కులాల గురించి మాట్లాడటానికి జంకు దేనికి? - SKU
ఈ పేజీ ని పంపండి

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మార్టీనా హింగిస్ ఈ మధ్య ఒక ఇంటర్య్వూలో విలియమ్స్ అక్కచెళ్ళెళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు విపరీతమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఆమె అన్నది.. "వీనస్ సోదరీమణులు ఆఫ్రికన్ అమెరికన్లు అవటం వలన వారిని విమర్శిస్తే ఎక్కడ తమని రేసిస్ట్ లు గా ముద్ర వేస్తారో అని అందరూ వారి గురించి మాట్లాడటానికి జంకుతారు." ఈ సంఘటన తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళినా విలేఖరుల నుంచి ఈ వ్యాఖ్య గురించి తప్పకుండా కనీసం ఒక ప్రశ్న ఎదురౌతోందట!

ఈ మధ్య ఒకాయన నాకు తను డర్బన్ లో జరుగుతున్న రేస్ కాన్ఫరెన్స్ లో మన దేశం లోని కులవ్యవస్థ మీద చర్చ గురించి UN కి తను రాసిన లేఖల ప్రతులు పంపించి నా అభిప్రాయం అడిగారు. నేనేమీ ఈ విష్యం లో మేధావిని కాదు నా అభిప్రాయం చెప్పటానికి. కానీ మేధావులే తమ అభిప్రాయాలు చెప్పటానికి యోగ్యులా?? ఇవి ఈ రిజర్వేషన్ల నైపధ్యం లో నాకు ఎదురైన కొన్ని అనుభవాలు.

విదేశాల్లో రేసిసం అని పెద్ద పేరు పెట్టినట్టు మనం ఇండియాలో పెద్ద పేరు పెట్టి పిలవం కానీ.. అక్కడ కూడా అసమానతలు వున్నాయి. ఎటువంటి వారి ఇంట్లో నైనా subtle నుంచి ధారుణం అనబడే స్థాయిలో ఈ వివక్ష జరుగుతూనే వుంది. దానికి సాక్ష్యం మన ఇంట్లో వుండే పని చేసేవాళ్ళ పట్ల మన ప్రవర్తనే. దానికి వాళ్ళూ మనమూ కూడా అలవాటు పడిపోయాం కనుక.. వాటిని మార్చే ఆశయం మనలో లేక ఆ అలవాట్లు అలానే వున్నాయి.

నాకు అస్సలు ఒక విష్యం అర్థం కాలేదు అప్పుడూ ఇప్పుడూ కూడా. భారతదేశం లో వెనుకబడిన వారి కోసం రిజర్వేషన్లు ఉన్నాయి. వారికి అన్ని ప్రత్యేక సదుపాయాలు వున్నాయి.. అయినా స్వాత్రంత్ర్యం వచ్చి 50+ సంవత్సరాలు అయినా.. ఎందుకు వాళ్ళ పరిస్థితి లో మార్పు రాలేదు? ఈ పధకాల మీద ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వాటిని అవి అవసరమైన వారికి ఎందుకు తెలిసేలా ప్రచారం చేయరు? కాకినాడలో మా ఇంటి చుట్టూ వున్న వీరిని గమనించి చూస్తే.. వాళ్ళలో ఎంతమందికి తమకున్న ఈ సదుపాయాల గురించి తెలుసు అని అనుమానం వేసేది.

అన్ని దురాచారాలకీ మూలం అవిద్య. రిక్షా లాగి జీవనం సాగించే వ్యక్తి కొడుకు అదే వృత్తి ని ఎంచుకుంటాడు.. పనులు చేసే వాళ్ళ అమ్మాయి తల్లి వెనుక చిన్నప్పటి నుంచే సాయంగా పనుల్లోకి వచ్చి కొంచెం వయసు రాగానే వారూ స్వంతం గా పనులు చేయటానికి ఇళ్ళు ఒప్పుకుంటారు తప్ప ఎందుకు చదువుకోరు?

