Confused రాజకీయం - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
చిన్నప్పటి నుంచీ నేనొక confused రాజకీయవాదిని! నేను ఎంతో అభిమానించే వాళ్ళలో ఎవో లోపాలు బయటపడుతూ వుంటాయి... వీరి కన్నా.. అవతలవాడే నయం అనుకుని.. అంతవరకూ ఇష్టపడని వారిని ఇష్టపడటం ఇలా సాగుతుండేది. ఆ మాటకి చెప్పాలంటే, ఎవరు కాదు? 5 ఏళ్ళకోసం ఒక పార్టీని ఎన్నుకుంటాం. వాళ్ళు వెలగబెట్టిన నిర్వాకాలు చూసి, "చీ..ఛీ.." అనుకుని, అంతకుముందు ఓడించిన వాడిని గద్దెనెక్కిస్తాం. వాడు అంతకు నాలుగు రెట్లు చూపిస్తాడు. బాబోయ్! అనుకుని, మొదటి వాడికి తిరిగి అధికార పీఠం అప్పగిస్తాం. ఇదే కదా కధ!

ఇంతకీ నేను చెప్పేదేమిటంటే, కాంగ్రెస్ నుంచి BJP లోకి దూకినప్పుడు నన్ను నేను సమర్ధించుకోవటానికి నా friends కి చెప్పిన కారణం.. PV గారి పాలనలో అవినీతి (నేను ఆయన ప్రత్యక్షంగా వీటిలో పాలుపంచుకున్నారంటే ఇప్పటికీ నమ్మకపోయినా!) అని చెప్పేదాన్ని. మరి BJP ఎందుకూ అంటే.. "వాజ్ పేయ్, అద్వాని లని చూపించేదాన్ని.. నా రోల్ మోడల్స్ అంటూ!

ఇవాళ ఆ విషయం తలచుకుంటే వాళ్ళనా నేను రోల్ మోడల్స్ అన్నది అని నా మీద నాకే సిగ్గు వేస్తుంది. అసలు నాకు కాంగ్రెస్ మీద అభిమానం వుండటానికి కారణం ఇంట్లో వాతావరణం. అమ్మమ్మ, అమ్మ, తాతయ్య గారూ అందరూ ఇందిరా గాంధీ అభిమానులు. నా చిన్నప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరా గాంధీ. అప్పట్లో రాజీవ్ గాంధీ అందమైన బుగ్గన సొట్టలు పడే నవ్వూ, క్యూట్ పిల్లలూ, అత్తగారి ని తల్లిలా చూసుకునే పెద్ద కోడలు ఇవన్నీ చూస్తే భలే ముచ్చట గా వుండేది.

ఎప్పుడయినా మేనకా గాంధీ ఏమైనా హడావిడి చేస్తే మా ఇంట్లో మేనక బాంబే డయింగ్ టవల్స్ ఆడ్. లని చేయటం, అత్తగారిని ఇబ్బంది పెట్టడం తలచుకుని తలచుకుని మా కాంగ్రెస్ త్రయం తిట్టి పోసేవారు.

నాన్నగారు BJP సానుభూతిపరుడు. కానీ రాజకీయ వాదనలు వస్తే ఆయనకి వాదన లలో పెద్దగా ఆశక్తి లేదు.

ఆ సమయం లో నేను నర్సాపురం మా మావయ్యగారి ఇంటికి వెళ్ళాను. ఆయన RSS కార్యకర్త. మాకు తెల్సిన RSS అంటే, గాంధీగారిని చంపి సంబరాలు చేసుకున్న RSS. మా అక్క అనుకుంటా మా మావయ్యగారిని అడిగింది RSS అంటే ఏమిటి అని.

దానికి ఆయన కొన్ని కరపత్రాలు ఇచ్చారు. అప్పటికి మేము ఇంకా స్కూలు కి వెళ్ళే పిల్లలం. ఆయన ఇచ్చిన కరపత్రాలు ఎక్కువ మన దేశం లో కుటీర పరిశ్రమలని ఏ విధం గా ప్రోత్సహించాలి, ఏ వస్తువులు మన దేశం లో సంపూర్ణం గా తయారయ్యాయి, ఏ వస్తువులు మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం, వేటిని వాడటం వలన మనం దేశం లో ప్రజల అభ్యున్నతికి పాటుపడగలం వంటి వివరాలతో కూడిన పెద్ద లిస్ట్ వుంది.

అది చదివి మేము ఇద్దరం కూడా అందులో కొన్ని వస్తువుల వివరాలు తిలియకపోయినా అప్పటీ నుండీ ప్రతీ సారీ నెలసరి సరుకులు తెచ్చినప్పుడు నాన్నగారు, అమ్మ కొని తెచ్చిన బ్రాండ్ లు మా దగ్గర వున్న లిస్ట్ లలో వున్నాయో లేవో చూసుకునే వాళ్ళం. లేకపోతే మేము వాటిని వాడము అని గొడవ చేసేవాళ్ళం.

స్వతహా గా మా అమ్మగారు ఎన్నో ఆదర్శాలతో వుండి వాటిని పాటించే వ్యక్తి. మేము అడుగుతున్నది తన ఆదర్శాలకి ఏ విధం గానూ అడ్డు వచ్చేది కాదు, పైగా కొంచెం ఇంచుమించు తను మాకు చెప్పే విషయాలలోదే. కనుక ఆ విధం గా నెమ్మదిగా మేము అన్నీ స్వదేశీ వస్తువుల వాడకం దార్లు అయిపోయాం.

మొన్న ఈ మధ్య ఇక్కడ MIT లో Parzania చిత్రం ప్రదర్శించినప్పుడు చూడటానికి మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము. ఆ చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించిన సంస్థ గుజరాత్ లో జరిగిన అల్లర్ల బాధితులకి సహాయం చేస్తున్న గ్రూప్ ల వాళ్ళని పిలిచారు.

