ఇంటర్వ్యూ- SKU
ఈ పేజీ ని పంపండి

ప్రతిరోజూ పొద్దుటే లేస్తూ కాస్త దేవుడి ఫోటో చూస్తే, రోజు బాగుంటుంది అని అమ్మమ్మ చెప్తూ ఉండేది. ఆవిడ మిగిలిన ఎడ్వయిజులు పాటించినా, పాటించకపోయినా, ఈ ఎడ్వయిజు మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటాను.

ఎప్పుడో ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు నా బొమ్మ తో చేయించుకున్న పోస్టర్ ఒకటి ఉంది నా దగ్గర. దానిని కొంచెం ఎవరికీ అంతగా కనిపించని చోట, తలుపు వెనకాల తగిలించాను. ఈ మధ్య మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు "బాగుంది ఈ పోస్టర్ బాగా కనపడేటట్టు ఇక్కడ పెట్టు" అంది. దానికి నేను, "లేదు, లేవగానే నా మొఖం కనిపిస్తుంది. పొద్దుట లేస్తూనే దానిని చూడటం ఎందుకని అలా అక్కడ తగిలించాను" అని చెప్పాను.

"అదేమిటీ.. నీ మొఖం గురించి నువ్వే అలా అంటావు? ప్రతి దానికీ పాజిటీవ్ ఆటిట్యూడ్ ఉండాలి" అని మందలించింది.

సరే, అని దానిని తెచ్చి నా దేవుడి పటాల పక్కన కనిపించేలా పెట్టాను. మర్నాడు పొద్దుట లేస్తూనే దేవుడి పటం బదులు దానిని చూసాను. దాని ఫలం రోజు ఎలా గడుస్తుందో అనుకున్నాను మనసులో...

* * *

మా కంపెనీ ని ఎవరో కొనుక్కుంటున్నారు. కొత్త కంపెనీ వాళ్ళు మనని ఉంచుతారో ఉంచరో ఎందుకు ఈ టెన్షన్, రెజ్యూమి కొంచెం అప్ డేట్ చేస్తే సరి అని ఒక ఆదివారం కూర్చుని నా రెజ్యుమి ఇక్కడి జాబ్ సైట్ ఒకదానిలో ఉంచాను.

ఈ లోగా, మా కంపెనీ లో కొంతమంది ని లే-ఆఫ్ చేసారు. వాళ్ళలో నేను చేరిన రోజే మా కంపెనీ లో చేరిన ఒకతనితో పాటు ఎప్పటినుంచో పని చేస్తున్న ఇద్దరు కూడా ఉన్నారు. లే-ఆఫ్ చేస్తే, నన్ను చేస్తారు అనుకున్నాను. నేను ఏమిటీ.. అందరూ అలాగే అనుకున్నము. కారణం, మిగిలిన వాళ్ళు అంతా ఎప్పటినుంచో కంపెనీ లో ఉన్నారు. నేను ఇంకా పెర్మనెంట్ కాలేదు. ఆశ్చర్యకరం గా నన్ను పెర్మనెంట్ చేసి, ఎప్పటి నుండో ఉన్న వారిని తీసేసారు. ఇది సహజం గానే కొందరు కనుబొమ్మలు ఎగరేసేటట్టు చేసింది.

క్లయింట్ నన్ను కలవాలనుకుంటున్నారు అని సరిగ్గా అదే రోజు ఒక consultant ఫోన్ చేసారు. కంపెనీ చాలా మంచిది. కెనడా లో నెంబర్ వన్ అడ్వర్టయిజింగ్ కంపెనీ. ఇంటర్వ్యూ కి వెళ్ళి చూద్దాం. అయినా అది వీకెండ్ పని. సరదాగా చెయ్యచ్చు ఏముందీ అని అనుకున్నాను. ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసుకున్నాం.

* * *

ఆ రోజే పొద్దుటే నేను నా ఫోటో ని పొద్దుటే లేస్తూనే చూసుకున్నాను!!

