నా స్కూటర్ కధ! - SKU
ఈ పేజీ ని పంపండి

నా స్కూటర్ కధ ఈ వారం చెప్తాను అని క్రితం వారం బెదిరించాను కదా.. వచ్చేసాను :-)

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే, APTECH లో కోర్స్ చేసేదాన్ని. నాన్నగారికి కంప్యూటర్ క్లాసులు అంటే, మామూలు చదువు కి లాగ పుస్తకాలు ముందు వేసుకుని చదవరని తెలీదు. అందుకని, మామూలు ప్రకారం ఎప్పుడూ నన్ను షంటేవారు.. "నీకు అస్సలు చదువు మీద శ్రద్ధ లేదు. నా చేత బోలెడు డబ్బులు పెట్టించి ఆ కంప్యూటర్ కోర్స్ లో చేరావు. కొంచెం కనీసం నా తృప్తి కోసం అప్పుడప్పుడు ఆ పుస్తకాలు బూజు దులుపుతూ ఉండు" అని!

నేనేం చెప్పను? ఇదే చెప్పేదాన్ని. కానీ ఆయన కి నా మాట మీద నమ్మకం తక్కువ! ఏం చేస్తాం? "నాన్నా పులి" కధ టైపు లో నాన్నగారికి ఉన్న బ్రహ్మాండమైన నమ్మకానికి కారణం నేనే!

ఇటువంటి క్లిష్టపరిస్థితి లో నాన్నగారికి దగ్గర నా ఇమేజ్ ఉండగా, sunny స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది, జనాలు.. అందులో కాలేజ్ పిల్లలు రివ్వు.. రివ్వున వాటి మీద వెళ్ళిపోవటం మొదలెట్టారు. మా Aptech అయితే చెప్పక్కర్లేదు. Sunny స్కూటర్ల షోరూం లా ఉండేది మా పార్కింగ్ లాట్. రోజూ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏ కొత్త రంగు స్కూటర్ వచ్చింది.. ఏ రంగు ఎక్కువ బాగుంది.. దానిని తోలే వ్యక్తి కి దానిని తోలేంత సీన్ ఉందా? లేకపోతే అతని / ఆమె మొఖానికి (క్షమించాలి) అంత సీన్ అనవసరమా? ఇటువంటి డిస్కషన్లు (ఫ్రెండ్స్ తో ఉంటే) లేక స్వగతాలు చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైము లో, నా మీద అలిగి రిపేర్ కి వచ్చే ఆరు సంవత్సరాల పైబడ్డ సైకిల్ ని ఏ లారీ లో పెట్టేసి, ఇంక దానిని రిపేర్ చేయటం దానిని తయారు చేసిన హీరో కంపెనీ వారికి కూడా సాధ్యమవని విధం గా చేసి, నాన్నగారిని పోరి, స్కూటర్ కొనిపించుకుంటే ఎలా ఉంటూందీ అని కుట్రలు చేసేదాన్ని.

చీకట్లో బాణం వేసినట్టు అక్కడకీ ఒకసారి అమ్మ దగ్గర "స్కూటర్ కొనచ్చు కదా.. రోజూ ఆ డొక్కు సైకిల్ కి బోలెడంత అవుతోంది రిపేర్లకి" అని అన్నా. దానికి అమ్మ, "సైకిల్ తొక్కడం రాని వాళ్ళు దాన్ని తొక్కేస్తే మరి రిపేర్లు రాక అమవుతాయి" అని నా అహం ని దెబ్బ తీసే ప్రశ్న వేసారు.

ఇలా కాదు వేరే రూట్లో రావాలి అని, మా అక్క, చెల్లెళ్ళని దువ్వటానికి ప్రయత్నించాను. మా చిన్నది పాపం ఉబలాటపడింది కానీ, మా అక్క నా ట్రాప్ లో పడలేదు. (ఒకవేళ స్కూటర్ కొన్నా, నేను దానిని తనకి దక్కనివ్వనని నమ్మి అయివుంటుంది!)

ఇది కూడా దెబ్బతింది అని తెలుసుకున్నాక, మళ్ళీ అమ్మ పంచన చేరాను. నాన్నగారు ప్రతీ ఆదివారం ఇంట్లోకి కావలసిన సరుకులు అన్నీ తెస్తారు. అప్పట్లో నాన్నగారి ఫ్రెండ్ ఏదో టూర్ కి వెళ్ళి, కంపెనీ లేక, నాన్నగారు వెళ్ళటం తగ్గించేసారు. దానితో అమ్మకి స్పెషాలిటీ కూరలు (అంటే, కొన్ని రకాలు మా ఇంటి దగ్గర దొరికేవి కావు. దొరికినా, చాలా ఖరీదు లో ఉండేవి. అమ్మ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ కనుక, ఎక్కువ ఖర్చు పెట్టేది కాదు) దొరకక నాన్నగారి మీద చిర్రుబుర్రులు ఆడేవారు.

