suryakumari.com, kaburlu.com కధా, కమామీషూ.. - SKU
ఈ పేజీ ని పంపండి

2000 సంవత్సరం డిసెంబర్ లో అనుకుంటా నా ఫ్రెండ్ అనూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మేం ఇక్కడికి వచ్చి మన దేశానికీ, మన దేశం నుండి ఇక్కడకి వచ్చేవాళ్ళకోసం ఏం చేస్తున్నాం అన్న డిస్కషన్ జరిగింది. ఆ సందర్భంలో నేను, రవి, అనూ మనం ఇక్కడ కొత్తగా వచ్చినవాళ్ళకోసం మా లాభం చూసుకోకుండా ఎదో ఒకటి చేయాలి అనే నిశ్చయానికి వచ్చాం. కానీ అది ఎలాగ అనే విష్యం మీద ఒక అభిప్రాయానికి రాలేకపోయాం. ఎన్నో ఆలోచనలు. కొన్ని సాధ్యమైనవి.. కొన్ని అందరికీ సాధ్యం కానివి. ఈ విష్యమై తమ ఐడియాలు చెప్పమని నా ఫ్రెండ్స్ అందరికీ (దాదాపు 20 మందికి) మైల్స్ పంపించాను. కానీ దానికి వచ్చిన జవాబులు కేవలం ఇద్దరినుండి. ఆంధ్రులు ఆరంభశూరులు అన్న నానుడిని నిజం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. తరువాత ఎవరి జీవిత గమనం లో వాళ్ళం బిజీ అయిపోయాం. ఈ విష్యం గురించి తాత్కాలికంగా మర్చిపోయాము.

అప్పుడే నాకు ఇమ్మిగ్రేషన్ వచ్చిన రోజులు. నేను నా మూర్ఖత్వం వలన చేసిన కొన్ని సిల్లీ తప్పుల వల్ల చాలా టెన్షన్ పడ్డాను. అవి చాలా చిన్న తప్పులు.. కానీ అవే నా ఇమ్మిగ్రేషన్ ని ప్రమాదం లో పడేసినవి. నేను చేసిన తప్పులు ఎవరూ చేయక పోవచ్చు. కానీ ఇమ్మిగ్రేషన్ కి అప్లై చేసేముందు గుర్తుంచుకోవలసిన విష్యాలు అందరికీ చెప్పటం లో తప్పు లేదనిపించింది. నేనూ క్లాసులు అప్పుడు చెప్పటం లేదు. కనుక ఆఫీస్ నుండి వచ్చాక ఖాళీనే. రవి తన సైట్ ద్వారా చేస్తున్న అద్భుతాలు చూసాను. ఆ విధంగా నా స్వంత వెబ్ సైట్ మొదలెట్టాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది.

జనవరి లో నా పేరు మీద డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసాను. నా ఈమైల్ ఫ్రెండ్ Qatar లో వుండే శ్యాంకి నా ఐడియా చెప్పగానే ఎంతో ప్రోత్సహించి కొన్ని సూచనలు ఇచ్చారు. నాకా ఇంగ్లీష్ రాదు. ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లతో జనవరి నెలాఖరుకి Immigration సెక్షన్ తో సైట్ మొదలైంది. ఇమ్మిగ్రేషన్ వ్యాసాలు రాయటానికి అన్ని సైట్లూ వెదతకటం వాటితో నెలరోజుల పైన గడిచిపోయింది. నేను రాసినవి శ్యాం చదివి సరిదిద్దేవారు.

నాకు చాలా మంది ఈ-మైల్ ఫ్రెండ్స్ వున్నారు. మేం ఎప్పుడూ మాకు నచ్చిన వ్యాసాలు, జోక్స్ షేర్ చేసుకుంటూ వుంటాం. నా దగ్గర వున్న జోక్స్ తో Humour, ఆలోచనాత్మక వ్యాసాలతో Thoughts విభాగాలు మొదలెట్టాను.