ఇంటర్వ్యూ కి వెళ్ళటానికి ముందు సరైన షూలు లేవు అని వెళ్ళి కొత్త షూలు కొనుక్కున్నాను. రేటు ఎక్కువయినా, "అంత పెద్ద కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను. ఆ మాత్రం తయారవ్వాలి!" అని నాకు నేనే సరిచెప్పుకున్నాను.

ఇంటర్వ్యూ ఉదయం పదింటికి. ఎలాగా? ఆఫీస్ కి సెలవ పెట్టాలి. కానీ ఈ నెలలో అప్పుడే రెండు సార్లు నేను "సిక్" అయిపోయాను! మళ్ళీ సిక్ అవటం అంటే కుదరదు! సరే లేట్ గా వెళ్దాం అని డిసైడ్ చేసుకున్నాను. అదృష్టవశాత్తూ ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి మా నెట్ వర్క్ ఇంజనీర్ MSN చాట్ లో వచ్చి "ఇంకా మెళకువ ఉన్నావా?" అని అడిగారు.

"లేదు, ఇంకో గంట లో air port కి వెళ్ళాలి. మా ఫ్రెండ్ వస్తున్నారు. అది అయి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. రేపు లేట్ గా వస్తాను, లేదా, అసలు రాను" అని చెప్పాను.

అసలు కి మా ప్రోజెక్ట్ మేనేజర్ చాలా మంచావిడ. ఏమీ ప్రశ్నలు వేయరు. కానీ కంపెనీ పరిస్థితి వలన కొంచెం ఇబ్బంది గా ఉంది ఆవిడకి అస్తమానూ ఏవో కధలు చెప్పడం. పైగా మ నెట్ వర్క్ ఇంజనీర్ కొంచెం క్వశ్చన్ లు ఎక్కువ వేసే రకం! "ఇతనికి చెప్పేస్తే, ఇతనే అందరికీ టం టాం వేసేస్తారు. మన నెమ్మదిగా పన్నెండింటికి వెళ్ళిపోవచ్చు ఆఫీస్ కి" అనుకున్నను.

ఇంత ఫూల్ ప్రూఫ్ ప్లాన్ వేసుకున్నది ముందు రోజు. అసలు కధ ఇంకా మొదలవలేదు!

* * *

లాబీ లో కూర్చున్నాను నన్ను ఇంటర్వ్యూ చేసే జాన్ అనే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ. ఇంతలో నాతో పని చేస్తూ ఈ మధ్య లే-ఆఫ్ అయిన ఖన్ వచ్చారు పెద్ద నవ్వు మొఖం తో!

అతనూ ఇంటర్వ్యూ కి వచ్చారుట! "నువ్వేంటీ.. ఇక్కడ? ఇంటర్వ్యూ కి వచ్చావా?" అడిగారు నన్ను.

నాకా అతన్ని చూస్తేనే కాస్త మతి పోయింది! అతనికి నేనంటే కొంచెం కోపం. నన్ను ఇక్కడ చూసినట్టు మా వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి ఇక్కడ గుమ్మం దాటడం పాపం ఫోన్ చేసి చెప్పేస్తారు. అక్కడా చెడ్డ అవుతాను! "ఇదెక్కడి గోలరా బాబూ!" అని బెంగ తో అతనితో సరిగా మాట్లాడను కూడా లేదు.

నా టెన్షన్ అర్థం అయినట్టుంది. "ఖంగారు పడకు, నిన్ను ఇక్కడ చూసినట్టు ఎవరికీ చెప్పను లే" అన్నారు కన్ను గీటుతూ.

"కుళ్ళావులే! నువ్వు చెప్తావో లేదో నాకు తెలీదా?" అనుకుంటూ ఒక వెర్రి నవ్వు నవ్వాను. "సీయూ!" అనేసి వెళ్ళిపోయారు ఖాన్.

నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఒక్కసారిగా తల నొప్పి పుట్టుకొచ్చింది. ఇంటర్వ్యూ హడావిడి లో పొద్దుటే కాఫీ కూడా తాగలేదు ఎక్కడా Starbucks కనపడక! అనాలోచితం గా తల పట్టుకొని అత్యంత దీనమైన ఫోజ్ లో కూర్చుని ఆలోచిస్తున్నా.. అప్పుడు చూసాను..