మా ఇంట్లో పనిచేసిన సత్యవతి అనే అమ్మాయి కూతురు లోవలక్ష్మి అని వుండేది. సత్యవతి మా ఇంట్లో పనికి వచ్చినప్పుడు లోవ కి 2 సంవత్సరములు. 5 ఏళ్ళు రాగానే school కి వెళ్ళినది. అది కొన్నాళ్ళే. ఎప్పుడూ school ఎదో ఒక ఒంక తో మానేసి తల్లి వెనుక మా ఇంటికి వచ్చి.. ఆమెకి గిన్నెలు కడగటం వగైరా పనుల్లో సాయం చేసేది. మా చెల్లెలు సుజాత లోవనీ, సత్యవతినీ కోప్పడి ఖాళీ వున్నప్పుడల్లా లోవకి పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేసేది. ఆమెకి ఆశక్తి లేదు. సుజాతని చూస్తే ఆమడదూరం పారిపోయేది.

లోవకి 6,7 ఏళ్ళు వచ్చేసరికి చిన్ని చిన్ని పనులు చేయగలిగే స్థాయికి వచ్చింది. అప్పుడే మా పొరుగింటి ఆవిడ లోవని తమ ఇంట్లో పనికి పెడతావా అని సత్యవతిని అడిగారు. వెంటనే లోవ వాళ్ళ ఇంట్లో పనికి కుదిరిపోయింది. మా సుజాత సత్యవతిని బెదిరించేది.. చిన్నపిల్లని చదువుకోనీయకుండా ఈ విధంగా పనుల్లో పెట్టటం చట్టవిరుద్ధం అని ఘోషించేది.

ఆమె బాధలు అమెవి. సత్యవతి భర్త రిక్షా లాగేవాడు. తాగుబోతు.. తాగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఎదో కారణం చెప్పి భార్యనీ పిల్లలనీ గొడ్డుని బాదినట్టు బాది కష్టపడి వీళ్ళు సంపాదించిందంతా తీసుకొని పోయేవాడు. రెండో భార్య వుంది.. కనుక సత్యవతి దగ్గరకి ఆ రెండో అమ్మాయి తన్ని తగలేసినప్పుడే వచ్చేవాడు. సత్యవతి ఒక్కర్తీ ఇద్దరు పిల్లలని తన సంపాదన తో పోషించలేదు. వేన్నీళ్ళకి చన్నీళ్ళని లోవని పనిలోకి పెట్టింది. చదివించటానికి ఎలాగూ లోవకి 15 నిండగానే పెళ్ళి చేసేస్తారు.. ఏమీ వుద్యోగం చేయించే ఉద్దేశ్యం లేదు. అటువంటప్పుడు లోవకి ఆశక్తి లేని చదువు చదివించటం వలన ప్రయోజనం ఏమిటి అని సత్యవతి ఎదురు ప్రశ్నించేది. చదువుకోవటం వలన ప్రయోజనాలూ.. చదువుకోవటానికి వాళ్ళకి వున్న అవకాశాల గురించి అమెకి చెప్పటానికి మా సుజాత చేసిన ప్రయత్నాలన్నీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు అయ్యాయి. ఎప్పుడు అమెతో ఈ విష్యం ప్రస్థావించినా.. "మీకు తెలియదు.. మీరు ఊరుకోండి అమ్మాయిగారూ" అంటూ మాట్లాడనిచ్చేది కాదు. తనకి చెప్పీ ప్రయోజనం లేదని మా అమ్మగారు సుజీ కి వాళ్ళ విష్యం ఒదిలేయమని నచ్చచెప్పారు.

* * *

స్కూల్ అవ్వగానే కాలేజ్ లో చేరిన మొదటి రోజు నా ప్రక్కనున్న ఒకమ్మాయి నన్ను అడిగింది..

