. అప్పటికీ "మా అమ్మని అడగండి" అని అమ్మ, "మా అక్క ని అడగండి" అని నాన్నగారూ polite గా తప్పించుకునేవారు. మా నాన్నగారు అయితే ఒకోసారి "ఆలా ఆ ఇంటాయన వచ్చి మాట్లాడుతోంటే నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతే ఏం బాగుంటుందే?" అని అమ్మని ప్రశ్నించేవారు. దానికి అమ్మమ్మ "ఏం దొబ్బిడాయి! నాతో మాట్లాడటానికి ఏం? రోగమా?" అని వాళ్ళ అభ్యంతరాలు కొట్టిపారేసేది. అమ్మ, నాన్నగారు తప్పించుకుంటే ఇంక గతిలేక వాళ్ళు అమ్మమ్మ తో మాట్లాడటానికి వచ్చేవారు. అప్పుడు scene నిజంగా చూడాలి. ఒకోసారి ఈ confrontations మా అమ్మ, నాన్నగార్లకి కూడా నవ్వు తెప్పించేవి!

అమ్మమ్మ తన అక్కసు అంతా ఎలా వెళ్ళగక్కుదామా అని చూసేది. వాళ్ళు ఎలా ఈ meeting త్వరగా ముగించేద్దామా అని చూసేవారు. సాధారణంగా అమ్మమ్మే నెగ్గేది. ఈ type meetings కి సాధారణంగా ఇంట్లోని మొగాయన.. వచ్చేవారు. వాళ్ళు "మా ఆడవాళ్ళకి చెప్తాం లెండి" type సమాధానాలతో అమ్మమ్మ ని శాంతింపచేసేవారు. ఆ తరువాత కొన్నాళ్ళు పరిస్థితులు మామూలు గా వుండేవి. మళ్ళీ అరుగు మీద సమావేశాలు మొదలయేవి. మేం మళ్ళీ అమ్మమ్మ కి ఎప్పుడు ఆగ్రహం వస్తుందా అని చూసేవాళ్ళం.

అమ్మమ్మ, అద్దెకున్న వాళ్ళ రిలేషన్ ఎక్కువగా మేం పిల్లలం ఉపయోగించుకునేవాళ్ళం. అమ్మమ్మ మీద కోపం వచ్చిందనుకోండి, వెళ్ళి అమ్మమ్మ కి ఇష్టం లేని వాళ్ళ పిల్లలతో కూర్చుని ఆడేవాళ్ళం. మా అమ్మ గారు అటు తనకీ ఇటు మాకూ చెప్పలేక మధ్యలో సతమత మయేవారు. అలాగే మామీద కోపం వచ్చినప్పుడు అమ్మమ్మ ఇంట్లో తనకి ఇష్టులైన అద్దెలకున్న వాళ్ళచేత తనకి కావల్సిన పనులు చేసిపెట్టమని అడిగేది. వాళ్ళని తను అలా ఏదైనా చేసిపెట్టమని అడిగితే మాకు తిక్క రేగేది. "సరే.. అయితే, ఇంక నన్ను మళ్ళీ ఏమైనా అడుగుతుందెమో చూడు. వున్నారుగా.. తన ఇష్టులు! వాళ్ళచేతే చేయించుకోమను!" అని అమ్మ దగ్గర శపధాలు చేసేవాళ్ళం. దానికి మా అమ్మమ్మ.. "మందుకి పిలిస్తే, మాసికానికి వచ్చే వీళ్ళని నమ్ముకునే కన్నా.. వాళ్ళని బతిమాలుకోవటమే మేలు!" అని retart ఇచ్చేది. మధ్యలో మా అమ్మగారు మౌన ప్రేక్షకురాలు!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.