మమకారం - SKU
ఈ పేజీ ని పంపండి

ఈ మధ్య US నుంచి మా ఫ్రెండ్స్ .. శ్యామ్, సరిత టొరొంటో వచ్చారు. నాకు వాళ్ళు పరిచయం లేరు. మా ఫ్రెండ్ వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు. ఎన్నో రకాలుగా నాకు ఆ భార్యా భర్తలు నచ్చారు.

అందులో ముఖ్యమైనది.. వాళ్ళిద్దరికీ నాలా రాజకీయాలంటే, సినిమాలంటే విపరీతమైన ఇంట్రెస్ట్. అదే కాదు.. వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే చాలా హాయిగా అనిపించింది. మళ్ళీ యింట్లో మా అమ్మ గారితో వాదించినట్టు అనిపించింది. ఆంటే వాళ్ళు నాకు అమ్మ లాంటి వాళ్ళని కాదు.. నా ఉద్దేశ్యం!

శ్యామ్ నాటకాల మీద ఇంట్రెస్ట్ తో మధురై లో వున్నప్పుడు నాటక సంస్థలకి వలంటీర్ గా పనిచేసేవారని చెప్పారు. వలంటీర్ అంటే.. టికెట్లు కోయటం.. కుర్చీలు సర్ధటం.. ఈ పనులు చేయటం కోసం ఒకోసారి కాలేజ్ మానేసే వాడినని చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. తమిళనాడు లో ఈ రకంగా నాటకాల వృద్దికి తనకన్నా ఎక్కువ పాటు పడుతున్న వాళ్ళు ఎంతో మంది వున్నారని ఆయన చెప్పారు. నాకు నాటకాలంటే అంత ఇంట్రెస్ట్ లేదని.. అస్సలు నేను ఇండియాలో వున్న 27 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఏ నాటకం చూడలేదని చెప్పాను. మా ఊరు కాకినాడ లో సరస్వతీ గాన సభ, యంగ్ మెన్స్ హేపీ క్లబ్ తదితర సంస్థలు వున్నాయి. వాటి నుంచి రావుగోపాల రావు, అంజలీదేవి వంటి కళాకారులు సినీరంగం లో ప్రముఖులైయ్యారు. కానీ ఇదేదీ నాకు తెలియదు.

ఎదో ఫర్నిచర్ మాటలు వచ్చాయి. "నేనేమి కొన్నా.. వాటిని ఇండియా తీసికెళ్ళటం ఎంత సులువో చూసి మరీ కొంటాను " అని సరిత అన్నారు..

"ఎవరికైనా గిఫ్ట్ లు తీసికెళ్ళటానికా? యిక్కడ నుంచి ఫర్నిచర్ తీసికెళ్ళటం ఎందుకు? అక్కడ ఇండియా లో దొరుకుతాయి కదా?" అడిగాను.

"గిఫ్ట్ లు కాదు.. మాకు.. మేము ఇండియా వెళ్ళిపోతాం కదా అప్పుడు యిక్కడ కొన్న వన్నీ తీసికెళ్ళిపోతాం " చెప్పారామె.

"ఇండియా వెళ్ళిపోతారా? ఎందుకు?" అడిగింది నా ఫ్రెండ్ రజని.

"శ్యామ్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కడే అబ్బాయి.. మా పేరెంట్స్ కి నేనూ పెద్దమ్మాయిని.. కనుక మాకు మా పెద్దవాళ్ళతో వుండాలని కోరిక " చెప్పారు సరిత.

"ఓ.. మీ పెద్దవాళ్ళు వచ్చేయమంటున్నారా?" అడిగాను.

"వాళ్ళు రమ్మని చెప్పరు.. కానీ వాళ్ళకి మనసులో అదే కోరిక వుంటుంది కదా.. మాకే వాళ్ళని ఒదిలి వుండ బుద్ది కాదు. కేవలం డబ్బు కోసమే వచ్చాం. శ్యామ్ US వచ్చి 4 సంవత్సరాలైనా.. పెళ్ళయ్యేంత వరకూ గ్రీన్ కార్డ్ కి అప్లై చేయలేదు అందుకే"

"అదేమిటీ?" సందేహంగా అడిగాను.

"అవును.. తనకి గ్రీన్ కార్డ్ వుంటే.. ఆ చేసుకున్న అమ్మాయి మళ్ళీ ఇండియా వెళ్ళటానికి ఒప్పుకోదు.. తనకి తన పేరెంట్స్ ని ఒదిలి వుండటం యిష్టం లేదు. నేనూ ఇండియాలో వున్న వ్యక్తి నే చేసుకుందాం అనుకున్నాను. మా పెళ్ళికి ముందు.. నా కండీషన్ అదే. నేను ఎప్పటికీ US వుండటం సమస్యే లేదన్నాను. తనకి కావల్సినదీ అదే.."

బాగుంది.. అభిప్రాయాలు కలవటం అంటే యిదేనెమో.

నేను యిక్కడ కెనడా ఇమ్మిగ్రేషన్ కి అప్లై చేస్తున్నపుడు మా నాన్నగారు ఒద్దని నన్ను బ్రతిమాలటం గుర్తుకి వచ్చింది. నేను యిక్కడ వుండాలని నిశ్చయించుకోవటానికి వేరే కారణాలు వున్నాయి. కానీ వీళ్ళిద్దరినీ చూసి.. అమ్మ, నాన్నల ప్రేమ కన్నా.. నా నిర్ణయాలూ.. ఆశయాలూ గొప్పవా అనిపించింది. శ్యామ్, సరితలకి మనసు చెప్పిన విధంగా వెళ్ళే ధైర్యం వుంది.. నాకెప్పుడు వస్తుందో ఆ ధైర్యం !!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.