నాన్నగారి స్కూటర్! - SKU
ఈ పేజీ ని పంపండి

మాకు చిన్నప్పటి నుంచీ అమ్మ అన్నా నాన్నగారు అంటే భయపడి ఒణికిపోయేంత సీన్ ఎప్పుడూ లేదు. దానికి కారణం, నాన్నగారి చమత్కార ధోరణి, అమ్మ మాతో వుండే పట్టు, విడుపుల ధోరణి అనుకుంటా. ఎంత భయం లేకపోయినా, నాన్నగారు డబ్బుల విషయం దగ్గరకి వస్తే మాత్రం మహా గట్టి. అవటానికి అమ్మ ఫైనాన్స్ మినిస్టర్ అయినా, నాన్నగారు అమ్మ మాకు ఇచ్చిన ప్రివిలేజస్ ని కొన్ని కొన్నిటిని వీటో చేసేస్తూ వుండేవారు.

నాకు చిన్నప్పటి నుంచీ తొందర ఎక్కువా, దుందుడుకుతనం ఎక్కువ అని తిడుతూ వుండేవారు నాన్నగారు. 7th పాస్ అవగానే, సైకిల్ కొనిచ్చారు. దానిమీద మూడు ఏక్సిడెంట్లూ, ఆరు రిపేర్లు లాగ వుండేది నా ప్రయాణం! నాన్నగారు మహా జాగర్త వస్తువుల వాడకం విషయం లో. అందులో తను రోజూ వాడుకునే స్కూటర్, తన నోస్టాల్జిక్ పాత సైకిల్ అంటే మరింత ఇష్టం. వాటిని వాడినా, వాడకపోయినా ఆదివారం వస్తే, వాటికి తల స్నానం కార్యక్రమం మొదలెట్టేవారు. దానికోసం ముందు రోజు రాత్రి (అంటే శనివారం) ఒక ఎనౌన్స్ మెంట్ చేసేవారు.. "రేపు పొద్దుటే లేచి స్కూటర్ కడుక్కోవాలి." అని. మా అమ్మగారు చక్కగా మూతి తిప్పేవారు.. "చాల్లే.. బడాయి!" అని!

ఇంక ఆ టైము లో మేము.. అంటే, నేను / అక్క. (మేమిద్దరమూ మా సైకిల్ వాడేవాళ్ళం) ఎవరైనా వుంటే,

"నువ్వు కూడా మీ సైకిల్ శుభ్రంగా తుడుచుకో. చూడు ఎలా వుందో.. పాతికేళ్ళ క్రితం సైకిల్.. నాది కొత్తదానిలా మెరిసిపోతోంది.. మీదీ వుంది.. ఆరు నెలలు కూడా అవలేదు.. అప్పుడే దానికి రెండు టైర్లు అయ్యాయి." అని మాకు చెప్పి, అమ్మని "నాకూ.. (పెళ్ళి పుస్తకం లో గుమ్మడి style లో) ఒక మెత్తని పాత గుడ్డ ఇయ్యి. పాత కాటన్ చీర ఎదైనా."

ఈ ముక్క కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండేవారు మా అమ్మగారు.. ఆవిడా తన రొటీన్ సమాధానం ఇలా చెప్పేవారు..

"నా చీరలన్నీ మీ స్కూటర్ కే అయిపోతున్నాయి! ఆ flannel cloth తెచ్చుకున్నారుగా.. దాన్ని వాడుకోండి."

