గ్రాండ్ పేరెంట్స్ డే - SKU
ఈ పేజీ ని పంపండి

ఆదివారం సెప్టెంబరు 7వ తారీఖు ని "గ్రాండ్ పేరెంట్స్ డే" అని ఇంగ్లీషు వాడు ప్రకటించాడుట. సరే, వాళ్ళకి అమ్మమ్మని తలచుకోటానికి ఒక రోజు ప్రత్యేకంగా కావాలి.. మనకి అవసరమా? మన జీవితాలలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ల పాత్ర ఎంతన్నది నేను ఇవాళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ల ఇళ్ళకి వెళ్ళకుండా గడిపిన వాళ్ళం మనలో చాలా తక్కువ మంది అయివుంటారు.

మాకు మాత్రం ఆ అదృష్టం లేదు. ఎందుకంటే, మేము, అమ్మమ్మ, తాతయ్యగారు అంతా కలిసే వుండేవాళ్ళం. అంటే, మా అమ్మగారి తలితండ్రులు. మేము అంతా కలిసి వుండటానికి కారణం వుంది. నాన్నగారికి అమ్మమ్మ స్వంత అక్క. మా అమ్మమ్మ వాళ్ళ తలితండ్రులకి రెండో అమ్మాయి. నాన్నగారు ఆఖరి, ఎనిమిదవ అబ్బాయి. నాన్నగారికి 3 నెలలప్పుడు వాళ్ళ అమ్మగారు కాన్సర్ వ్యాధి తో పోయారు. అప్పటికి అమ్మమ్మ కి పెళ్ళి అయిపోయింది. ఆవిడ తరువాత ముగ్గురు చెల్లెళ్ళూ, ముగ్గురు తమ్ముళ్ళూ వున్నారు. ఆంతా చదువుకుంటున్నారు. ఎవరికీ పెళ్ళిళ్ళు అవలేదు. తల్లి లేని తమ్ముళ్ళనీ, చెళ్ళెళ్ళనీ ఆవిడ ఇంటికి ఆడదిక్కు గా, తల్లి మాదిరిగా సాకింది. వాళ్ళ పెద్ద అక్క కాపురం వేరే ఊర్లో. అమ్మమ్మ భర్త, అదే, తాతయ్యగారు తాహసీల్దారు గా చేస్తూ ఊళ్ళు తిరిగే వారు. కాపురం మాత్రం కాకినాడ. ఒకే ఊరు కనుక అమ్మమ్మ పుట్టింటి బాగోగులు కుడా చూసేవారు. నాన్నగారి తండ్రి కూడా ఆడదిక్కు లేని సంసారం చక్కదిద్దటానికి కూతురు, అదే, అమ్మమ్మ మీద ఆధారపడ్డారు. ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. ఆయన పోయే టైము లో అమ్మ ని నాన్నగారికి ఇచ్చి పెళ్ళి చేసి పోయారు. అమ్మ, నాన్నగారు వైజాగ్ లో కాపురం పెట్టారు. అమ్మ అమ్మమ్మ కి నలుగురు పిల్లలు పోయాక పుట్టిన అమ్మాయి. అమ్మ తరువాత ఒక అబ్బాయి. మావయ్య చాలా తెలివైనవారుట! వీళ్ళ పెళ్ళి అవగానే, వైజాగ్ లో వున్న అక్క ని చూడటానికి మావయ్య ఇంటర్ సెలవుల్లో వైజాగ్ వచ్చారుట. అక్కడ సముద్రం లో ఓడ ని చూడటానికి వెళ్ళినప్పుడు విషజ్వరం వచ్చి, రెండో రోజు ఆయన పోయారు. వున్న ఒక్కగానొక్క కొడుకు పోవటం తో అమ్మమ్మ బాగా కృంగిపోయింది. తాతయ్య గారి పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. చిన్నప్పుడు తల్లి లా సాకిన అమ్మమ్మ ఋణం తీర్చుకోవటానికి నాన్నగారు వైజాగ్ లో కెరీర్ ఒదిలేసుకొని కాకినాడ వచ్చి స్థిరపడ్డారు. అలా నా చిన్నప్పటినుంచీ వేరు వేరు కాపురాలు అయినా, ఒకే ఇంట్లో వున్నాం .

