కెనడా లో ఉద్యోగ ప్రయత్నాలు - SKU
ఈ పేజీ ని పంపండి

సరీగ్గా రెండేళ్ళ క్రితం నేను కెనడా వచ్చేముందు ఇక్కడ నా పరిస్థితి గురించి నేను ఊహించుకున్నది ఒకటి.. ఎదురైనది ఒకటి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న తలంపు తో వచ్చేవారు కోటి ఆశలతో flight ఎక్కుతారు. కానీ అక్కడ దిగాక చేదు పరిస్థితులు ఇక్కడ ఎదురైతే వారిలో ఎటువుంటి పరిస్థితి నైనా ఎదుర్కోవాలన్న పట్టుదల లేకపోతే చాలా depression కి లోను అవవలసి వస్తుంది.

నేనూ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు. కానీ ఎట్టిపరిస్థితిలోనూ తిరిగి India వెళ్ళలేను. తిరిగి వెళ్ళానూ అంటే.. నా ఓటమిని ఒప్పుకున్నట్టే. అక్కడ మళ్ళీ హేళనలు ఎదుర్కొనే కన్నా ఇక్కడే విజయం కోసం ప్రయత్నించాలి అనుకున్నాను.

ఎప్పుడూ నాలోని శక్తి సామర్థ్యాలని వెలికి తీసేది నన్ను చిన్నచూపు చూసిన వ్యక్తులే. అటువంటి పరిస్థితులే నాలో పట్టుదల పెంచి నేనేమిటో చూపించాలన్న పౌరుషం ని నాలో నింపుతుంది.

నేను వచ్చింది work permit మీద. చాలా మంది వలెనే నేనూ డబ్బు ఇచ్చి ఇక్కడ వుద్యోగం తెప్పించుకోగలను అన్న ధైర్యం తో వచ్చాను. నేను సెలెక్ట్ అయేసరికి ఇక్కడ hot గా వున్నది AS/400. నాకు వీసా వచ్చేసరికి అది కాస్తా పోయి Java వెలుగు లోకి వచ్చింది. కానీ నాకు జావా మీద పట్టు లేదు. 3 నెలలలో దానిని ముక్కున పట్టి వచ్చాను. ఎంత ఆ మూడు నెలలూ పగలూ, రేయీ జావా తో గడిపినా.. ఎంత దానిలో మంచి ప్రోజెక్ట్ లు చేసినా.. దానిలో ఉద్యోగం చేయగలను అన్న ధైర్యం లేదు.

అన్నిటికన్నా ముందు నాకు ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదు. ఇక్కడ ఎవరైనా గట్టిగా నాలుగు ప్రశ్నలు వేస్తే అర్థం కాక నేనెదో సమాధానం ఇస్తే నవ్వుల పాలు అవుతానెమో అన్న భయం.

వచ్చిన దాదాపు 15 రోజులకి నా sin కార్డ్ వచ్చాక నా resume తయారు చేసాను. దానిని తీసికెళ్ళి ఇక్కడ వున్న HRDC (క్రొత్తగా కెనడా వచ్చిన వాళ్ళకోసం కెనడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్) లో చూపిస్తే ఆమె కొన్ని సవరణలు చేసి ఇచ్చారు. ఇంకేముందీ.. వెంటనే నాలుగు కంపెనీలకీ పంపితే.. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తాయి అని భ్రమ పడ్డాను.

ఇక్కడ సాధారణంగా వుద్యోగాలు consulting firm ద్వారా భర్తీ అవుతాయి. USA లో లాగ ఇక్కడ consultant అంటే పని చేసే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి నీ, కంపెనీ నీ దగ్గరకి తెచ్చే మధ్యవర్తి. కనుక.. నేను కంపెనీలకి కాదు.. consultancy లకి నా resume పంపాలని ఇక్కడ వాళ్ళు చెప్పారు. వెంటనే ఇంటర్నెట్ లో వెతికి అన్ని పెద్ద consultancy లకీ నా resume పంపించాను. వాళ్ళు ఇంటర్యూలు కని పిలిచే వారు.

