Safety Pins తో విమానం హైజాక్!? - SKU
ఈ పేజీ ని పంపండి

September 11 దాడుల ద్వారా టెర్రరిస్ట్ లు ఏ విధంగా అమెరికన్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసారో చూస్తుంటే చాలా బాధ వేస్తోంది. వారి లో ఒక ఆవేశం. మనం వీళ్ళకి పోనీ కదా అని అవకాశాలు ఇచ్చి ఆదుకుంటుంటే (?) వీళ్ళు వచ్చి మామీద దాడి చేస్తారా?? ఆ confusion లో వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడాదో తేల్చుకోలేని సంశయం లో వున్నారు.

San Fransisco లో ఎదో ballet ప్రదర్శన తిలకించటానికి గత వారం San Jose వెళ్ళాను. వెళ్ళటం సరిగానే, ఏ సంఘటనా లేకుండా అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు నాది San Jose - Toronto డైరెక్ట్ flight. టెర్రరిస్ట్ దాడుల వల్ల జనాలు flights ఎక్కటం లేదు.. కనుక వచ్చిన ఆ నష్టాలని భరిస్తూ పని చేయలేమంటూ Air Canada ముందే చేతులెత్తేసి, కొన్ని flights ని రద్దు చేసింది. వాటిలో నా San Jose - Toronto flight ఒకటి. కనుక San Fransisco లో నా టికెట్ ని San Jose - Chicago, Chicago - Toronto గా మార్చారు.

* * *

Toronto లో వున్న విపరీతమైన security checkings చూసినప్పుడే ఇంత జాగ్రర్తా! అనుకున్నాను. మనని మనం కాపాడుకోవాలంటే తప్పదు అనుకున్నాను. నేను వెళ్తున్నది ఒక Dance కార్యక్రమానికి.. కనుక మన భారతీయ సంప్రదాయం లో పట్టు చీర కట్టుకొని వెళ్దాం అని ముచ్చట పడ్డాను. కానీ అమ్మ లాగ నాకు చీర కట్టినది కట్టినట్టు వుండదు. అందరిలోనూ దాన్ని మాటి మాటికీ సర్దుకోవటం నాకు చెడ్డ చిరాకు. కనుక మరీ "దొంగమొగుడు" చిత్రం లో భానుప్రియ లా కాకపోయినా కొంతవరకూ దానిని safety pins తో మాట వినేలా చేస్తూ వుంటాను. కనుక నా toiletries లో ఒక పేకెట్టు safety pins కూడా వున్నాయి. ఇండియా నుంచి వెంట తెచ్చుకున్న మరొక అలవాటు.. నాలిక బద్ద (Tongue cleaner). ఆ వాడేది ఒక ప్లాస్టిక్ ముక్క వాడొచ్చు కదా! పడి వుంటుంది.. మళ్ళీ మళ్ళీ కొనుక్కోక్కర్లేదు అని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాన్నగారు ఒక మెటల్ Tongue cleaners పేకెట్ ఇచ్చారు. కనుక నా సామానుల్లో ఒక Tongue cleaner కూడా వుంది. నేను చేసిన పొరపాటు వీటినన్నిటినీ నా కేబిన్ bag లో పెట్టడం!

San Jose airport లో వారి computers random గా pick చేసిన వారి మొత్తం సామానులు మరొక సారి తనిఖీ చేస్తున్నారు. Fine! నేనేమీ టెర్రరిస్ట్ ని కాను, నా నెంబరు రాలేదు.. కనుక లోపలికి బాగానే వెళ్ళిపోయాను. Immigration అయ్యాక గేట్ దగ్గర మెటల్ డిటెక్టర్ ల తో అందరినీ తనీఖీ చేస్తున్నారు. నా cell phone, coins అన్నీ వేరుగా ఒక డబ్బా లో పెట్టి belt మీద పెట్టి, నేను డిటెక్టర్ గుండా అవతలి వైపుకు వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఒక వ్యక్తి ఒళ్ళంతా మెటల్ డిటెక్టర్ తో పరీక్ష చేస్తున్నారు. నా ఒంటి మీద గాజులూ, మెడలో chain సరే.. కనబడుతున్నాయి.. కానీ నడుము దగ్గరకి వచ్చేసరికి మళ్ళీ "కుయ్" మని గోల చేసింది ఆమె చేతిలో వున్న డిటెక్టర్.

