తలుపులు తెరిచియే ఉన్నవి! - SKU
ఈ పేజీ ని పంపండి

సినిమాల్లో కధానాయిక కానీ మరేదైనా పాత్రకానీ ఎవరింట్లోనైనా జామకాయలు, మామిడికాయలూ వగైరా ఆకతాయితనంగా దొంగలించి తినే సంఘటనలు చూపిస్తే సాధారణంగా అది మనకి కామెడీగా అనిపించి నవ్వుతాము. వారి వెనుక ఆ తోట లేక చెట్టు యజమాని పరుగెడుతుంటే వారి పాట్లు చూసి enjoy చేస్తాము. కానీ ఇటువంటి scenes చూసినప్పుడల్లా మా అమ్మమ్మ తిట్టుకుంటూవుంటుంది. ఆ చెట్టు యజమాని బాధలు చూసి జాలిపడుతుంది. ఎందుకంటారు?? సరీగ్గా కనిపెట్టారు.. మా అమ్మమ్మా అటువంటి బాధితురాలు కనుక!

ఆది మామిడికాయ అవనీయండి లేకా వేరేదైనా కాయ కానీయండి.. దానిని ఆశించేవారికి సంబంధించినంతవరకూ అది కేవలం ఒక కాయి మాత్రమే. కానీ దానిని ఆ స్థితికి తీసుకురావటానికి ఆ చెట్టు నాటీ, నీళ్ళు పోసీ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే దాని యజమానికి మాత్రం అది ఒక ఆస్థి! తన కష్టాన్నీ ఎవరో బయటి వ్యక్తులు తేరగా దోచుకుపోతుంటే వారి ప్రాణం తల్లడిల్లుతుంది.. దానిని కాపాడుకోవటం కోసం ఎదో దాచిపెట్టిన నిధి కోసం అన్నట్టు పోరాటానికి దిగుతారు. వారి బాధా మరి అర్థం చేసుకోవాలి!

కాకినాడ లో మా ఇల్లు అన్ని రకాల చెట్లతో అడవిలా వుంటుంది. నాకు మొక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ మా ఇంట్లో మిగిలిన అందరూ తెగ ఆపసోపాలు పడిపోయేవారు ఆ మొక్కలని కాపాడుకోవటానికి. మా అమ్మమ్మ తన మొక్కల మీదకి రాళ్ళతో దాడిచేసేవాళ్ళని ద్వేషించినంతగా ఎవ్వరినీ ద్వేషించదెమో! అమ్మమ్మే కాదు సాధారణంగా మొక్కలు పెంచిన ఎవరైనా అంతే.

మా ఇంటి చుట్టూ పూరి పాకలు వుంటాయి. అందులోని వాళ్ళందరికీ మేకలూ కోళ్ళూ వుండేవి. ఆ మేకలు కొంచెం గేటు తీసి వుంటే చాలు రాణీ వారిలా (మా అమ్మమ్మ ఆ మేకలకి వాడే పదం!) వచ్చి చక్కగా మొక్కలని భోంచేసి వెళ్ళేవి. ఒక్క క్షణం వాటిని గమనించటం లేట్ అయినా మొక్క మాయం!! అమ్మమ్మ ఆ మేకల యజమానులని వాటికి సరీగ్గా తిండి పెట్టకుండా ఇలా ఊళ్ళో వారి ఇళ్ళల్లొకి ఒదులుతున్నారని వాళ్ళతో దెబ్బలాడేది. అయితే వాళ్ళేం తక్కువ తిన్నారా?? మీ గేట్ తలుపు మూసుకోవచ్చు గా అని సలహా ఇచ్చేవారు.

గేట్ తలుపు ఎప్పుడూ మూసుకోవటం అంటే అది అంత సుళువైన పని కాదు. పాపం అమ్మమ్మ ఒక బోర్డ్ మీద చక్కగా "గేటు తీసిన వెంటనే వేయవలెను" అని రాసి గేటుకి తగిలించింది. దానిని దూరం నుంచి చూసిన ఒకరిద్దరు అదెదో Tolet బోర్డ్ అనుకుని వచ్చి నిష్టూరాలాడారని గేటు మీద మా అమ్మగారు, తనూ కలిసి paint చేసారు. అయినా ఎవరికి ఓపికా, తీరికా? ఆ గేటు మీద రాసినది ఏమిటో చదివి.. బుద్ధిమంతుల్లా తలుపు తీసిన వెంటనే వేయటానికి?? తలుపులు తీసేసి వెళ్ళిపోయేవారు. అందుకని గేటు చప్పుడవితే చాలు ఎక్కడున్నా అమ్మమ్మ గుండె లటుక్కున కొట్టుకునేది. తరువాత గేటు వేసిన చప్పుడు కోసం ఎదురు చూసేది. అది గానీ వినిపించలేదా.. అయిపోయింది!!

