త్వరగా చచ్చిపోమ్మా తల్లీ!! - SKU
ఈ పేజీ ని పంపండి

ఈ మధ్య ఏదో పేపర్లో చదివాను.. సియాటిల్ లో ఎవరో అమ్మాయి ఏదో వంతెన మీద నుండి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా గమనించి ఆమెని అక్కడ నుంచి క్షేమంగా క్రిందకి దిగి రావటానికి పోలీసులు మంచి మాటలు చెప్పుతూ ప్రయత్నిస్తుండగా.. ఆ వంతెన మీద ట్రాఫిక్ గంటల తరబడి ఆగిపోయిందట. ఆ వెయిట్ భరించలేని రోడ్డు మీద చిక్కుకుపోయిన వాళ్ళలో కొందరు ఆమెకి వినిపించేలాగ తమ కార్లలోంచి అరిచారుట..

"ఆ దూకేదేదో త్వరగా దూకి చావు" అని శాపనార్థాలు పెట్టారుట. దీని గురించి చెప్తూ పోలీసుల్లో ఒకతను అన్నారు..

"గంటల తరబడీ ట్రాఫిక్ లో చిక్కుకుపోవటం బాధాకరమే. కానీ తాము త్వరగా ఇంటికి వెళ్ళటం కోసం మరొక మనిషిని చచ్చిపోమనటం చాలా ధారుణం."

ఇది చదివినప్పుడు నాకు చాలా సంఘటనలు గుర్తుకు వచ్చాయి. మనలో ఎంత సున్నితత్వం, మానవత్వం ఉన్నా, కొన్ని పరిస్థితుల్లో ప్రాణం విసిగినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాము.

కొన్నాళ్ళ క్రితం ఒక చంటిపిల్లతో ఒక డాక్టరు వేగం గా వస్తున్న రైలు మీదకి దూకి తన చంటి పిల్లాడితో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వార్తకి వచ్చిన విపరీతమైన ప్రెస్ కవరేజి వలన వెనువెంటనే వరుసగా చాలా మంది అటువంటి ప్రయత్నాలు చేసారు. ఇటువంటి సంఘటనలు అయినప్పుడల్లా గంటల తరబడి రైళ్ళు ఆగిపోతాయి. ఆఫీసులనుంచి వచ్చేవారు ఎంతో అలసిపోయి ఎప్పుడు ఇంటిలో పడతామా అనే ఆతృతలో ఉంటారు. అటువంటప్పుడు ఎవరో ఇటువంటి పిచ్చి పని చేసారని రైళ్ళు ఆగిపోయి, ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలీని పరిస్థితి వచ్చినప్పుడు, ఎంత sane మనిషికి అయిన insane ఆలోచనలు వస్తాయి. ఆ అభాగ్యురాలో, అభాగ్యుడో .. ఆ తెలియని వ్యక్తి ని తిట్టుకుంటారు.

నేనేమీ దేవతని కాదు. అటువంటి పరిస్థితి లో చిక్కుకుని పోయినప్పుడు నేనూ తిట్టుకున్నాను.

"ఆ దూకేదేదో, rush లేనప్పుడు ఏ మధ్యాహ్నం టైమో చూసుకొని అప్పుడు దూకొచ్చు కదా!? అసలు ఎందుకు చేస్తారో ఇటువంటి పని! అంత ఎవరికీ ఉపయోగం లేము చచ్చిపోదాం అని అనుకున్నప్పుడు, ఆ చేసేది ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేయక, పోతూ పోతూ కూడా ఇలా అందరినీ ఏడిపించటం దేనికి? వాళ్ళ శాపనార్థాలు తినటం దేనికోసం?"

ఎంత క్రూరమైన ఆలోచన! ఒక మనిషి ఎటువంటి తప్పని పరిస్థితిలో, అంత బాధాకరమైన పని చేస్తారో అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలిని కాను. కానీ ఎప్పుడు ఇంటికి వెళ్తాన అన్న అదుర్దా, తొందర లో మానవత్వం, జాలి, దయ అవన్నీ వెనకడుగు వేస్తాయి.

ఇదే కాదు. చిన్నప్పుడు అదేంటో నాకెప్పుడూ అర్థం కాదు, ఎప్పుడూ నాకు పరీక్షలప్పుడు మా బంధువుల్లో ఎవరో ఒకరు పోవటం, మాకు మైల రావటం అయేది. మైల అంటే, ఒకే ఇంటి పేరు గలవారు ఎవరైనా పోతే, సంతాప సూచకంగా ఇంట్లో పూజలూ అవీ మానేసి కొంచెం సాత్వికం గా జీవించటం. ఇది చనిపోయిన వారికి ధర్మోదకాలు ఇచ్చేంత వరకూ అంటే 12వ రోజు వరకూ ఇంట్లో కొంచెం విడిగా ఉంటారు. 12వ రోజు తరువాత స్నానం చేసి, ఇల్లంతా ధర్భలు, పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తారు. మైల సమయం లో బట్టలున్న బీరువాలు ముట్టుకోకూడదు. మంచాల మీద పడుకోవటానికి లేదు. నేల మీద పడుకోవటం. ఇంక స్నానం రోజయితే మరీ ఏడుపు వచ్చేది. అన్నీ శుద్ధి చేసి, ఈ పది రోజులుగా వాడిన బండెడు బట్టలూ ఉతికి, అన్నీ చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. ఈ పనులన్నీ మా అమ్మగారు చేసేవారు. అయినా ఎంత పిల్లలమని మాకు పనులు ఏమీ చెప్పకపోయినా, మేము కూడా ఎంతో strain అయిపోయేవాళ్ళం.