చూస్తే.. belt.. అయినా సందేహ నివృత్తి కోసం ఆమె దానిని విప్పమన్నారు . "what!?" నన్నేనా.. లేక అందరినీ అలాగే అడుగుతున్నారా అని చుట్టూ చూసాను. నా చుట్టు వున్న belt ధారులందరికీ అదే గతి అని గమనించి belt తీసి చూపించాను. నేను వేసుకున్నది jeans, దానికి మెటల్ బటన్ లు వున్నాయి.. "సుందరి ఇప్పుడేమి అడుగుతుంది?" అని ఖంగారు పడ్డాను. అబ్బే.. ఇంకేమీ వస్త్రాపహరణం అడగలేదు లెండి!

చాలా బాధ పడ్డాను.. pleasent గా వుండవలసిన మనసులని ఈ విధంగా భయాందోళనలకి గురిచేసిన ఆ తెలియని టెర్రరిస్ట్ ల మీద కోపం వచ్చింది. ఆ ఆలోచనల్లో పడి నెమ్మదిగా నా gate వైపు నాలుగు అడుగులు వేసాక గుర్తు వచ్చింది.. నా cell phone!" దానిని అక్కడ డబ్బా లోంచి తీసుకోవటం మర్చి పోయాను!

Irony చూడండి.. అప్పుడే ఒక announcement వస్తోంది.. సామానులులేవీ ఒదిలి వెళ్ళవద్దనీ.. ఆ విధంగా ఒదిలిన సామానులని వెంటనే confiscate చేయటం జరుగుతుందనీ!!

"సుత్తి మొఖం!" నన్ను నేనే తిట్టుకుంటూ మళ్ళీ చెకింగ్ జరుగుతున్న చోటికి వచ్చాను. అక్కడ ప్రశాంతంగా కనిపిస్తే ఎక్కడ తనని అసమర్థుడు అనుకుంటారో అన్నట్టు., వంద మర్డర్లు చేసి వచ్చినట్టూ నుంచుని వున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి నేను నా cell phone అక్కడ మరచి పోయాననీ దానిని తీసుకోవటానికి వచ్చాననీ. అతనికి నా మీద నమ్మకం కలగటానికి సాధ్యమైనంత అమాయకంగా మొఖం పెట్టి చెప్పాను. పాపం కనబడటానికి కర్కోటకుడిలా వున్నా.. మంచోడే.. తీసుకోమని తలూపాడు.

"బతికానురా దేవుడా!" అనుకుని దానిని తీసుకొని, నా flight check-in జరిగే ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నాను. నేను చదువుతున్నది Precipice అనే నవల. అదొక crime thriller. పైన బొమ్మ ఎవరో ఎవరినో పేద్ధ (అంటే చాలా అని!) కత్తి తో పొడుస్తున్నట్టు భయంకరమైన బొమ్మ వుంది.

* * *

Check in మొదలయ్యింది. ఇందాకా మమ్మలని చూసిన అమ్మాయే మళ్ళీ తన kit పట్టుకొని ఇక్కడకీ వచ్చింది. line లో వున్న వాళ్ళలో కొంతమందిని random గా సెలెక్ట్ చేసి, మళ్ళీ వాళ్ళని తనిఖీ చేస్తోంది. ఈ సారి మరి కొంచెం ఎక్కువగా! నన్ను పిలిచింది రమ్మని. వెళ్ళాను.

"Are you a phillippino?" గొంతు తగ్గించి నన్ను అడిగింది.. (నాది కొంచెం చైనా face లెండి. thanks to my ముక్కు!)

"కాదు.. Indian" చెప్పాను.

నా back pack తెరచింది. పొద్దుట బయలుదేరుతున్నప్పుడు cream రాసుకొని నా toiletries వున్న box ని backpack లో పైకే పెట్టాను. ఆమె దానిని తెరచారు.

అందులో ఒక మూల వున్న safety pins పేకెట్ ని పైకి తీసి "ఇవేమిటీ?" అని అడిగారు.

తెలీదా?? ఆశ్చర్యపోయి చెప్పాను "Safety pins" అది వినగానే ఆమెలో ఒక alarm!

"No.. you can't take these on the flight" అడ్డంగా తలూపుతూ నాతో అని, ప్రక్కన వున్న మరొక సెక్యూరిటీ ఆఫీసర్ తో గట్టిగా నాలుగూళ్ళకి వినిపించేలా ..

"I found these in her bag!"