ఇది కనిపెట్టి, అమ్మ దగ్గర చేరి నెమ్మదిగా హితబోధ చేసాను.

"అమ్మా అసలు నాన్నగారికి తేవటం కుదరకపోతే నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు. నాకు స్కూటర్ కొంటే, నేను వెళ్ళి తెస్తాను. నాకు సరిగా తెలీక పోతే (మళ్ళీ ఇంటి పనులకి మనకి టైము ఉండదు కదా.. అది ఇండైరెక్ట్ గా చెప్పటం) నువ్వు వెళ్ళి తెచ్చుకోవటానికి నేను నీకు కూడా స్కూటర్ నేర్పిస్తాను. లైసెన్స్ రెండు రోజుల్లో వస్తుంది. ఇంక నువ్వు ప్రతీ దానికీ నాన్నగారిని బ్రతిమాలుకోనక్కర్లేదు. ఎక్కడకి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు" (స్కూటర్ కొన్నాక, అమ్మని ఎక్కించుకొని తీసుకొనివెళ్ళిన ప్రహసనం గురించి తరువాత చెప్తాను!)

మరి నా కబుర్లకి బుట్టలో పడ్డారో.. నా గొడవ వదిలించుకోవటానికి మెత్తబడ్డారో .. మొత్తానికి అమ్మ నాకు స్కూటర్ ఇవ్వటం వలన దేశం లో క్లిష్ట పరిస్థితులు ఏమీ రావు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆ ధైర్యం తో నాన్నగారిని కొంచెం డైరెక్ట్ గా అడిగాను. నాకు స్కూటర్ కొని ఇవ్వమని. అప్పటికి నాకు డిగ్రీ అయిపోయింది. నా "చిన్ని" కోరిక విని, నాన్నగారి సమాధానం..

"డిగ్రీ వరకూ చదివించాను. నీ పెళ్ళి మీద తప్ప ఇంక పైసా పెట్టేది లేదు. ఏదైనా చదువుకుంటావా.. చెప్పు.. చదివిస్తాను. నీకు ఇప్పుడు స్కూటర్ లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంక స్కూటర్ కొంటే, దాని మీద ఊరంతా బలాదూర్లు తిరిగి, పెట్రోల్ కి డబ్బులు అంటూ వందలకి వందలు అడుగుతావు. మన ఇంట్లో లంకె బిందెలు ఏమన్నా ఉన్నాయా?"

అయినా పట్టు వదలని విక్రమార్కురాలి లా రెండు మూడు సార్లు అడిగాను. ప్రాణం విసిగి ఒకరోజు నాన్నగారు..

"డిగ్రీ చదివావు. ఇంకా ఇది కావాలి, అది కావాలి అని అడగటానికి సిగ్గులేదా?" అని అడిగారు.

చాలా పౌరుషం వచ్చింది. నన్ను అంత మాట అన్నందుకు. మనసులోనే సూరమ్మ శపధం చేసుకున్నాను. "స్కూటర్ గురించి మిమ్మల్ని మళ్ళీ అడిగితే చూడండి! నేనే సంపాదించి, నేనే కొనుక్కుంటాను. ఎలా ఆపగలరో చూద్దాం!"

ఈ పట్టుదల తో ఉద్యోగాల కోసం చూడటం మొదలెట్టాను. ఫ్రెష్ గా డిగ్రీ అయిన వాళ్ళకి వచ్చేది టీచర్ ఉద్యోగం. అదీ ఎయిడ్ లేని స్కూళ్ళలో. వాటిలోనే ప్రయత్నిస్తుండగా, ఒక రోజు మా క్లాస్ మేట్ ఒకబ్బాయి, మా కాలేజ్ లో లెక్చరర్స్ పెట్టిన ఒక స్కూల్ లో లెక్కలు చెప్పటానికి MPC స్టూడెంట్స్ కోసం అడిగారని చెప్పారు.

వెంటనే, ఊరికి 5 కిలోమీటర్ల దూరం (కాకినాడ NFCL దాటి వెళ్ళాలి) లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసాను. నాకు ఉద్యోగం ఇచ్చారు. జీతం ఎంత కావాలి అని అడిగారు. నేను ఉద్యోగం చేయటం వెనుక నా ఉద్దేశం చెప్పాను. దనికి మా లెక్చరర్ గారు తనకి ఊర్లో ని Bajaj స్కూటర్ల ప్రొప్రైటర్ తనకి తెలిసిన వ్యక్తి కనుక, మాట్లాడి లోన్ ఇప్పిస్తా అని చెప్పారు. లోన్ అంటే, నాకు ఒక వారం రోజుల్లో స్కూటర్ వచ్చేస్తుంది!! ఆనందం గా ఆయన ధాంక్స్ చెప్పేసి, ఇంట్లో ఒక సారి చెప్పేసి, వెంటనే చేరిపోతా అని చెప్పాను.

