దేసెలు - SKU
ఈ పేజీ ని పంపండి

మా గుజరారీ రూమ్మేట్ ప్రతిరోజూ ఎడాపెడా గుజరాతీ వంటకాలు వండి పడేస్తోంది. చెప్పొద్దూ భలే రుచిగా వుంటాయి తన వంటలు. అస్సలు పొగడకపోతే మళ్ళీ వండదెమో అని డబల్ పొగడి తనని మెప్పించటానికి ప్రయత్నిస్తూవుంటాను. ఈ మధ్య ఒకసారి "దక్షిణాది వంటకాలు ఎప్పుడైనా తిన్నావా?" అని అడిగాను తనని.

దానికి వెంటనే "మీ దోసెలు చాలా ఇష్టం నాకు" అని చెప్పింది.

"ఓస్ దోసెలు.. అంతే కదా.. నాకు చెయ్యటం వచ్చు." గొప్పగా చెప్పాను.

మా వినీ, ప్రశాంతి ల పుణ్యమా అని దోసెలు చింపకుండా తీయటం నాకు ఇక్కడ కెనడా వచ్చాక వచ్చింది.

"అదేమిటీ అదేమన్నా బ్రహ్మవిద్యా?" అని అనుకుంటున్నారు కదూ?

"బ్రహ్మ విద్యా?!" అన్న తేలిక మాట వెళ్ళి మా అమ్మగారి దగ్గర అనండి తెలుస్తుంది అది బ్రహ్మవిద్యో కాదో! మా చిన్నప్పుడు అంతా దాదాపు దోసెలు మాట వింటే వులిక్కిపడుతూ పెరిగిన అనుభవం మాది మరి!

కధ చెప్పటానికి రంగం సిద్ధం చేసాను అని అర్థం అయింది కదూ? కధ కాదు లెండి!

* * *

మా ఇంట్లో చెప్పటానికి వంట చేసేది మా అమ్మగారు అయినా, మా నాన్నగారు, అమ్మమ్మ back seat cooking చేసేవారు. "back seat cooking?" అని క్వచ్చన్ మార్కు ఫేసు పెట్టారా? దీనిని ఇంచు మించు back seat driving అనే మాట అర్థం లో చదూకోండి.

నాన్నగారిది గట్టుపెత్తనం! మధ్య లో అటూ ఇటూ తిరుగుతూ వంటింట్లోకి వచ్చి, అమ్మ మేము లేదా, అమ్మ అమ్మమ్మ వంట మెనూ డిస్కస్ చేసుకుంటుంటే తన అమూల్యమైన సలహాలు ఇస్తూ వుంటారు.

అయ్యగారికి అన్నీ పెద్ద పెద్ద కోరికలు! మచ్చు కి ఒకటి.. "ఈ ఆదివారం గోధుమ హల్వా చేసుకుంటే ఎలావుంటుందీ?" అంటారు తీరిగ్గా TV చూస్తూ.

"చేసుకుంటే" అన్న మాట విని ఆయన ఎదో వచ్చి చేతులు విరగ నొప్పులు పుట్టించే గోధుమ పాలు తిప్పుడు కార్యక్రమం లో ఏమన్నా సాయం చేస్తారెమో అని పప్పు లో కాళ్ళు వేయకండి! ఆయన కనీసం ఇక్కడ గిన్నె అక్కడ పెట్టరు. కానీ ఆ కోరిక తీర్చకపోతే మాత్రం తెగ సాధిస్తారు!

ఇంక అమ్మమ్మ.. ఆవిడ ఒక perfectionist! అమ్మ "కట్టె, కొట్టె, తెచ్చే" టైపు వంటకత్తె. కనుక అన్నీ పద్ధతిగా ప్లాన్ చేసుకొని చకచకా చేసిపడేస్తుంది. కానీ అమ్మమ్మ అలా కాదు చిన్నప్పుడు తను ఎలా చేసిందో అలా ప్రతీదీ కుంపటి మీద చేస్తే తప్ప ఈ గాసు స్టౌ ల మీద చేస్తే రుచి రాదు అన్న అభిప్రాయం తనది.

అమ్మ పాపం తనకి కష్టం అయినా సరే, ఇద్దరినీ సాధ్యమైనంత సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. కానీ తనలో ఒక దుర్గుణం వుంది.. తన వంటని విమర్శిస్తే తను విమర్శించాలి తప్ప మాలో ఎవ్వరికీ ఆ వంటని విమర్శించే హక్కు లేదు అనుకుంటుంది!

ఎంత కష్టపడినా దోసెలు చెయ్యటం దగ్గర మాత్రం ఎందుకో ఫెయిల్ అయేది అమ్మ ఎప్పుడూ. ఎవరింట్లో అయినా రేకుల్లాంటి దోసెలు తింటే, "నువ్వెప్పుడూ చెయ్యవ్" అని అమ్మ ని సాధించేవాళ్ళం. దాని వలన వచ్చే అనర్థాలు అర్థం కాని రోజుల్లో!

"నాకు దోసెలు చేయటం రాదు బాబూ!" అని సవినయంగా ఒప్పేసుకునేది అమ్మ.

వెంటనే అమ్మమ్మ వుంటే కామెంటేది.. "ఎందుకు రాదూ? శుభ్రంగా పిండి సమపాళ్ళల్లో కలిపి సరిగా కాలిస్తే ఎందుకు రావు దొబ్బిడయా?"

