సైడ్ వాక్ మీద డ్రైవింగ్! - SKU
ఈ పేజీ ని పంపండి

ఎప్పటి నుంచో మా అనిత, నేను కలిసి డ్రైవింగ్ క్లాసులు తీసుకుందామని ప్లాన్లు వేస్తున్నాము కానీ మాకు ఇక్కడ కెనడాలో కారు అంత అవసరం లేదు. పైగా కారు వుంటే ఎక్కడకో అక్కడకి వెళ్ళటం అదో క్షవరం! చక్కగా నెలకి వంద డాలర్ల తో పని గడిచిపోతోంది కదా! ఇండియా నుంచి తిరిగి వచ్చాక అప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాను. కానీ నేను ఉద్యోగం మారటం వలన రోజూ 5 గంటలు రైళ్ళలో గడపవలసిన పరిస్థితి వచ్చింది. అదీనూ కాక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వుంటే కారు కొనే టైముకి కాస్త insurance తగ్గుతుంది అని ఫ్రెండ్స్ సూచించిన మీదట కారు డ్రైవింగ్ నేర్చుకోవటానికే నిశ్చయించుకున్నాను.

ఇండియా లో వుండగా స్కూటర్ నడిపేదాన్ని. కానీ 4 చక్రాల బండి అంటే చెప్పద్దూ కొంచెం భయమే! అప్పుడు ఎవరైనా కారు గురించి అడిగితే..

"ఆ.. కారులో అయితే నేను వేసుకున్న డ్రెస్ ఎవరికీ కనిపించదు.. అదే స్కూటర్ అయితే.. Zip.. Zap.. Zoom అంటూ వెళ్ళనూ వచ్చు.. అంత ఖర్చు పోసి కొన్న బట్టలు నలుగురూ చూసినట్టూ వుంటుంది" అని వితండవాదం చేసేదాన్ని. భయం అని చెప్పటానికి చిన్నతనం వేసి! ఆ భయాలన్నీ ఒక సంఘటన వలన శాశ్వతంగా మదిలో నిలిచిపోయాయి.

కెనడా వచ్చాక ఒకసారి Go-carting కి వెళ్ళాను. అంటే అదొక మినియేచర్ రేస్ వంటిది .. కార్లే, కాకపోతే కొంచెం చిన్నవి.. మేక్సిమమ్ 40 kmph తో నడవగలిగేవి నడుపుతామన్నమాట! ఆ రేసులో మొత్తం 16 మందిలో 16 వ స్థానం లో వచ్చిన ఘనత నాదే! ఇంత గౌరవం దక్కటానికి కారణం నెమ్మదిగా వెళ్ళటం కాదు.. నా ప్రక్కన వున్న దాదాపు ప్రతీ కారునీ ఢీ కొట్టడం, అక్కడి అటెండెంట్ ని గుద్దేసినంత పని చేసినందువల్ల.

"ఇంతకు ముందు ఎప్పుడైనా కారు డ్రైవ్ చేసావా?" మొదటి రోజు నా instructor అడిగారు. అతను Guyana లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి.. పేరు సింగ్.

"లేదు" చెప్పాను.

"గుడ్.. అదే మంచిది.. కన్ఫ్యూజన్ వుండదు" ధైర్యం చెప్పి మొత్తం కారులో ముఖ్యంగా తెలుసుకోవలసిన కంట్రోల్స్ అన్నీ వివరించి.. "దా.. రంగంలోకి దూకు!" అన్నారు!

"ఏంటీ.. అప్పుడేనా.. 2nd క్లాసు నుంచీ నడుపుతా.. " భయంగా చెప్పాను.

"మరేం ఫర్లేదు.. నేనున్నాగా.." అబ్బే ప్రాణం మీద అస్సలు భయం లేదు! నేనంత భయపడుతున్నా స్టీరింగ్ నాకప్పగించేసారు!

మొత్తం 10 క్లాసులు పేకేజ్ తీసుకున్నాను. మరి నామీద నాకున్న నమ్మకం అటువంటిది! 25 గంటలు థియరీ క్లాసులు వింటే సర్టిఫికెట్ వస్తుంది. అది వుంటే insurence కి డబ్బులు ఆదా చేసుకోవచ్చు. కనుక క్లాసులు వినటం బోర్ అయినా దానికీ డబ్బులు కట్టాను. మొత్తం $320 డాలర్లు ఫీజు.

