సరోజిని అత్త (1) - టామ్ సాయర్
ఈ పేజీ ని పంపండి

మొన్న ఎందుకో నాకు కలలో కి వచ్చింది మా సరోజిని అత్త. "ఎంటిరా? నన్ను మర్చి పోయావా?" అని అడిగినట్టు అనిపించింది. అత్త అంటే ఆవిడేమీ మా నాన్న చెల్లెలు కాదు. అసలు నిజానికి అత్త కానే కాదు. మా నాయనమ్మ కి ఆవిడ వేలు విడిచిన ఆడబడుచు. ఆవిడ తన మేనమామ ని పెళ్ళి చేసుకున్నారు. ఎందుకు పిలిచేవాళ్ళమో తెలీదు కానీ మొదటి నుంచీ సరోజిని అత్త అనే పిలిచే వాళ్ళం. ఇంకో రెండు పేర్ల తో కూడా పిలిచే వాళ్ళం, "నల్లత్త", "నత్తి అత్త" (ఆవిడకి నత్తి ఉండేది. అందుకనే ఆ పేరు).

ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఆవిడకి. అందరూ నాకన్నా పెద్ద వాళ్ళే. ఆవిడ భర్త గారి పేరు మాకు ఎవరికీ గుర్తు లేదు. ఆవిడకి ఆయన మామ కదా ఆవిడ "మామయ్య" అని పిల్చేది. మాకూ "ఆయన అత్తమామయ్య"! వాళ్ళ అబ్బాయి పేరు సత్యనారాయణ, మేము పిలిచే పేరు "అత్త బాబు", వాళ్ళ అమ్మాయిలు "పెద్ద పాపక్కయ్య", "చిన పాపక్కయ్య".

వీళ్ళకీ నాకూ చాలా వయోబేధం ఉంది. కానీ చివరి అమ్మాయి కీ నాకూ తక్కువ. ఆ అమ్మాయి నాకంటే ఒకటో రెండో ఏళ్ళు పెద్దది. నా చిన్నప్పుడు నాకు చాలా జుట్టు ఉండేది. (తెలుసు కదా తిరుపతి మొక్కు ఆలశ్యం అన్నమాట) దానితో నాకు కృష్ణుడి లాగ జుట్టు పైకి కట్టే వాళ్ళు. (నాకు రెండో, మూడో యేళ్ళు. అంతగా గుర్తు లేదు).

వూర్లో మా వాళ్ళ ఇళ్ళు అన్నీ మంచి నీటి చెరువు కు మూడు వైపులా ఉండేవి. నాలుగో వైపు పొలాలు ఉండేవి. చెరువు ఒక చివర మా ఇల్లు రెండో చివర పెద్ద రావి చెట్టు, దాని కింద పెద్ద అరుగూ ఉండేవి. రావి చెట్టు దగ్గర వీళ్ళ ఇల్లు. మా అత్త ఇంటి పక్కనే ఏదో పద్య పాఠశాల ఉండేది. దాంట్లో అయిదవ తరగతి వరకూ ఉండేది.(ఇప్పుడు అది కొంచెం పెరిగింది. అంటే తరగతుల విషయం లో కాదు, పంతుళ్ళ విషయం లో మాత్రమే). ఆ బడి లో బల్లలు గట్రా వుండేవి కాదు.

సరే కథ లొకి వస్తా. ఆ వయసులో నా సావాస కత్తె మా అత్త మూడో అమ్మాయి. బడిలో ఆడుకుంటూ ఒక రోజు మంచి నీళ్ళు తాగుదాం అని చెరువు లోకి వెళ్ళాం. (ఇల్లు అక్కడే కానీ ఇంటికి పోలా, చెరువు కు పోయాం). అక్కడ మెట్ల మీద పాకుడుకి ఇద్దరం చెరువు లో పడి పోయాము. మొదట ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కోసం నేను. ఆ వయసులో ఈత రాదు కదా, ఇద్దరమూ నీళ్ళు మింగి లోపలికి వెళ్ళి పోయాం. నా జుట్టు పయికి కనపడి బడి లో పిల్లలు ఎవరో జుట్టు పట్టుకుని లాగారు. నాకు తెలివి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి చని పోయింది.

అప్పటి నుంచీ ఎప్పుడు నేను వూరు వెళ్ళినా నన్ను చూసి మా అత్త చనిపోయిన కూతుర్ని తల్చుకొని ఒక ఏడుపు ఏడ్చేది. నేను వేశవి శలవలకి ఎప్పుడు వెళ్ళినా అది మొదటి రోజు తప్పని సరిగా జరిగే సంఘటన.

