పొదుపు - SKU
ఈ పేజీ ని పంపండి

మొన్న ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ తను ఉన్న ఒక్క గది లోనే కాక ఇంట్లో వున్న మొత్తం గదుల్లో లైట్లూ, ఫాన్లూ వాటికి తోడు వణుకు పుట్టుంచే లెవల్లో సెంట్రల్ AC నడుస్తున్నాయి. నాకు అర్థం కాలేదు, ఉన్నది ఒక్క మనిషి.. మిగిలిన వాళ్ళు అంతా ఇంకా బయట తిరుగుతున్నారు. అలా అందరి గదుల్లో ఫేన్లూ, లైట్లూ, వాటికి తోడు ఆ AC నడవటం మా నాన్నగారు కనుక చూసి ఉంటే కూర్చోపెట్టి పొదుపు గురించి ఒక పాఠం చెప్పేసి ఉండేవారు.

నాకు ఆ వ్యక్తి దగ్గర నాన్నగారి మాదిలి పాఠం పీకే చనువు లేదు కాబట్టి మౌనం గా గమనించి వచ్చేసాను.

* * *

మా ఉపాధ్యాయుల వంశం లో పీనాసితనం ఎక్కడో ఏదో నరం లో నడుస్తూ ఉంటుందని నాదో పెద్ద అనుమానం! కానీ ఎవ్వరం ఆ విషయం తమ దగ్గరకి వచ్చేసరికి ఒప్పుకోం. కానీ ఈ ఉపాధ్యాయుల వారి వంశం లోనే ఉన్న మరొక్క గుణం కారణం గా పక్క వారిని మాత్రం మహా చక్కగా విమర్శిస్తాం.. అది మా నాన్నగారిని చూసి విసుక్కునే, నేను అవచ్చు, వాళ్ళ అప్ప ని చూసి విసుక్కున్న నాన్నగారు కావచ్చు లేక వీళ్ళ ధోరణి అస్సలు అర్థం కాని మా అమ్మగారు కావచ్చు.. అందరం.. పక్క వాళ్ళ విషయానికి వస్తే అది పీనాసితనం, మన విషయానికి వస్తే, అది పొదుపు అని మాకు మేమే భుజం తట్టేసుకుంటాం.

ఈ విషయం లో మా అమ్మమ్మ చెప్పే ఒక సూత్రం.. "నీళ్ళు వాడటం బట్టి ఆడపిల్ల కి ఎంత పొందిక ఉందో చెప్పచ్చు" అని. మేము ఉండేది గోదావరి జిల్లాల్లోని కాకినాడ మహాపట్టణం లో. భగవంతుడి దయ వలన, మాకు నీళ్ళకి కటకటాల్సిన పరిస్థితి ఎప్పుడూ లేదు. అయిదు మీటర్ల లోతులో నిండుగా వచ్చే నూతి నీళ్ళు (ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మా అమ్మగారు చెప్పారు) కుళాయి లో నీళ్ళు మాకు, మా ఇంట్లోని ఆరేడు వాటాలలోని కుటూంబాలకి సరిపోయేవి.

ఎప్పుడైనా నీళ్ళు నూతి దగ్గర మేము అనవసరం గా దుబారా చేయటం చూస్తే మా అమ్మమ్మ గారు మమ్మల్ని పైన సూత్రం చెప్పి మందలించేవారు.

నాకు నోటి దురుసుతనం కొంచెం ఎక్కువ కదా, ఒక స్నేహితురాలు కెనడా లో ఉండగా మా ఇంటిలో కుళయి పూర్తిగా తిప్పేసి పక్కన ఏవో సర్దుకుంటుంటే నోరు నిగ్గబెట్టుకోలేక అమ్మ సూత్రం చెప్పాను, తనకి ఒద్దిక లేదు అనే అర్థం వచ్చే మాదిరి. మరి ఆ అమ్మాయికి కోపం నశాళం కి అంటిందంటే అది తన తప్పు అనను!

* * *

ఇంక మా నాన్నగారి విషయం చెప్తా.