అటువంటి మొదటి ఇంటర్యూ వచ్చినప్పుడు అది అవ్వగానే వుద్యోగమే అనుకుని ముందురోజు అంతా వుద్వేగం గా గడిపాను. అక్కడ వాళ్ళు నా చేత ఒక form పూర్తి చేయించి, పంపేసారు. అప్పుడు అసలు ప్రాజెక్ట్ లు ఏమీ లేనందువల్ల కంపెనీలు కూడా కొత్త వేకెన్సీ లని ప్రకటించటం తాత్కాలికంగ మానేసాయి. జనవరి, ఫిబ్రవరి ల్లో మళ్ళీ పుంజుకుంటాయి అని తెలిసిన వాళ్ళు ధైర్యం చెప్పే వారు.

ఎక్కడకి వెళ్ళినా కెనేడియన్ ఎక్స్ పీరియన్స్ ఎంత వుంది అని అడిగేవారు. నా ఎక్స్ పీరియన్స్ అంత ఇండియాలో అని చెపితే.. సరే.. resume ని client కి పంపించి చూస్తాం అని చెప్పేవాళ్ళు. ఏమీ మళ్ళీ వాళ్ళ దగ్గర్నుంచి కబురు వచ్చేది కాదు.

అటువంటి పరిస్థితి లో ఒకరోజు New Jersy నుంచి ఫోన్ వచ్చింది. అతను ఎవరో మామూలు రొటీన్ ప్రశ్నలు వేసాక సడెన్ గా తెలుగు లోకి దిగారు. "నేనూ ఆంధ్రా ప్రాంతం వాడినే నండీ. ఇంటర్నెట్ లో మీ resume చూసి తూ.గో.జీ (తూర్పు గోదావరి జిల్లా) భాష వినాలనిపించి ఫోన్ చేసాను" అన్నారు. చెప్పలేనంత నిరాశ, ఆనందం. అది ఇంటర్యూ కానందుకు నిరాశ, సాటి తెలుగు వ్యక్తి పరిచయం అయ్యారని సంతోషం. ఆయన అక్కడ ఒక రిక్రూటింగ్ కంపెనీ లో పని చేస్తున్నారు. తమ కంపెనీ కి apply చేయమని నాకు చెప్పారు.

నేను వాళ్ళకి నా resume పంపించిన వెంటనే టెక్నికల్ ఇంటర్యూ అవటం, దానిలో నేను సెలెక్ట్ అయ్యానని నా క్రొత్త ఫ్రెండ్ చెప్పటం 2 రోజులలో జరిగిపోయింది. వాళ్ళు నా H1 పేపర్లు file చేసారు. జీతం చాలా తక్కువ. కానీ.. నాకా ఎక్స్ పీరియన్స్ లేదు.. ఇక్కడ అవకాసాలు లేవు, పరిస్థితి బాగాలేదు. beggers are not choosers అన్నట్టు వాళ్ళు ఎంత చెపితే దానికి ఒప్పేసుకున్నాను. నన్ను ఇక్కడకి తీసుకొచ్చిన ఆయనకి ఈ విష్యం చెపితే ఆయన అదే మాట అన్నారు.

మూడు నెలలు గడిచిపోయాయి. ఇంక నేను వుంటున్నందుకు అద్దె కట్టాలి. (మొదటి 3 నెలలూ free) చేతిలో ఒక నెలకి కూడా ఇచ్చెంత డబ్బులు లేవు. ఏం చేయాలో తెలీని పరిస్థితి. ఎవరిని వెళ్ళి అడుగుతాను? ఇండియా లో వున్న నా తలితండ్రులకి నా గురించి చెప్పలేదు. వాళ్ళు నేను అప్పటికే వుద్యోగం లో స్థిరపడిపోయానని అనుకుంటున్నారు. వాళ్ళ మనసులు కష్ట పెట్టడం ఇష్టం లేక వాళ్ళకీ ఇక్కడి బాధలన్నీ చెప్పలేదు.

నా లీగల్ స్టేటస్ వల్ల.. software లో తప్ప వేరే వుద్యోగం చేయలేని పరిస్థితి. కానీ cash jobs దొరుకుతాయి అని ఒక friend చెప్పటం తో ఒక దగ్గర కుట్టు పని కి ఒప్పుకుని మా consultant ఆ విష్యం చెప్పే ధైర్యం లేక.. కుట్టు పని చేద్దామనుకుంటున్నాను అని ఆయనకి సూచన ప్రాయంగా చెప్పాను.

