Mt.Pierce హైక్ - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి

బోస్టన్ వచ్చాక నేను చాలా మారాను. అంతకు ముందు ఎప్పుడూ అసలు gym మొఖం కూడా చూసి ఎరుగని నేను gym కి వెళ్ళటం, పరిగెట్టడం మొదలెట్టడం, నాలుగు మేరధాన్ లూ, రెండు హాఫ్-మేరధాన్ లు పూర్తి చేసాను.

కానీ పరిగెత్తడం కొంచెం విసుగు వేయటం మొదలెట్టగానే, కొత్త హోబీ ల కోసం మీటప్ గ్రూప్ లలో వెతకడం మొదలెట్టాను. కొత్త హాబీలు అలవాటు చేసుకోవాలనుకునే వారికి ఈ మీటప్ వెబ్ సైట్ ఒక వరం లాంటిది. అక్కడ దాదాపు అన్ని రకాల గ్రూపులూ వుంటాయి. అలా నేను హైకింగ్ గ్రూప్ ఒక దానిని చూసి, పోనీ కొద్దిగా హైకింగ్ చేద్దాం అని చేరాను.

చేరిన రెండో రోజే అక్కడ బోస్టన్ AMC గ్రూప్ వారి హైకింగ్ క్లాస్ ల గురించి ఒక మెసేజ్ చూసాను. నాకు అంతకు ముందు కొద్దిగా హైకింగ్ చేసిన అనుభవం వుంది.

కానీ ఆ హైక్ చేసినప్పుడు సరైన బట్టలు లేక, సరైన సామగ్రీ, హైకింగ్ అనుభవం లేకపోవటం వలన కొద్ది ఇబ్బంది ఎదుర్కోవటం గుర్తు వుంది. కనుక, AMC వాళ్ళ హైకింగ్ క్లాస్ కి వెళ్ళి కొద్దిగా టిప్స్, ట్రిక్స్ నేర్చుకుందాం అని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను.

ఎందరో స్నేహితులు అయ్యారు. AMC హైకింగ్ పాఠాల వలన మొదటి సారి వింటర్ హైకింగ్ మీద కూడా ఆశక్తి కలిగింది. సాధారణం గా చలి కాలం లో ఆఫీస్ కి వెళ్ళటానికి తప్ప బయటకి రాని నేను మంచు లో, చలి లో హైక్ చేయటం నిజం గా ఒక కొత్త అనుభూతి. నేను చలి కి తట్టుకొని నిలవగలనా అనుకున్నాను కానీ రెండు మూడు హైక్ ల తరువాత నాకు అసాధ్యం అనేది ఏదీ లేదు అని ఒక నమ్మకం ఏర్పడింది.

నన్ను స్ప్రింగ్, వింటర్ హైక్ లలో చూసిన సోన్యా అనే AMC లీడర్ నేను హైకింగ్ లీడర్ గా ట్రైన్ అవితే మంచి లీడర్ ని అవగలను అని సూచించారు. సోన్యా చెప్పినదే మరో లీడర్ కూడా చెప్పేసరికి కొంచెం ధైర్యం కలిగి, హైకింగ్ లీడర్ షిప్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అది పూర్తి అయ్యాక మాకు కో-లీడర్ సర్టిఫికెట్ ఇస్తారు. మూడు హైక్ లు ముగ్గురు వేరు వేరు లీడర్ల క్రింద కో-లీడ్ చేసి, ప్రధమ చికిత్స, మేప్ & కంపాస్ ట్రైనింగ్ పూర్తి చేసాక లీడర్ గా సర్టిఫికెట్ కోసం apply చేసుకోవచ్చు.

నేను రెండు హైక్ లు కో-లీడ్ చేసాను. కానీ ఒక్కదాన్నీ ఎప్పుడూ హైక్ కి వెళ్ళలేదు. నేను హైకింగ్ చేసేటప్పుడు ఎన్నాళ్ళగానో హైక్ చేస్తున్న AMC లీడర్లు కొంతమంది ని కలిసాను. వాళ్ళలో చాలా మంది New England లోని 4000 అడుగులు కన్నా ఎత్తు వున్న కొండలు (మొత్తం 48) హైక్ చేసిన వాళ్ళు. అలా పూర్తి చేసిన వాళ్ళు తాము ఆ కొండలన్నీ హైక్ చేసామని నిరూపించే ఫోటోలు, లేక ఎవరితో కలిసి హైక్ చేసామో ఆ వివరాలు ఇస్తే, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్లబ్ లో స్థానం లభిస్తుంది. అదొక సరదా!!

