పెద్దయ్యాక నేనేమవుదామనుకున్నాను? - SKU
ఈ పేజీ ని పంపండి

చిన్నప్పుడు ఎప్పుడైనా యిక్కడకి వస్తానని అనుకున్నావా? ఈ మధ్య నా ఫ్రెండ్ విజయ అడిగింది. "నేనేమి అవ్వాలనుకున్నాను?" ఆలోచిస్తే ఒక్కటి కాదు చాలా జవాబులు గుర్తొచ్చాయి. యిన్ని అవ్వాలనుకున్నానా అని నేనే ఆశ్చర్య పోయాను.

నేనే కాదు, ప్రతీ వారూ వయసు తో పాటు తమ ఆలోచనలు, ఆశలూ మారటం గమనించే వుంటారు. నా విష్యానికి వస్తే...

మరీ చిన్నపిల్ల గా వున్నపుడు త్వరగా పెద్దవ్వాలని అనుకున్నాను.. స్కూల్ కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం వుండదని... ఆ రోజుల్లో కాలేజ్ కి వెళ్ళి చదివే వాళ్ళు మా యింట్లో ఎవరూ లేరు.. మా యింట్లో అద్దెకి వున్న వాళ్ళ అమ్మాయిల్లా చదువు అయిపోయి.. యింట్లో వుండి .. సినిమా కబుర్లో , చింతపిక్కలాటలో మా అమ్మమ్మ తో అడుకుంటూ వుండేవాళ్ళని చూస్తే.. లైఫ్ అంటే యిదీ ... పెద్దవగానే యిలాగే వుంటాను అనుకున్నాను.

చిన్నప్పుడు స్వీట్లు తెచ్చిపెట్టమని రోజూ వేధిస్తుంటే మా నాన్నగారు ఊరించారు.. పెద్దయ్యాక ఒక స్వీట్ల షాప్ అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తాను.. రోజూ నీకు కావల్సినన్ని స్వీట్లు అని! కనుక మా ఊరు కాకినాడలో ని కోటయ్య కాజాల షాప్ లో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసేసుకున్నాను.. పెద్దయ్యాక పెళ్ళి చేసుకుంటానని!.. తర్వాత కొన్ని నెలలకే కాజాల మీద మోజు పోయింది.. ఆ అబ్బాయి మీద కూడా! అదృష్టవంతుడు.. ఎక్కడ వున్నాడో!!

చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే పిచ్చి. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి, టికెట్లు దొరకకపోతే అక్కడ వున్న గేట్ కీపర్లని చూసి అనుకునేదాన్ని. ఎంత అదృష్టవంతులు! చక్కగా ఏ సినిమా అయినా ఎన్ని సార్లయినా చూడచ్చు. అయితే యిలా గేట్ కీపర్ యినా కావాలి, (కానీ అప్పుడొక అనుమానం ఆ పని మగవాళ్ళే చేస్తారెమో అని!) లేకపోతే ఆ పని చేసుకునే వ్యక్తిని చూసుకోవాలి అని! మరి ఆ రోజుల్లో ఏ గేట్ కీపరూ నచ్చలేదనుకుంటా.. ఆ విష్యం తొందర్లోనే మర్చిపోయాను.

మొదటిసారి నన్ను బయటి వాళ్ళు పెద్దయ్యాక నేనేం అవుతానని అడగటం.. 10 క్లాసులో.. మా మేధ్స్ సార్ అందర్నీ అడిగారు.. మేమేం అవాలనుకుంటున్నామో చెప్పమని.. దాదాపు అంతా డాక్టర్ అని చెప్పాం.. ఒక్క అబ్బాయి తప్ప ! భావన్నారాయణ అనే అబ్బాయి "పెద్దయి.. రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ ని పెళ్ళి చేసుకుంటాను " చెప్పాడు .. అతన్ని క్లాసు లో ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.. చాలా నెమ్మది అయిన అబ్బాయి.. యిలా బాంబ్ పేల్చే సరికి.. మొత్తం క్లాసంతా స్టన్ అయిపోయాం.. అతనికి అప్పటి నుంచీ బోల్డు అటెన్షన్!