ఆమె అన్న ఈ మాట అక్కడ కలకలం రేపింది. నలుగురు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చుట్టుముట్టారు. ఆమె చేతిలో వున్న safety pins చూడగానే "ఓస్! ఇవేనా!!" అన్న ఫీలింగ్.. కానీ మళ్ళీ అంతలోనే భయం! ఏమో.. ఏ పుట్టలో ఏ పామున్నదో! అని అందరూ ఒకరి తరువాత ఒకరు వాటిని పరిశీలించటం మొదలెట్టారు.

ఇంతలో మన సుందరి నా box లో మిగిలిన వస్తువులని వాసన చూసీ, నొక్కి చూసీ, పైకీ, క్రిందకీ తిప్పీ పరిశీలిస్తోంది.. ఇంతలో మరొక ఆయుధం నా సామానుల్లో కనిపించింది ఆమెకి!

నా Tongue cleaner! ఆమెకి అర్థం కాలేదు అది ఏమిటో.

Tongue cleaner! to clean!" ఆమెకి చెప్పాను.

"Look at this!!" మరొక ఆర్తనాదం చేసారామె. ఆ Tongue cleaner ని రక రకాల shape లలో వంచి, దానితో ఏమైనా murders చేసే అవకాశం.. ఆ మాట కొస్తే గాయపరచటానికి ఏమైనా chance వుందెమో చూసారు. ఈ ప్రయత్నంలో ఆమె చూపులు నేను చదువుతున్న నవల మీద పడ్డాయి.

"You like Murder misteries??" జోక్ చేస్తున్నట్టు (కానీ ఆమె స్వరం లో అస్సలు humour లేదు) అడిగారు.

గొంతు తడారిపోయింది.. అంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లని చూస్తే భయం వేసింది.. ఏం సమాధానం చెప్పానో గుర్తు లేదు.

అదే ప్రక్రియ మిగిలిన వాళ్ళు కూడా follow అయ్యాక, ఆఖరికి

"అబ్బే.. వీటిని flight లో తీసికెళ్ళటానికి వీల్లేదు" శలవిచ్చారు.

పోతే పోయింది.. after all ఇంత బ్రతుకూ బతికి మూల నున్న ముసలమ్మ చేతిలో చచ్చినట్టు.. టెర్రరిస్టులు అంటే మండిపడుతూ.. వారిని గర్హిస్తూ ఒక website నిర్వహిస్తూ.. security pin ల గురించి ఒక Terrorist గా అనుమానించబడటం! అయినా నేనేం చేస్తున్నానో వాళ్ళకేం పట్టింది?? M.J.Akbar వంటి ప్రముఖ వ్యక్తికే ఇటువంటి చేదు అనుభవం తప్పలేదు. నేనొక లెఖ్ఖా.. సంతలో చింతకాయని!

ఆఖరికి అందరి అనుమతీ తీసుకొని, మరొకసారి నా సామానుల కంప్లీట్ చెకింగ్ అయ్యాక నా విమానం ఎక్కాను. నా గౌరవార్థం 15 నిమిషాలు ఆలశ్యంగా విమానం చికాగో బయలుదేరింది.

* * *

మా కజిన్ ప్రెగ్నెంట్. తనకి సాయం కోసం కాకినాడ నుంచి మా పెద్దమ్మా, పెదనాన్నగారూ అమెరికా వచ్చారు. వాళ్ళు వుండేది Evansville లో. చిన్న ఊరు. కానీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు ఇక్కడ గుర్తు గా వుంటుందని అక్కడ ఎదో Mall కి వెళ్ళినప్పుడు video తీసుకున్నారు.

2 రోజుల తరువాత మా చెల్లెలికి pains మొదలయి hospital కి తీసికెళ్ళారు. తను hospital లో వుండగా ఒకరోజు వీళ్ళ ఇంటికి FBI నుంచి ఒక వ్యక్తి వచ్చారు. ఇంట్లో వున్న పెద నాన్నగారిని మా వాళ్ళ గురించి అడిగారు. Hospital లో వున్నారని చెప్పగానే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారుట.

వీళ్ళు పాప తో ఇంటికి రాగానే పోలీసులు మళ్ళీ వచ్చారుట. ఎంతో "మర్యాదగా" వీళ్ళీమధ్య దగ్గర వున్న Mall లో Video ఏమైనా తీసారా? ఎందుకు? దాని పూర్వాపరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారుట.

వీళ్ళకి అసలు అర్థం కాలేదు. Video తీసుకోవటం ఏ విధంగా తప్పు పనో! కావాలంటే ఆ video చూడమని ఇచ్చారు.