2 క్లాసులు అయ్యాక డ్రైవ్ చేయటం అంటే భయం నాకు పోయింది. మా instructor కి భయం పట్టుకుంది. నేను వెళ్ళే విపరీతమైన వేగం.. నేను మధ్య మధ్యలో ఆబ్సెంట్ మైండెడ్ గా చేసే ఘోరమైన పొరపాట్లు.. అంటే చూసుకోకుండా లేన్ మారటం, రెడ్ సిగ్నల్ దగ్గర ఆగకపోవటం చూసి ఇంక నసగటం మొదలెట్టారు. దానితో.. ఆయన్ని చూస్తే శల్యుడు లా అనిపించేవారు. నెమ్మదిగా వెళ్తే మినిమమ్ లో వెళ్ళటం లేదు అనేవారు.. స్పీడ్ గా వెళ్ళితే నువ్వేమన్నా రేస్ లో వున్నావా అని సతాయించేవారు.

"చూడు! నా క్లాసుల ఆఖరి రోజున ఎదో McDonald's ట్రక్ చూసుకొని దానికి పెట్టేస్తాను!" కసిగా అనుకునేదాన్ని. కానీ పాపం ఆయన నా మంచి కోరి చెప్తున్నారని ఏమాత్రం అనుకోలేదు.

ఇంక ఆ థియరీ క్లాసులు! ఆదివారం ప్రొద్దుట 10 గంటల నుంచీ మధ్యాహ్నం 2.00 గంటల వరకూ వుండేవి. రోజంతా పోయినట్టు అనిపించేది. బుద్ధిగా క్లాసులు చెప్పకుండా కుళ్ళు జోకులు వేసేవారు! నాకు కితకితలు పెట్టుకున్నా నవ్వు వచ్చేదికాదు.. చిరాకు వేసేది.. నిద్ర వచ్చేది.. నన్ను ఒదిలేసి నా ఫ్రెండ్స్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని తలచుకుంటే కోపం వచ్చేది. నట్టుతూ మొత్తానికి క్లాసులు అవగొట్టాను. నా డ్రైవింగ్ ప్రతిభ నాతో చేరిన మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ కధలు కధలుగా సింగ్ చెప్పారు. నాకూ తెలుసు.. చాలా ఘోరంగా డ్రైవ్ చేస్తున్నానని.. కానీ ఎంత ప్రయత్నిచినా అదే నా బెస్ట్!

* * *

టెస్ట్ రోజు వచ్చింది. ఒకో టెస్ట్ కి మళ్ళీ $80 డాలర్లు కట్టాలి. నేను నాకు కావలసిన తేదీ నిర్ణయించుకోవటం వలన ఇంకొక $50 డాలర్లు ఎక్కువ! టెస్ట్ సెంటర్ దగ్గర పరీక్షకి వాళ్ళు తీసుకెళ్ళే దారిలో ఒక పసుపు లైన్ చూపించి చెప్పారు సింగ్ ..

"ఎట్టి పరిస్థితిలోనూ ఆ పసుపు లైను దగ్గరగా ఆగొద్దు. అందరిదీ దాదాపు అక్కడే తప్పుతుంది".

"ఇదెదో లక్ష్మణ రేఖ లా వుందే!" అనుకున్నాను. టెన్షన్ పడకుండా చూసుకుంటే చాలు .. అది వస్తేనే కొంచెం ఇబ్బంది! అనుకున్నా నాగురించి నేను.. నా ఎగ్జామినర్ కోసం కార్లో వెయిట్ చేస్తూ.

పరీక్ష మొదలైంది. సింగ్ చెప్పిన లక్ష్మణ రేఖ దగ్గరకి వచ్చాను. దూరం! అన్నారు.. సరే, దూరంగానే కారాపాను. అక్కడ అదెదో దాదాపు U - Turn లా వుంది! ఎవరో ముదుసలి జంట వచ్చారు. వాళ్ళని వెళ్ళనివ్వటం కోసం ఆగాను. నా ఎగ్జామినర్ ఖుషీ అయిపోయారు.. "considerate to pedestriants" అనో పొగడ్త రాసేసారు. వాళ్ళని వెళ్ళనిచ్చాక.. నేను తిరగ వలసిన మలుపు చూస్తూ.. కారుని సైడ్-వాక్ ఎక్కించేసాను!!!