"చక్రాలూ అవీ తుడవటానికి ఆ గుడ్డ ఎందుకూ?" అని అమ్మ మాట కొట్టిపారేసేవారు. నాన్నగారికి స్కూటర్ తుడవటానికి 3 రకాల గుడ్డలు. గ్రీజ్ వుండే చోట తుడవటానికి ఒకటి. ఇది డిస్పోజబుల్! ఒకసారి దాన్ని వాడితే, మళ్ళీ దానిని ముట్టుకోవటానికి ఇష్టపడరు. దీనికోసమే.. అమ్మ చీరలు అన్నీ వాడిపారేసేవారు!! ఇంక గ్రీజ్ అంటని, ఎక్కువ మురికి భాగాలు (అంటే, చక్రాలు లాంటివి) తుడవటానికి ఒకటి. వీటిని అమ్మ సరిగ్గా వుతకదని.. నాన్నగారే ఉతుక్కునేవారు.. అది మరొక ప్రహసనం! (అది కూడా చెప్తా) ఇంక మూడో రకం.. అంటే, పైకి కనపడే భాగాలని తుడవటానికి flannel cloth వాడేవారు!

"అక్కా.. నేను స్కూటర్ కడుక్కోవాలి.. మొక్కలకి నీళ్ళు సాయంత్రం పెడదాం" అని అమ్మమ్మ తో చెప్పి కుళాయి ని బుక్ చేసుకుని, న్యూస్ పేపర్ మా ఎవ్వరినీ చదవనివ్వకుండా ముందు తను చదివేసి, మా పనమ్మాయి సత్యవతి ని షంటేసి కుళాయి ఖాళీ చేయించి, ఏడు గంటలకల్లా కాఫీ అవగానే మొదలెట్టేసేవారు..! తొమ్మిది గంటలకల్లా కూరల కోసం పెద్ద మార్కెట్ కి వెళ్ళటానికి తన ఫ్రెండ్ వచ్చేవారు. (వారానికి ఒకసారి సరుకులు తేవటం నాన్నగారి అలవాటు) ఆ టైముకి అయిపోవాలని ఖంగారు పడిపోయేవారు.

ఇంక ఆ స్కూటర్ ని పామీ, పామీ తళ తళా మెరిసేలా చేసుకుని, అటూ, ఇటూ ఎవరన్నా వస్తే, "చూడు.. ఎంత బాగా మెరిసిపోతోందో!" అని తన ప్రతిభకి మొహమాటపెట్టేసైనా సరే, "బాగుంది" అని అనిపించుకుని, తను ఆనందపడేవారు! (ఇంకా ఇప్పటికి కూడా). ఇలా తోమడం / తుడవటం / కడగటం కార్యక్రమాలు అయ్యాక, వుతకడం కార్యక్రమం మొదలెట్టేవారు.

ఉతకడం అంటే.. స్కూటర్ ని కాదు. దాన్ని తుడిచిన 2,3 కేటగిరీ గుడ్డలని. దాని కోసం రెండు స్పెషల్ mug లు వుండేవి. వాటిల్లో మూడు వంతుల నీళ్ళు పోసి.. ఆ మగ్గుడు నీళ్ళకీ రెండేసి spoon ల surf extra strong వేసి, అది చాలదన్నట్టు గుడ్డలకి సగం రిన్ సబ్బు పట్టించి నానబెట్టేవారు. మధ్యాహ్నం బోజనం అయేంతవరకూ ఇవి అలా నానాలన్నమాట. అప్పుడు మొదలెట్టేవారు. తన వుతుకుడు!

మాది ఉమ్మడి ఇల్లు. తను వాటిని వుతుకుతున్నప్పుడు ఎవరన్నా చూస్తే బాగోదని.. బాత్ రూం' లో తన కార్యక్రమం మొదలెట్టేవారు. ఒక గంట ఆయాసపడిపోయి, చమటలు కక్కేసి, మొత్తానికి వాటిని వాటి అసలు రంగు కూడా మర్చిపోయేలా చేసి, తెచ్చి మా అమ్మ గారు ఆరేసుకున్న చీర వేసిన దండెం మీద ఆరేసేవారు. అది పాపం అమ్మ మర్నాడు పూజ కి అని ఆరేసుకున్న బట్ట. అక్కడ మధ్యాహ్నం ఎండ పడుతుంది. నాన్నగారికి తన ఇంతోటి పట్టు పీతాంబరం ఎండ లో వుంటే కానీ ఆరదు అని అనుమానం వలన అది నిషిద్ధ ప్రాంతం అని మర్చిపోయేవారు!