తర్వాత కాలేజ్ లో చేరినప్పుడు.. ఏక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చూసి పోలీస్ అవుదామనుకున్నాను.. కనీసం N.C.C. కి కూడా సెలెక్ట్ కాలేదు.. (నేను కేవలం 5 అడుగులు అందుకని!!) పోనీ డిటెక్టీవ్ అవుదామనుకున్నాను.. ఎందుకంటే.. బోల్డు డిటెక్టీవ్ సినిమాలు చూశాను , చేజ్ నవలలు చదవటం మొదలు పెట్టిన రోజులు.. మంచి థ్రిల్లింగ్ గా వుంటుంది ఆ పని అనుకునేదాన్ని అప్పుడు. ఇంటర్ లో వుండగా ఒక 1, జనవరి పార్టీ కి నన్ను వెళ్ళనీయలేదు మా అమ్మగారు.. ఎందుకో శిక్ష గా.. అంతవరకూ మా ఫ్రెండ్స్ పార్టీలని వేటినీ కాదనలేదు.. పైగా.. వాళ్ళతో వుండి కాస్త చదువు మీద ధ్యాస అయినా పెరుగుతుందని (నా ఫ్రెండ్స్ అంతా బాగా మేధావులు లెండి!) నా ఫ్రెండ్స్ ని బాగా ప్రోత్సహించేవారు మా అమ్మగారు. పార్టీ కి వెళ్ళద్దొనే సరికి విపరీతమయిన కోపం వచ్చింది .. ఏం చేయాలీ.. అని పైన మేడ మీద ఒక్కదాన్నీ కూర్చుని ఆలోచించి.. లేదు.. చచ్చిపోవాలి అనుకున్నాను.. కానీ భయ్యం! ఆఖరికి.. ఒక మొండి బ్లేడ్ (దానికి పదును అంతగా లేదని నిర్ధారించుకుని) తీసుకుని.. రెండు చేతుల మీదా నరాలు కోసుకున్నాను.. సినిమాల్లో చూపించినట్టు.. రక్తం ధారలుగా కారలేదు.. ఇదెంటబ్బా.. అని మరింత లోతుగా కోసుకోవటానికి ప్రయత్నించి.. నాకు చచ్చిపోయేందుకు ధైర్యం లేదని గ్రహించాను.. కనుక ఎన్నో రిస్క్ లు వున్న డిటెక్షన్ లాంటి పనులకి మనం పనికి రాము అని నిర్ధారణకి వచ్చేసాను.

ఇంటర్ రెండో సంవత్సరం లో వుండగా.. నా ఫ్రెండ్ ఒకమ్మాయిని మా క్లాస్ మేట్ ఒకబ్బాయి చాలా చీప్ గా ఎదో కామెంట్ చేశాడు. నాకు పిచ్చ కోపం వచ్చి అతనిని నా నోటికి వచ్చిన తిట్లు అన్నీ నడి రోడ్డు మీద అతన్ని తిట్టాను.. దానికి అతను మర్నాడు నా దారి కాచి తనకి సారీ చెప్పకపోతే.. తన తడాఖా చూపిస్తానని బెదిరించాడు.. నా ఫ్రెండ్ అతనితో గొడవ ఎందుకు.. వెళ్ళి సారీ చెప్పేసేయి... మళ్ళీ యింట్లో తెలిసిందంటే.. మొత్తానికి చదువు మానిపించి మూల కూర్చోపెడతారు.. అని పోరింది.. తప్పని పరిస్థితి లో.. (నా ఫ్రెండ్ నాతో మాట్లాడటం మానేస్తానని బెదిరించింది..) వెళ్ళి అతనికి సారీ చెప్పాను .. కానీ కోపం.. ఉక్రోషం.. అవమానం .. ఎలా అతని మీద పగ తీర్చుకోవాలి అని అతి తీవ్రంగా ఆలోచించాను.. అప్పుడు నా ఇంకొక ఫ్రెండ్ ని అడిగాను... ఆమె.. కొంత ప్రేమ లో విఫలమై.. తన మావయ్య మీద పిచ్చ కోపం మీద వుంది.. నా బాధ విని.. "మనిద్దరం.. వెళ్ళి నక్సలైట్లలో కలిసిపోదాం.. మనకి ఒక తుపాకీ ఇస్తారు ఇంచక్కగా.. అప్పుడు.. ఆ తుపాకీతో.. మా మావయ్యనీ.. నీ గూండా క్లాస్-మేట్ గాడినీ .. అందరినీ కాల్చి పారేద్దాం.. " చెప్పింది. ఐడియా బాగానే అనిపించింది. ఆమె ని అందుకు ఎవర్ని కలవాలో ఆలోచించమని కూడా చెప్పాను. ఆమె మళ్ళీ ప్రేమలో పడటం వలన ఆ ఐడియా ఒదిలేసింది.. నాలో కూడా.. కొంత ఆవేశం తగ్గిపోయింది.

