నందికేశుని నోములు - JUBV ప్రసాద్
ఈ పేజీ ని పంపండి

రెండో తరగతి చదువుతున్న రోజులు. బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినందుకు సంతోషించే రోజులవి. ఎందుకంటే ఏ బ్రాహ్మణుల ఇంట్లో నందెకేశుని నోము నోచుకున్నా, మధ్యాహ్నం కల్లా వాళ్ళు స్కూళ్ళ మీద పడేవారు పిల్లల కోసం.

ఈ కబుర్లు చెప్పే ముందర మీకందరికీ నందికేశుని నోము గురించి చెప్తాను.

నందికేశుని నోము పేరుతో ఆ ఇంట్లో వాళ్ళు పొద్దున్నే ఒక పదార్థం భారీ ఎత్తున చేస్తారు. గారెలు, అప్పాలు, అట్లూ, చిమ్మిలీ, చలిమిడి, పరమాన్నం వగైరాలలో ఒక పదార్థం ఎన్నుకుంటారు. అలా చేసిన ఆ పదార్థాన్నంతా సాయంకాలం లోపున తినేయాలి. మళ్ళీ ఆ పదార్థం వాళ్ళింటి గుమ్మం దాటకూడదు. వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ స్నేహితులూ తినేశాక కూడా ఇంకా చాలా పదార్థం మిగిలిపోతుంది. అప్పుడు స్కూళ్ళకి వచ్చేవారు.

"బ్రాహ్మణ పిల్లలు చేతులెత్తండ్రా" అనేవారు టీచరు.

బ్రాహ్మణ పిల్లలంతా చేతులెత్తితే, వాళ్ళందరినీ లేపి, లైనులో ఆ నోము నోచుకున్న వాళ్ళింటికి తీసుకెళ్ళేవారు.

"పిల్లలూ, పారెయ్యకుండా తినాలి" అంటూ తినగలిగినంతా పెట్టేవారు.

ఇలా నోము నోచుకున్న వాళ్ళింటికి ఆ రోజు ఎన్నిసార్లన్నా వెళ్ళి తినొచ్చు. అలా తిని వచ్చిన బ్రాహ్మణ పిల్లలు క్లాసులో సంతోషం గా ఉంటే, బ్రాహ్మణులు కాని పిల్లలంతా జాలిగా మొహాలు పెట్టేవారు.

ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా పరమాన్నం అంటే చాలా ఇష్టం నాకు. అందులోనూ బియ్యం పరమాన్నం బెల్లం తో చేస్తేనే ఇష్టం. మళ్ళీ జీడిపప్పు, కొబ్బరి, కిస్ మిస్ వెయ్యకూడదు. అన్నం పాలతోనే ఉడికించాలి కూడా.

చిన్నప్పుడు మా అమ్మ ఉత్త పండగల్లో మాత్రమే పరమాన్నం చేసేది. పండగలు కాక మరొక రోజు కూడా చేసేది - అది మా తాత తద్దినం రోజున. మా తాత నేను పుట్టకముందరే పోయారుట. దాంతో తద్దినం వస్తోందంటే అన్నీ వండుతారు కదా అని సంతోషం గా ఉండేది. ఏడాదికి ఒకటి కన్నా ఎక్కువ తద్దినాలు మా ఇంట్లో రావే అని విచారిస్తే, మా అమ్మ తిట్టింది బాగా.

ఈ రోజుల్లో అయితే మా ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు బెల్లం తో బియ్యం పరమాన్నం చేసేస్తుంది. ఎటొచ్చి చేసిన ప్రతీసారీ ఒకో రుచి వస్తుంది మరి. అది వేరే సంగతి.

రెండో తరగతి చదివే రోజుల్లో ఒక రోజు ఒకయన మా క్లాసులోకి వచ్చి మా టీచరు తో నేమ్మదిగా ఏదో చెప్పారు.

అలాంటి వాళ్ళని చూడగానే గుర్తు పట్టేసేవాడిని నేను. వాళ్ళింట్లో నందికేశుని నోము అని అర్థం అయిపోయింది. నా మొఖం చింకి చేటంత అయింది.

టీచరు చేతులెత్తమంటారూ, ఎత్తేద్దాం అని రెడీ గా ఉన్నాను.

"కోమట్ల పిల్లలెవరన్నా ఉంటే చేతులెత్తండర్రా" అన్నారు టీచరు.

ఆ టీచరు మాట్లాడుతూ ఉండగానే చెయ్యెత్తేశాను. ఆ తరువాత టీచరు అన్నది బుర్రలోకెక్కి, చెయ్యి దింపేశాను.

కొంతమంది కోమట్ల పిల్లలు చేతులెత్తారు.

"వీళ్ళింట్లో పరమాన్నం నందికేశుని నోముంది. మీరంతా ఈయన తో వెళ్ళి తిని రండి." చెప్పారు టీచరు.

వెంటనే నేను కూడా చెయ్యెత్తేశాను. ఆశగా చెయ్యైతే ఎత్తాను కానీ, లోపల బితుగ్గానే ఉంది టీచరు తిడతారేమోనని. టీచరుకి నా సంగతి తెలుసు గదా!

ఏమనుకున్నారో ఏమో, టీచరు నావైపు ఒకసారి చూసి ఊరుకున్నారు.

ఆ కోమట్ల పిల్లల్తో పాటు నేనూ వెళ్ళి పరమాన్నం తిని వచ్చాను. ఒక్కరు కూడా నా మీద కంప్లైంట్ చెయ్యలేదు. బ్రాహ్మణ పిల్లలంతా బిక్క మొఖం వేసుకొని, మిగిలిన కోమట్లు కాని పిల్లలతో కూర్చున్నారు.

ఒక గంట పోయాక మళ్ళీ ఇందాక వచ్చినాయనే మళ్ళీ వచ్చి, మళ్ళీ టీచరు తో ఏదో మాట్లాడారు.

"బ్రాహ్మణ పిల్లలు చేతులెత్తి, ఈ కోమట్లింట్లో పరమాన్నం నోముకి వెళ్ళండి" అన్నారు టీచరు.

మళ్ళీ చెయ్యెత్తి బ్రాహ్మణ పిల్లలతో కలిసి కోమట్ల ఇంటి లో మళ్ళీ పరమాన్నం తిని వచ్చాను.

అలా వాళ్ళ ఇళ్ళలో నోము చెల్లడానికి తింటే, ఏదో వాళ్ళకి గొప్ప సహాయం చేసినట్టు ఫీలింగ్!! ఆ రకం గానే ఏమో కులాల మీద నమ్మకం పోయి, తిండి మీద మాత్రమే నమ్మకం వచ్చింది.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయితJUBV ప్రసాద్ కి తెలియచేయండి.