కరెంటు విషయం లో నాన్నగారికీ మాకూ బోలెడన్ని వాదనలు! అప్పటికి చంద్రబాబు వచ్చి APSEB ని నాశనం చెయ్యలేదు. వాళ్ళ మావగారు ఏలుతున్న రోజులు లేకా ఇంకా పూర్వం విషయం. అప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబానికి కరెంటు బిల్లు షాకు కొట్టేది.

ఇంట్లో మేము ముగ్గురం ముందు గదిలో మడత మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం. నాన్నగారు పొద్దుటే ఆరింటికి రేడియో కార్యక్రమాలు వింటూ మంచం మీద దొర్లేవారు. అప్పటికి అమ్మ వెళ్ళి బాయిలర్ వెలిగించటం, స్నానం చెయ్యటం, పూజకి పువ్వులు కోసుకోవటం వంటి పనుల్లో బిజీగా ఉండేవారు. ఆరున్నర ఆ సమయానికి మా పాలబ్బాయి నాగేశ్వరరావు, అతని గేదెలూ వచ్చేవి.

మా వంతు రాగానే, వాళ్ళ అబ్బాయి వచ్చి, "సుబ్బారావుగారూ! పాలండీ!" అని గట్టిగా వీధిలోంచి అరిచేవారు.

నాన్నగారు లేచి వచ్చి, గేదెపాలు తీసే కార్యక్రమం పర్యవేక్షణ కి వెళ్ళేముందు మా గదిలోంచి వెళ్తూ, ఫేన్ కట్టేసి, కిటికీ తలుపులు తీసేసి, ముందు గది పూర్తిగా వెయ్యకుండా వీధి గుమ్మం లోకి వెళ్ళిపోయేవారు.

అప్పటికి మేమూ నిద్రలు లేచేవాళ్ళం. నాన్నగారు గట్టిగా పెట్టిన రేడియో సుప్రభాతం, బయట నాగేశ్వరరావు, అతని సంతానం గేదెలని అదిలిస్తూ గట్టిగా వేసే కేకలు మొదలైన శబ్ద కాలుష్యాల వలన.

కానీ మంచాలు దిగేవాళ్ళం కాదు, ముసుగులు తీసేవాళ్ళం కాదు. ఫాన్ కట్టేస్తే మటుకు చెప్పలేనంత చిరాకు వచ్చేది. నాన్నగారు పాల పని పూర్తి చేసుకొని వచ్చేసరికి మేము మంచాలు దిగి పళ్ళు తోమటానికి వెళ్ళిపోవాలి, ఆయన కాఫీ పూర్తి చేసుకొని వచ్చేసారికి మంచాలు ఎత్తేసి, ఎవరి వంతు అయితే వాళ్ళు ముందు గది తుడిచేయాలి.

మేము ఏ విహయం గురించి ఎక్కువ దెబ్బలాడాలో తైలియక ఆయన మంచం దిగగానే మేము కూడా దిగిపోవాలన్నట్టు మేము పడుకున్న గదిలోని ఫేన్ కట్టేయటం ఏమీ సబబు కాదని గొడవ చేసేవాళ్ళం. అప్పుడు మాకు ఆయన దగ్గర నుండి పొదుపు గురించి, కరెంటు ఆదా గురించి ఒక పాఠం నడిచేది. ఆయన పద్ధతి ఆయనదే. మా గోల మాదే అన్నట్టు ఉండేది పరిస్థితి.

"అహా నా పెళ్ళంట" చిత్రం లో కోట శ్రీనివాసరావు పాత్ర అయిపోయిన టూత్ పేస్ట్ ట్యూబ్ లోంచి మిగిలిపోయిన పేస్ట్ ని లాగటానికి పడే ప్రయాసలు రాజేంద్ర ప్రసాద్ పాత్ర నోరు బెళ్ళబెట్టేలా చేసాయి. ప్రేక్షకులని నవ్వించాయి. మాకు మాత్రం ఆ పరిస్థితి కొత్త కాదు. మా ఇంట్లో అమాందస్తా గూటం ఒకటి ఉంది. నాన్నగారు పేస్ట్ అయిపోగానే, దానిని తలుపు సందులో పెట్టి flat చేసి ఓ రెండు తోముళ్ళకి సరిపోయే పేస్ట్ లాగేవారు. ఆ తరువాత, ఈ గూటం తో దానిని మరింత flat చేసి, కనీసం ఒక బ్రష్ కి సరిపడా పేస్ట్ తీయగలిగితే తన పొదుపు కి ఎంతో సంతోషించేవారు.