నా ఎదురుగా ఇంకో ఇద్దరు ఉన్నారు నన్నే గమనిస్తూ నవ్వుకుంటూ.. నేను వాళ్ళని గమనించానని గమనించగానే, వచ్చారు నా దగ్గరకి. "సూర్య కదూ?" అని అడుగుతూ.

అర్థం అయింది. నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయేది వీళ్ళే అని. నేను తల పట్టుకొని కూర్చున్న విధానం గుర్తొచ్చి వాళ్ళు కానీ గమనించలేదు కదా.. నేను ఖాన్ తో మాట్లాడటం.. తరువాత నా ఫోజ్.. "ఏంటో!" అనుకుంటుండగా అడిగారు వాళ్ళలో ఒక వ్యక్తి షేక్ హాండ్ కోసం చేయి చాపుతూ..

"ఏంటీ.. ఒంట్లో బాగాలేదా? కాఫీ తాగుతావా? You look very pale!"

వాళ్ళు నా బాధ గమనించారని తెలియగానే శుభ్రం గా ఒప్పుకోవచ్చు కదా.. లేదు. "అబ్బెబ్బే ఏమీ లేదు." అని కవరప్ చేయటానికి ప్రయత్నించాను. పైగా, "నేను కాఫీ, టీ తాగను" అని అబద్ధం చెప్పాను.

"మరేం తాగుతావు? మంచి నీళ్ళు తాగుతావా?" వాళ్ళు అడిగిన పద్ధతి చూస్తుంటే, నేను నిజం గనే నా ఫీలింగ్స్ దాచుకోవటం లో ఫెయిల్ అయినట్టున్నాను.

"లేదు నాకు అస్సలు దాహమే లేదు! పైగా నేను ఫుల్" ఒక వెర్రి జవాబు చెప్పాను.

"మరెందుకు అలా ఉన్నావు? దేని గురించి అయినా అప్ సెట్ అయ్యావా?" అడిగారు ఒకాయన. ఈ మాటలు అడగటానికి తీసుకెళ్ళి కాఫీ బార్ లో కూర్చోబెట్టారు. నాకు వెనకాల వస్తున్న ఫ్రెష్ కాఫీ సువాసన కి కాఫీ తాగాలన్న కోరిక బలీయం గా కలగటం మొదలయ్యింది.

అక్కడ నుండీ వాళ్ళ ప్రశ్నలకి అన్నీ తిక్క జవాబులు ఇవ్వడం మొదలెట్టా. ఎప్పుడో ఎక్కడో వాళ్ళు కూడా నేను ఖంగారు పడుతున్నా అని అర్థం చేసుకున్నట్టున్నారు. నా టెన్షన్ చూసి వాళ్ళకి నవ్వులాట గా అనిపించినట్టుంది, వాళ్ళూ నన్ను ఏడిపించటానికి అన్నీ తిక్క ప్రశ్నలు అడగటం మొదలెట్టారు. అసలు టెక్నికల్ ఇంటర్వ్యూ అవసరం లేదు, నేను వాళ్ళకి కావలసిన పని ఎన్ని గంటల్లో చేయగలనో టైం లైన్ ఇవ్వమన్నారు. అలా అని వదిలేయచ్చు కదా, లేదు. నన్ను ఇంక నా ఆరోగ్యం గురించీ, కరెంట్ సాఫ్ట్ వేర్ ట్రెండ్ ల గురించీ ప్రశ్నలు వేయటం మొదలెట్టారు.

అప్పుడు నా ప్రస్తుత కంపెనీ ప్రస్థావన వచ్చింది. పేరు చూసి అడిగారు. "ఖాన్ కూడా అక్కడే పని చేసారు కదా మొన్నటి వరకూ?"

"అవును" చెప్పాను.

వెంటనే వాళ్ళ మొఖం మీద నవ్వు పరుచుకుంది. వాళ్ళకి న ఫోజ్ కి కారణం అర్థం అయింది అని తెలియగానే అడిగాను "ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నేను ఇందాక అలా ఎందుకు రియాక్ట్ అయ్యానో ఖాన్ ని చూడగానే".

"అది మాకు అప్పుడే తెలుసు. Just we were pulling your leg!" అన్నారు ఒకాయన.