"మీరేవుట్లు??" .. అంటే నీదే కులం అని అడిగింది. ప్రక్కవారి కులం ఏమిటో తెలుసుకోవటం అంత అవసరమా?

ఇంటర్ అవ్వగానే దాదాపు ప్రతీ Maths విధ్యార్థి కీ ఇంజనీరింగ్ చదవాలనే కోరిక వుంటుంది. తెలివైన వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకొని రాంకులు సాధించితే నా లాంటి అత్తెసరు మార్కుల వాళ్ళు అదృష్టం మీద ఆధారపడతారు. మా నాన్నగారు ఒకటే చెప్పారు. "కాకినాడలో సీట్ తెచ్చుకో.. ఏదైనా చదివిస్తాను. చదువుకోసం వేరే ఊరు పంపేది మాత్రం లేదు". కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ అంటే.. EAMCET లో చాలా మంచి ర్యాంక్ రావాలి. పుట్టిన పుట్టుక వల్ల ఏ రిజర్వేషనూ లేదు. కనుక మనకి ఆ అవకాశం లేదని అర్థం అయిపోయింది. అయినా.. నా friends అంతా వెళ్తున్నారు కదా అని నేను కూడా కోచింగ్ తీసుకొని ఓ చిన్న ప్రయత్నం చేసాను. నాకొచ్చిన ర్యాంక్ చెప్పటానికి సిగ్గేస్తోంది కానీ.. నా friend ఒకమ్మాయి కి మంచి ర్యాంక్ వచ్చింది. అది తెప్పించుకోవటం కోసం తను రాత్రీ పగలూ అని లేకుండా కష్టపడింది. కానీ రిజర్వేషన్లూ.. కోటాలూ అయ్యాక ఆమెకి తనకి కావలసిన దానిలో seat రాదని తేలిపోయింది. అప్పుడు ఆమె పడిన బాధకి నేను ప్రత్యక్ష సాక్షిని. పుండు మీద కారం జల్లినట్టు.. మా friends లోనే మరొక అమ్మాయి.. ఈ అమ్మాయికన్నా వేలలో పెద్ద ర్యాంక్ వచ్చినా.. రిజర్వేషన్ల వలన తనకి కావలసిన దానిలో సీట్ తెప్పించుకొంది. ఎంత మంచి మనసున్న వారికైనా ఈ పరిస్థితిలో తమకి అన్యాయం జరిగిందని అనిపించటం సహజం. అప్పుడే V.P.Singh గారి మండల్ కమీషన్ వెలుగులోకి వచ్చింది.

Strike లూ, దీక్షలూ చేసాం అంతా. గొడవలు పడ్డాం. మాకు అన్యాయం జరిగుతోందని ఘోషించాం. ఎన్నో నినాదాలు.. ఎన్నో ఆవేశపూరితమైన ఉపన్యాసాలు.. రాజీవ్ గోస్వామి ఆత్మాహుతి ప్రయత్నం.. బిజూ పట్నాయక్ సంచలనాత్మక స్టేట్ మెంట్లు.. ఈ వివాదంలో తెలివి తేటలని నాశనం చేయద్దు అని రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు డిమాండ్ చేస్తే.. ఏం తెలివితేటలు మీ ఒక్కరికే స్వంతమా అని రిజర్వేషన్లు వున్నవారు పోరాటానికి వచ్చారు. వాళ్ళతో గొడవలు పడ్డాం.. అటువైపూ.. ఇటువైపూ కూడా పోలీసుల లాఠీ ల రుచి చూసాం. (ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా వున్నాయి).. నిన్నటి ప్రాణ స్నేహితులు ఈ గొడవల వల్ల బద్ధ విరోధులం అయ్యాము.

రిజర్వేషన్లు వున్న వారు ఎవరైనా తమ ప్రతిభతో పైకి వచ్చినా.. వారిని ముందో వెనుకో చులకన చేయటం.. వాళ్ళు వీరు తమని ఎక్కడ చిన్నచూపు చూస్తున్నారో అని అనుమాన పడటం.. ఈ దూరాలు అప్పటి నుంచి ఇప్పటివరకూ తొలగలేదు... పైగా మరింత దూరం అయ్యాయి.

