రష్యన్ ధియేటర్ నిర్బంధం - SKU
ఈ పేజీ ని పంపండి

నాలుగు రొజుల క్రితం మొదలయిన రష్యన్ ధియేటర్ నిర్బంధం డ్రామా నిన్న రాత్రి నేను పడుకునే సమయానికి ఒక భయంకరమైన మలుపు తిరిగింది. బందీలలో ఇద్దరిని హత్య చేసారన్న వార్త చదివి చాలా టెన్షన్ కి లోనయ్యాను.

మధ్య రాత్రి ఎందుకో మెళకువ వచ్చి దాని సంగతి ఏమయిందో చూద్దామని చూస్తే రష్యన్ సైనికులు ధియేటర్ పై మెరపుదాడి చేసి ఈ ఉదంతానికి తెర దించారని చదివి నిట్టూర్చాను. ఈ సంఘటనలో చాలా మంది బందీలూ, టెర్రరిస్ట్ లు మరణించారు. కానీ కొంతలో కొంత నయం. అన్నింటి కన్నా ముఖ్యమైనది.. ఈ మొత్తం ఉదంతం లో టెర్రరిస్ట్ లకి విజయం దక్కనందుకు నాకు సంతోషంగా వుంది.

* * *

శుక్రవారం, అక్టోబర్ 25, 2002.

ఇంటీవల అమెరికన్లనీ వాళ్ళతో పాటు అమెరికా వార్తలు అంటే ఒళ్ళుతెలీని మిగిలిన దేశీయులనీ 24 గంటలూ engage చేసిన sniper ఉదంతం గురించి అనర్గళంగా ఉపన్యాసం ఇస్తున్నారు నా కొలీగ్ సర్గోయ్. మధ్యలో నేను అక్కడ మాస్కో ధియేటర్ సంగతి ఏమయిందో అని CNN మరొకసారి చూసాను.

"సర్గోయ్.. మీరు రష్యన్ న్యూస్ చూస్తూ వుంటారా?" అడిగాను అతనికేమన్నా CNN కన్నా లేటెస్ట్ న్యూస్ ఇవ్వగలిగే వెబ్ సైట్ తెలుసెమో తెలుసుకుందామని.

నేను ఎందుకు అడుగుతున్నానో తెలియక, "చూస్తాను, దానితో పాటు CNN, BBC అవి కూడా చూస్తాను." చెప్పారు.

"అది కాదు.. మాస్కో లో జరుగుతున్న ధియేటర్ seize గురించి తెలుసా?" అడిగాను.

ఒక్కసారిగా సర్గోయ్ సీరియస్ గా అయిపోయారు.

"తెలుసు. వాళ్ళెవ్వరూ బ్రతకరు. నాకు, నా లాంటి మిగిలిన రష్యన్లు అందరికీ తెలుసు ఈ సంగతి. వాళ్ళంతా టెర్రరిస్ట్ లు. చావటానికి సిద్ధపడిన వాళ్ళు. చావుకి తెగించిన వ్యక్తి తనతో పాటు ఎంత మందిని అయినా తీసుకువెళ్ళటానికి సందేహించరు." నిరాశగా అన్నారు.

"అదే. ఇదివరకు కూడా ఇలాంటి hostage drama లో 120 మందినో ఎంత మందినో చంపేశారు కదా? ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చంపేస్తారని మీలాగే మీ అధికారులు కూడా అనుకుని వాళ్ళ demands అన్నింటినీ ఒప్పుకుంటే ఇంక ప్రపంచం లోని ప్రతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కీ వీళ్ళొక దారి చూపించినట్టు అవుతుంది. అందులో మాకు కాశ్మీర్ లాంటి సెన్సెటీవ్ ప్రదేశాల్లో ఇలాంటి పనులు మొదలెడితే, మా గవర్నమెంట్ ముందే వాళ్ళ డిమాండ్లు ఒప్పుకుని ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు పెరిగేలా చేస్తుంది."

"తప్పదు. కొన్ని సార్లు టెర్రరిస్ట్ ల డిమాండ్ లని ఒప్పుకోవాల్సి వుంటుంది. ఒప్పుకోకపోతే అమాయకులని ప్రాణాలని బలి చేయటం అవుతుంది. అది ఒక త్యాగం. అంతే. ఈ టెర్రరిస్ట్ లని ఆపాలంటే కొంతమంది మనవాళ్ళు కూడా పోవక తప్పదు. కానీ ఆ పోయేవాళ్ళలో మన అమ్మో, అక్కో, లేక మనమో వున్నప్పుడే ఎందుకు గవర్నమెంట్ ఆ టెర్రరిస్ట్ ల డిమాండ్లని ఒప్పుకోలేదు? అని అనుకుంటాము. నేను నా రష్యన్ friends కొందరితో మాట్లాడాను. వాళ్ళకెవ్వరికీ కూడా ఈ 700+ మంది లో ఒక్కరు కూడా బ్రతుకుతారన్న ఆశ లేదు." చెప్పారు సర్గోయ్.

తను ఈ మాట చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "నేను లోపల ఆ ధియేటర్లో వుండి వుంటే?" అని ఊహించుకొని. లోపల వాళ్ళకన్నా ఘోరం.. వాళ్ళ కోసం బయట ఎదురు చూస్తున్న వారి ఆత్మీయుల పరిస్థితి.

ఈ టెర్రరిస్ట్ లకి కారణాలు ఏమైనా కావచ్చు. మధ్యలో అమాయకులైన ఆ సామాన్య ప్రజల మీదనా వారి ప్రతాపం? ఒళ్ళంతా బాంబులు కట్టుకొని, చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు పట్టుకొని, నిరాయుధుల మీద వీరాంగాలు ఆడతారా? వాళ్ళు నిజంగా రష్యన్ అక్రమాల మీదే పోరాడుతున్నట్టయితే, ఇది ఏ రకంగా సక్రమం? ఇటువంటి చర్యలకి మద్దతు ఇచ్చే ఏ దేశాన్నయినా సాంఘిక బహిష్కారం చేయాలి.

ఇదే మాట అమెరికా నుంచి వచ్చిన ఒక అమెరికన్-ఇండియన్ ఫ్రెండ్ తో అన్నప్పుడు ఆయన నవ్వారు.

"ఎవరు చెయ్యాలి? అమెరికా నా? లేక దాని వెనుక కుక్కల్లా (చావా గారి కి మళ్ళీ కుక్కని కించపరుస్తున్నందుకు కోపం వస్తుందెమో!) తోక ఊపుకుంటూ తిరిగే ఇతర దేశాలా?" ప్రశ్నించారు.

నిజమే! మరి రోజు రోజు కీ పెరిగిపోతున్న ఈ టెర్రరిజం సమస్య కి పరిష్కారం ఏమిటి? అంతకన్నా ముందు టెర్రరిస్ట్ అనే మాటకి ముందు అందరూ అర్థం తెలుసుకుంటే మంచిది ఎమో! ఒక దేశం టెర్రరిస్ట్ లు గా ముద్ర వేసిన వాళ్ళు మరొక దేశం దృష్టి లో స్వాతంత్ర్య సమర యోధులు. ఎంత స్వాతంత్ర్య సమరం అయితే మాత్రం.. అమాయకులని పొట్టన పెట్టుకోవటమా వారి వీరత్వానికి ఋజువు?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి అరుణ బీరకాయల కి తెలియచేయండి.