"Pulling leg? ఏడ్చినట్టే ఉంది!" అనుకున్నాను.

గమ్ముని నన్ను వదిలేస్తే ఆఫీస్ కి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఇద్దరూ ఇంకో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. ఆఖరికి పదకొండున్నర కి నన్ను వదిలారు. గబ గబా పరుగులు పెడుతూ సబ్-వే కి బయలుదేరాను. వేసుకున్న కొత్త షూ కూడా అప్పుడే టైము చూసుకున్నట్టుంది. కాళ్ళు కరిచేస్తోంది. ఎడమ కాలు మరీ నొప్పి పెడుతోంది. మరీ మనం పొట్టి గా ఉన్నాం అని అలవాటు లేని హై హీలు కొన్నాను. అది వేసుకొని నడవటమే కష్టం గా ఉంది. ఇప్పుడు పరిగెడుతున్నాను ఆఫీస్ కి లేట్ అవుతోందని హడావిడి లో. కాఫీ తాగలేదు, ఇక్కడ చుట్టు ప్రక్కల ఎక్కడా తాగలేను. వాళ్ళెవరన్నా చూస్తే మళ్ళీ బాగోదు. స్నో కొంచెం కొంచెం గా కరుగుతోంది. దాని మీద నడవటం కొంచెం కష్టం గానే ఉంది.

రెండు సార్లు తప్పించుకున్నాను కానీ.. మూడోసారి జారినప్పుడు నిలదొక్కుకోలేకపోయాను. జారి పేవ్ మెంట్ మీద పడ్డాను. ఆ పడేటప్పుడు చేతి మీద ఆనుకోవడం తో చెయ్యి ఎక్కడో కలుక్కుమంది! నీళ్ళ గా ఉండటం తో పేంటు, కొత్త జాకెట్టు అంతా ఖరాబు అయ్యాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోవాలి!

* * *

ఇంటికి వెళ్ళి, బట్టలు మార్చుకొని, ఆఫీస్ కి వెళ్తుండగా మళ్ళీ ఖాన్ గుర్తొచ్చారు. ఏం చేయాలి? ఈ పాటికి చెప్పేసి ఉంటారా? ఇప్పుడు నిజం చెప్పాలా లేక ఇంకా నా ఫ్రెండ్ కెనడా వస్తున్నారు అనే కధ తోనే స్టిక్ అయి ఉండాలా? ఏమీ తోచట్లేదు.

మా బిల్డింగ్ లోకి అడుగుపెట్టగానే, ఎదురుగుండా ఉన్న ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తున్న మా నెట్ వర్క్ ఇంజనీర్ కనిపించారు.

"ఇప్పుడే వస్తున్నావా?" అడిగారు.

"అవును. మీరు?" తిరిగి ప్రశ్నించాను.

నా ప్రశ్న విన్నట్టు లేరు.. "మీ ఫ్రెండ్ వచ్చారా?" అడిగారు.

నాకు ఎందుకో ఇతను కూడా leg pulling చేస్తున్నారేమో అని అనుమానం వచ్చింది. అనాలోచితం గా అనేసాను. "నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళి వస్తున్నాను. పార్ట్-టైము. ఈ ఉద్యోగం ఏమన్నా అటో ఇటో అవితే బేకప్ కోసం. అక్కడ నాకు ఖాన్ కనిపించారు."

"ఖాన్? తనకి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు!? ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చాడు?" ఆశ్చర్యపోయారు అతను. "అయినా, మన ఉద్యోగాలకి ఏమీ ఢోకా లేదు. ఏమీ అవదు." నాకు ధైర్యం చెప్పారు.

నా మనసు నుండి ఒక గుదిబండ దిగిపోయినట్టు అనిపించింది. ఖాన్ ఫోన్ చేస్తే అతనికే చేస్తారు. అతని ద్వారా తెలిసే కన్నా, నేనే ముందు చెప్పేసాను! "అయినా, నిజమే, ఖాన్ తనకి ఉద్యోగం వచ్చింది అన్నారు.. మరి ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చారు?" నాకూ సందేహం వచ్చింది.

