సరోజిని అత్త (2) - టామ్ సాయర్
ఈ పేజీ ని పంపండి

మా అత్త అమ్మాయిలకి నాకు ఊహ తెలిసే సరికే పెళ్ళిళ్ళు అయి పోయాయి. పెద్ద అమ్మాయి విజయవాడ, ఆయన సానిటరీ వ్యాపారం చేసే వారు. ఆయన దగ్గరే అత్త బాబు ఉద్యోగం లో చేరి పోయారు, చదువు మానేసి.

నేను వేశవి సెలవలకి వెళ్ళినప్పుడు నెలకి ఒక శనివారం సాయంత్రం వచ్చి ఆది వారం సాయంత్రం వెళ్ళి పోయేవాడు. అప్పుడప్పుడు మమ్మల్ని సినిమా కి తీసుకెళ్ళే వాడు. ఆయన పెళ్ళి చేసుకుని విజయవాడ లో ఉండేవారు. నేను ఒకే సారి వెళ్ళా వాళ్ళ ఇంటికి. ఆయన కూడా సడెన్ గా పోయారు, ముగ్గురు ఆడ పిల్లలు. చిన్న అక్క భర్త ఒక వ్యవసాయదారుడు. ఒక సారి వేశవి సెలవలకి నేను వెళ్ళేటప్పటికి అత్త మామయ్య చని పోయారు. చిన్నక్క భర్త ఆయన పొలం చూడటం మొదలు పెట్టారు.

పెద్ద అక్కకి పిల్లలు లేరు, కానీ ఆస్తి చాలా ఉంది. చిన్న అక్కకి ఆస్తి లేదు కానీ ముగ్గురు పిల్లలు. ఒక సారి వేశవి సెలవలకి వెళ్ళేటప్పటికి అయనా పోయారు అని చెప్పారు. చాలా బాధ వేసింది. కానీ అప్పటికి మనకు సరిగా ఊహ తెలీదు. చిన్న అక్క కొడుకుల్లో రెండో వాడు కుమార్ రాజా, నాకన్నా కొంచెం చిన్న. పెద్ద వాడు నాకు అంత పరిచయం లేడు.

కానీ కుమార్ రాజా, చిన్నా నాతో చాలా బాగా ఉండేవాళ్ళు. చిన్నా అక్క మీద సరోజిని అత్త, పిల్లల భారం ఒక్కసారి పడింది. పిల్లలు కూడా చిన్న వాళ్ళు. అక్క పొలం వెళ్ళటం మొదలు పెట్టింది. కుమార్ చదువు మానేసి అక్కకి సహాయపడటం మొదలు పెట్టాడు. చిన్న బళ్ళోకి వెళ్ళేవాడు. నేను వెళ్ళినప్పుడల్లా (అంటే వేశవి సెలవలకి) ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. కానీ వాళ్ళ ఆర్ధిక సంగతులు అంత గా తెలుసుకునే వయసు కాదు నాకు.

కుమార్ రాజా నన్ను ఎప్పుడు చూసినా చాలా సంతోషం గా పలకరించే వాడు. ఎప్పుడు తలచుకున్నా వాడి చూపులు నన్ను ఆప్యాయతతో తడిపినట్టు ఉండేవి. నిజంగా ఇప్పుడు తలుచుకుంటే నేను చాలా సిగ్గుపడతాను. నేను ఏం చేసాను అని వాళ్ళకి. నా మీద ఏంటీ ఈ ఆప్యాయత అని అనిపిస్తుంది.

ఒకో సంవత్సరం ఒకో వార్త వింటూ ఉండేవాడిని. ఒక సారి వెళ్ళేటప్పటికి అత్త చని పోయారు. ఇంకో సారి పెద్దావిడకి ఏదో ఏక్సిడెంట్ జరిగింది అని చెప్పారు.

చిన్నక్క చాలా కష్టాలు పడింది. ఆమె ఎప్పుడూ నాకు తెల్సి సుఖపడగా చూడలా. కానీ ఊర్లో కానీ మా ఇళ్ళల్లో కానీ ఏ పండగ (అంటే పెళ్ళి, బారశాల లాంటివి) లేక దినం లాంటివి జరిగితే first పని చెయ్యడానికి వచ్చేవారు ఆవిడ. ఎప్పుడూ నవ్వు మొహం తో కనిపించే వారు. ఏ రోజూ తన కష్టాలు చెప్పి ఒక్కళ్ళని బాధ పెట్టగా చూడలేదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పెట్టేవారు. ఎవరి దగ్గరా ఎప్పుడూ చెయ్యి చాచి ఎరగరు.

ఆవిడ పోలిక తో ఉన్న వాడు కుమార్ రాజా, చిన్న. కుమార్ కి ఎప్పుడు నన్ను చూసినా కళ్ళు మెరిసి పోయేవి. తనకి ఏ రోజూ నేను ఏమీ ఇవ్వలేదు. కానీ తనకి నన్ను చూస్తే ఎందుకు అంత ఇష్టమో ఇప్పటికీ నాకు అర్ధం కాదు. అన్నయ్య అని నోరారా పిలుస్తాడు. స్వచ్చమయిన నవ్వు! చిన్నా కూడా అంతే. వాడు ఆర్ధిక కారణాల వల్ల చదువు మానేసి మెకానిక్ షెడ్ లో జేరాడు. వెళ్ళినప్పుడు పలకరించడానికి వెళ్ళా. నాకు ఏం చెయ్యాలో తెలీదు కానీ వాడి బంగారు బాల్యం అలా కరిగి పోయింది. కానీ వాడు నన్ను చూసి ఎంత సంతోషించాడో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

చివరిసారి మొన్న వెళ్ళినప్పుడు చిన్నా అక్కని కలవడానికి వెళ్ళా. అక్క ఇల్లు అమ్మేసి ఒక చిన్న గది లో ఉన్నారు. కుమార్ పొలం వెళ్ళాడు అని చెప్పారు. ఆవిడ ఎంత సంతోషించారో నన్ను చూసి! గుర్తు పెట్టుకుని వచ్చా అని. నేను జీవితం లో స్థిరపడాలి అని కోరిక ఆవిడకి. వాళ్ళ ఆప్యాయతలు, అనురాగాలూ నిష్కల్మషమైనవి. నేను వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు, తీసుకోవడం తప్ప. తల్చుకుంటే చాలా సిగ్గు వేస్తుంది ఈ రోజు కూడా.

నాకు అప్పుడప్పుడు చాల గుర్తుకు వస్తారు. కానీ ఈ యాంత్రిక, ఆర్ధిక ప్రపంచం లో వాళ్ళ కోసం నేను ఏమీ చెయ్యలేక పోతున్నందుకు చాలా చాలా సిగ్గుపడుతూ ఉంటాను. (ఇంకా చాలా వాటికి కూడా పడతాను అనుకోండి, కానీ దున్నపోతు చర్మం కదా, ఏం చేస్తాం!).

P.S: ఏంటీ బాబూ ఈ సుత్తి అని అనుకోకండి... ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. నా బరువు కొంచం తగ్గించుకోడానికి రాసా. ఎవరికన్నా విసుగు తెప్పిస్తే క్షమించండి.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత టామ్ సాయర్ కి తెలియచేయండి.