తను ఖాళీ గా ఉంటే ఎంతసేపూ పాపం గేట్ కీపర్ పని చేసేది. ఎప్పుడూ వెళ్ళి గేట్ వేస్తున్నట్టే అనిపించేది. ఆఖరికి గేట్ తీసి గేట్లో కూర్చోవటం మొదలెట్టింది. ఖాళీ గా కూర్చుని వుంది కదా అని చుట్టు ప్రక్కల వాళ్ళు వచ్చి అమ్మమ్మ దగ్గర కూర్చుని కబుర్లు మొదలెట్టేవారు. ఆ విధంగా గేట్లో లోకాభిరమాయణాలు మొదలయ్యాయి. TV లో ఏమైనా కార్యక్రమాలు వస్తే గుమ్మానికి అటూ ఇటూ కూర్చునేది. ఒక కన్నూ, చెవీ TV వైపూ, మరొక కన్నూ, చెవీ గేట్ వైపూ వేసి ద్విపాత్రాభినయం చేసేది. ఎప్పుడైనా మంచి తనకి నచ్చిన కార్యక్రమం ఏమైనా వస్తే రావణాసురుడు శివలింగాన్ని వినాయకుడికి ఇచ్చినట్టు మా పిల్లకాయల మీద గేట్ కాపు కాసే బాధ్యత పెట్టేది. మేము duty లో వుండగా గానీ ఏదైనా మేక గానీ ఇంట్లోకి వచ్చిందా.. మా పని అయిందన్నమాటే!

నేను కాలేజ్ లో వుండగా మా ఇంట్లో మా కాలేజ్ లో చదివే ఒకబ్బాయి వాళ్ళ కుటుంబం అద్దెకి వుండేవారు. అతనికోసం నాకు తెలిసిన మా కాలేజ్ గూండాలు (ఎందుకో వాళ్ళు ఆడపిల్లలని ఏడిపించే పద్ధతి చూస్తే గూండాల్లా అనిపించారు అప్పుడు) వచ్చేవారు. వాళ్ళది అంతా నిర్లక్ష్యం పద్ధతి. తలుపులు వేసే వాళ్ళు కాదు. show గా వెళ్తున్న అబ్బాయిని ఒక డీ-గ్లామరైజ్డ్ అమ్మమ్మ గారు వెనక్కి పిలిచి తలుపు వేయమని మందలిస్తే ఎవరికి నచ్చుతుందీ?? మా అమ్మమ్మ మీద జోకులు వేసేవారు. అది విన్నప్పుడు తనకి అర్థం కాకపోయినా మాకు అర్థం అయేది.

"అమ్మమ్మా.. ఎందుకు వాళ్ళతో.. చూడు ఎలా మాట్లాడుతున్నారో!" అని అమ్మమ్మ నోరు నొక్కేందుకు ప్రయత్నించేవాళ్ళం. మా ఇంట్లో వున్నబ్బాయి వినయంగా నే వుండేవాడు అమ్మమ్మతో. (అవి నక్క వినయాలు అని మాకు అనిపించేది) అతనెదో తన మాట వింటాడు.. విని తన friends కి తలుపు తీయగానే వేయాలి అని చెపుతాడు.. వాళ్ళకి బోధి చెట్టు క్రింద కూర్చున్న బుద్ధిడికి మల్లే జ్ఞానోదయం అయిపోయి.. తలుపులు వేసి.. తల ఒంచుకొని తమ పనెదో తాము చూసుకుంటారు.. అని మా అమ్మమ్మ భ్రమ పడేది. పాపం చాలా రోజులు ఆ భ్రమ లో వుండి.. ఆఖరికి ప్రాణం విసిగి వాళ్ళని ఇల్లు ఖాళీ చేసిపారేయమని చెప్పింది.

మా friend ఒకాయన తన friend కి జరిగిన అనుభవం గురించి చెప్పినది ఈ సందర్భంలో నాకు గుర్తొస్తోంది. మా ఇంటికి వచ్చే అబ్బాయిల్లాగే రాజేంద్ర అనే ఈ అబ్బాయి కూడా తన friend రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు సైకిలు బయట పెట్టి, అక్కడ దొంగల భయం ఎక్కువ, కనుక గేట్ వేసేస్తే సైకిలు కనపడదని గేట్ "తలుపులు తెరచియే వున్నవి" టైపు లో బార్లా ఒదలి లోపలికి వచ్చేవాడుట. అయితే ఈయన లోపల వుండగా ఒకటి రెండు సార్లు ఆవులో లేక మేకలో లోపలికి వచ్చి మల్లె పందిరి ని భోంచేసేసాయని రమేష్ వాళ్ళ ఇంటాయన కోప్పడ్డారుట.