"మా గురించి ఏమేం ఊహించుకుని వుంటారో తలుచుకుంటుంటే ఎలానో వుంది" మా చెల్లెలు నాతో చెప్పింది.

"ఎవరో అక్కడ మేము video తీసుకుంటుంటే చూసి మమ్మలని Terrorist లుగా అనుకుని, మా car నెంబరు పోలీసులకి చెప్పి వుంటారు. వాళ్ళు దానిని బట్టి మా address అదీ తెలుసుకొని ఇంటికి వచ్చారు" అసలు వాళ్ళ ఎడ్రస్ ఎలా తెలిసింది అన్న నా ప్రశ్నకి సమాధానంగా అంది.

ఈ విషయం మా కొలీగ్స్ తో చెప్పినట్టు అందరిలో ఒక విధమైన ఆశ్చర్యం. ఇంత paranoid గా అయిపోయారా అక్కడ జనాలు? అన్న బాధ.

"అదే ఒక American కుటుంబం video తీసుకుంటే ఈ రకంగానే వాళ్ళ ఇళ్ళకీ వెళ్తారా?!" మా Canadian collegue ఒకమ్మాయి ఆశ్చర్యపోయింది.

* * *

నాకు తెలిసిన ఒక కుటుంబం వుంది. వాళ్ళు తమ friend ని కలుసుకోవటానికి Canada లో వున్న Toronto నుంచి US లో వున్న Buffallo వెళ్ళారు. సాధారణంగా అక్కడ బోర్డరు దగ్గర ఎవరో ఒక గార్డ్ వుంటారు.. ఆవులించుకుంటూ కెనడా నుంచి వచ్చే వాళ్ళ Passport లు అడుగుతారు. ఓపిక వుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు, Passport లో pin చేసి వుండే మా Canada Landing Paper ని చూస్తారు. లేకపోతే తలూపేస్తారు వెళ్ళండన్నట్టు.

David ని అక్కడ బోర్డరు లో ఆపారు. ఎక్కడికి, ఏమిటీ ప్రశ్నలు అడిగారు. తరువాత కారు trunk ని తెరవమన్నారు. అందులో తన friend కోసం కొన్న gift pack ఎదో వుంది.

"ఏముంది ఇందులో?" అని అడిగారుట అక్కడి officer.

"Dinner Set అని చెప్పగానే కెనడా నుంచి Dinner set అమెరికాకి తీసికెళ్తున్నారా అని అనుమానంగా ప్రశ్నలు వేశారుట. తరువాత కారు దిగమన్నారుట. పైకి రమ్మని చెప్పారుట.

David కొంచెం భయస్తులు. ఇదేమిటీ నన్నెందుకు ఆపారు? అన్న ప్రశ్నకి సమాధానం దొరకక.. ఆ officer వెంట నడిచారుట.

అక్కడ ఒక గది లో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి, కాపలాగా ఒక officer ని వుంచి వీళ్ళ passports తీసుకొని వెళ్ళిపోయారుట.

గంటన్నర గడిచింది. అసలు passports తీసికెళ్ళిన వ్యక్తి పత్తా లేదు. వీళ్ళిద్దరికీ అసలు జరుగుతున్నదేదీ తెలీదు. ఏం అడిగితే ఏం గొడవ వస్తుందో అని నోరు విప్పకుండా కూర్చున్నారుట.

దాదాపు రెండు గంటల తరువాత వీళ్ళ passports వీళ్ళకి అందించి "మీరింక వెళ్ళొచ్చు" అన్నారుట ఆ officer.

"నన్నెందుకు ఆపారు? మా papers లో ఏమైనా fault వుందా?" అనుమానం నివృత్తి చేసుకోవటానికి David ఆ officer ని అడిగారుట.

"అబ్బే.. just routine check up అంతే!" చెప్పారుట ఆ వ్యక్తి!

* * *

మనకే ఇన్ని అనుమానపు చూపులు ఎదురౌతుంటే.. ఇంక ప్రత్యక్షంగా వారి వస్త్ర ధారణ బట్టి ముస్లిం మతస్థులుగా తెలుస్తున్న వారు ఇంకెన్ని అనుమానాలూ, అవమానాలూ ఎదుర్కొంటున్నారో! సాటి మనిషి ని అనుమానం తో చూసే ఇటువంటి పరిస్థితి ని కల్పించిన ఆ Terrorist లని గర్హించకుండా వుండలేకున్నాను.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.