దానికి ఆయన "ఒద్దు. అటువంటి పనులు చేయద్దు. మీరు మీకు ఉద్యోగం వచ్చేంతవరకూ మా ఇంట్లో వుండండి. మాకేమీ ఇవ్వనక్కర్లేదు. వుద్యోగం వచ్చాక అన్నీ చూసుకోవచ్చు" అని వారించారు. కానీ నా ఇబ్బంది కనిపెట్టి తనకి తెలిసిన కొంతమంది తెలుగు వాళ్ళకి నా గురించి చెప్పి, నా దగ్గర జావా నేర్చుకోమని రికమెండ్ చేసారు. నన్ను అప్పుడు అడిగారు వాళ్ళకి జావా చెప్పగలరా అని.

నేనా.. అంతవరకూ ఎదో నా సబ్జెక్ట్ లో బాగా వున్నాను కానీ దానిని ఇంకొకరికి చెప్పాలంటే.. ఎన్నో సందేహాలు. మొదట్లో 1 గంట క్లాస్ చెప్పాలంటే 4 గంటలు చదివి, ప్రాక్టీస్ చేసేదాన్ని. రోజూ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని అవి చదివి నోట్స్ తయారు చేసుకొనేదాన్ని. ఇవన్నీ చేయటం వలన ఇంట్లో పని అస్సలు చేసే time వుండేది కాదు. ఇది కొంచెం మిగిలిన వారికి కష్టం కలిగించింది. నేను పని ఎగ్గొట్టటానికి పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటున్నానన్న అభిప్రాయం వారికి కలిగింది.

ఎన్నో తప్పులు.. ఎన్నో తొట్రుపాట్లు.. మొత్తానికి నేనెలా చెప్పినా నా students శ్రద్ధ గా వినేవారు. నేను చెప్పినదానిని వారు తమ స్వంత ఆశక్తి తో మరింత నేర్చుకున్నారు, నాకు నేర్పారు. వాళ్ళు అంతా దాదాపు ఇక్కడ mainframe లో ఎక్స్ పీరియన్స్ వున్నవారు. కనుక నా క్లాసులు పూర్తి అవుతుండగానే వాళ్ళకి ఒక్కోళ్ళకీ వుద్యోగాలు రావటం మొదలయ్యాయి. కానీ నేను మాత్రం ఇంకా consultancy ల చుట్టూ తిరగటం దగ్గరే వున్నాను. వచ్చి 5 నెలల పైన అయింది. ఇంత వరకూ ఒక్క client ఇంటర్యూ జరగలేదు.

ఈ consultant ఇంటర్యూ లతో ఎంతగా విసిగి పోయానంటే ఒకరోజు ఒక ఇంటర్యూ కి జీన్స్, రన్నింగ్ షూలు, ఒక బాగ్ పాక్ తో class నుంచి సరాసరి వెళ్ళిపోయాను. ఆ consultant నాకు క్లాస్ పీకారు..

"Next time.. when u go to an interview.. no running shoes, no jeans, no back pack. You should give an impression that you are serious about the job"

ఆ ఇంటర్యూ జరిగింది ఒక Tim Hortins coffee shop లో.. నాకు తిక్క రేగి అన్నాను..

"Next time.. when you conduct an interview in a decent work place, I definitely will come in a business suit. Are you going to send my resume based on my appearence?"

అతను ఒక్క క్షణం బిత్తర పోయి అన్నారు.. తమ clients అసలు ముందు candidate డీసెంట్ గా అనిపించక పోతే అసలు consider చేయరని. client ఇంటర్యూ కి ఆవిధంగా వెళ్ళననీ.. అసలు ఆ రోజు కూడా class నుంచి డైరెక్ట్ గా రావటం వలన ఆ విధంగా వచ్చాననీ చెప్పాను. obvious గా అతని నుంచి నేను మళ్ళీ ఏమీ వినలేదు.

నిరాశ ఆవరించుకుంటుండగా.. ఒకరోజు ఇంటర్నెట్ లో నా resume చూసిన ఒక కంపెనీ ఇంటర్యూ కి పిలిచింది. మొదటి client ఇంటర్యూ.

