నేను - మా అమ్మమ్మ సంగీతం పాఠాలూ - SKU
ఈ పేజీ ని పంపండి

నాకు ఒక విష్యంలో ఖచ్చితంగా మా అమ్మగారి పోలిక వచ్చింది. అదే కంఠం. మా అమ్మగారి కంఠం బాగుంటుంది. కనుక నాదీ బాగుంటుంది. కానీ మా అమ్మమ్మ చెప్పటం మాది కీచు గొంతు. ఒకసారెప్పుడో మా అమ్మమ్మే ప్రముఖ నైపధ్యగాయని శ్రీమతి యస్.జానకి గారిది కీచు కంఠం అన్నట్టు గుర్తు. కనుక నాదీ కీచు అని సర్టిఫికెట్ యిచ్చేసారు కనుక నేను జానకిగారు పాడిన పాటలన్నీ ఆమెలా పాడగలనని నమ్మకం పెట్టేసుకున్నాను.

అమ్మమ్మ బాగా పాటలు పాడుతుంది. శాస్త్రీయ సంగీతం మంచి ఇంట్రెస్ట్.. మాకు సంబంధించినంత వరకూ తను వాయించే violin Guitar కి replacement! తను సాధన చేసుకుంటూ ఎదైనా కూర కలపటానికో మరే పనికో ప్రక్కకి వెళ్ళితే గబ గబా వెళ్ళి దాని మీద మేం శ్రీ జంధ్యాల గారి జయమ్మునిశ్చయమ్మురా చిత్రంలో బ్రహ్మానందం పాత్రలా టుయ్ టుయ్ అనిపించేవాళ్ళం. ఇంతలో మా అమ్మమ్మ వచ్చి శృతి అంతా పోతుంది.. మీరు పిల్లలు కాదు పిశాచాలు అని తిట్టేది పాపం.. అమ్మమ్మ.. తన పాలిట ఒక్కళ్ళు కాదు 3 పిశాచాలు!!

మా తింగరితనం ని.. సంగీతం అంటే మాకున్న అభిమానం అని భ్రమ పడి మా అమ్మగారు ఒకసారి పోనీ సంగీతం నేర్చుకోవచ్చు కదా అని అన్నారు. మా అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. పాపం మా అమ్మగారికి నేర్పించటానికి చిన్నప్పుడు చాలా ప్రయత్నించిందట.. మా అమ్మ గారు.. ఆ.. ఒకో మాటనీ అరగంట సేపు అనవసరంగా సాగదీస్తూ.. నేనేం నేర్చుకోను లెద్దూ అన్నారుట.

సో.. మా ఆర్డరులో ముందు అక్క కదా.. మా అక్కకి సంగీతం పాఠాలు మొదలెట్టింది అమ్మమ్మ. యివన్నీ మాకు శలవల్లో మొదలెట్టేది. వుట్టప్పుడు అయితే చదువు, డాన్స్, ఆటలు, సంగీతం .. అసలే అంతంతమాత్రం చదువులు.. మొత్తానికి ఎందుకూ పనికి రాకుండా పోతామెమో అని నాన్నగారి భయం. ముందు అక్క సంగీతం పాఠాలు కదా.. ఒక 2 రోజులు రోజూ మేడమీద గంట పాఠము అవ్వగానే మిగిలిన మెళకువగా వున్న సమయం అంతా దానిని ప్రాక్టీస్ చేస్తూ వుండేది. ఖచ్చితంగా యిది 2 రోజులే.. తర్వాత నేను పాడను.. ఏదైనా వాయిద్యం నేర్చుకుంటాను అని మొదలెట్టింది. తనకి వైలెన్ బోర్.. వాళ్ళ ఫ్రెండ్ ఒకమ్మాయి వీణ బాగా వాయిస్తుంది కనుక తను కూడా వీణ నేర్చుకుంటానని మారాం మొదలెట్టింది. మా అమ్మగారు దాని ఫీజు చాలా ఎక్కువ.. నీ శ్రద్ధ ఎన్నాళ్ళో తెలీదు వీణ కొనటం.. మొత్తం ప్రాక్టికాలిటీస్ అన్నీ అలోచించి యింట్లో అమ్మమ్మ నేర్పిచే వైలెన్ యిష్టం అయితే నేర్చుకో.. లేకపోతే మూసుకొని కూర్చో అన్నారు. అలిగి నాకస్సలు సంగీతం వద్దు అంది. అప్పుడే ఒక శపధం కూడా చేసింది.. చూడు ఎప్పటికైనా వీణ నేర్చుకుని నీకు చూపిస్తాను. కానీ యిప్పటికీ శపధం గురించే మాట్లాడుతుంది.. పాపం అమ్మమ్మ చాలా బ్రతిమాలింది. ముందు సంగీతం పాడటం నేర్చుకోమ్మా.. అది అయ్యాక కొంచెం వీణని నీ తీసి ప్రక్కకి పెట్టగలిగేంత అయ్యాక దానిని నేర్చుకుందువు అని.. కానీ మా అక్కకి పట్టుదల ఎక్కువ లెండి.. కనుక ఆ పాఠాలు అక్కడ ఆగిపోయాయి.