మరి ఇది చూసి అమ్మ ఊరుకునేదా? అబ్బే! తన దండెం మీద ఎవరన్నా బట్టలు వేస్టే అమ్మ కి మండుతుంది. అలాంటిది.. స్కూటర్ తుడిచిన ముష్టి గుడ్డ (ఎంత అది తన పాత చీరే అయినా, ఒకసారి స్కూటర్ కి ఇచ్చేసాక.. దానిని ఇంక అమ్మ ఎప్పుడూ "ముష్టి గుడ్డ" అనే సంభోధించేది) తెచ్చి తన మడి బట్ట పక్క ఆరేసారని దెబ్బలాడేది. ఇంక నాన్నగారు.. "ఆ.. గాడిద గుడ్డు! అలా చేస్తే కానీ దేవుడు ఒప్పుకోడా పూజని?" అని అడిగేవారు.

* * *

ఇంత ముద్దు గా చూసుకునే స్కూటర్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు. నాన్నగారితో కలిసి బయటకి వెళ్ళాలంటే ఒకోసారి భయం వేసేది. ఆయన స్కూటర్ కి దగ్గరగా ఎవరన్నా స్కూటర్ పార్క్ చేస్తే ఆయనకి నచ్చదు. తీసేటప్పుడు ఎక్కడ తన స్కూటర్ కి గీతలు పెట్టేస్తారో అని భయం! అలాగే డ్రైవింగ్ నాన్నగారు చాలా జాగ్రర్త గా చేస్తారు. అంతా defensive డ్రైవింగ్! ఎంత డిఫెన్సీవ్ డ్రైవింగ్ అయినా ఎవరన్నా ఆయన మీదకి ఎగ్రెసీవ్ గా వచ్చారంటే నోటికి పని చెప్పేవారు. తనకి వచ్చిన సంస్కృతం లోని తిట్లు అన్నీ తిట్టేవారు. ఇంక ఆ అవతల వ్యక్తి స్టూడెంట్ అయితే మరింత! ఆయన దృష్టి లో స్టూడెంట్స్ కి "పొగరు" అని!!

ఈ స్టూడెంట్ ల మీద ఆయన తన భాషాపాండిత్యం చూపించేటప్పుడు వెనకాల మా ముగ్గురిలో ఎవరం వున్నా తెగ ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అమ్మాయి ని వెనకాల కూర్చోపెట్టుకుని తిడితే అవతల కుర్రాళ్ళకి కూడా చిన్నతనం కదా.. అందుకని వాళ్ళూ ఎదో పొగరు గా సమాధానం చెప్పేవారు. దానికి ఈయన BP పెంచేసుకునేవారు! వెనకాల మేం ఇబ్బంది పడేవాళ్ళం. నాన్నగారిని ఆ టైములో ఆపే ధైర్యం మాకు లేదు. అలాగని నాన్నగారిని వాళ్ళు చులకన గా మాట్లాడుతుంటే భరించలేము! ఇంటికొచ్చాక నాన్నగారి మీద దెబ్బలాడేవాళ్ళం!

* * *

నాన్నగారికి తను స్కూటర్ ని చాలా జాగ్రర్త గా చూసుకుంటానని చాలా గొప్ప గా ఫీల్ అవుతారు. ఆయన కూతుళ్ళం.. మా ముగ్గురిలో ఒక్కళ్ళకీ పాపం ఆయన తన స్కూటర్ మీద చూపించే ప్రేమ లో సహస్రాంశం మా స్కూటర్ మీద చూపించాలన్న ధ్యాస లేదు. చెప్పలేదు కదూ.. ఈప్పుడు మాకు కూడా ఒక స్కూటర్ వచ్చింది. దానిని కొనడం వెనక కధ మళ్ళీ ఎప్పుడన్నా చెపుతాను.