ఆయన అలా మందలించటం మనోడికి కొంచెం అనమానంగా అనిపించింది.. కానీ రమేష్ వాళ్ళకి వాళ్ళ ఇంటాయన అంటే భయం కనుక ఆయనకి ఎదురు చెప్పొద్దని గట్టిగా చెప్పాడుట. అప్పటినుంచీ రాజేంద్ర ఆయన వుంటే గేట్ వేసి.. లేకపోతే ఒదిలేసీ చేసేవాడుట. ఒకసారి రమేష్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సాధారణంగా కూర్చునే పడక కుర్చీ లో ఆయన కనపడక పోయేసరికి

"అమ్మ! ముసలోడు లేడు" అనుకొని, తన సైకిలు కి తాళం వేసి, గేట్ తీసేసి లోపలికి రాబోయాడట. పైనుంచి ఇతను రావటం గమనించిన ఆ పెద్దాయన..

"ఏమయ్యా? గేట్ వేయమని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అర్థం చేసుకోవాలి.. చిన్నపిల్లలా ఏమన్నా??" అన్నారుట కొంచెం కోపంగా.

"అబ్బే.. లేదండీ .. ఇప్పుడే చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాను" సమర్థించుకోవటానికి ప్రయత్నించాడుట రాజేంద్ర.

"కదా! మరి నీ సైకిలు కి తాళం ఎందుకు వేసుకున్నావ్?? తనది కాకపోతే ఊరంతా డేకమన్నాడుట.. నీలాంటివాళ్ళని చూసే!"

మన రాజేంద్ర feelings ఎలా వుండి వుంటాయో నేను ప్రత్యేకంగా చెప్పాలా???

* * *

మొక్కలని కాపాడుకోవటం విషయానికి వస్తే మా అమ్మమ్మ, తాతయ్యగారూ ఎంత కష్టనష్టాలైనా ఎదుర్కోవటానికి సిద్ధపడేవాళ్ళు. మా ఇంటికి ఆనుకొని కాకినాడ మూసీ నది (అదే.. ఏలేరు కాలువ.. దాని లోంచి వచ్చే దుర్గంధం, దానిపై పెరిగే జంతుజాలం లని చూసి మా అమ్మగారు దానిని కాకినాడ మూసి అనేవారు) వుంది. వర్షాలు మొదలయ్యే టైముకి దాని నిండా గుర్రపు డెక్క మొలిచేది. ప్రతీ సంవత్సరం దాని వలన చాలా ఇబ్బంది అవుతోందని దానిని వెడల్పు చేసే పని ప్రముఖ సినీ నిర్మాత, MP శ్రీ సుబ్బిరామిరెడ్డి గారి గాయత్రి construction కి అప్పగించారు. వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ కట్టించి ఇచ్చే ఒప్పందం మీద తమ పనికి అడ్డుగా వుందని మా గోడని పడగొట్టారు. పని అయిపోయింది, వాళ్ళెవ్వరూ కనిపించటం లేదు.. గోడ కట్టించే నాధుడు లేడు.

మా ఇంట్లో వున్న పనస కాయలూ, మామిడి కాయలూ, ఉసిరి కాయలూ, ములక్కాడలూ, గోరింటాకు మొదలైన వాటి కోసం చుట్టు ప్రక్కల వాళ్ళు స్వేచ్ఛగా (గోడ లేకపోవటం వలన) వచ్చి అయ్యగారి సొమ్ము అన్నట్టు కోసుకొని వెళ్ళేవారు. మా తాతయ్య గారు ఎన్ని సార్లు ఆ construction company వాళ్ళ office వెళ్ళినా రేపు, మాపు అంటూ అక్కడి incharge తిప్పించేవారు. ఆఖరికి ప్రాణం విసిగి మా అమ్మగారు consumer court లో కేస్ వేశారు. దాని నోటీస్ అందగానే అఘమేఘాల మేద రాత్రి లాంతర్లు పెట్టుకొని మరీ గోడని కట్టించి ఇచ్చారు. అంతే కాదు.. మా మొక్కలికి జరిగిన నష్టానికీ, మాకు కలిగిన మానసిక వేదనకీ కూడా నష్టపరిహారం ఇచ్చారు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.