నేను స్కూల్ లో వున్నపుడు మా క్లాస్ లో మంచిగా పాటలు పాడే 1,2 పిల్లలు వుండేవారు. నా కంఠం బాగుంటుంది కదా..(??!) కనుక వాళ్ళదగ్గర పాటలు తీసుకుని రాసుకొని యింటిదగ్గర పాడేదాన్ని. రోజూ రేడియోలో వచ్చే సుప్రభాతం పాటలు ఒక ఫాసినేషన్. వాటిని పాడటానికి కష్టపడేదాన్ని. M.S.రామారావు గారి చాలీసా, ఆదివారం సుప్రభాతం లో వచ్చే క్రిస్టియన్ పాటలు.. ఈ విధంగా తరతమ బేధం లేదు. పెద్ద సంగీత వంపులు లేని పాటలన్ని కొట్టిన పిండి. ఆఖరికి మా అమ్మమ్మ నన్ను కరుణించింది. నేనైనా తన దగ్గర బుద్ధిగా సంగీతం నేర్చుకుంటానని ఆశపడింది.

యింక నా సంగీతం క్లాసులు మొదలయ్యాయి. సప్తస్వరాల్ని సప్తస్వరాల్లో ఖూనీ చేసేదాన్ని. ఎవరో పాడిన .. ఎదో సినిమాపాట మదిలో మెదిలేది.. నాకు తెలీకుండా ఆ style లో పాడేసేదాన్ని. అంటే.. ఒక example చెప్తాను చూడండి. మా ఊళ్ళో సూర్యకళామందిర్ లో ఎప్పుడో నాగేశ్వరరావుగారి సినిమాల్లో పాటల పోటీలు పెట్టారు. మా అమ్మాగారు నన్ను అందులో పాల్గొనమని A.M.రాజా గారు పాడిన చూడుమదే చెలియా (విప్రనారాయణ) పాట నేర్పించడం మొదలెట్టారు. నేనా పాట అప్పటికి వినలేదు. మా యింట్లో ఆ పాట రికార్డు లేదు. నాకెందుకో ఆ పాట భానుమతి గారు పాడారనో.. లేక ఆవిడయితే ఆ పాట ఎలా పాడతారు అనో.. మొత్తానికి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. దానితో దానిని భానుమతి గారి style లో పాడటం మొదలెట్టాను. మా అమ్మగారు నా పద్ధతి మార్చలేక.. ఆఖరికి నీ యిష్టం వచ్చినట్టు పాడు ఫో అనేసారు. పోటీల రోజు అదే పాట కనీసం 4,5 గురు పాడారు. వాళ్ళతో పోల్చుకుంటే.. నన్ను రాళ్ళు, చెప్పులూ వేసి కొడతారెమో అని భయం వేసి మొత్తానికి బరిలోకే దిగలేదు!!!

కొన్నాళ్ళకి యింక విసుగు వచ్చి.. ఈ స్వరాలూ రాగాలూ వద్దు.. ఏకంగా పాటలు నేర్పించేయి.. అని మా అమ్మమ్మని పెద్ద ప్రమోషన్ కోసం అడిగాను. ఉట్టికి ఎవరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట నీలాంటిదే అని మా అమ్మమ్మ ఒప్పుకోలేదు. అయితే నేను సంగీతం నేర్చుకోను అని బెదిరించాను. మానేయ్.. నాకేం ఉద్ధరింపా.. నువ్వు సంగీతం నేర్చుకుంటే.. అది అయినా యిలా అల్లాటప్పా గా వచ్చేస్తుందా? అయినా నీ పిల్లలేమిటే సరళా.. మరీ మొద్దు రాతిచిప్పలు అని మా అమ్మ గారిని అడిగేవారు.

మా అక్క అడిగింది.. మరి నీ ముద్దుల పిల్లకి (మా అమ్మ గారికి) ఏందుకు నేర్పలేదబ్బా నీ సంగీత విద్య అని అడిగింది.

"నాకు ఇంట్రెస్టు లేదు బాబు అలాంటి సంగీతమంటే" మా అమ్మగారు ఒప్పేసుకున్నారు.