నాకు కాశ్మీర్ అంటే అంత ప్రత్యేకమైన ఆశక్తి వుండేది కాదు. కానీ ఒకసారి ఎదో భారతీయ వెబ్ సైట్ (Zee అనుకుంటా) ని ఎవరో హాక్ చేసారన్న వార్త BBC లో చదువుతుండగా అక్కడ ఇచ్చిన ఒక పాకిస్తాన్ వార్తా పత్రిక యొక్క వెబ్ సైట్ URL చూసి వారి పేపర్లు ఎలా వుంటాయి, వారి సైట్స్ లో భద్రత ఏ విధంగా వుందీ అన్న కుతూహలం తో ఆ సైట్ కి వెళ్ళాను. దానిలో వున్న భారత వ్యతిరేక వార్తలు చదివి నిజంగా రక్తం మరిగిపోయింది అంటారు చూడండి.. అలాగైంది. నేను కొన్ని కాశ్మీర్ సంబంధిత వెబ్ ఫోరం'ల సభ్యురాలిని. వాటిలో జరిగిన కొన్ని చర్చల వలన నా అభిప్రాయాలు నా సైట్ ద్వారా చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాను. కానీ తరువాత.. నా అభిప్రాయాలు చెప్పేకన్నా నేను ఈ విష్యమై చదివిన వ్యాసాలు ప్రచురించటం బాగుంటుంది అనుకుని వాటిని ప్రచురించటానికి కాశ్మీర్ విభాగం మొదలెట్టాను.

నయాగరా ఫాల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రకృతి సౌదర్యం, నాలో కలిగిన భావాల పరంపర ని నా ఫ్రెండ్స్ కి వివరించాను. తరువాత నా మొదటి విమానం ఎక్కిన అనుభవం, మరికొన్ని.. నాకు వింతగా.. క్రొత్తగా అనిపించినవాటి గురించి రాసాను.. వాటిని ప్రచురించటానికి Memories విభాగం మొదలెట్టాను. చాలా రోజులు నేను నా గురించి సైట్ లో వివరాలు ఇవ్వటం అనవసరం అనుకున్నాను. నా సైట్ ని చూసి నన్ను ఒక ఫ్రెండ్ గా తలచి తమ జీవిత సమస్యలు నాతో పంచుకున్న ఒకరిద్దరి అనుభవాలు నన్ను చాలా కదిలించాయి. నా సైట్ చూసి నా స్నేహం కోరుతూ వచ్చే కొన్ని లేఖలు నన్ను ఇబ్బంది కలిగించాయి. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారిస్తున్నా.. నా గురించి ఎవరో ఎదో అనుకుంటారని భయపడి నేను చెప్పేది చెప్పటం ఎందుకు మానాలి అన్న సంఘర్షణ కి లోనయ్యాను. నాకు ఎప్పుడూ తోడుగా వున్న కొంత మంది ఫ్రెండ్స్ తో చర్చించి నేను చెప్పాలనుకున్న దానిని సూటిగా చెప్పటానికి Memories విభాగం ప్రారంభించాను. ఈ articles వలన విమర్శలు వచ్చినా.. నాకు వచ్చే లేఖల సరళి ఖచ్చితంగా మారింది. "నువు చాలా ధైర్యవంతురాలివి" అని ప్రోత్సహించే ఈ లేఖలు చదువుతుంటే క్రొత్త ఆత్మవిశ్వాశం తో ఉత్సాహం రెట్టింపు అయింది.

ఆ రోజులలో నా సైట్ చూసి పరిచయం అయిన వారిలో నాతో కలిసి చదువుకున్న దీక్షిత్ ఒకరు. ఆయన Technology సంబంధిత వెబ్ సైట్ల URLs పంపించారు. వాటిని సైట్ లో ప్రచురిస్తే బాగుంటుందని సూచించారు. నాకూ ఈ ఆలోచన చాలా నచ్చి FYI విభాగం మొదలెట్టాను. దీనికి ఈ పేరు సూచించింది కూడా ఆయనే. తరువాత చాలా మంది ఎన్నో URLs పంపించారు. నేను కూడా భారత సంబంధిత వెబ్ సైట్ల వివరాలు సేకరించి ఇక్కడ ప్రచురించటం మొదలెట్టాను.

నేను చదివే వివిధ దేశాల వార్తలలో నాకు ఆశక్తి కలిగించిన వార్తల లింకులు తో న్యూస్ విభాగం మొదలెట్టాను. నేను దీనిని Surya's News అనటం నా ఈగో ని ప్రతిబింబిస్తుంది అని విమర్శించారు ఒకాయన. కానీ నాకు ఆశక్తి కలిగించిన వార్తలు.. కనుక ఆ పేరు పెట్టాను అని నన్ను నేను సమర్థించుకున్నాను.

