పరాయి దేశానికి ఊడిగం చేయటం దేనికోసం? - SKU
ఈ పేజీ ని పంపండి

గతవారం ఎవరో నాకు మైల్ రాశారు. నీ సైట్ ని దేశానికి అంకితం యిచ్చేముందు నిన్ను నీవు భారతదేశానికి ఏం నేను ఏం చేస్తున్నాను అని ప్రశ్నించుకో.. నువు వెళ్ళి ఎలాగూ పరాయి దేశానికి ఊడిగం చేస్తున్నావు.. మిగిలిన వాళ్ళని కూడా ఆ పని చేయమని ఎందుకు ఎగదోస్తావు? ఇక్కడ విద్యని పొంది, ఆ విద్యని మాతృదేశం కోసం ఏవిధంగానూ ఉపయోగించక.. వేరే దేశంకోసం ఉపయోగించటానికి సిగ్గుగా లేదా? మళ్ళీ నేను భారతీయురాలిని అని చెప్పటం ఒకటా? భారతదేశంలో అందరూ నీలా ఆలోచించి స్వార్థం విడవక దేశం కోసం త్యాగాలు చేయకండా వుండి వుంటే.. మనం ఇంకా పరాయి పాలనలోనే వుండి వుండేవాళ్ళం.

ఈ మైల్ చదవగానే.. ఎన్నో ఆలోచనలు నా మనస్సులో మెదిలాయి. నేను ఇండియా లో వుండి వుంటే.. నేనూ బహుశా ఇలాగే మాట్లాడి వుండేదాన్ని ఇండియా వదలి వచ్చిన వాళ్ళ గురించి. ఇక్కడకి వచ్చాక నా అభిప్రాయాలు మారిపోయాయని కాదు.. కానీ నా ఆలోచనా సరళి తప్పకుండా మారింది. కొంత ప్రాక్టికాలిటీ అలవడింది.

ప్రతీ మనిషిలొనూ వుండాల్సినది తన జన్మ భూమి పట్ల ఒక కృతజ్ఞత, కొంత బాధ్యత. నేను ఒక్కదాన్నీ నా దేశం గురించి ఆలోచించటం మానేసి ఇక్కడ కెనడానే నా దేశం అని అనుకోవటం వలన భారత దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ భారతదేశం వదిలి యిక్కడ ఆర్థికంగా స్థిరపడిన ప్రతీ వ్యక్తీ తన జన్మభూమి పట్ల తమ బాధ్యత విస్మరించక అక్కడ ఎదో ఒక రకంగా పెట్టుబడి పెడితే మన దేశానికి అది ఎంత లాభకరంగా వుంటుంది? మీరే ఆలోచించండి.

ఇక్కడ చాలా మంది భారతదేశానికి డబ్బులు పంపించాలంటే hawala ఏజంట్ల ద్వారా డబ్బులు పంపిస్తారు. దానివలన వారికి వచ్చే లాభం ఒక వెయ్యి డాలర్లకి 2 లేక 3 వేలు. సాధారణంగా ప్రతీ వ్యక్తీ తన ఒక్కడి వల్లా దేశానికి అయే నష్టం పెద్ద గొప్పది కాదు అన్న ఉద్దేశ్యంతో తనకి వచ్చే లాభం గురించే ఆలోచిస్తారు. కానీ తనలాగే ఆలోచించే మిగిలిన భారతీయులంతా కలిసి ఈ విధంగా చేయటం వలన సంఘ వ్యతిరేక శక్తులని ప్రోత్సహిస్తున్నారు, మన దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారు. అది వారికి తెలియదా? కాని వారికి సంబంధించినంత వరకూ ఆ పని చేసేది తమ మధ్యలో వ్యక్తి, తమకి తెలిసిన వ్యక్తి.. తను కష్టపడి సంపాదించిన దానికి మంచి రేటు యిస్తున్నాడు.. ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఒక భావం. ఇక్కడి భారతీయులు దానాలూ ధర్మాలూ చేయక్కర్లేదు.. తన వాళ్ళకి పంపించే డబ్బుని.. చట్టబద్దంగా పంపించితే చాలు దేశానికి ఎంతో ఆర్థిక చేయూత యిచ్చిన వాళ్ళు అవుతారు.

ఇంక ఇక్కడ ఎవైనా కొనేటప్పుడు ఎక్కడైనా భారతీయ ఉత్పత్తులు కనిపిస్తే వెళ్ళి వాటిని కొనటం ద్వారా భారత దేశ ఎగుమతులు అభివృద్ది చెందేలా చేయవచ్చు. తమ ఆర్థిక పరిస్థితి బాగా వుంటే చదువుకోలేని పరిస్థితిలో వున్న అనాధనో.. లేని వారి బిడ్డనో చదివించే బాధ్యత తీసుకోవచ్చు. ఒక మనిషి భవిష్యత్తు మన వలన బాగుపడుతోంది అంటే ఆ ఆనందం ఎంత సంతౄప్తిని ఇస్తుంది!