ఇంటర్యూ చాలా బాగా చేసాను. teaching మొదలెట్టినప్పటి నుంచీ నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ మరింత పెరిగింది. నేను చేసిన ప్రాజెక్ట్ లు చూసారు... కనీసం ఒక program source code కావాలని అడిగారు. కానీ నా దగ్గర ఏదీ లేదు. సరే పంపిస్తాను అని చెప్పాను. ఇంటికి రాగానే hyderabad లో నేను course చేసిన వాళ్ళని సంప్రదించి code పంపమని అడిగాను. కానీ వారు పంపలేదు.. code లేదని ఆ కంపెనీ ని మరల సంప్రదించ బుద్ధి వేయలేదు.

ఇది జరిగాక మరింత నిరాశ నన్ను ఆవరించింది. ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎంత పొదుపుగా వున్నా కొన్ని తప్పించుకోలేని ఖర్చులు. ఎవ్వరినీ నోరు తెరచి అడగటానికి ఆత్మాభిమానం అడ్డు వచ్చేది.

తప్పని పరిస్థితిలో ఒట్టి జావా మీదే కాక AS/400, "Coldfusion" ల మీద కూడా resume లు తయారు చేసాను. AS/400 బాగా వచ్చినా.. coldfusion అంటే అసలు ఏమిటో.. దానిని ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలీదు. అది HTML లాగ వుంటుంది అని ఎక్కడో చదివి HTML లో మనం Queen కనుక అదీ అంతే కామోసు అనుకున్నాను.

మరొక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కి రమ్మని email వచ్చింది. ఇది నా రెండవ client ఇంటర్వ్యూ. వీళ్ళు కూడా నా resume ని ఇంటర్నెట్ లో చూసారు. ముందు అనుభవం తో అన్ని రకాలుగా సమాధానలు (code అడిగితే) సిద్ధం చేసుకొని వెళ్ళాను. అక్కడ ముందు నా కాబోయే boss ఇంటర్యూ చేసారు. ఆయనకి నేను చాలా నచ్చాను అన్న సంగతి తెలుస్తూనే వుంది. తమ technical cheif నన్ను technical ఇంటర్యూ చేస్తారని చెప్పారు. ఉద్యోగం Coldfusion మీద. కానీ త్వరలో జావా లోకి మొత్తం ప్రోజెక్ట్ ని మార్చే ఉద్దేశ్యం లో వున్నారు. అందుకని రెండూ వచ్చిన వారి కోసం చూస్తున్నారు. నేను అతనితో చెప్పాను నాకు coldfusion లో అంత పట్టు లేదని. ఫర్లేదు.. తామకి database, జావా బాగా వచ్చిన వారు చాలని అన్నారు.

Technical ఇంటర్యూ చేసింది ఒక చైనీస్ వ్యక్తి. అతనికి ఇంగ్లీష్ అస్సలు రాదు. మాట్లేడేది కూడా నాకు అర్థం కాలేదు. నేను చెప్పేది నా slang వలన ఆయనకి అంతకన్నా అర్థం కాలేదు. మొత్తానికి ఆయన జావా లో నా రికార్డ్ చూసి, వారికి కావలసిన database లో ఆయన అడిగిన ప్రశ్న కి నేను సమాధానం తప్పుగా చెప్పినా.. నన్ను సెలెక్ట్ చేసారు. 2 రోజులలో చెపుతామని చెప్పారు.

ఇంటికి వచ్చేసరికి నన్ను Tim Hortins లో ఇంటర్యూ చేసిన consultant నుంచి మెసేజ్.. మర్నాడు client నన్ను కలవాలన్నారని. అక్కడ కూడా చాలా బాగా చేసాను. ఇంటర్యూ పూర్తి కాకుండానే నేను సెలెక్ట్ అయిన విష్యం నాకు తెలిసి పోయింది. ఇది 6 నెలల contract వుద్యోగం. కానీ జీతం చాలా ఎక్కువ. నిన్న జరిగిన ఇంటర్వ్యూ కూడా బాగానే చేసాను. రెండూ వచ్చేలా వున్నాయి. కానీ నిన్నటి దానిలో ఇంకా ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళతో నేను పోటీ పడగలనా అన్నది అక్కడ అనుమానం. అది permanent ఉద్యోగం. జీతం సంగతి ఏదీ నేను తేల్చలేదు.