* * *

ఏదో డిస్కస్ చేయడానికి మా టీం లీడర్ నా డెస్క్ దగ్గరకి వచ్చారు. ఇంతలో ఖాన్ MSN లో వచ్చారు. "సీట్ దగ్గర ఒక్కదానివీ ఉన్నావా?" అని మెసేజ్ పంపారు!

ఏం సమాధానం చెప్తాను? పక్కన వేరే వాళ్ళు ఉంటే? అతను చూడకుండా గబుక్కున ఆ విండో ని మినిమైజ్ చేసేసాను. ఇంకా ఖాన్ ఏదో అంటున్నారు కానీ దానిని పట్టించుకోకుండా మా టీం లీడర్ తో మాట్లాడుతున్నాను.

ఇంతలో మా నెట్ వర్క్ ఇంజనీర్ వచ్చి చెప్పారు.. "ఖాన్ నిన్ను MSN లోకి రమ్మంటున్నారు." అది చెప్పి చూసారు నేను మినిమైజ్ చేసేసిన ఖాన్ MSN చాట్ విండో.

మా టీం లీడర్ వెళ్ళగానే ఏమిటో అతని గోల అనుకుంటూ చూసాను. అతనిది గోలే.. కాకపోతే పీత కష్టాలు పీతవి అన్నట్టు.. అతని బాధ.. నేను ఎక్కడ తను ఇంటర్వ్యూ కి వచ్చిన సంగతి మిగిలిన వాళ్ళకి చెప్పేసానో అని ఖంగారు తో నన్ను కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతనికేం తెలుసు నేను ఆల్రెడీ మా ఆఫీస్ పబ్లిక్ అనౌన్స్ మెంట్ కి ఆ విషయం చేరేసేసాను అని!

నేను నెట్ వర్క్ ఇంజనీర్ కి ఆ విషయం చెప్పాను అని చెప్పగానే తల బాదుకొన్నారు కాస్సేపు! ఇంతలో నా సెల్ ఫోన్ మ్రోగింది. చూస్తే, నన్ను ఈ ఇంటర్వ్యూ కి పంపించిన కన్సల్టెంటు. అప్పుడు గుర్తొచ్చింది.. ఈ హడావిడి లో అతనికి ఇంటర్వ్యూ ఏమయిందో ఫోన్ చేసి చెప్పలేదన్న విషయం!

"ఒక్క నిమిషం ఆగు నేనే ఫోన్ చేస్తాను" అని చెప్పి ఎవరూ వినకుండా అతనితో మాట్లాడటానికి మా వాష్ రూం దగ్గరకి నడిచాను. "ఇప్పుడే నువ్వు నాకు కూడా దొబ్బులు పెట్టు.. నువ్వొక్కడివే మిగిలావు!" కసి గా అనుకుంటూ.

అనుకున్నట్టే కాస్సేపు నేను ఫోన్ చేయలేదని నిష్టూరాలు పోయారు అతను. ఇంటర్వ్యూ గురించీ, ఉద్యోగం గురించి వాళ్ళు నాకు చెప్పిన విషయాల గురించీ, నేను కోట్ చెయ్యాలనుకున్న రేట్ గురించీ చెప్తున్నాను. ఇంతలో ప్రక్కన అలికిడి అయింది.

చూస్తే, జెంట్స్ వాష్ రూం నుంచి వస్తున్నారు.. మా బాస్! తను నా మాటలు విన్నారన్నది స్పష్టం. తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. అతను కూడా మొహమాటానికి ఏదో ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు.

మళ్ళీ ఆఫీస్ లో వెళ్ళి అతనికి మొఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. మొఖం కడుక్కోవడానికి వాష్ రూం లోకి వెళ్ళి, ఇంక ఆఫీస్ కి వెళ్ళబుద్ధి కాక, క్రింద ఉన్న స్నాక్ బార్ కి వెళ్ళి అక్కడ అబ్బాయితో కాస్సేపు మాట్లాడి, అక్కడే ఒక కాఫీ చేసుకొని తాగి, నెమ్మదిగా పిల్లి లా ఆఫీస్ లోకి అడుగుపెట్టాను.