స్కూటర్ కొనే నాటికి మా ముగ్గురిలో (ఇక్కడ ముగ్గురు అంటే.. అప్పచెల్లెళ్ళం మేం ముగ్గురూ అని) నాకొక్క దానికే డ్రైవింగ్ లైసెన్స్ వుంది. కనుక కొన్నాళ్ళ పాటు దానికి నేను మకుటం లేని మహరాణి ని! పైగా, ఆ స్కూటర్ మీద నాకు ప్రత్యేక హక్కులు కూడా వున్నాయి! (ఇవేమిటో.. స్కూటర్ కొన్న కధ లో చెపుతాను.) ఇక్కడ నా గురించి కొంచెం చెప్పాలి. నాకు సాధారణం గా రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్రేక్ అన్న మాట తెలీదు! ఎవైనా అడ్డం వస్తే, పక్కకి తప్పుకొనో.. లేకపోతే సందుల్లో దూరిపోయో.. అదీ కుదరకపోతే.. ఠపీ మని ఆ ఎదురుగ్గా వచ్చేదాన్ని గుద్దేయటమో చేసేదాన్ని! నాకు మరి చిన్న బాధ వుంది. అవటానికి మాది ఆడపిల్లల సైకిలే అయినా, నాకు కాళ్ళు నేల మీదకి ఆనేవి కావు. సీట్ కిందకి దింపించటానికి నాన్నగారికి ఎవరో సైకిల్ లుక్ పోతుంది అని చెప్పారుట.. అందుకని.. ఆయన ససేమీరా అన్నారు. పైగా, ఆయనది అదో భ్రమ! నేలని ఆనించటానికి కాళ్ళు సాగదీస్తే, సాగీ.. సాగీ.. కాళ్ళు పొడవు అయి, మేము పొడవు అవుతామని అనుకునేవారు!! (మేం పొట్టి వాళ్ళం లెండి!)

గుద్దేయటం దగ్గర వున్నా కదూ.. ఇంకేముందీ.. సైకిల్ కీ, నాకూ, వెనకాల ఎవరన్నా వుంటే వాళ్ళకీ ఒంటినిండా గాయాలు! సైకిల్ లో చుట్టేసి చింపేసిన లంగాలూ, చున్నీలూ అయితే లెక్క లేదు! మా వీధి చివర వుండే సైకిల్ కొట్టు అబ్బాయికి రోజు ఖాతా లా వుండేది మా సైకిల్ రిపేర్ ఖాతా! ఒకోసారి.. "ఇవాళేమయింది?" అని అడిగేవాడు. ఇంట్లో మాకు pocket money చాలా తక్కువ ఇచ్చేవారు. అందుకని అమ్మని సైకిల్ రిపేర్ కి డబ్బులు అడగక తప్పేది కాదు. అమ్మ కి తెలుసు నాన్నగారికి సైకిల్ మళ్ళీ రిపేర్ అంటే తిడతారని. అందుకని మాట్లాడక ఇచ్చేది. నాన్నగారు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆ సైకిల్ కొట్టు వైపు నుండి వచ్చేవారు. ఆయన అక్కడ దాన్ని చూస్తే ఆగి ఏమయిందో enquiry చేసి వచ్చేవారు. ఆ సైకిల్ వాడు కూడా, మేం లేనప్పుడు చూసి మేం సైకిల్ ని ఎన్ని కష్టాలు పెడుతున్నామో చెప్పేవాడు! ఇంక ఇంటికి వచ్చి ఆయన మా మీద చిందులు వేసేవారు.

"మీ మొఖాలకి సైకిల్ ఎందుకు?" అని వెటాకరం కూడా చేసేవారు!

ఈ విధంగా.. సైకిల్ కే ఇంత హంగామా చేసే నాన్నగారు.. స్కూటర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు! వంద జాగర్తలు చెప్పి, స్కూటర్ మీద కనీసం ఒక 1000 రౌండ్లు మా చుట్టుప్రక్కల వీధుల్లో తిరిగి, నేను రోడ్డు మీద జనాలకి ఏమాత్రం ప్రమాదకారిని కాను అని నమ్మకం కుదిరాక ఒక్కదాన్నీ స్కూటర్ మీద వెళ్ళటానికి ఒప్పుకున్నారు.