మర్నాడు permanent వుద్యోగం వాళ్ళు ఫోన్ చేసి జీతం గురించి అడిగారు. ఆయన్ని line లో వుంచి భోజనం చేస్తున్న నా consultant ని అడిగాను ఎంత అడగమంటారు అని. అయన "ఏమీ చెప్పద్దు.. వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అడగండి.. దానికి కొంచెం ఎక్కువ చేసి అడగండి" అని సలహా ఇచ్చారు.

మొత్తానికి నేను చెప్పిన అంకె కి అయిష్టంగానే ఒప్పుకున్నారు అతను. కానీ తానొక్కసారి తన boss తో సంప్రదించి, ఆయన ఒప్పుకుంటే నాకు offer letter ని email చేస్తానని చెప్పారు. ఆ క్షణం నుంచీ దానికోసం ఎదురు చూపులు మొదలెట్టాను. మర్నాడు కూడా అది రాకపోయేసరికి మరీ అత్యాస కి పోయానా అని అనుమానం.. అతన్ని మళ్ళీ కంటాక్ట్ చేయటానికి అభిమానం. ఈ పరిస్థితి లో contract వుద్యోగం కూడా వచ్చిందన్న ఫోన్ వచ్చింది. కానీ మా friends దాని కన్నా ఈ permanent ఉద్యోగమే మంచిది కనుక 2 రోజులు time అడుగు ఏ సంగతీ చెప్పటానికి అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళని hold లో పెట్టాను. ఒకవేళ ఈ permanent వుద్యోగం రాకపోతే దానికి వెళ్ళచ్చు అన్న ఆలోచనతో.

ఊరించి, ఊరించి మొత్తానికి రెండో రోజు ఆ email వచ్చింది. వస్తే దానిలో చేరిపోదామని అప్పటికే నిర్ణయించుకోవటం తో రెండో దానికి sorry చెప్పేసాను. 6 నెలల ఎదురు చూపుల తర్వాత February 14, 2000 న కెనడా లో నా మొదటి ఉద్యోగంలో చేరాను.

వుద్యోగం లో చేరిన వారం రోజులు కూడా తిరగకముందే.. నా US H1 వచ్చింది. ఎప్పుడు US కి వస్తావు అని ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి అడిగారు. ఎన్నో సంధిగ్ధాలు. నేను ఇక్కడకి వచ్చింది డబ్బు కోసం. US లో అయితే ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ వుద్యోగాన్ని మానేసి వెళ్ళిపోదామనుకున్నాను. ఇంతలో USA లో కొంతమంది Indian software professionals ని అరెస్ట్ చేసారన్న విష్యం తెలుసుకొని మా నాన్నగారు అక్కడకి వెళ్ళటం వద్దు గాక వద్దు అని చెప్పారు.

ఇక్కడ వుద్యోగం బాగుంది. అక్కడ మళ్ళీ బెంచ్ మీద వుండాలి. 6 నెలలు ఆ బాధలు అనుభవించి వున్న దాన్ని. చేతిలో డబ్బులు లేవు. ఎందుకు ఇక్కడ స్థిరత్వాన్ని ఒదిలి అక్కడకి వెళ్ళటం అనిపించింది. New Jersy నుంచి నాకు ఫోన్ చేసిన వ్యక్తి ని అడిగాను నా పరిస్థితి ఇది.. ఏం చేయమంటారు అని. అతను ఆ కంపెనీ అప్పటికి ఒదిలేసి తన స్వంత కంపెనీ పెట్టుకున్నారు. ఆయన కూడా.. ఆ కంపెనీ కి వద్దు లెండి.. నేను నా కంపెనీ నుంచి H1 చేస్తాను.. మా కంపెనీ కి రండి అన్నారు. ఎవరికి పని చేసినా bench తప్పించుకోలేను. అందువలన కెనడాలో స్థిరపడటానికే నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ఇక్కడ Permanent Residency తీసుకున్నాను.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.