ఆవిడ ఎప్పుడూ ఖాళీగా కూర్చోగా చూడలేదు. ఎప్పుడూ ఏదో చేస్తా ఉండేది. మా ఇంటికి ఎవరన్నా చూట్టాలు వస్తే మేము పడుకోడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. (ఇంట్లో మరి మంచాలు తక్కువ అవుతాయి కదా, అందుకని). వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చాలా చక్కగా ఉండేది. మా అత్త, మామ కూడా చాలా చక్కగా పద్యాలు పాడే వాళ్ళు. ఇంటి అరుగులు ఎప్పుడూ చక్కగా అలికి చుట్టూ తెల్లటి సుద్ద ముగ్గులు పెట్టి ఉండేవి. వసారా గోడల మీద శ్రీ రామ నామాలు, పద్యాలూ రాసి ఉండేవి. ఆయన చాలా ఓపికగా మాకు సుమతీ శతకాలు, వేమన పద్యాలు, శ్రీ రామ నామాలూ నేర్పేవారు. ఎప్పుడూ ఆయన చదువుతా ఉండగా చూడలేదు మరి. కానీ మంచి జ్ఞాపక శక్తి ఆయనకి.

ఆయన కూడా ఎప్పుడూ ఏదో చేస్తూ ఉండే వారు. వాళ్ళ ఇంట్లో నులక మంచాలు ఎక్కువ. ఆ నులక ఆయనే నేసే వారు. దాని మీద బొంతలు అన్నీ మా అత్త కుట్టేది. కప్పుకోడానికి కూడా అవే వాడే వాళ్ళు. చాలా మెత్త గా ఉంటాయి అన్నీ. దిండు గలేబుల మీద, కర్టెన్ల మీదా cross stitch తో డిజైన్లు కుట్టే వారు ఆవిడ.

ఇంటి ముందు ఎప్పుడూ పెద్ద ముగ్గు, వాకిట్లో మధ్య తిరగలి, ధాన్యపు పురి, ధాన్యపు పురి మీద కూడా సగం వరకూ అలికి దాని మీద నాము సుద్ద తో లతలు వేసి వుడేవి. రెండో, మూడో గేదెలు పక్కన పశువుల చావిట్లో ఉండేవి. పొద్దున్నే పొలం వెళ్ళేటప్పుడు కనపడితే చాలు పిలిచి పచ్చి పాలతో కాఫీ పెట్టి ఇచ్చేది. (మా ఇంట్లో కాఫీ నిషేధం!). అప్పట్లో ఆవిడ కాఫీ తాగడం వల్లే నల్లగా ఉండేది అని మా ఊహ! మాకు అలాగే చెప్పేవారు మా పెద్దాళ్ళు! కానీ అది మమ్మలని కాఫీ తాగ కుండా ఆపలేక పోయేది. ఆ కాఫీ రుచి వేరుగా ఉండేది లెండి. కాఫీ గింజలు దంచి, దాన్ని మళ్ళీ తెల్ల గుడ్డ తో వడకట్టేది. కనుక చాలా ఫ్రెష్ కాఫీ టేస్ట్ అన్నమాట.

ఊర్లో ఇళ్ళు తెలుసు కదా, ఒక చిన్న పడగ్గది, అది కాక ఒక గది, చిన్న వంట ఇల్లు, అన్ని గదులూ కలిపినంత వసారా వుంటాయి. ఆ వసారా కి ముందు వేసవి కాలం లో తాటాకు పందిళ్ళు ఉండేవి. మామూలు గా అందరం ఆ తాటాకు పందిళ్ళలో పడుకునే వాళ్ళం. వర్షం వస్తే మాత్రం ఇంట్లో. లేక, పోతే వేసవి శెలవల్లో ఎప్పుడూ బయటే పడుకునే వాళ్ళం.

మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా అత్త ఇంటికి పడుకోడానికి వెళ్ళేవాళ్ళం అని ముందే చెప్పాను కదా.. ఈవిడ జాకట్ కి ఎప్పుడూ hooks ఉండేవి కాదు. ముడి వేసుకునేది. ఎండాకాలం ఎండకి చమట పొక్కులు వస్తే మమ్మల్ని గోక మనేది. మాకు అదో పెద్ద సిగ్గుపడే విషయం. అది చెయ్యడానికి లంచం పెట్టేది. అప్పట్లో తాటాకు విసిన కర్రలు వుండేవి దానికి కూడా చుట్టూ బట్ట తో చక్కగా లేస్ టైప్ లో కుట్టి వుండేవి. పొద్దున్నే ఎప్పుడు వెళ్ళినా చల్ల చిలుక్కుంటూ ఎంత కావలి అంటే అంత వెన్న పెట్టేది. చెక్కెర కూడా కలిపి పెట్టేది.

అక్కడ ఉన్న సమయం లో ప్రతి సారీ భోజనానికి రమ్మని పిలిచేది. పాలతాలుకలు ఇష్టం అంటే చేసి పెట్టేది. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తిండానికి పెట్టేది. ఎప్పుడూ కోపం గా చూడలా మా అత్తని.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత టామ్ సాయర్ కి తెలియచేయండి.