కార్తీక్ సినిమా ఘర్షణ విడుదల అయింది. నేను ఇంటర్ లో వుండగా.. అతన్ని ఎలాగైనా సరే పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. అతని కోసం ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో చదవటం మాని మరీ ఆ సినిమా చూశాను. తర్వాత యింకొక క్రొత్త హీరో ఎవరో పాప్యులర్ అయ్యారు.. కార్తీక్ చెరిగిపోయారు.!

కొంత పెద్దరికం వచ్చాక శివ సినిమా చూశాను. అప్పటికి.. పెళ్ళి ఒక్కటే పరమావధి కాదు.. నేనూ ఎదో సాధించాలి అన్న నిజం తెలుసుకున్నాను. సినిమాలంటే చిన్నప్పటి నుంచీ పిచ్చి. ఆ సినిమా ని డైరెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ టెక్నిక్ ఎంతగానో నచ్చి, ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరటానికి హైదరాబాదు పారిపోదామని చాలా రోజులు తీవ్రంగా ప్లాన్లు వేసాను. (యిప్పటికీ ఆ కోరిక వుంది)

సింధూరం సినిమా చూశాను. అప్పటికి నేను నక్సలైట్ల గురించీ, వాళ్ళ పోరాటం గురించీ పేపర్లలో రాసే ప్రతీ వార్తనీ చదువుతున్న రోజులు.. అందులోని "పారాహుషారైన పాట " అనే పాటని కొన్ని వేలసార్లు విని, విన్న ప్రతీ సారీ వారి ఉద్యమం లో చేరాలీ అన్న కోరిక మరింత బలీయమై , వాళ్ళని ఎలా సంప్రదించాలి అని దారులు వెతికాను. కానీ ఒక ఫ్రెండ్ చేసిన హితబోధల వల్ల ధైర్యం చేయలేక పోయాను.

పెళ్ళి వయసు వచ్చాక.. ఏమీ వద్దు.. ఆదర్శ వంతమైన భార్య లాగ వుండి, మా అమ్మగారి లాంటి ప్రశాంతమైన జీవితం చాలు అనుకున్నాను.

యింతలో కంప్యూటర్ కోర్సుల్లో చేరాక.. మరియూ కొన్ని కారణాల వల్లా, ఆ ఆశలూ, ఆలోచనలూ అన్నీ మారాయి.. నేనూ నా రంగంలో ఎదో ఒకటి చేయాలన్న కోరిక మొదలైంది. అనుకున్నది అక్కడ ఇండియాలో సాధించ లేనెమో అన్న అనుమానంతో అవకాశాలు వెతుక్కుంటూ యింత దూరం కెనడా వచ్చాను. యిక్కడ యింకా కొత్త కలలు కంటున్నాను. తీరుతాయా.. లేక మారుతాయా? చూద్దాం!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.