Highway - అరుణ బీరకాయల
ఈ పేజీ ని పంపండి

నేను US కి వచ్చిన రెండవ రోజున ఒక ఫూల్ ని అయ్యా. అసలు ఎంత ఎడ్డి మొహం వేసుకొని వచ్చానూ అంటే తిన్నగా "ఎర్ర బస్" దిగి యూనివర్శిటీ కి వచ్చాను ఏమో అని నాకే అనుమానం వేస్తుంది. నేను ఆర్లింగ్టన్ (ఆర్లింగాపురం.. ఇదో పల్లెటూరు!) టెక్సాస్ కి వచ్చాను UTA కి. మా అన్నయ్య ఆస్టిన్ లో ఉంటాడు. నన్ను చూడడానికి వచ్చాడు. అంతా తిరిగాం డల్లాస్ డవున్ టౌన్ మరియీ చుట్టు పక్కల ప్రదేశాలు. ఇక్కడ ఒక సీనియర్ మా అన్నయ్యనూ, నన్నూ, నాతో పాటు వచ్చిన మా స్నేహితురాలినీ దగ్గర లో ఉన్న ఒక పెద్ద దుకాణానికి (Wal Mart) తీసుకు వెళ్తున్నారు. దారిలొ అతను మాట్లాడేరు. (కానీ ఎవరితొనో నాకు అర్ధం కాలేదు.. నేను వెనుక ఉన్నా. అతను డ్రైవ్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే..

"మీరు వెళ్ళేటప్పుడు I20 తీస్కుంటే ఈజీ గా ఉంటుంది"

ఎవరిని ఉద్దేసించో నాకు తెలియలేదు. కానీ నాకు ఊ.. అన్నా ఆ.. అన్నా టెన్షన్ లెండి. అదే దేశం కాని దేశమాయె.

నేను గట్టిగా, ఆత్రంగా అన్నాను "అయ్యో అవునా? నాకు తెలియలేదు. ఇప్పుడు ఎలా? నన్ను రానివ్వరా లోపలికి?"

నా భయం వేరు లెండి. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది జాగర్తలు చెప్పారు

"ఒక్కదానివీ వెళ్ళకు.. వెళ్ళినా ఏమి తీసుకెళ్ళకు.. ఎవరైనా నిన్ను ఆపి డబ్బులు అడిగితే నోరుమూసుకుని ఇచ్చేయ్యి...లేదా.. కాల్చేస్తారు" అని!

ఇక్కడ అంతా స్ట్రిక్ట్ గా ఉంటుందెమో అనీ, ఇంకా నాతో ఎవ్వరినీ నిలుచోపెట్టరు, నేను ఒక్కదాన్నే ఉండాలి ఏమో అనీ భయపడ్డా. అది విని మా అన్నయ్య, మా సీనియర్ పగలబడి నవ్వారు. నాకు, నా స్నేహితురాలికీ ఇంకా అర్ధం కాలేదు.

కొంచం నవ్వు అయ్యాక కుదుటపడ్డాక, మా అన్నయ్య చెప్పారు "I20 అంటే స్కూల్ ది కాదురా.. ఇప్పుడు అర్ధం కాదు కానీ.. ఇక్కడ ఒక highway పేరు I20. నేను మళ్ళీ ఆస్టిన్ వెళ్ళేటప్పుడు అది తీసుకుంటే ఈజీ అని చెప్పారు. మీరు మామూలుగా షాప్ లోకి ఎంటర్ అవ్వచ్చు పరవాలేదు"

ఓహో అని మేము కూడా నవ్వుకున్నాం.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి అరుణ బీరకాయల కి తెలియచేయండి.