నా సైట్ చూసిన ఉదయ్ అనే ఆయన నాకు ఒక క్రొత్త ఆలోచన ఇచ్చారు. ఆయన భారత దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించి రాసిన కొన్ని వ్యాసాలు Visit India అనే విభాగం ప్రారంభించి అందులో ప్రచురించమని సూచించారు. ఆ విధంగా Visit India విభాగం ప్రారంభం అయింది. ఆయన తో పాటు నేను కూడ వివిధ సైట్స్ వెతకి భారత దేశంలో వున్న ప్రముఖ పర్యటన కేంద్రాల వివరాలు సేకరించి ఇందులో ప్రచురించటం మొదలెట్టాను.

ఇన్ని చేసినా సైట్ అంతా HTML పేజీలతో వుండటం అసంతృప్తి కలిగించింది. నాకు సైట్ లో ఎక్కడా ఎడ్వర్టైజ్ మెంట్లు లేకుండా చేయాలని కోరిక. కానీ గెస్ట్ బుక్ కోసం వేరే వారి ప్రోగ్రాం వాడటం వలన వారి ప్రకటనలు ఆ పేజీ లో రావటం నా నియమానికి వ్యతిరేకంగా అనిపించింది. కనుక గెస్ట్ బుక్ ని నేనే రాసుకున్నాను. అయితే నా హోస్ట్ లు నేను వాడిన php scripts కి ఇచ్చే సహకారం అంతంత మాత్రం. కనుక సైట్ హోస్ట్ ని phpwebhosting కి మార్చాను. త్వరలోనే నేనే స్వంతంగా హోస్ట్ చేసే ఆలోచన వుంది. ప్రస్తుతానికి మాత్రం phpwebhosting నుంచి సైట్ హోస్టింగ్ ని midphase కి మార్చాను.

kaburlu.com

చిన్నప్పటి నుంచీ కధలు రాయటం అలవాటు. మా అమ్మగారు వాళ్ళ లేడీస్ క్లబ్ కోసం నిర్వహించిన "కళావాణి" వారపత్రిక చూసి మేం ఫ్రెండ్స్ కొంత మంది కలసి "బాలవాణి" అనే పిల్లల మేగజైన్ నిర్వహించాం. అది 5, 6 వారాలే. అది మానేసినా మానని అలవాట్లు బొమ్మలు వేయటం, కధలు రాయటం. ఇక్కడ కెనడా వచ్చాక నేను రాశిన కధలు చదవండంటూ నా స్టూడెంట్స్ బుర్రలు తినేదాన్ని. వాటిని నా సైట్ లో ప్రచురించాలని కోరిక. కానీ తెలుగులో వాటిని ఏవిధంగా ప్రచురించాలో తెలీదు. ఒకరోజు తెలుగులో వెబ్ పేజి లు తయారు చేయటానికి Linguipad అనే సాఫ్ట్ వేర్ దొరికింది. అందులో నా కధలు టైపు చేసి, వాటిని gif ఇమేజ్ లు గా మార్చి, వాటితో Telugu విభాగం మొదలెట్టాను. నాకు RIT పద్ధతి అలవాటు అవని కారణంగా ధారుణమైన తప్పులు. ఒక తప్పు దిద్దగానే మళ్ళీ మొదటికి వచ్చేది. వాటిని సరిదిద్దటం, ఇమేజ్ లు తయారు చేయటం. చాలా బాధ గా వుండేది. పైగా నేను రాసినది మళ్ళీ చదివితే నాకే నచ్చేది కాదు. అలాగని చదవకుండా ప్రచురిస్తే తప్పులు.. పంటి క్రింద రాళ్ళలా! నా ఫ్రెండ్ శ్యాం Telugu Word సాఫ్ట్ వేర్ పంపించారు ప్రయత్నించమని. అది కూడా నాకు ఎందుకో వీలుగా అనిపించలేదు. ఈ సాఫ్ట్ వేర్లు ఉపయోగించటం సుళువు అయివుండవచ్చు. కానీ నా పద్ధతికి అవి సరిపోలేదు.