నాకు కూడా ఆ క్లబ్ లో చేరాలని చిన్న కోరిక మొదలయింది. అంటే, ఇప్పుడు ఆ కొండలన్నీ నేను హైక్ చేయాలి. ఒకోసారి నాతో హైక్ చేయటానికి ఎవరూ దొరకక పోవచ్చు. అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి అయినా మొత్తం ఆ కొండలన్నీ పూర్తి చేయాలి.

సరే, ఇన్ని సార్లు ఇన్ని కొండలు ఎక్కాను. ఇంతవరకూ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. ముందు ఏదో ఒక తేలికగా హైక్ చేయగలిగే కొండ ఎంచుకొని అది పూర్తి చేసాక కష్టమైన వాటి పని పట్టచ్చు అని నిర్ణయించుకున్నాను.

* * *

కానీ నా గురించి మీకు తెలుసు. ఏ పనీ ఏదో ఒక విచిత్రం చేయకుండా నేను పూర్తి చేయను కదా!? నేను తేలిక అని డిసైడ్ అయిన కొండ Mt.Pierce. దీనినే అదివరకు Mt.Clinton అనేవారు. దీని ఎత్తు 4310 అడుగులు. మొత్తం 6.6 మైళ్ళ హైక్. నేను చేసిన మిగిలిన హైక్ లతో పోలిస్తే చాలా తేలిక హైక్. ఒకద్దాన్నీ వెళ్ళి వద్దాం అని అనుకుని, మా ఆఫీస్ లో అందరికీ, ఒక వేళ నేను సోమవారం ఆఫీస్ కి రాకపోతే, ఎందుకు రాలేదు అని ఏమీ email పంపించకపోతే, నేను తప్పిపోయాను అని పోలీస్ లకి రిపోర్ట్ చెయ్యండి అని చెప్పి వచ్చాను శుక్రవారం నాడే.

చూద్దాం ఎవరికైనా ఈ హైక్ మీద ఆశక్తి వుందేమో అని నా ఫ్రెండ్స్ కొంత మంది కి నేను ఇలా Mt.Pierce హైక్ కి వెళ్తున్నాను, నాతో వచ్చేది అయితే, ఏమేమి తీసుకొని రావాలో, ఎప్పుడు అందరూ కలవాలో వివరాలతో email పంపించాను.

నేను ఇలా హైక్ కి వెళ్తున్నాను అని చెప్పగానే నా కొత్త రూమ్మేట్ తను కూడా వస్తాను అని ఆశ పడ్డారు. తనకి అసలు హైకింగ్ అనుభవం లేదు. తను దాదాపు ఏడు మైళ్ళు నడవగలరో లేదో అని అనుమానం. పైగా హైక్ చెయ్యాలంటే ముఖ్యం గా కావలసిన హైకింగ్ బూట్లు తన దగ్గర లేవు. ఎదో చిన్న హైక్ లకి అయితే సరి అయిన బూట్లు లేకుండా వెళ్ళచ్చు కానీ ఇటువంటి హైక్ లకి తనకి తగినంత అనుభవం లేదు అని నిస్సంకోచం గా "కుదరదు" అని చెప్పేసాను.

ఈ లోగా ఇద్దరు ఫ్రెండ్స్ తాము కూడా నాతో వస్తాను అని నాకు email ఇచ్చారు. నా రూమ్మేట్ కి చెప్పినట్టే, వాళ్ళకి కూడా నాతో రావాలంటే సరి అయిన హైకింగ్ బూట్లు, రెండు లీటర్ల మంచి నీళ్ళు, రైన్ జాకెట్, తినటానికి లంచ్ అన్నీ వుండాలని చెప్పాను. వాళ్ళు నాతొ అంతకు ముందు హైక్ చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర అవన్నీ వున్నాయి అని నాకు తెలుసు. కనుక మొత్తానికి మేము ముగ్గురం హైక్ కి వెళ్ళాటం ప్రోగ్రాం స్థిరమైంది.

పొద్దుటే ఇంట్లో మూడున్నర కి లేవటానికి అలారం పెట్టుకున్నాను. కానీ నాకు మెళకువ నాలుగున్నర కి వచ్చింది. కారణం? మూడున్నర am కి పెట్టాల్సింది అలారం pm కి పెట్టాను. ఎదో అదృష్టం బాగుండి నాకు అలారం మ్రోగకపోయినా మెళకువ వచ్చింది.

ఇంక అక్కడి నుండి ఉరుకులూ పరుగులు! మా రూమ్మేట్ ని సాధ్యమైనంత వరకూ డిస్టర్బ్ చేయకుండా హైక్ కి కావలసినవి కొన్ని లైట్ వెలుగు లో కొన్ని చీకట్లో చేతికి దొరకపుచ్చుకొని, ముందు రోజు సాయంత్రమే అన్నీ కార్లో పెట్టుకోనందుకు నన్ను నేను తిట్టుకుంటూ ఇంట్లోంచి బయలుదేరాను.