మా మనసులని అప్పుడు తొలచిన ప్రశ్న.. ఈ రిజర్వేషన్ల వలన సీట్లు తెచ్చుకున్న వారు ఏ విధంగా వెనుకబడినవారు అన్నది. ఒక కుటుంబం లో అందరికీ అన్ని స్థాయిలలోనూ ఎందుకు ఈ రిజర్వేషన్లు అన్న అనుమానం. మేము అప్పుడు చూసిన రిజర్వేషన్ వున్న వారంతా... ఆర్థికంగా మా కన్నా మంచి స్థితిలో వున్నవారు.. మరి అటువంటప్పుడు.. వారికి ఎందుకీ రిజర్వేషన్లు అని వాదించుకొనే వాళ్ళం. (అప్పుడే మాకు creamy layer అనే మాట తెలిసింది)

ఈ రిజర్వేషన్లు అవసరమైన సత్యవతి లాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోకుండా అక్కడే.. ఆ పరిస్థితిలోనే వుంటుంటే.. వాటి గురించి తెలిసిన వారు.. తాము కూడా ఆ అభాగ్యుల వంటి వారమే అంటూ మరింత పైకి వెళ్తున్నారు. ఇటువంటి వారిని చూసి.. రిజర్వేషన్లు లేనివారు.. అసలు ఈ రిజర్వేషన్లన్నవే వద్దు అనటం మొదలెట్టారు. మరి దీనికి పరిష్కారం??

ప్రభుత్వం ఎందుకు ఈ పధకాల గురించి అందరికీ చెప్పలేకపోతోంది. ఎందుకు ఆ వెనుకబడినవారు పైకి రాలేకపోతున్నారు? అణచివేతకి గురౌతున్నారన్న మాట ఎందుకో నాకు నమ్మ బుద్ధి కాలేదు చాలా రోజులు. మనకి దేశంలో అందరికీ ఒకే చట్టం వుండగా.. వాళ్ళు ఎందుకు అణచివేయబడుతున్నారు?? ఏం.. తమకి అన్యాయం జరుగుతోంటే.. వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు కదా?? అణచివేయటం అన్నది ఎంత గర్హనీయమో.. సంవత్సరాలతరబడీ.. వాటిని సహించటం కూడా అంతే మూర్ఖత్వం.

ఈ అవకాశాల గురించి వారికి తెలియజేయనంత కాలం.. ఇప్పుడే కాదు.. మరొక 50 ఏళ్ళు గడచినా పరిస్థితి ఇలాగే వుంటుంది లేక మరింత ధారుణంగా తయారౌతుంది. బయట కులం వారిని పెళ్ళి చేసుకున్నారని స్వంత బిడ్డలనే ఉరి తీసిన ఘనులున్న దేశం మనది. ఇటువంటి పరిస్థితులు దేశంలో వున్నప్పుడు మనలో రేసిజం వంటి వివక్షలేదనీ.. కులాల వ్యవస్థ రేసిజం నుంచి పూర్తిగా వేరనీ ఎలా చెప్పగలం? ఏ పేరు పెట్టినా.. ఆఖరికి జరుగుతున్నది మాత్రం.. తమకున్న అవకాశాలు తెలియని వాళ్ళు బావిలో ని కప్పల్లా అక్కడే మ్రగ్గి పోతుంటే.. వారి పేరున కొంతమంది బాగుపడుతున్నారు. ఇటువంటి వారిని చూసి రిజర్వేషన్లు లేని వారు తమకి అన్యాయం జరిగిందని ఘర్షణ పడుతున్నారు.

