గాన కోకిలలు - SKU
   ఈ పేజీ ని పంపండి

క్రితం వారం మా అమ్మాయి ఆణిక న్యూ జెర్సీ లో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తనని అక్కడి నుండి నన్ను తీసుకుని రమ్మని రాజు నాకు పురమాయించారు. ఇక్కడ బోస్టన్ నుండి కనిటికట్ మూడు గంటల డ్రైవ్.. దారిలో వినటానికి ఈ మధ్య నోస్టాజియా ఫీల్ అయి పాత తవ్వకాల్లోంచి బయటకి తీసిన ఆషిఖీ సినిమా పాటలు, దానికి జతగా కొత్త ఆషిఖీ పాటలూ కలిపి ఒక CD చేసి ముందు రోజే కార్లో పెట్టుకున్నాను.

దారి పొడవునా పాత ఆషిఖీ పాటలు వింటూ, వాటి వెనుక పాడుతూ కనిటికట్ చేరుకునే సరికి నా గొంతు సగం పోయింది.

ఆషిఖీ అంటే మొన్నా మధ్య వచ్చిన ఆషిఖీ నా అని అడిగేరకం కాకపోతే, మీకు పాత ఆషిఖీ పాటలు గుర్తు ఉండే ఉంటాయి. కుమార్ సానూ, అనురాధా పాడ్వాల్, నదీం శ్రవన్, అనూ అగర్వాల్, రాహుల్ రాయ్ ఇలా ఎంత మందో తమ కెరీర్ లు మొదలెట్టిన సినిమా, లేక ప్రఖ్యాతి పొందిన సినిమా. నాకు అందులో పాటలు అన్నీ చాలా ఇష్టం. నా డ్రైవింగ్ గురించి తెలిసినవారు చెప్తారు.. నేను పాటలు లేకుండా డ్రైవ్ చెయ్యలేను.. అలాగే వాటి వెనుక పాడకుండా కూడా డ్రైవ్ చెయ్యలేను. నా గాన మాధుర్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమే.. కానీ డ్రైవర్ ఎవరు?

రాజు అస్సలు పాటలు వినరు. మేమిద్దరమూ కార్లో ఉన్నప్పుడు నేను ఏదన్నా పుస్తకం చదువుకుంటాను.. లేకపోతే తను హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే నేను నాకు కావలసిన పాటలు పెట్టుకుని వింటాను.. నాకు హెడ్ ఫోన్స్ తో పాటలు వినడం పెద్దగా నచ్చదు లెండి.

దౌర్జన్యం అనుకుంటున్నారా.. మా ఆయన కార్లో ఆమాత్రం నాకు స్వాతంత్రం ఉండటం తప్పా?

నెమ్మదిగా నా అలవాటు ఆణిక కి కూడా అంటించేసాను. నేను తనని రోజూ స్కూల్ కి దిగపెడుతుంటాను. వెళ్ళేటప్పుడు ఇద్దరం మాకు నచ్చిన KISS 108 రేడియో వింటూ, అందులో వచ్చే పాటల వెనుక మా గొంతులు చించుకుని పాడుతూ వెళ్తాము స్కూల్ కి.

మేమిద్దరమూ ఇలా మా పాటలతో హింసిస్తుంటే ఇంక భరించలేక రాజు మా ఇద్దర్నీ సంగీతం నేర్చుకోండి, అప్పుడు కనీసం ఆ పాడేది ఏదో కొంచెం స్వరబద్ధం గా అయినా పాడుతారు అని బ్రతిమాలేసరికి జాలి తలచి, ఇద్దరమూ సంగీతం నేర్చుకోవటం మొదలెట్టాము.

నాకు సంగీతం నేర్పించటానికి పాపం మా అమ్మమ్మ తెగ కష్టపడింది.. ఆ విషయాలు ఎప్పుడో మీకు గత జన్మ లో (అదే, ఇదివరకెప్పుడో చెప్పిన కబుర్లలో) చెప్పిన గుర్తు. మా అమ్మమ్మ సాధించలేనిది మా మాలతి ఆంటీ సాధించారు. నేను సంగీతం శ్రద్ధ గా నేర్చుకునేలా చేసారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. అది నిజమని చెప్పటానికి నేను అమ్మమ్మ సంగీతం పాఠాల మీద శ్రద్ధ చూపించి ఉండను. ఇప్పుడు ఆణిక తో క్లాస్ కి వెళ్ళటం తో తన తోడు తో నేనూ శ్రద్ధ గా నేర్చుకోవటం మొదలెట్టాను. నాది కొంచెం కీచు గొంతు.. మన కబుర్లు లో కొన్ని కబుర్లు చెప్పిన టీజీ నా గొంతు సినీ నటి జయంతి గొంతు ని పోలి ఉంటుంది అని అన్నారు అదివరకెప్పుడో.

ఆణిక గొంతు బాగుంటుంది, తనకి స్వర జ్ఞానం కూడా ఉంది. మా అక్క కూతురు అమృత వర్షిణి పాడుతుంటే అమృతం వర్షిస్తున్నట్టు ఉంటుంది. దాని గొంతు సన్నగా ఉండి కోమలంగా పాడుతుంది. ఆణిక ది నిఖార్సైన స్వరం. ఎక్కడా దాదాపు వణకదు, కీచు రాదు. మా అమ్మమ్మ బ్రతికి ఉండి ఉంటే ఈ ముని మనవరాళ్ళని చూసి "మీరు మనవరాళ్ళు కాదర్రా.. కుండ లో రాళ్ళు" అని మమ్మల్ని తిట్టిన రోజులు మర్చిపోయి ఉండేది.

మేము కనిటకట్ నుండి బోస్టన్ కి వచ్చేసాం, దానితో మా సంగీతం పాఠాలు కూడా రద్దయ్యాయి. కానీ మా పాడటం మాత్రం రద్దవలేదు. ఇప్పుడు రాజు ఏమి చేస్తున్నారు అంటారా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకునో లేక దగ్గర్లో పెట్టుకునో ఉంటారు.. మరి నాకూ, ఆణిక కీ ఎప్పుడు ఏ పాట వెనుక మా స్వరాలు జత కలపాలనిపిస్తుందో చెప్పలేము కదా.

మా ఆణిక ఇండియా వెళ్ళినప్పుడు మా మేనళ్ళుడు హృదయ్, ఆణిక ఇంకా అక్కడ పిల్లలు అంతా కలిసి మదర్స్ డే నాడు అక్కడ ఉన్న మదర్స్ అందరికోసం సంగీత విభావరి ఒకటి పెట్టారు. అందులో ఆణిక, హృద్దూ కలిసి ఆషిఖీ -2 లోని "తుమ్ హి హో" పాట ప్రాక్టీస్ చేసి పాడారు.

ప్రస్తుతానికి వస్తే, నిన్న నేను దార్లో ఆషిఖీ పాటలు పాడుకుంటుంటే ఆణిక కి ఆ పాటలు తెలీక నా టార్చర్ ని మౌనం గా భరించింది. కానీ ఆషిఖీ-2 లో పాటలు మొదలు అవగానే, తన హింగ్లీష్ లో తను కూడా జత కలిపింది.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.