నా ఫ్రెండ్ అనూ ravivaranasi.com లో ఎదో newsletter కోసం వాడిన TeluguLipi సాఫ్ట్ వేర్ గురించి నాకు చెప్పింది. దానిని ప్రయత్నించగా అందులో వున్న కొన్ని ఫీచర్స్ నచ్చి, నా తెలుగు పేజీలు అన్నీ దానిలో తయారు చేయటం మొదలెట్టాను. దీనిలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదాహరణకి.. దీనితో వాడిన ha అక్షరం వెబ్ సైట్ లో కనిపించదు. అందువల్ల సాధ్యమైనంత వరకూ ఆ అక్షరం ఉపయోగించకుండా రాయటానికి ప్రయత్నించటం మొదలెట్టాను. దానివలన అయిష్టంగానైనా మధ్యలో ఇంగ్లీష్ మాటలు వాడటం మొదలుపెట్టవలసి వచ్చింది. తరువాత పోనీ ఇంగ్లీష్ మాటలని ఇంగ్లీష్ లోనే రాస్తే అని ఆలోచన వచ్చి ఆ విధంగా రాయటం మొదలెట్టాను. కానీ ఇది కూడా పరిష్కారం కాదు. మంచి సాఫ్ట్ వేర్ కోసం చూస్తుండగానే మరొక సమస్య ఎదురైంది.

నా వెబ్ సైట్ ని చూసి సూచనలు ఇచ్చే నా ఫ్రెండ్ శ్యాం, మా అమ్మగారు ఈ ఫాంట్ ని install చేసుకోవటం లో ఇబ్బందులు ఎదుర్కోవటం తో వాటిని వారు చదవలేకపోయారు. ఎన్నో రకాలు గా ప్రయత్నించినా వారు చెప్పేది నాకు అర్థం కాక ఇబ్బంది ఎక్కడ వుందో తెలియలేదు. అసలు ఈ font download సమస్య లేకుండా Web Embedded Fonts ఉపయోగిస్తే? అన్న ఆలోచన వచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ వాటిని Netscape browser లో ఉపయోగించటానికి కావలసిన సాఫ్ట్ వేర్ తయారుచేసే సంస్థ దానిని ఆపేయటం తో Netscape ఉపయోగించే వారు ఇంకా ఈ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకోవలసిన అవసరం వుంది. Internet Explorer ఉపయోగించే వారికోసం మైక్రోసాఫ్ట్ వారి WEFT ఉపయోగించి సైట్ లో పేజీలు అన్నింటినీ Embedded Fonts తో తయారు చేసాను. తెలుగు పేజీలతో ఇంక చాలా ఇబ్బందులు వున్నాయి. వాటిని పరిష్కరించటానికి మార్గాలు కోసం ఇంకా వెతుకుతుండగా, lekhini.org సైట్ గురించి తెలిసింది. వారి online ఎడిటర్ ఉపయోగించి, నేను ఇంతకు ముందే సేవ్ చేసిన RTS ఫార్మట్ లోని ఇంగ్లీష్ టెక్స్ట్ ని Unicode ఫార్మాట్ లోకి మార్చి ప్రచురించటం మొదలెట్టాను. ప్రస్తుతానికి ఇది అన్ని మోడర్న్ బ్రౌజర్ లలోనూ (Firefox, IE, Chrome, Safari) పని చేస్తోంది.

తెలుగు సైట్ లో ముందు కేవలం కధలు, చురకలు మాత్రమే వుండేవి. సంతోష్ శివన్ దర్శకత్వం చేసిన "The Terrorist" చిత్రం చూసినప్పుడు దానిని గురించి అందరికీ చెప్పాలని ఎంతో అనిపించింది. కానీ అందరూ రాసే రివ్యూలకి భిన్నంగా నా రివ్యూలు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టు వుండాలన్న అభిప్రాయం తో వాటిని నా స్వంత అభిప్రాయాలు గా రాయటం మొదలెట్టాను. ఆ విధంగా సినీ రివ్యూలు విభాగం మొదలైంది. మొదలెట్టినప్పటి నుంచీ రివ్యూలు చాలా ఆదరణ పొందాయి. అదేవిధంగా నేను ఎదుర్కొన్న విమర్శలు కూడా వాటి వలనే! నేను రాసిన కొన్ని తెలుగు సినిమా రివ్యూలు కొంతమంది ని నొప్పించాయి. ఆ బాధలో వారు పంపించిన కొన్ని mails నేను చాలా బాధపడేలా చేశాయి. తరువాత నా పొరపాటు గ్రహించి ఆ రివ్యూలని తిరిగి రాసాను. రివ్యూలని సెటైరిక్ గా రాయాలని నా ప్రయత్నం.