ఆ రకంగా చిన్నప్పటి నుండీ అమ్మమ్మ తోనే వున్నాం మేము. అమ్మమ్మ ది డామినేటింగ్ నేచర్. పెళ్ళిళ్ళు అయి మనవలు పుట్టినా, మిగిలిన అత్తయ్యలు అంతా అమ్మమ్మ అంటే భయపడతారు. ఇంక వాళ్ళ పిల్లలు అయితే సరేసారి. అందరూ అమ్మమ్మ చేతి మొట్టికాయలు, తిట్లూ రుచి చూసిన వాళ్ళే. అమ్మమ్మ పేరు సూర్యకాంతం. పేరుకు తగ్గట్టు సురేకారం లా మండిపోతూ వుండేది.. తన పట్టు విషయం లో కానీ, చెప్పిన పని చెయ్యని వాళ్ళ మీద కాని. అమ్మమ్మ వేడి అంతా, మేము మనవలం వచ్చాక చల్లారిపోయింది. అందుకే మా పిన్నులు, బాబయ్యలూ అంతా, మమ్మల్ని చూసి అమ్మమ్మ మీద నిష్టూరాలు ఆడుతూవుంటారు. మమ్మల్ని అలా తిట్టేదానివి.. ఇలా చేసేదానివి.. "నీ మనవరాళ్ళు ఏంటి.. నీ తిక్క కుదిర్చారు" అని. దానికి అమ్మమ్మ ఒకోసారి "వాళ్ళా.. మనవరాళ్ళు కాదు.. రాళ్ళు!" అని.

అంటే, మేము ఎదో రాళ్ళూ, రాపాషణాలూ అన్న నిశ్చయానికి వచ్చేయకండి. మా అమ్మ, నాన్నగార్లు మాకు చాలా స్వాతంత్ర్యం ఇచ్చారు. మా మాటకి విలువ ఇచ్చేవారు. కనుక మేము మా ఇష్టం వచ్చినట్టు వుండేవాళ్ళం. తరాల అంతరం వలన, మా పోకడలు కొన్ని అమ్మమ్మ కి నచ్చేవి కావు. ముఖ్యంగా మాకు అస్సలు నచ్చనిది అమ్మమ్మ మడీ ఆచారాలు. ఆ పేరు చెప్పి, మా స్నేహాల మీద, కదలికల మీదా ఎన్నో ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నించేది. ఆడపిల్లలు అంటే, మరీ ఎక్కువ కదా ఈ రకం ఆంక్షలు. మేమా ఊరుకునే టైపు కాదు. ఆవిడ పెద్ద నాగు అయితే, మేము పిల్ల నాగుల్లా తలలు ఎగరేసేవాళ్ళం.

ఎన్నో సార్లు మా ఇద్దరికీ చెప్పలేక అమ్మ సతమతమయ్యేది. మా నోటిదురుసుతనాన్ని తిడితే, మేము అమ్మ మీద ఎగిరేవాళ్ళం.. అమ్మా చాదస్తం తగ్గించుకో అని చెప్తే అమ్మమ్మ కస్సు బుస్సు లాడేది. అమ్మమ్మ ని అర్థం చేసుకోవాలని అప్పట్లో మేమూ ప్రయత్నించలేదు.. రోజులు మారాయి అని అమ్మమ్మా ఒప్పుకోలేదు. తాతయ్యగారు చాలా శాంతస్వభావి. ఆయన ఎప్పుడూ తీవ్రంగా మాట్లాడటం నేను ఎరగను. ఆయన సహనం, అమ్మమ్మ రుద్రస్వరూపిణి రూపం రెండూ చూపించగల ఘనత అమ్మ కి వుంది. నాన్నగారు సాధ్యమైనంత వరకూ ఇంటి విషయాలు అన్నీ అమ్మని చూసుకోనిచ్చేవారు. కానీ వ్యవహారం శృతిమించుతుంటే మాత్రం వచ్చి అందరికీ అక్షింతలు వేసేవారు.

