కేశోపాఖ్యానం - SKU
ఈ పేజీ ని పంపండి

ఇండియా వెళ్ళగానే అక్కడ వున్న ఫ్రెండ్స్, మా చుట్టాలూ నన్నూ, నా మారిన వేషాన్నీ చూసి చేసిన కొన్ని కామెంట్లు భలే నవ్వు తెప్పించాయి.

"నువ్వు ఇప్పుడు అచ్చం సినిమాల్లో చూపించే నర్స్ లా వున్నావే!" మా మామయ్య కామెంట్!

"అదేమిటీ?" అర్థం కాక అడిగాను.

"అదే.. ఆ చిన్ని జుట్టు, బొట్టు లేని మొఖం.. ఒంటిమీద అస్సలు నగలు లేకపోవటం.." నేను ఆపి వుండక పోతే ఇంకా పెద్ద list నే చదివేవాడు!!

* * *

"అదేమిటీ జుట్టు అంతా నెరిసిపొయిందా? గోరింటాకు.. అదే మెహందీ ఎదో అంటారు కదా దాన్ని పెట్టుకున్నావా?" ఎక్కువ మంది అడిగిన ప్రశ్న.

నాకు భోరున ఏడవాలని అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ వంద డాలర్ల పైన పోసి చేయించుకున్న జుట్టు high lights వీళ్ళకి జుట్టు నెరిసిపోతే ఉపయోగించే గోరింటాకు వైద్యం అనిపించిందా!!?

గోరింటాకు చాలా మంచిది జుట్టుకి. కానీ నేను ఎదో వీళ్ళ దగ్గర స్టయిల్ గా కాస్త కటింగ్ ఇద్దామని వంద రకాల రంగులు చూసి, సెలెక్ట్ చేసి వేయించుకుంటే వీళ్ళెవ్వరూ దానిని గమనించలేదు.. పైగా ముసలితనం దాచుకుంటున్నావా అని అనుమానపు ప్రశ్నలు.. (నిజానికి నేను high lights వేయించుకోవటానికి అదీ ఒక కారణమనుకోండి!)

* * *

ఇంకా నా జుట్టు కత్తిరించటం గురించిన ప్రశ్నలు..

"జుట్టు ఎక్కడ ఇచ్చారమ్మా? మీలో ఆడపిల్లలు తల ఇవ్వరు కదా?" మా మామయ్య వాళ్ళ పనమ్మాయి అనుమానపు ప్రశ్న.

"తలా ఇవ్వలేదు.. దానిమీద జుట్టూ ఇవ్వలేదు.. సరదాపడి చేయించుకున్న క్రాఫ్.. మరీ అక్కడకి వెళ్ళి ఏ విధంగానూ మారకపోతే బాగోదని.. పోనీలే పాపం అని జుట్టు ని అక్కడి క్షురకురాలికి (అంటే ఆడ hair stylist అని!) ఇచ్చొచ్చాను."

మా నాన్నగారికైతే ఒళ్ళుమండింది.. నా కొత్త అవతారం.. కానీ ఆయన రూటే సెపరేటు.. ఏదీ డైరెక్ట్ గా అనరు, చురుక్కుమనిపించేలా చెణుకులు విసురుతారు.

"నువ్వేమన్నా ఇందిరాగాంధీవి అనుకుంటున్నావా? నిన్ను చూడగానే ఎదురొచ్చి నీ పని చేసిపెట్టటానికి?" నేను ఎదో పనికి ఎవరి దగ్గరో appointment ఎందుకూ అని అడిగినందుకు ఆయన విసురు!

ఆ సమయానికి అక్కడే వున్న మా ఇంట్లో పని చేస్తున్న అతను దానికి తన కామెంట్ జోడించారు..

"కొంచెం రంగేసారు కానీ అక్కడక్కడా తెల్లెంట్రుకలు కనిపిస్తే ఆ తలకట్టు ఇందిరాగాంధీ తలకట్టేనండి"

నాకు సంతోషించాలో ఏడవాలో తెలిలేదు.