నేను నడుపుతున్నది ఒక బుజ్జి కారు. నా ఎగ్జామినర్ ఆజానుబాహుడు. కారు సైడ్-వాక్ నుంచి తను నడవవలసినది రోడ్ మీద అని గుర్తించి క్రిందకి ఒక ఉదుటున రావటం లో అతని తల వెళ్ళి కారు టాప్ కి కొట్టుకుంది.

"నువు వెళ్ళాల్సింది రోడ్ మీద అనుకుంటా?!" నెత్తి మీద బొప్పి కట్టిందెమో తడిమి చూసుకుంటూ అన్నారు.

వెటకారమేమిటీ.. నాకూ తెలుసు ఆ సంగతి! అయిపోయింది. మన కధ ముగిసిపోయింది. నాకు నా టెస్ట్ రిజల్ట్ తెలిసిపోయింది. అది తెలిసి అప్పుడైనా హాయిగా టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయవచ్చు కదా! ఆహ! ఎందుకు వచ్చిందో విపరీతమైన టెన్షన్ వచ్చింది. కాలు బ్రేక్ నొక్కుతోంటే ఏక్సిలరేటర్ రైజ్ అవుతోంది.. ఎదురుగా సిగ్నళ్ళు ఏ రంగో తెలీట్లేదు.. అసలు చుట్టు ప్రక్కల అంతా ఒక బ్లర్ ఇమేజ్ లా అయిపోయింది. ఎదో గొణుగుతున్నారు అతను! ఏమీ నా చెవి దాకా రావట్లేదు..

"అవునూ.. సీట్ బెల్ట్ పెట్టుకున్నానా?" అనుమానం వచ్చి.. చూసుకున్నాను. అదేమిటీ అసలు కాళ్ళకి బ్రేక్ గానీ ఏక్సిలరేటర్ గానీ అందటం లేదు?? ఇంకా ఎంత సేపు డ్రైవ్ చేయాలి? అయ్యో!! చూసుకోలేదు! ఎదురుగా రెడ్ లైట్ వుంది.. నేను వెళ్తున్నది 60 లో.. ఆగలేను.. దేవుడా.. ఏదీ దారి? గట్టిగా బ్రేకులు వేద్దామంటే.. కాళ్ళు అసలు బ్రేక్ దగ్గరే లేనట్టు వుంది! నా ఎగ్జామినర్ తన కాళ్ళ దగ్గర వున్న బ్రేక్ వేసి కారు ఆపాడు.

"అంత రాష్ గానా వెళ్ళటం??" కోప్పడ్డాడు. కుడి వైపు టర్న్ తీసుకోమని చెప్పారు. అతను చెప్పటం ఆలశ్యం.. వెళ్ళిపోబోయాను.. మళ్ళీ బ్రేక్స్ వేసి ఆపారు..

"కేర్ ఫుల్! కార్లు వస్తున్నాయి" రెండో మందలింపు అయింది. కానీ.. నాకు తెలుసు.. నేను క్షేమంగా ఇంటికి వెళ్ళలేనెమో అని భయం! ఇద్దరం కలిసి కారుని తీసికెళ్ళి pedestriants నడిచే తోవకి అడ్డంగా ఆపాము. పాపం అతనిని ఎందుకు లెండి ఈ పాపం లో ఇరికించటం.. తప్పంతా నాదే!

"డ్రైవింగ్ లైసెన్స్ కన్నా ముందు ట్రాఫిక్ టికెట్ వచ్చేలా వుందే!" అనుకున్నాను. నా అదృష్టం బాగుంది. ఆ సెంటర్ లో హిడెన్ కెమెరాలు లేవు.

నాకు దారి సుగమమవగానే మళ్ళీ కారుని ఆశ్వనీ గుర్రాన్ని ఉరికించినట్టు ఉరికించాను. దానితో కారు చిన్న సైజు భూకంప బాధితురాలిలా గోల చేసింది. నా ఎగ్జామినర్ లో మొట్టమొదటిసారిగా భయచిహ్నాలు కనపడటం మొదలెట్టాయి. టెన్షన్ వల్ల నేను సరైన విధంగా ఆలోచించే పరిస్థితిలో లేనని గ్రహించారు.

"నేను డ్రైవ్ చేయనా?" అడిగారు.

"No.. I can manage!" బింకంగా చెప్పాను.

అక్కడొక మాల్ పార్కింగ్ లాట్ వుంది. దానిలోకి కారుని పోనీయమన్నారు.

