"అయ్యా.. నే పొలం దున్నుకొంటా!!!!" - చావా
ఈ పేజీ ని పంపండి

"అయ్యా.. నే పొలం దున్నుకొంటా!!!!"

మూడు సంవత్సరాల క్రితం..

"ఏంటీ ఉద్యోగం మానేస్తావా? మానేసి ఏం చేస్తావ్?" --మా అమ్మ

"పొలం దున్నుకొంటా" --నేను

"దున్నావు లే" --అమ్మ

"హ హ హ " --నాన్న

"అదేందయ్యా, అలాగంటావ్? బంగారం లాంటి బావి (mining engg) పని మానేసి పొలం దున్నుకొంటావా! ఏం మాట అది?! చక్కగా ఇంటి పక్కనే government ఉద్యొగం చేసుకోక నీకెందుకు ఈ పొలం పనులు?" --మా తాత.

బంగారం లాంటి ఉద్యొగం! government ది!! ఛీ ఛీ!! వీళ్లకి ఎలా చెప్పినా అర్ధం కాడం లేదు. పేరుకి 8 గంటల shift.. కాని పని చేసేది రోజుకి 12 గంటల పైనే. పోని చేస్తే చేసాం లే అనుకోడానికి అదేమన్నా ఫాన్ కింద కూచొని చేసేదా అంటే అదీ కాదు. మాంచి ఎండలో చమటలు కక్కుతూ పని చేయాలి. పని చేసినంత సేపూగొర్రెలు కాసేవాడిలా పని వాళ్ల ని అదిలిస్తూనే ఉండాలి.. పైగా ఎవడిష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతాడు. అవన్ని విని కూడా విననట్లే ఉండాలి. పట్టించుకొంటే పనులు జరగవు మరి!

ఇంతా చేసి పని అయ్యాక సాయంత్రం ఇంటికి వచ్చేముందు manager గాడి తో shunting. ఎందుకు ఈ బ్రతుకు అనిపించేలా! వాడింట్లో బట్టలుతకడానికి పనోడిని పంపలేదు అనే కోపం మొత్తం మన మీద అరుపుల్లో చూపిస్తాడు. మొహం వేలాడేసుకొని ఇంటి దారి పట్టడం తప్ప ఏం చేయగలం? మన service record వాడి చేతిలో ఉందాయె! ఇక అలసి పోయి ఇంటికి రాగానే స్నానం చేసి, తిని, పడుకోడం! చా.. ఇదీ ఒక ఉద్యోగమేనా?

ఇలాంటి ఉద్యోగం చేయడం కన్నా నా పొలం నేను దున్నుకోడం మంచిదా కాదా? మీరే చెప్పండి!

********

నిన్న:

"ఇంత హఠాత్తుగా India వచ్చి ఏం చేస్తావు రా?" --అమ్మ

"పొలం దున్నుకొంటా" --నేను

"దున్నావు లే" --అమ్మ

"హ హ హ" --నాన్న

"అదేందయ్యా.. అదేం మాట! ఇక్కడ బావి పని నచ్చలేదని దేశం గాని దేశం పోతివి. అక్కడ కడుపులొ చల్ల కదలకుండా ఉండే ఉద్యోగం చేస్తుంటివి. చల్లగా ac room లో చేసే ఉద్యోగం ఉండగా నీకు పొలం దున్నుకోవల్సిన ఖర్మ ఏంటి?" --మా తాత.

అవును నిజమే.. కడుపులో చల్ల కదలకుండా ఉండే ఉద్యోగమే.. మీరు చేస్తే మీకు తెలుస్తుంది! పొద్దున్న 6 కి లేచి ఉరుకుల పరుగుల్తో office కి పోయి మళ్ళీ సాయింత్రం 6 కి నీరసం గా ఇంటికి రాడం. office లో ఉన్నంత సేపు టిక్కు - టిక్కు మంటూ key board ని కొట్టి కొట్టి, monitor వేపు చూసి చూసి విసుగొస్తోంది. ఇంతా చేస్తే ఈ ఉద్యోగం రేపటికి ఉంటుందో ఊడుతుందో తెలియదు! రేపొద్దున్న రాగానే పింక్ స్లిప్ చేతికొచ్చినా అశ్చర్యం లేదు! అప్పుడు మళ్లా మొదటినుండి మొదలెట్టాలి!

సాయంత్రం కాగానే India లో లా నలుగురు కలిసి కబుర్లు చెప్పుకొనేదా లేదు. కబుర్లు మాటలా ఉంచు, అసలు కలవడమే గొప్ప! మనసులో ఏదో తెలియని వెలితి. పోనీ డబ్బులేమన్నా తెగ సంపాదిస్తున్నామా అంటే అదీ లేదు. నెల మధ్యలోకి రాగానే బిల్లులు కట్టడానికే సరిపొతున్నాయి! ఛా.. ఇదీ ఒక ఉద్యోగమేనా??

ఇలాంటి ఉద్యోగం చేయడం కన్నా నా పొలం నేను దున్నుకోడం మంచిదా కాదా? మీరే చెప్పండి!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.