బయట వాళ్ళు, ప్రభుత్వం చేయలేకపోతే ఆయా కులాలలో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘంలో గౌరవం కోసం మతం మార్చుకొని.. మళ్ళీ రిజర్వేషన్లని ఉపయోగించుకొనే దగ్గరకి వచ్చేసరికి తామూ వెనుక బడినవాళ్ళమే అంటూ తమ అసలు కులం పేరు చెప్పుకొనే పరిస్థితులు ఎందుకు వున్నాయి? వారిని అంతగా humiliate చేసిన పరిస్థితులు ఎందుకు మారటం లేదు?

రిజర్వేషన్లన్నవి కుల ప్రాతిపదికిన కాకుండా ఆర్థిక పరిస్థితి ఆధారంగా వున్నప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. కులం పేరు తో ధారుణాలు చేసే వారిని కఠినంగా శిక్షించి, చిత్తశుద్ధి తో అన్యాయాలకి గురౌతున్న నిజమైన వెనుక బడినవారికి న్యాయం కల్పించటానికి ప్రయత్నిస్తే.. ఈ కులాహంకారాలు తగ్గవా? రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నిర్లక్ష్యానికి గురయిన వారి జీవన ప్రమాణాలు పెంపొందించటం..అంతే కదా.. 50 సంవత్సరాలుగా మనం ఈ ఆశయంతో అమలుపరుస్తున్న పధకాలూ, వాటిని అమలుపరుస్తున్న పద్ధతులూ ఫలితాలు ఇవ్వనప్పుడు మరి లోపం ఎక్కడ వుందో పునరాలోచన చేసి అవసరమైతే పద్ధతులని మార్చాల్సిన అవసరం లేదా? కానీ ఆ పని చేయగల ధైర్యం వున్న రాజకీయ వేత్తలు ఈనాడు మనకెరీ?

డర్బన్ సదస్సులో చేసే ప్రకటన లో నుంచి మన దేశ కుల వ్యవస్థ గురించి వున్న వాఖ్యలని తొలగింపచేయటం లో మన దౌత్యవర్గాలు సఫలీకృతమయ్యాయి. కానీ ఎన్నాళ్ళిలా మనని మనం మోసం చేసుకుంటాం..? రేసిజం వల్ల ఒక జాతి వారు కష్టాలని అనుభవిస్తుంటే.. కులాల వల్ల కొన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ అగచాట్లకి గురౌతున్నారు. వీళ్ళంతా వెనుకబడిన కులాల వాళ్ళే అని చెప్పటానికి లేదు. ఆ మాటకొస్తే "ఈ కులస్థులు అంతా సౌఖ్యంగా బ్రతుకుతున్నారు" అని చెప్పగలమా? ఎంత మంది అగ్రకులాల్లో వాళ్ళు తమ జీవితాలు దయనీయమైన పరిస్థితుల్లో గడపటం లేదు! పేరు ఏదయినా end product - అదే వివక్ష.. అది ప్రభుత్వం నుంచో .. ఇతర కులాల వాళ్ళనుంచో ఏ రకమైనదైనా బాధ మాత్రం ఒకటే కదా!

ఈ విషయంలో ప్రతివారికీ తమ తమ అభిప్రాయం ఒకటి వుంటుంది. ధైర్యంగా వీటి గురించి మాట్లాడిన వాళ్ళని "రేసిస్ట్" గా ముద్ర వేసే కన్నా.. తమ అభిప్రాయాన్ని తామూ చెపితే బాగుంటుంది. నేనేమీ ఈ విష్యం గురించి ఏ పరిశోధనలూ చేయలేదు. కానీ నాకు భారత దేశం లో ఓటు హక్కు వుంది. ఓటు వేసే ప్రతీ వ్యక్తీ ఇటువంటి క్లిష్ట సమస్యల గురించి ఒక అవగాహన కలిగి ఒక అభిప్రాయానికి రావటం చాలా అవసరం. ఆ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతీ వ్యక్తి కీ వుంది. అందుకే ఈ విషయంలో నా అభిప్రాయం ని నేను ఇక్కడ చెప్పాను.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.