దారిలో నా ఫ్రెండ్స్ ని పిక్ చేసుకొని, ఎనిమిదిన్నర కి New Hamshire లోని train head కి చేరుకున్నాం. అందరం బూట్లు వేసుకొని, బేగ్ లు తగిలించుకొనీ హైక్ మొదలెట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టాము. నేను నా బూట్లు అన్నీ షూ రేక్ లో పట్టినన్ని పెట్టి మిగిలినవి, పెద్దవి ఆ షూస్ కొన్నప్పుడు వచ్చిన పెట్టెల్లో పెడతాను. సాధారణం గా నా హైకింగ్ సామాన్లు అన్నీ నా రెండో bed room ని స్పేర్ రూం చేసి అందులో పెట్టేదాన్ని. కానీ రూమ్మేట్ వచ్చినప్పుడు అన్నీ తీసి ఒక దగ్గర పడేసి, తనకి ఆ గది ఖాళీ చేసి ఇచ్చాను.

తను వచ్చాక ఇదే మొదటి సారి నేను హైకింగ్ కి వెళ్ళటం. చీకట్లో దొరికిన బాక్స్ తీసుకొని కార్లో పెట్టుకొని వచ్చాను.

ఇప్పుడు ఆ బాక్స్ తెరిచి చూస్తే, అందులో వున్నవి నా హైకింగ్ బూట్లు కాదు.. చలి కాలం లో వేసుకొనే winter soft furry shoes!!

వాటిని చూసి నా రియాక్షన్ ని వర్ణించలేను! నా ఫ్రెండ్స్ కి నాతో హైక్ చెయ్యాలంటే ఫలానా ఫలానా వుండాలి అంటూ కటింగ్ లు ఇచ్చి, ఇప్పుడు నేను trail head దగ్గర హైకింగ్ బూట్లు లేకుండా వెర్రి మొఖం వేసుకొని నిలబడ్డాను.

ఫెండ్స్ పాపం ఇంత దూరం వచ్చారు. నా తప్పు వలన వాళ్ళ ట్రిప్ వృధా అవటం ఇష్టం లేక, చూద్దాం ఈ బూట్ల తో ఎంత దూరం రాగలిగితే అంత దూరం వస్తాను. ఒకవేళ ఏమైనా నది, కాలవలు దాటవలసి వస్తే, లేక వర్షం వస్తే నేను వెనక్కి వచ్చేస్తాను, మీరు వెళ్ళి వద్దురుగాని, అని వాళ్ళకి ధైర్యం చెప్పి, బయలుదేరాము.

అదృష్టవశాత్తూ, ఆ రోజు వర్షం రాలేదు, నేను హైక్ ఏ ఇబ్బందీ లేక ఆ సిల్లీ షూస్ లో పూర్తి చేసాను.

నా ఫ్రెండ్స్ తో what happens at the trail head will be forgotten at the trail head అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను హైక్ పూర్తి అయ్యాక. ఎవ్వరికీ ఏమీ చెప్పం అని వాళ్ళు ముసి ముసి నవ్వులు నవ్వుతూనే నాకు వాగ్ధానం చేసారు. ఒకవేళ వాళ్ళు ఎవరికైనా చెప్తే, మాకు ఇక్కడ AMC ప్రతీ సంవత్సరం, Most Embarrassing leader/co-leader అవార్డు ఇస్తూ వుంటారు. ఆ అవార్డు ఈ సంవత్సరం నాకే ఖచ్చితం గా వస్తుంది! క్రింతం సంవత్సరం ఆ అవార్డు వచ్చిన లీడర్, 4 రోజుల backpacking ట్రిప్ ప్లాన్ చేసి, trail head కి backpack మర్చిపోయి వచ్చారు!

* * *

ఎవ్వరికీ చెప్పొద్దు అని నా ఫ్రెండ్స్ కి చెప్పినా అందరికీ దండోరా వేసి మరీ చెప్పినది నేనే. నా రూమ్మేట్ కి నేను బూట్లు మర్చిపోయి వెళ్ళాను అనగానే ఆమె కూడా ఒక రకమైన లుక్ ఇచ్చి మరీ నవ్వారు.

ఇవాళ అడిగారు, "మీరు మళ్ళీ హైక్ కి వెళ్ళినప్పుడు నేను కూడా మీతో వస్తాను."

"తప్పకుండా. మరి మీకు హైకింగ్ బూట్లు వున్నాయా?" సిగ్గులేకుండా అడిగాను.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.