తాతయ్యగారికి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించాము. డాక్టరు ఒక కన్ను కి చేయాల్సిన ఆపరేషను వేరే కన్నుకి చేసారు. దాని కోసం రెండో కన్ను కి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ ఆపరేషన్ కాదు కానీ ఆయన కంటి చూపు చాలా మందగించింది. ఆయన చనిపోయేంతవరకూ కంటి చూపు కోసం తిరగని చోటు లేదు. ఇక్కడ జనాల మాదిరి లౌక్యం తెలీదు.. కోర్టు కేసులు వేసి ఆ డాక్టర్లని ముప్పుతిప్పలు పెట్టడానికి. ఏమయితేనేం.. ఆయన కంటి చూపు మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వలన దెబ్బతింది.

దానితో ఆయన బయటకి వెళ్ళటం తగ్గించేసారు. కాలక్షేపం కోసం TV లో వచ్చే క్రికెట్ మేచ్ లు వినటం మొదలెట్టారు. కానీ చూడటం వీలవదు కనుక, ఆయన తో కూర్చో పెట్టుకొని, అమ్మకీ, మాకూ క్రికెట్ ఆట మెళకువలు చెప్పేవారు. నాకు అంత నేర్చుకునే ఆశక్తి లేదు కానీ, అమ్మ ఆయన శిక్షణ లో మా లోకల్ పేపర్ లో క్రికెట్ రివ్యూలు రాయగల ప్రావీణ్యం సంపాదించుకుంది. అలాగే ఆయన కి పుస్తకాలు చదవటం అంటే విపరీతమైన ఆశక్తి. కంటి చూపు మందగించటం తో, ఆయనకి రోజూ మనవరాళ్ళం పేపరూ, వారపత్రికలో ఆయన ఫాలో అయే సీరియల్స్ అన్నీ పైకి చదువుతూ వుండేవాళ్ళం. న్యూస్ పేపర్ లో ప్రతీ చిన్న వార్తా చదవటం అలా మాకు అలవాటు అయింది. అలాగే చిన్న వయసు లోనే వారపత్రికల సీరియల్స్ చదవటం కూడా. ఆ చదవటం రేడియో లో వార్తలు చదివే వారిని అనుకరిస్తూ, వారి శైలి లో పదాలు విరవటం వగైరా అలవాటు అయ్యాయి. ఇంక సీరియల్స్ అయితే, డ్రామా డైలాగులు ఫీల్ అవుతూ చదవటం.. అదీ.. అదొక సరదా! ఆయన కూడా మా తెలుగు ఉచ్చారణ లోని దోషాలు సరిదిద్దుతూ, మా తెలుగు వృద్ధి చెందటానికి తోడ్పడ్డారు. ఆయనకి పేపర్లు చదివేటప్పుడే, రాజకీయాలంటే నాకు ఆశక్తి మొదలైంది.

తాతగారికి కి కాంగ్రెస్ అంతే చాలా ఇష్టం. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎవరన్నా ఏమన్నా స్టేట్ మెంట్ ఇచ్చినా, కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఏ పేపర్ అయినా సంపాదకీయాలూ వగైరా రాసినా చాలా బాధపడేవారు. కాంగ్రెస్ ని సమర్థించటానికి ఆయనకి ఎప్పుడూ ఏదో ఒక కారణం దొరికేది. ఇందిరా గాంధి మరణించినప్పుడు ఆవిడ అంత్యక్రియలు TV లో చూస్తూ ఆయన, అమ్మ, అమ్మమ్మా కంట నీరు పెట్టటం నాకు ఇంకా గుర్తే. నాన్నగారు జనతా పార్టీ అభిమాని. ఎప్పుడన్నా వాదన వస్తే, వారి వాదనలు బాగుండేవి. తాతయ్యగారు ఆవేశపడక పోయినా, కాంగ్రెస్ ని సమర్థిస్తూ అమ్మ ఆవేశపడిపోయేవారు.