"ఇప్పుడు పార్కింగులు చేయమంటాడా ఏమిటి కొంపతీసి.. తిన్నగా నడపటానికే దిక్కు లేదు.. పార్కింగొకటా.. ఎన్ని కార్లని స్మాష్ చేసి పారేస్తానో.. దేవుడా!!" అనుకుంటూ అందులోనికి పోనిచ్చాను.

"నువు వుండవలసినది కుడి వైపు కదా? ఇలా వున్న కాస్త జాగా ఆక్రమించేసుకుంటే వచ్చేవాళ్ళు ఎలా వస్తారు?" అడిగారు.. నేను పట్టపుటేనుగులా అక్కడి దారి మధ్యలో వెళ్ళటం చూసి.

"ఎటువైపు నడపాలి??" ఒక చవటాయి ప్రశ్న వేసాను.. ఏం మాట్లాడుతున్నానో.. ఆలోచించకుండా.

"అదేమిటీ? నువు అసలు రోడ్ లెసన్లు తీసుకున్నావా?" ప్రశ్నించారు అనుమానంగా.

తీసుకున్నానన్నట్టు తలూపి నా డ్రైవింగ్ మీద ఏకాగ్రత పెట్టాను. కానీ ఆయనకి నామీద ఇంక నమ్మకం పూర్తిగా పోయింది. నేనింకొక్క క్షణం స్టీరింగ్ వెనుకాల.. రోడ్డు మీద వుంటే.. జరగరానిదెదో జరిగిపోతుందని ఆయన కి అనిపించినట్టుంది.. ప్రక్కనే వున్న టెస్ట్ సెంటర్ లోకి పోనీయమన్నారు... ఇంక పార్కింగ్ చేయమనకుండానే!!

నెమ్మదిగా కారుని ఆపాను..

అతను ఎదో అనటానికి నోరు తెరిచారు.. నేను చేసిన తప్పుల చిట్టా విప్పటానికి అనుకుంటా..

"నాకు తెలుసు.. సైడ్ వాక్ ఎక్కించేసినప్పుడే నా టెస్ట్ అయిపోయిందని.. ఇక్కడి వరకూ ఎలా వచ్చానో నాకే తెలీదు.." అతని ముందు కాళ్ళకి బంధం వేస్తూ అన్నాను.

"I know.. నీ వంటి వాళ్ళని రోజూ బోల్డు మందిని చూస్తూవుంటాం.. అయినా.. ఆ టర్నింగ్ కొంచెం టఫ్. బాగా practice చేసి మళ్ళా రా." నా ఫాక్ట్స్ షీట్ అందిస్తూ చెప్పారు.మళ్ళీ వచ్చేవారం నా రెండో ప్రయత్నం.. ఈసారీ అతనే నా ఎగ్జామినర్ అయితే.. నాతో కారు ఎక్కుతారంటారా???

* * *

ఆ ముచ్చటా తీరింది. నా రెండో ప్రయత్నం కూడా అయింది. ఏంటీ ఎమైందీ అని అడుగుతున్నారా?? కధ మామూలే.. తప్పింది :-( చెప్పాలంటే ఇది మరొక విషాద గాధ!!!

ఈ సారి నా పాత ఎగ్జామినర్ రాలేదు.

"ఇతను మంచోడు.. ఈ సారి తప్పకుండా గట్టెక్కేస్తావు" సింగ్ ఆఖరి నిమిషంలో వచ్చి నా చెవిలో ఊదారు. మళ్ళీ ఆ లక్ష్మణ రేఖ దగ్గరకి వచ్చాను. ఈ సారి అస్సలు సైడ్-వాక్ మీదకి వెళ్ళకూడదు.. రోడ్డు మీద "మాత్రమే" కారుని నడపాలి అని గట్టిగా నిర్ణయించుకుని వున్నాను కదా.. అక్కడ దారి క్లియర్ గా కనిపించింది.. ఎవరూ రావట్లేదు. కుర్బ్ ని కాకుండా రోడ్డు మధ్యలో చూస్తూ జాగ్రత్తగా కారుని నడిపించాను..

"hurrey!!!! నా అతిక్లిష్టమైన పరీక్ష నెగ్గాను.. " అనుకున్నాను.

అయినా పరీక్ష తప్పాను..

ఎందుకంటే..

సైడ్-వాక్ ని తప్పించాలన్న ఆత్రంలో స్టాప్ - సైన్ చూడలేదు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.