తరువాత సినీ కబుర్లు మొదలయ్యాయి. నేను New Jersy వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన ని "వయసులు వరుసలు తెలియని సరసులు సన్నాసులు.." గా రాసాను. కానీ దానిని ప్రచురించటానికి సరైన విభాగం లేక "వ్యాసాలు" అనే కొత్త విభాగం మొదలెట్టాను.

అదే విధంగా.. తెలుగులో వస్తున్న వెబ్ సైట్ గురించి అందరికీ పరిచయం చేయాలన్న సంకల్పంతో Telugu Sites విభాగం మొదలెట్టాను. తరువాత నేను వేరే కార్యక్రమాలలో బిజీ కావటం తో ఈ విభాగాన్ని అప్ డేట్ చేసి చాలా రోజులు అయింది.

మరొక్కసారి నా ఫ్రెండ్ దీక్షిత్ తెలుగు విభాగం లో సంస్కృతికి సంబంధించిన విభాగం మొదలెట్టమని సూచించారు. అయితే దీనిలో ఏమి ప్రచురించాలి అన్న విష్యం చాలా రోజులు నా ఫ్రెండ్స్ దీక్షిత్, భార్గవ్ లతో చర్చించిన పిమ్మట "శ్రీ శిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము" తో మొదలెడదామన్న నిర్ణయానికి వచ్చాను.

నా ఫ్రెండ్ భార్గవ్ తెలుగు విభాగం ని విడతీసి ఒక అర్థవంతమైన డొమైన్ నేమ్ రిజిస్టర్ చేయమని సూచించారు. అంతటితో ఊరుకోకుండా చాలా లభ్యమైన పేర్లు కూడా పంపించారు. ఆ సమయంలో నే నా సైట్ చూసిన ఒకాయన "కబుర్లు" అనే పేరు సూచించారు. ఇది ఎంతగానో నచ్చి వెంటనే దానిని రిజిస్టర్ చేసి తెలుగు సైట్ ని ఈ పేరు మీదకి మార్చాను. అప్పుడే "వ్యాసాలు" ని "లోకాభిరామాయణం" గా మార్చాను.

"ఆశోకా" చిత్ర సంగీతం చాలా నచ్చి దాని గురించి రాయటానికి "సంగీతం" విభాగం మొదలెట్టాను. చాలా మంది సూచించిన పిమ్మట మేట్రిమోనియల్ వగైరా ప్రోగ్రాం' లని రాసాను. కానీ వాటిని నిర్వహించటం లో ఎక్కువ రిస్క్ లు వుండటం గమనించాను. వాటి రూపం బాగోలేక అనుకుంటా ఎవరూ వాటిని ఆదరించలేదు. కనుక కొన్ని రోజులు చూసి, వాటిని తొలగించాను.

సాధారణంగా ఏదైనా సైట్ కి మళ్ళీ వెళ్ళాలంటే దానిలో మంచి పాటలు వుండాలి. లేదా ఆశక్తిని కలిగించే విష్యాలు అక్కడ వుండాలి. సాధ్యమైనంత వరకూ ఈ సైట్స్ ని ఆకర్షనీయంగా మలచాలని నా ప్రయత్నం. కానీ పని ఒత్తిడి, నాకున్న కొన్ని పరిధుల వలన ఒకోసారి నేను రాసేవాటిలో సృజనాత్మకత కనిపించక వాటిని ప్రచురించటానికి నాకే మనసు ఒప్పుకోదు. అందుకే అందరినీ ఈ ప్రయత్నం లో పాలు పంచుకోమని కోరుతున్నాను. ఆ విధముగా వివిధ ఆలోచనలు మనం ఇక్కడ చూడవచ్చు.

ప్రతీ అందమైన భవంతికీ బలమైన పునాది చాలా ముఖ్యం. నా ఈ సైట్స్ కి పునాదులు.. నా ఫ్రెండ్స్ వినిత, Dana Baitz. నేను రాశిన వాటిలో తప్పులు దిద్ది, తగు సూచనలు చేస్తూ, నన్ను భుజం తట్టి ముందుకు నడింపచటం లో వీరిద్దరు, ముఖ్యంగా వినిత మేలు నేను మరువలేను.

* * End * *