అమ్మమ్మ కుమారుడు పోయిన విషాదం నుండి తేరుకోవటానికి సంగీతాన్ని ఆశ్రయించింది. సంగీతం సాధన మొదలెట్టి, తన స్నేహితులతో కలిసి కాకినాడ లో "సత్కళావాహిని" అనే భక్తి రస సంగీత సంస్థ ని నెలకొల్పటం లో తోడ్పడింది. తాతయ్యగారికి సంగీతం అంటే అస్సలు ఇష్టం లేదు. అమ్మ కి తాతయ్య గారి పోలిక వచ్చింది ఈ విషయం లో. తనకీ "సంగీతం అంటే అలా సాగదీస్తూ పాడటం.. నేను పాడలేను.. నాకు ఓపిక లేదు బాబూ!" అని తనకి నేర్పటానికి అమ్మమ్మ ఎంత ప్రయత్నించినా నేర్చుకోలేదు.

అమ్మ నిరాశ పరచిందని మాకు తన విద్య నేర్పటానికి అమ్మమ్మ ప్రయత్నించింది. కానీ మేము కూడా ఎవ్వరం శ్రద్ధ గా నేర్చుకోలేదు. 60+ ఏళ్ళ వయసులో వైలెన్ సాధన మొదలెట్టి దానిలో ప్రావీణ్యం సంపాదించటం అమ్మమ్మ పట్టుదలకి మచ్చుతునక. అలాంటి అమ్మమ్మ ఇప్పుడు వృద్ధాప్యం వలన గొంతు కేన్సర్ వలన కనీసం ఘన రూపం లోని ఆహారం ఏదీ కూడా తినలేని పరిస్థితి లో వుంది అని అమ్మ చెప్తున్నప్పుడు నా బాధ గురించి ఎలా చెప్పను?

చలికాలం వస్తే, అమ్మమ్మ కి భయం. ఊపిరి ఆడని ఆయాసం అల్లాడిస్తుంది. తాతయ్య గారు కూడా ఆఖరి రోజుల్లో ఆయాసం తో చాలా ఇబ్బంది పడి దానితోనే పోయారు. ఆయనని సిగరెట్లు కాల్చటం మానేయమని అమ్మమ్మ ఎంత పోరినప్పటికీ, ఆయనచేత ఆ అలవాటు ని మాత్రం మానిపించలేకపోయింది. ఆయన తను వుండగా అక్క పెళ్ళి చూడాలని ఎంతగానో తపించారు. కానీ ఆయన బతికి వుండగా అక్క పెళ్ళి కుదరలేదు. ఆయన పోయిన మరుసటి సంవత్సరం అక్క పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి లో తాతయ్యగారిని స్మరించుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తాతయ్య గారు మా మధ్య లేకపోయినా, ఆయన సున్నితంగా విషయం బోధపడేటట్టు చెప్పే తీరు, ఆ అపారమైన విజ్ఞానం తలచుకుంటే కళ్ళు చెమరుస్తాయి.

ఫోన్ చేసినప్పుడల్లా అమ్మమ్మ నిన్ను చూడాలని వుందమ్మా.. అక్కడ ఎందుకు.. ఇండియా వచ్చేయి అని చెప్తున్నప్పుడు మనసు లాగుతుంది. ఈ చివరి దశ లో తన కోరిక తీర్చాలని అనిపిస్తుంది. కానీ అన్నీ మన చేతుల్లో వుండవు కదా!! అమ్మమ్మ ని ఎన్నో సార్లు కోప్పడ్డా, మరెన్నో సార్లు వేళాకోళాలు ఆడినా, అమ్మమ్మ ప్రభావం నామీద వుందన్నది మాత్రం సత్యం. తననీ, తీపి జ్ఞాపకం గా మిగిలిపోయిన తాతయ్యగారినీ కేవలం ఈ ఒక్క రోజే కాదు.. నా జీవితాంతం ప్రేమిస్తాను, వారితో గడిపిన మధుర క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకొని నా ఒంటరి క్షణాలని మర్చిపోతాను.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.