ఈ పనంతా పరీక్షలప్పుడు వస్తే చాలా చిరాకు వేసేది. మా స్నేహితులు ఎక్కువ బ్రాహ్మణ పిల్లలు. మైల సమయం లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మైల బట్టలు ఎలా కలుపుతాము? వాళ్ళు వచ్చేవారు కాదు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. combined studies అలావాటు పడిన నాకు అది పిచ్చ చిరాకు తెప్పించేది. మాకు ఎవరో తెలియని వ్యక్తి చనిపోతే, కేవలం మా ఇంటి పేరు అవటం వలన, ఆ వ్యక్తి పట్ల మాకెటువంటి ఫీలింగ్ ఉన్నా లేకపోయినా ఈ సంతాపాలూ, మైల పట్టడాలూ ఎంతో కోపం తెప్పించేవి. దానితో పరీక్షలు వస్తున్నాయంటే ఎవరైనా లేచిపోయే టికెట్లు ఉన్నాయా అని నేనూ, నా ఫ్రెండ్స్ మా చుట్టాలలో చూసుకునేవాళ్ళం. ఎవరైనా ఏదైనా కబురు తెస్తే, ఆ తెచ్చిన వాళ్ళని తిట్టుకునే వాళ్ళం. ఆ చెప్పేది ధర్మోదకాలు అయ్యాక చెప్పచ్చు కదా, ఏదో శుభవార్త చెప్పినట్టు అక్కడ ప్రాణం ఇంకా స్వర్గానికి అయినా చేరక ముందే, ఊరంతా టామ్ టామ్ వేసేయటం.

మేము ఫ్రెండ్స్ అంతా ఈ విష్యాలు మాట్లాడుకుంటుంటే వింటే మా పెద్దవాళ్ళు చాలా కోప్పడేవారు. అవును మరి, మాకు అప్పుడు మనుష్యులూ, మమతలూ తెలియవు. మాకు సంబంధించినంతవరకూ, ఎవరైనా పోయారంటే, పది రోజుల శిక్ష అని మాత్రమే అనుకున్నాం.

మా చుట్టాలంతా ఎక్కువ నరసాపురం, పాశర్లపూడి అటువైపు ఉన్నారు. ఆ ఊళ్ళలోని ఏ వీధి కెళ్ళినా మా చుట్టాలే. అందరూ దాదాపు ఒకే ఇంటి పేరు కలిగి, వారి మధ్య ఏదో ఒక బీరకాయ పీచు చుట్టరికం ఉండేది. అట్లాంటి కుటుంబాలకి ఇంక ఈ బాధ మరీ ఎక్కువ. ఒకోసారి పరిస్థితి ఎంత ధారుణం గా ఉండేదంటే, ఎవరింట్లో అయినా ఏదైనా పెళ్ళి కానీ మరేదైనా శుభకార్యం ప్లాన్ చేసుకుంటే, అది సవ్యం గా అయేంత వరకూ అనుమానమే.

నాకు తెలిసి మా చుట్టాలలో ఒక ఇంట్లో పెళ్ళి అయినప్పుడు ఆ పెళ్ళి కొడుకు మావయ్య పోయారు. పెళ్ళి ఆగిపోతుందని భయపడి, పెళ్ళి ఇంట్లో ఆ మృతదేహం ఉండగా ఆ మరణం వార్త ఎవరికీ చెప్పకుండా కప్పిపెట్టి పెళ్ళి చేసారు. నిజమే, లక్షలు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లూ చేసుకొన్న శుభకార్యం ఆగిపోతే ఎవరికైనా బాధే. కానీ పెళ్ళి చేయటానికి ఈ విధం గా మరణాన్ని దాచిపెట్టడాన్ని అప్పుడు చాలా మంది మా బంధువులు విమర్శించారు.

ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలోనూ ఆపకూడదన్న నిర్ణయం చేసిన వాళ్ళంతా మానవత్వం లేని వాళ్ళా? కాదే. పైగా వాళ్ళకి పోయిన వ్యక్తి ఎంతో సన్నిహితుడు. ఎంతో ప్రియమైన వారు. ఆయన పోయిన బాధ వాళ్ళకీ ఉంది. కానీ ఆ పరిస్థితిలో ఆ బాధ కన్నా, పెళ్ళి ఆగిపోతే కలిగే బాధే వాళ్ళని ఎక్కువ కలవరపెట్టింది. భయపెట్టింది.

ఆఖరికి ఈ బాధలూ టెన్షన్ లూ పడలేక ఆ ఊళ్ళో ఒకే ఇంటి పేరు ఉన్న చాలా మంది కుండలు బ్రద్దలు కొట్టేసుకున్నారు. అంటే, లాంచనం గా మీకూ మాకూ ఏ సంబంధం లేదు. కనుక ఎవరింట్లో ఎవరు పోయినా, ఈ మైల పట్టడాలు వద్దు అని ఒక adjustment చేసుకున్నారు. తెలివైన అయిడియా!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.