"హమ్మయ్య!" అనుకుని, స్కూటర్ వేసుకుని అప్పుడు Sunny (అదే నేను తోలుతున్న బండి) కి వచ్చే advertizement పాట "Zip...Zap...Zoom!!!" అని పాడుకుంటూ కొండయ్యపాలెం రైల్వే గేటు దాటి, రైల్వే కల్యాణ మండపం రోడ్ చివర టర్నింగ్ తీసుకోబోయాను! నా ప్రయత్నం.. APTECH కి వెళ్దామని.

ఎదురుగా "Fill it.. Shut it.. Forget it.." అనే అయివుంటుంది పాడేసుకుంటూ Honda మీద.. వచ్చేసారు ఒక మహానుభావుడు! వచ్చి ఏముందీ.. టర్నింగ్ లో నా Sunny ని గుద్దేసారు. అతనితో మామూలు దెబ్బలాట, సారీలు అయ్యాక చూసుకుంటే ఏముందీ.. "కిందపడి నువ్వు దెబ్బ తినలేదెమో కానీ.. నేను సుకుమారిని.. తట్టుకోలేకపోయాను" అని చెప్పింది నా బండి! అంటే అర్థం కాలేదా? స్కూటర్ ముందువైపు వుండే ప్లాస్టిక్ షీల్డ్ చూపుడు వేలంత మేర పగిలిపోయింది.

నాకు నాన్నగారే గుర్తొచ్చారు. ఆయన నాకు వినిపించే దండకాలు గుర్తొచ్చేసాయి. కర్తవ్యం ఏంటీ అని ఆలోచించాను. ఇలాంటి సమయంలో నాకు "చావు తెలివితేటలు" వస్తాయని మా అమ్మమ్మ విసుక్కుంటూ వుంటుంది. అలాంటిదే ఒకటి వచ్చింది.

వెంటనే, APTECH వెళ్ళి, అక్కడ దొరికిన ఫ్రెండ్ దగ్గర ఒక వంద అప్పు తీసుకున్నా.

"దేనికీ? కొత్త స్కూటర్ పార్టీకా?" అని అడిగింది.

"పార్టీకి కాదు.. రిపేరు కి"

అని చెప్పి.. అక్కడే వున్న stickering అతని దగ్గరకి తీసుకెళ్ళా బండిని. కధ చెప్పి, ఎలాగైనా తన కళానైపుణ్యం చూపించి, ఆ పగులు మానవమాత్రుడికి కనపడకుండా చేసేయమన్నాను. ఆడ కూతురు కష్టం అర్థం చేసుకున్న ఆ అబ్బాయి.. దానికి gum ఎదో పెట్టి, అతను బండి ని కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబు చేసాడు. కానీ.. నా కళ్ళకి మాత్రం.. ఆ పగులు కనపడుతూనే వుంది.

నాన్నగారికి ఇలాంటి దుబారా ఖర్చులు ఇష్టం వుండవని ముందే చెప్పా కదా. Stickering కి నేను పెట్టిన ఖర్చు గురించి (నేను ఆయనకి పూర్తి రేటు చెప్పలేదు కూడా!) ముందు నాలుగు తిట్టి, ఎలా చేసాడో చూస్తా అని దగ్గరకి వెళ్ళి పరిశీలించటం మొదలెట్టారు. ఏముందీ.. ఆయన కంట పడింది!!!! ఎలాగంటారా? నేను gum పెట్టాక దాన్ని కనీసం ఆరనియ్యకుండా వచ్చేయటం వల్ల.. పగులు ఎదో కుదుపులో పడ్డప్పుడు మళ్ళీ బయటకి వచ్చింది.. నా కొంప ముంచింది!!

తర్వాత ఏమయిందో నేను చెప్పాలా??

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.