* * *

మా అమ్మమ్మ మహా strict! మా పిన్నులూ, పెద్దమ్మలూ, వాళ్ళ పిల్లలూ అంతా తనంటే గడగడలాడిపోయేవారుట! మేము పుట్టని క్రితం వాళ్ళందరూ చిన్న పిల్లలప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలంటే కూడా పడని భయం మా అమ్మమ్మ అంటే పడేవారుట.

అమ్మమ్మ జుట్టు విషయం లో ఎంతో పర్టిక్యులర్. ఈ పిల్లకాయలు ఎవరైనా కొంచెం తలకి నూనె తక్కువ పట్టించినా లేక కొంచెం loose గా జడ అల్లుకున్నా, కొంచెం పెద్ద పూల దండ పెట్టుకున్నా వాళ్ళ పనైపోయేదిట. నెత్తి మీద భాగోతం కనుక నెత్తికి కాసిని మొట్టికాయల ఒడ్డింపుతో మొదలయి తొడపాశాలూ, తిట్ల దండకాలతో వాళ్ళు వేసుకున్న జడ విప్పి బాపూ గారి ఎదో joke లో మాదిరిగా కంట్లో గుడ్లు పైకి ఎగదన్నుకుని వచ్చేలా గట్టిగా తల దువ్వి, "ముక్కుపుడక" సినిమాలో suhasini జడలా ఒంకర తిరిగేంత బిగుతుగా జడ అల్లేవారుట.

అదంతా మేము పుట్టని క్రితం మాట. మనవలం వచ్చాం. ఎంతైనా అసలు కంటే వడ్డీ ముద్దు కదా.. అమ్మమ్మ hitlerism (ఇంగ్లీష్ బాషాభిమానూలూ! యుద్దానికి రాకండి! సరదాగా బాగున్నట్టుందని ఈ ప్రయోగం చేశా!) మా దగ్గర సాగలేదు. మా అమ్మగారు పాపం అమ్మమ్మ భయం లో గడిపిన వారు కదా.. కనుక మాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. (అయినా గానీ జుట్టు cut చేసుకోవటానికి మాకు permission లేదు.. అది వేరే సంగతి!) అది చూసి మా చుట్టాలంతా అమ్మమ్మ partiality గురించి నిష్టూరాలాడేవారు.

ఇప్పుడు నేను ఇలా జుట్టు కత్తిరించుకొని ఇంటికి వెళ్ళేసరికి మా చుట్టాలు (అదే అమ్మమ్మ బాధితులు) చాలామంది నా కొత్త అవతారం చూసి అమ్మమ్మ ఏమి కామెంట్లు చేస్తుందో అని కుతూహలంగా చూశారు. వాళ్ళకి మా అమ్మమ్మగారు ఇచ్చిన సమాధానం విని నవ్వుకున్నాను. అదేమిటి అంటారా???

"అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడి వాళ్ళ లాగా వుండాలిట.. లేకపోతే ఉద్యోగాలు ఇవ్వరంట!!"

అయితే నేను విదేశాల్లో నా ఫ్రెండ్స్ అందరితో కలిసి తీసుకున్న వీడియో కేసెట్లు చూపించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ శుభ్రమైన జుట్టులతో వుండటం చూసి అమ్మమ్మకి సందేహం రానే వచ్చింది.

"ఏమే? వీళ్ళెవ్వరూ ఉద్యోగాలు చేయటంలేదా?" అడిగింది ఎంతో అమాయకంగా.

"ఎందుకు చేయటంలేదు?" అనాలోచితంగా అన్నాను.

"మరి వాళ్ళంతా శుభ్రంగా వుంటే నీకేం రోగం? అలా జుట్టంతా కత్తిరించి తగలెట్టావు?"

"అమ్మమ్మా.. నువ్వు FBI లో వుండవలసిన దానిని!" అనుకున్నాను.. ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.