నీ బుద్దులే నీ కూతుళ్ళకీ.. ఊళ్ళో అంతా నేర్పించమని నా వెనుక పడుతుంటే.. నేర్పిస్తాను నేర్చుకోండర్రా అంటే.. పొగర్లు.. మా అమ్మమ్మ పాపం కోపం దాచుకోలేక పోయింది.

ఎవరైనా T.V. లో చిన్న పిల్లలు సంగీతం పాడుతోంటే మా అమ్మమ్మ ప్రక్కన వున్నామంటే చచ్చామన్న మాటే.. చూడు నీకన్నా చిన్న వాడు.. వాళ్ళని చూసి నేర్చుకో.. అదీ .. యిదీ అని తినేసేది.

కానీ త్వరలోనే అమ్మమ్మ తో cease fire ప్రకటించి సంధి చేసుకున్నాను. నాకు నచ్చిన అన్నమాచార్య కీర్తనలు, వాళ్ళు భక్తి రంజని (మా అమ్మమ్మ వాళ్ళ భక్తి రస సంగీత సంస్థ సత్కళావాహిని వారు పాడే పాటలు) లో పాటలూ, త్యాగరాజ కీర్తనలు, జయదేవుని అష్టపదులూ.. కొన్ని సెలక్టెడ్ గా నేర్చుకున్నాను. మా నాన్నగారు ఒకసారి అడిగారు.. రేపు నిన్ను ఎవరైనా చూసుకోవటానికి వచ్చి అమ్మాయ్ పాటొచ్చా అని అడిగితే.. పాడ గలవా అని.. దానికి మా అమ్మాగారు.. "చూడుమదే చెలియా" పాట పాడుతుంది అని జోక్ చేసారు.

కానీ సంగీత పునాదులు లేకుండా ఈ కీర్తనలు నేర్చుకోవటం వలన ఒక యిబ్బంది వుందండోయ్.. అల్లుడుగారు చిత్రం లో అన్నమాచార్య కీర్తన కొండలలో నెలకొన్న వుంది. అది కొంచెం కుంకుడుకాయ రసంతో (అంతే.. స్పీడ్ గా అన్నమాట.. ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలీదు.. దేవుడ్ని నిలదీస్తూ సినీ పాత్రలు పాడే పాటల్ని కుంకుడుకాయ రసం పాటలు అనటం అలవాటు) వుంటుంది. కానీ నేను నేర్చుకున్న సంప్రదాయబద్ధమైన పాటకన్నా అదే బాగున్నట్టు అనిపించింది. అప్పటికింకా అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. నువు చెప్పేకన్న ఆ సినిమాలో ట్యూనే బాగుంది.. చక్కగా స్పీడ్ గా.. నువ్వేమో.. ప్రతీ మాటనీ 4,5 సార్లు పాడిస్తావు అని complaint చేసాను. మరి మా అమ్మమ్మ సమాధానం ఈ పాటికి మీకు అర్థం అయ్యే వుంటుంది.

డిగ్రీ అవుతూనే నేను ఉద్యోగం, కంప్యూటర్ చదువులతో బాగా బిజీ అయిపోయాను. సంగీతం మానేసాను. కనుక నా తర్వాత లైన్ లో వున్నది మా సుజాత వంతు వచ్చింది. తనకి బాగా షార్ట్ టెంపర్.. మా అమ్మమ్మ perfectionist. కనుక సరిగా పాడకపోతే తిట్టిపోసేది. సుజీకి కోపం వచ్చి సంగీతం కట్ అని మానేసేది. ముద్దుల మనవరాలు కదా.. మళ్ళీ అమ్మమ్మే కూల్ అయి సుజి ని బ్రతిమాలి మాళ్ళీ మొదలెట్టేది.. మళ్ళీ కధ మామూలే. పాపం ఈ మనవరాలూ మా అమ్మమ్మకి నిరాశనే మిగిల్చింది. యిప్పటికీ మా అమ్మమ్మ బాధ పడుతుంది.. సంగీతం మన యింట్లో నాతోనే అయిపోతుంది అని! అది చూసి మా నాన్నగారు అంటూంటారు.. పోనీ నువ్వు నేర్చుకో.. అని మా అమ్మగారిని!!!

అమ్మమ్మకి బాగా పెద్ద వయసు అయిపోయింది. యింకా తన విద్య పది మందికీ నేర్పించాలని కోరిక. ఎవరో ఒకరు యింటికి వచ్చి తనదగ్గర పాఠాలు చెప్పించుకొని వెళ్తుంటారు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.