ఇంట్లో చెప్పినప్పుడు అమ్మ సంతోషించింది. అమ్మ దృష్టి లో ఇంట్లో ఏమీ చేయకుండ కూర్చునే బదులు ఏదో ఒకటీ, చదువుకోవటం, ఉద్యోగం చేయటంలో ఏదో ఒక వ్యాపకం ఉంటే మంచిది అని. సాయంత్రం నాన్నగారు ఇంటికి రాగానే, ఇంటి సభ్యుల మీటింగ్ పెట్టి, మా లెక్చరర్ నాకు లోన్ ఇప్పిస్తున్నారు కనుక, ఒక పది రోజుల్లో నేను స్కూటర్.. అదే నా sunny కొనుక్కుంటున్నానని చెప్పాను.

"మరి ఈ పది రోజులూ అంత దూరం సైకిల్ మీద ఎలా వెళ్తావు? ఎందుకొచ్చిన బాధ? బుద్ధి గా కంప్యూటర్ కోర్స్ ఏదో చెయ్యి. అది బాగా చేస్తే, మీ Aptech వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారు కదా. ఈ చిన్నా చితకా ఉద్యోగాల వలన నీకు లాభం ఏమీ లేదు" అని నచ్చచెప్పటానికి ప్రయత్నించారు నాన్నగారు. లోన్ రావటం అంత తేలిక కాదు అని కూడా చెప్పారు.

కానీ నా కళ్ళ ముందు నేను స్కూటర్ ఎక్కి ఊరంతా తిరుగుతున్న పిక్చర్ ఈస్ట్ మన్ కలర్ లో కంపించేస్తోంది already! కనుక ఇంక ఎవ్వరు ఆపినా ఆగే పరిస్థితి లో అస్సలు లేను.

"సరే, చూద్దాం లే" అని నాన్నగారు బయటకి వెళ్ళిపోయారు.

"చూద్దాం" అని నాన్నగారు అన్నారంటే, అలోచిస్తున్నారన్నమాట! ఈ స్టేజ్ కి ఆయన వచ్చాక కొంచెం అమ్మ చేత మంచి మాటలు చెప్పిస్తే, పని సుళువు అయిపోతుంది అని నేను ఆ తరువాత strategy ఆలోచించేయటం మొదలెట్టేసాను. అమ్మకి ఆ రోజు ఎప్పటికన్నా కాస్త ఎక్కువే ఇంటి పని లో సాయం చేసి, చేస్తున్నంత సేపూ "స్కూటర్ - దాని వలన వచ్చే ఉపయోగాలు" అనే విషయం మీద జ్ఞానబోధ చేస్తూనేవున్నాను.

మర్నాడు నాన్నగారు నా నెత్తి మీద పన్నీరు చిలకరించినట్టు ఉండే మాట చెప్పారు. అదే, స్కూటర్ తను కొనిస్తా అని చెప్పారు. సాయంత్రం ఆఫీస్ కి వస్తే, వెళ్ళి కొనుక్కుని వద్దాం అని అన్నారు.

నాకు నోట మాట రాలేదు. నాన్నగారి మీద చెప్పలేనంత ప్రేమ వచ్చేసింది. కానీ, నేను అనుకున్న విధం గా ఉద్యోగం చేసి, దాని డబ్బులు కంపెనీ వాడికి కట్టే బదులు నాన్నగారికి నెల నెలా కొంత చొప్పున ఇచ్చేస్తాను అని చెప్పాను.

"చూద్దాం లే.. ఇంక ఉద్యోగం ఎందుకు? చదువుకో" అన్నారు నాన్నగారు.

కానీ, అమ్మ "చెయ్యనివ్వండి. దానికీ కొంచెం బాధ్యత తెలుస్తుంది. తన డబ్బుతో కొన్నది అని ఆ స్కూటర్ ని కొంచెం జాగ్రర్త గా నడుపుతుంది." అన్నారు. (కానీ స్కూటర్ వాడిన మొదటి రోజునే, నేను చేసిన ఘన కార్యం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా?)

నేను ఏడు నెలల్లో నా స్కూటర్ డబ్బులు మొత్తం నాన్నగారికి ఇచ్చేసాను. దానిని మళ్ళీ నా పేరున fixed deposit లో వేసారు. ఎప్పుడన్నా తప్పితే, స్కూటర్ కి అయే పెట్రోల్ కోసం కానీ, రిపేర్ (డ్రైవర్ నేను అయినప్పుడు ఈ ఖర్చు ప్రతీ నెలా తప్పవ్ మరి!) కి కానీ నాన్నగారిని డబ్బులు అడగలేదు. ఆ విషయం లో మాత్రం, నాకు నా మీద చాలా గర్వం గా ఉంటుంది.