వారిలో కొంత మంది చేసిన ప్రసంగాలు నాకు పెద్దగా రుచించలేదు. ముఖ్యం గా ఒకామె RSS గురించి కొన్ని వ్యాఖ్య లు చేసారు. ఆమె RSS వారిని కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ ల రిక్రూటింగ్ తో పోల్చారు. MIT లో కూడా త్వరలో RSS మరియూ హిందూ గ్రూప్ ల సంఘటన జరుగుతోందనీ, హిందూ మందిరాలలో ఈ గ్రూప్ లు మదరాసా ల తరహాలో పరమత ద్వేషాన్ని ప్రభోధిస్తున్నాయనీ అన్నారు.

అది నిజం అయితే అయి వుండవచ్చు కొన్ని చోట్ల. కానీ, ఆమె మొత్తం RSS సంస్థ అంటే కేవలం ముస్లిం లని ఊచకోత కోసే సంస్థ గా పేర్కొనటం నాకు నచ్చలేదు. కారణం నాకు తెలుసు వారి పనుల గురించి. వారి మూల సిద్ధాంతాల గురించి. కొన్ని extreme శక్తుల వలన మొత్తం సంఘం కి చెడ్డ పేరు రావటం అంటే ఇదే. దానికి తోడు పూర్ణ జ్ఞానం లేకుండా మిడి మిడి జ్ఞానం తో మాట్లాడే ఆ అమ్మాయి తరహా వ్యక్తులు కూడా ఒక కారణం.

నేను బయటకి వచ్చేప్పుడు నా మితృడు అరిందం తో ఈ మాట అన్నప్పుడు ఆయన వచ్చే వారం వాళ్ళు ఎక్కడ కలుస్తారో చెప్పారు కదా, వెళ్ళి వాళ్ళకి ఆ సంస్థ గురించి నీకు తెలిసినది చెప్పు. వాళ్ళని కరెక్ట్ చేయి అన్నారు. నేను వెళ్ళలేదు, అది వేరే సంగతి!

బాబ్రీ కూల్చివేత, గుజరాత్ వంటి ధారుణ సంఘటనల తరువాత కాంగ్రెస్ గూటికి మళ్ళీ వచ్చాను. కానీ ఆ రావటానికి కారణం ఎక్కువ మన రాష్ట్రం లోని పరిస్థితులు. చంద్రబాబు చండాలమైన పాలన ఎప్పుడెప్పుడు అంతం అవుతుందా అని రోజులు లెక్కపెట్టిన వ్యక్తులలో నేను ఒకదాన్ని.

రాజశేఖర్ రెడ్డి మీద ప్రత్యేకమయిన అభిమానం లేదు. ఆ మాటకి వస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి వస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయినా, మళ్ళీ రెండు నెలల్లో స్వంత పార్టీ వాళ్ళు పీతల బుట్ట నానుడి నిజం చేస్తూ అతన్ని కిందికి లాగుతారని ఒక రకమైన నమ్మకం!

అయినా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ని ఎంతో శ్రద్ధ గా ఫాలో అయ్యాను. చంద్రబాబు కాలం లో రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, ప్రస్తుత స్పీకర్ సురేష్ రెడ్డి, ప్రస్తుతం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న మైసూరా రెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉపన్యాసాలు ఎంతో ఆసక్తికరం గా, ఆలోచింపచేసేవిగా వుండేవి. ఆనాడు వాళ్ళు ప్రతి పక్షం గా చంద్రబాబు చేస్తున్న పనుల గురించి సాక్ష్యాలతో సహా బయట పెడ్డటం లో సఫలమవటం వలనే నాకు మళ్ళీ కాంగ్రెస్ మీద అభిమానం, చంద్రబాబు పాలన కి చివరి రోజులు వచ్చాయి అనే ఆశ ఉదయించింది.

అనుకున్నట్టే రాజశేఖర్ రెడ్డి గద్దెనెక్కారు. అంతే, అంతవరకూ ఒక లక్ష్యం వుండేది.. చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవలనే లక్ష్యం. అది సాధించటం జరిగింది. ప్రస్తుతం లక్ష్యం ఏమీ లేదు. మళ్ళీ మొనాటమీ.

కానీ మనసు కాంగ్రెస్ మీదనుంచి మళ్ళకపోవటానికి కారణం ఇప్పటి వరకూ ఏమీ కనపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులలో నచ్చనివి వున్నప్పటికీ, మన రాష్ట్రానికి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని YSR ప్రభుత్వం పునరుజ్జీవింపచేయటం తో అవన్నీ చంద్రుడి వెలుతురు చాటున మాయమయ్యే మచ్చల మల్లే దాని ముందు మరుగున పడిపోయాయి.

కానీ ఇప్పుడు ఆ అభిమానం కి బీటలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి అది రాష్ట్రం లోని కాంగ్రెస్ వలన కాదు, కేంద్రం లోని కాంగ్రెస్ వలన.

US ప్రభుత్వం తో కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎందుకో నాకు చాలా తొందరపాటు చర్య అనిపిస్తోంది. ఈ విషయం లో లెఫ్ట్ పార్టీలు మన్మోహన్ చేస్తున్న ఎమోషనల్ బ్లాక్ మైల్ కి లొంగిపోతే మన దేశానికీ, భారత ఉపఖండానికీ చెడు రోజులు మొదలవుతాయేమో అని భయం. అదే కనుక జరిగితే కాంగ్రెస్ ని మళ్ళి అభిమానించగలనా అనేది ప్రశ్నే!

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.