ఈ ఒక్క ముక్క చాలు అమ్మ లో పౌరుషం పెంచటానికి. వెంటనే తరువాతి రోజో, లేక వారం వున్న రోజో మొదలు పెట్టేది దోసెల కార్యక్రమం. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది వుంది. మరి పిండి లోపమో, మా ఇంట్లో పెనం లోపమో తెలీదు కానీ దోసెలు వెయ్యటం బానే వుండేది కానీ తీసేటప్పుడు ఆ పెనం ఒదలి రానవేవి ఆ దోసెలు! దానితో ఒక్క దోసె కుడా పూర్తి గుండ్రటి ఆకారం లో వచ్చేది కాదు.

పిండి లోపం అంటే, మా ఇంట్లో చాలా వరకూ బజారు లో పిండి లు కొనము. అన్నీ పప్పులు కొనుక్కుని, ఇంట్లో పిండి ఆడుకోవటమే. దానిని తీసుకెళ్ళి పిండి మర లో మర పట్టించటం కూడా చేయరు. మా పాత సుమీత్ గ్రైండర్ లో ఏదన్నా పిండి చేయటమే! మరి ఆ పిండి మెత్తగా వచ్చేది కాదెమో! అమ్మ మాత్రం ఏం చేస్తుంది?

ఒకో దోసె అలా చిరిగిపోతుంటే, ఇక్కడ అమ్మ అసహనం కూడా proportionate గా పెరిగిపోయేది. ఆ అసహనం లో అమ్మని చూసే మేము భయపడేది. పెద్దది అమ్మమ్మ ని ఏమీ అనలేదు. నాన్నగారినీ సాధించటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇంక మిగిలినది మేము పిల్లకాయలం. మా మీద తన కోపం చూపించేది. విసుక్కునేది మమ్మల్ని. కొండొకచో ఆ పెనం కాస్తా flying saucer అయేది. (మా మీద కాదండోయ్.. సింక్ లోకి!) అప్పుడు మేము కుక్కిన పేనుల్లా వెళ్ళి TV కట్టేసి, కూర్చుని క్లాసు పుస్తకాలు తెరిచేవాళ్ళం.

ఇంక పెద్దయ్యాక అమ్మ ఎప్పుడన్నా దోసెల కార్యక్రమం మొదలుపెడితే నేనూ, మా సుజీ ఒక ఎగ్రిమెంట్ కి వచ్చాము. అప్పటికి అక్క పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు ప్రమాద సంకేతాలు మొదలయినా, ఎవరు దానిని మొదట గమనించినా, రెండోవాళ్ళని హెచ్చరించాలి అని! అంటే, నేను బయట నుండి అప్పుడే వచ్చాననుకోండి.. మా సుజీ గుమ్మం లోనే నుంచుని, నేను నా సన్నీ లోపల స్టాండ్ వేయక ముందే, "అమ్మ దోసెలు వేస్తోంది" అని చెప్పేది.

"మళ్ళీ..." అని నేను నా మాట పూర్తి చేయనక్కర్లేదు.. నాకు అర్థం అయిపోయేది. మా సుజీ అసలే భలే నెగోషియేటర్. అదే వచ్చి గుమ్మం లో నుంచుని చెప్తోంది అంటే ఎదో పెద్ద ప్రమాదమే అని అర్థం అయిపోయి, సన్నీ వెనక్కి తిప్పి మళ్ళీ ఊరు మీద పడేదాన్ని. అలాగే నేనూ దానిని రాబోయే ఆపద నుండి రక్షించేదాన్ని. అమ్మ కోపం లో వుంటే కాస్సేపు మేమెవరం కనపడకుండా, విసిగించకుండా వుంటే తనే చల్లారిపోయేది.

అప్పట్లో Non-stick pan లు వచ్చాయి ఇండియాల్లో. నాన్నగారిని పోరి ఒకటి కొనిపించాము. అమ్మ అలా దోసెల గురించి తన handicap గురించి తెగ బాధ పడటం చూసి మేమూ బాధపడి. కానీ మా నాన్నగారు, అమ్మమ్మ వున్నారే.. ఇద్దరూ ఇద్దరే! వాళ్ళిద్దరే, మా అమ్మగారి కష్టాలకి కారణం! (అంటే మేం పిల్లకాయలు కాదని కాదనుకోండి!)

అమ్మమ్మ కి ఇత్తడి పెనం మీద వేసిన రుచి అనిపించలేదు ఈ non-stick పెనం మీద దోసె. ఇంక నాన్నగారికి నూనె లేకుండా చేసిన దోసె రుచి అనిపించలేదు! ఆయనకి ఆ పెనం మీద దోసె కాలిస్తే, నూనె లేకుండా కాలుతుంది అని వాదించేవారు.

* * *

కొసమెరుపు ఏమిటంటే, నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక లక్ష్మి వారం టిఫెన్ ఏం చేయాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు నేను దోసెలు చేస్తాను అని చెప్పాను. కానీ మా సుజి దోసెలు ఒద్దంటే ఒద్దు అని నన్ను చెయ్యనివ్వలేదు.

ఎందుకంటారా? నాకూ మా అమ్మగారి టెంపరు వచ్చింది. (లేదులెండి.. ఆ విషయం లో అమ్మ కి నాలుగు ఆకులు ఎక్కువ చదివాను) "అమ్మ చేతిలో దోసెలు పాడు అయితే, కేవలం శబ్దాలు వచ్చేవి.. నువ్వు సురేకారానివి.. ఏం చేస్తావో ఏమో.. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఏ మినపరొట్టో తిననివ్వు తల్లీ" అని చెప్పి నన్ను ఆపింది!

అన్నట్టు మా రూమ్మేట్ కి చేసిన దోసెలు మాత్రం బానే వచ్చాయి సుమండీ!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.