మా చుట్టాలాయన ఒకాయన ఉన్నారు. మంచి ఉద్యోగం, బోలెడంత ఆదాయం. కానీ వంశాచారం గా వచ్చిన బుద్ధులు ఆయన లో కూడా చిత్రం గా బయటకి కనిపిస్తూ ఉంటాయి. మా ఊళ్ళో ఒక హోల్ సేల్ స్టోర్ ఉంది. ఎన్నో ఏళ్ళగా ఉన్న పరిచయం కొద్దీ అక్కడ కావలసిన వస్తువులు అన్నీ మంచి ధర కి దొరికేవి. ఆయన ప్రతీ ఆరు నెలలకీ ఒకసారి ఎన్నో వందల మైళ్ళ దూరం నుండి వచ్చి, సంచీల నిండు సామానులు కట్టుకొని వెళ్ళేవారు. ఇంతకీ ఆ కొనే సామానులు ఏమిటీ అంటే, పేస్ట్ లూ, బ్రష్ లూ ఇలాంటి చిల్లర వస్తువులు. అది మాకు అస్సలు అర్థం కాదు. ఈ రకం గా ఎంతో అసౌకర్యం ఫీల్ అవుతూ మోయలేని మోత మోసుకొని వెళ్ళి, వాటిని ఇంటి నిండా నింపేసేలా స్టోర్ చేసి ఆదా చేసే డబ్బు ఎంత అని!

నాన్నగారికి వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు సంసారం నడపడం లో మా అమ్మగారు తన కి చేతనైనంత సాయం చేసేవారు. పెరుగుతున్నప్పుడు మేము ఎప్పుడూ ఇంట్లో అమ్మ కుట్టిన బట్టలే కట్టుకున్నాం. మా ఫేషన్ కి తను కుట్టే స్టయిల్స్ సరిపోయినా సరిపోకపోయినా, కిక్కురుమనకుండా వేసుకునేవాళ్ళం. పెరట్లో కూరల పాదులు పెట్టి కూరల ఖర్చు వీలయినంత తగ్గించేవారు. మళ్ళీ ఇక్కడ ఎప్పుడన్నా వరుసగ రెండు రోజులు ఒకే రకం ఇంట్లో పెంచిన కూర ఏదన్నా చేస్తే, మా కన్నా ముందే నాన్నగారు, "మీ అమ్మ వారోత్సవం చేస్తున్నట్టుంది పెరటి పెంపకం తో" అని కవ్వించేవారు తనని.

మధ్య తరగతి కుటుంబం అంటే ఎన్నో ఖర్చు లు. అందులో పిల్లలు ఉన్నప్పుడు ఒక్క సంపాదన మీద సంసారం నడపటం అంటే మాటలు కాదు. అమ్మా నాన్నగార్లు ఎంతో ఆదర్శమైన భావాలు కలవారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ లో పని అని చెప్పగానే ఒంకర చూపులు చూసిన వాళ్ళు నాకు గుర్తే. అవి ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నిజాయితీపరులూ, లంచాలు కోసం చేయి చాపని వాళ్ళూ ఉంటారని తెలియన వాళ్ళ చూపులు. మమ్మల్ని పెంచి, చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేయటానికి అమ్మా నాన్నగారూ మేము పీనాసి తనం అని విసుక్కునే విధాలుగా పైసా పైసా కూడబెట్టి కష్టపడ్డారు. ఆ విషయం తలుచుకున్నప్పుడు వాళ్ళ పీనాసి తనం లా అనిపించే పొదుపరితనం గుండెని గర్వం తో నింపుతుంది.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.