నా ప్రక్క సీట్ అతను తెలుగాయనే. నన్ను చూసి, "మీ కోసం కెర్రీ అడిగారు" అని చెప్పారు.

కెర్రీ అంటే మా బాస్. మౌనం గా తలూపి వెళ్ళచ్చు కదా.. లేదు.. ఇవాళ ఒక్క పనీ సరిగ్గా ఇంతవరకూ చేయలేదు. ఇది కూడా అంతే.. ఎందుకు అన్నానో.. అనేసాను. "నాకు మూడినట్టుంది" అని తెలుగులో.

"అదేమిటీ?" అర్థం కాక అడిగారు అతను.

"ఏమో .. నా ఉద్యోగానికి ముహూర్తం మూడినట్టుంది." అన్నాను. అప్పుడు అనిపించింది. "ఇతనితో ఎందుకు ఇవన్నీ వాగుతున్నాను?" అని.

"అబ్బే.. లేదు లెండి. ఊరికే అడిగారు. మీరు సీట్ దగ్గర కనపడకపోయేసరికి అడిగారు. ఇంటికి వెళ్ళిపోతూ అందరికీ బై చెప్పటానికి వచ్చారు అంతే. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు" అన్నారు.

పని లో పడి మధ్యాహ్నం భోజనం చేయలేదు అని గుర్తొచ్చింది అయిదింటికి. ఆకలి వేస్తోంది. కాఫీ తాగబుద్ధి కావటం లేదు. దుకాణం కట్టేసి, ప్రక్కన ఉన్న మాల్ లోకి నడిచాను. ఆలోచనల్లో పడి కోపం వచ్చింది. నామీద నాకే. పొద్దుట నుండీ చేసిన తింగరి పనులన్నీ గుర్తొచ్చి.

అంతే, మరొక తింగరి పని మొదలెట్టాను. అదే, తినటం! డిప్రేస్ అయి ఉంటే జనాలు తిండి మీద పడతారు అంటే ఏమిటో తెలిసింది. రెండు కేకులూ, ఒక New York Fries, Tim Hortons కాఫీ, చివరగా సమోసాలు! ఆ సమోసాలు, డాలర్ కి మూడు సమోసాలు అంది అక్కడి అమ్మాయి. సరే అని మూడూ తీసుకొని, మూడూ తినేసాను కూడా.

తిన్నాక, కడుపు లో ఏదో గాభరా మొదలయ్యింది!! వికారం గా అనిపించడం మొదలయ్యింది. "అమ్మో.. ఇంటికి త్వరగా వెళ్ళాలి" అనుకొని, బస్ స్టాప్ వైపు పరుగెట్టాను. అప్పుడు తెలిసింది.. పొద్దుట పడినప్పుడు కాలు కూడా దెబ్బ తిన్నట్టుంది. అది మొరాయించడం మొదలెట్టింది. షూ కూడా అప్పుడే టైము చూసుకొని నొప్పి గుర్తు చేయటం మొదలెట్టింది.

ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి సమోసాల్లో నూనె వలన అనుకుంటా తల గిర్రున తిరగటం మొదలయ్యింది. బట్టలు మార్చటం కూడా పూర్తి కాలేదు.. తిన్న గడ్డి అంతా బయటకి వచ్చేసింది.

ఇంక తిండీ, గిండీ, అన్నీ వదిలేసి, రెండు తలనొప్పి టాబ్లెట్లు వేసుకొని పడుకున్నా. కళ్ళు మూయబోతుండగా.. కనిపించింది ఎందురుగా ఉన్న నా ఫోటో.

"నువ్వే తల్లీ.. ఇవాళ నా రోజు ఇలా తగలడటానికి కారణం!" అని ఫోటో లో ఉన్న నన్ను నేనే తిట్టుకొని, మళ్ళీ రేపు లేవగానే కనపడుతుందేమో అని .. లేని ఓపిక తెచ్చుకొని, ఆ ఫోటో ని అక్కడ నుండి తీసేసాను.

ఏంటీ మరీ superstitious గా ఆలోచిస్తున్నానంటారా? ఏం చేయను.. నా నమ్మకాలు అలాంటివి!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.