* * *

సైకిల్ మీద నేను చేసే ఘనకార్యాలు గురించి తెలిసున్న అమ్మ మొదట్లో నా స్కూటర్ ఎక్కటానికి ధైర్యం చేయలేకపోయారు. పైగా నాన్నగారిది Bajaj CUB. దానికి వెనక కూర్చునే వాళ్ళకోసం ప్రత్యేకమైన సీట్ ఉండి, రెండ్ సీట్ల మధ్యా వెనక్కాల వాళ్ళు పట్టుకోవటానికి ఒక చిన్న హేండిల్ ఉంటుంది. కానీ sunny కి ఒకటే సీట్ ఉండి, అది కూడా slanting గా ఉంటుంది. దానితో వెనక కూర్చున్న వాళ్ళకి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. (ఒక వైపు కూర్చుంటే. అటూ, ఇటూ కాళ్ళు వేసి కూర్చుంటే, Sunny / kinetic అంత సుఖం మరొకటి లేదు!)

ఎన్నో నిష్టూరాలు అయ్యాక, ఆఖరికి ఒక రోజు నాన్నగారికి ఒంట్లో బాగుండకపోతే, అమ్మని ఎక్కడికో నేను తీసుకెళ్ళవలసి వచ్చింది. అమ్మ రిక్షా మీద వెళ్ళిపోదామనుకుంది. కానీ, నేను దింపుతా అని వెయ్యోసారి అడిగాను.

"పోన్లే పాపం ఏడుస్తోంది" అనే అనుకుంటా అనుకుని, మొత్తానికి ఎక్కారు. జాగ్రర్త గా నడిపి, అమ్మ ని తీసుకెళ్ళటం బాగానే తీసుకెళ్ళా. తిరిగి రావటం సాయంత్రం. ఆ సమయానికి మా వీధి లో మా పాలబ్బాయి నాగేశ్వరరావు తన 5+ గేదలని తోలుకుని వచ్చి, మా వీధి లో ఇంటింటికీ తెచ్చి వాటి పాలు తీసి పోస్తూ ఉంటారు. ఒక దాని పని చూస్తుంటే, మిగిలినవి వీధి అంతా స్వైరవిహారం చేస్తూ ఉంటాయి. అవి ఎవరినీ ఏమీ చెయ్యవు కానీ, నాకు బండి నడిపేప్పుడు అవి ఎదురుగా వస్తే కొంచెం వణుకు వస్తూ ఉంటుంది. పైగా వాటికి అస్సలు రోడ్ సెన్స్ లేదు! హారన్ కొడుతున్నా, అవి పక్కకి తప్పుకోవు. వీటికి తోడు, అక్కడే వీధి కుళాయి ఉంది. నీళ్ళు పట్టుకునే వాళ్ళతో, ఈ గేదెలతో, మిగిలిన రోడ్ మీద పోయేవాళ్ళతో, ఆ సమయం లో భలే కళకళలాడుతూ ఉంటుంది. ఆ టైము లో మా అమ్మమ్మ లాంటి అమ్మలక్కలు కూడా వారి వారి గుమ్మాలలో కూర్చుని, లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు.

అమ్మని తీసుకుని ఇంటికి వస్తుంటే, ఒక గేదె అడ్డం వచ్చింది. నేను హారన్ కొట్టాను. అది కదలదే! సరే, నేనే దానిని తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకునే లోపు, మా పాలబ్బాయి వాళ్ళ కుర్రాడు నాకు సాయం చేద్దామని సదుద్దేశం తో గేదెని అదిలించటం కోసం పెద్ద కర్ర పట్టుకొని, ఆ గేదె ని కొట్టాడు.

అది reflex action లాగ, ఒక్కసారి about turn అయింది. నేను అసలు ఆ అబ్బాయి అలా కొడతాడని అనుకోలేదు. కొట్టినా ఆ గేదె మా మీదకి వస్తుంది అనుకోలేదు. ఒంటి కాలు మీద అమ్మ బరువు, స్కూటర్ బరువు కొయ్యలేక, స్కూటర్ ని ఒక వైపు కి ఒరిగించేసాను. అంతే, అమ్మ కింద పడిపోవటం, వెనువెంటనే, నేను ఒక కాలు నేల మీద ఉన్నా, స్కూటర్ తో కలిసి నేనుకూడా కిందకి పడిపోయాను.

అలా నాన్నగారు ఎప్పుడూ అమ్మని పడెయ్యలేదు కానీ, రోడ్డు మీద, తన స్వజనుల మధ్య, అందరూ చూస్తుండగా పడటం లో ఎంత మజా ఉంటుందో అమ్మ కి నేను చూపించాను!!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.