మా మావయ్యగారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. నా చిన్నప్పుడు ఆయన ఒకసారి భారత దేశంలో తయారయిన మనం నిత్యం వాడే ఉత్పత్తుల జాబితా ఒకటి మాకు అందచేసి సాధ్యమైనంత వరకూ వాటిని వాడి భారతీయ ఉత్పత్తులకి చేయూత నివ్వమని కోరారు. మా అక్క, అమ్మగారు వాటిని పాటించటం నాకు తెలుసు. నేను నెలకొకటి కొనే టూత్ పేస్ట్ ని కొనటానికి భారతీయ ఉత్పత్తి ని ఎంచుకోవటం వల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా.. ప్రతీ భారతీయుడూ ఆవిధంగా చేయటం వలన పరిస్థితిలో వచ్చే మార్పుని ఊహించండి.

మేము చేసేదానికన్నా ఇంకా కొన్ని మంచి విధానాల ద్వారా మన దేశం పట్ల మన కృతజ్ఞతని చూపించవచ్చు.. కానీ భారత దేశానికి ఉపయోగపడాలన్న కోరిక, ఆ భావం ఒకటి మన మదిలో వుంటే.. ఎక్కడ వున్నా.. ఏ దేశానికి సేవ చేస్తున్నా మనం మన దేశం కోసం పాటు పడతాం.

పిడీకిలి బిగించి భారీ డైలాగులు చెప్పినంత మాత్రాన మనకి దేశభక్తి వున్నట్టా? కారణాలు ఏమైనా కానీయండి.. jews తమ పద్దతికి తగినట్టుగా వున్న వస్తువునే కొంటారు, తిండినే తింటారు.. బట్టనే కడతారు.. వార్తలే వింటారు. మిగిలినవాటిని వేటినీ కన్నెత్తి చూడరు. మనం వారిలా భారతీయత లేని వాటిని బహిష్కరించనక్కర్లేక పోయినా.. భారతీయ వస్తువులని, భారత దేశాన్నీ ఏవగింపుతో చూడకుండా వుంటే అదే పదివేలు!

ఇంక పైన email లో ఆయన అన్న వేరే వాళ్ళని ఎగదోయటం విషయానికి వస్తే... మనం ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించవలసిన అవసరం వుంది. భారతదేశంలో చదువుకుని విదేశాలకి వస్తున్న అందరూ భారతదేశం తిరిగి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంటే.. వారికి అందరికీ అక్కడ తగిన అవకాశాలు వున్నాయా? ఒక ఉద్యోగం వుంటే.. దానిని చేరటానికి రిజర్వేషన్లు, రికమండేషన్లు, పోటీ, ప్రతిభ ఇన్ని అడ్డంకులు. వాటిని ఛేదించుకొని ఆ పీఠం ఎంత మంది ఎక్కగలరు? (నేను రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.) అన్నీ సవ్యంగా జరిగి ఉద్యోగం వస్తే.. వచ్చే జీతం ఎంత? అక్కడ సంవత్సరం ఉద్యోగం చేసి సంపాదించి వెనకేసేది ఇక్కడ ఒక నెలలో వెనకేయవచ్చు. తను బాగుపడి, తన వాళ్ళని బాగుచేస్తే అంతకన్నా కావలసింది ఏముంది?

ఇది ఉద్యోగం దొరికిన వాళ్ళ పరిస్థితి. మరి ఉద్యోగం దొరకని వాళ్ళు ఏం చేస్తున్నారు? M.Sc లు చదివి ప్యూన్లు గా చేస్తూ.. అదీ దొరకక పోతే సంఘ విద్రోహ శక్తులు గా మరుతూ.. లేక డిప్రెషన్ కి లోనౌతూ.. తనకీ, తన వాళ్ళకీ అంతులేని బాధని కలిగించటం బాగుంటుందా? అలా చేస్తే వారివల్ల దేశం వరకూ ఎందుకు.. కనీసం వారిని కన్న వాళ్ళకైనా ఏమైనా ఉపయోగం వుందా?

అందరూ అలా అవ్వరు.. కానీ కనీసం నేను అలా అయి వుండేదాన్ని.. ఎందుకంటే.. నాకు వున్న మానసిక స్థైర్యం అనండి లేక వికాసం అనండి అంత మాత్రమే. నాకు గుర్తు వుంది.. ఇండియాలో వుండగా కనీసం 2 సార్లు నక్సలైట్లలో చేరే ఆలోచన చాలా తీవ్రంగా చేసాను. అప్పుడు నా ఆశల మీద కానీయండి, జీవితం మీద కానీయండి.. నా సమర్థత మీద కానీయండి.. పడిన దెబ్బలకి ఏమైనా చేసి వుండేదాన్ని.. నా అదృష్టవశాత్తూ నాకు సకాలంలో brain wash చేయటానికి మా అమ్మగారు, ఒక friend వుండబట్టి సరిపోయింది. నేను సరైన నిర్ణయం తీసుకోగలిగాను. ఎంతమందికి తమని సక్రమమైన మార్గంలో నడిపించ గలిగే వారు వుంటారు?

భారతదేశంలో అవకాశాలు దొరకని ప్రతీ వారూ వేరే దేశానికి వెళ్ళగలరా? అలా వెళ్ళగలిగిన ప్రతివారికీ ఇక్కడ జీవితం ఒడ్డించిన విస్తరా? దేశం ఒదిలి వచ్చిన ప్రతీ వ్యక్తీ తను పుట్టిన ఊరు, పెరిగిన పరిసరాలు, తన వారు, తనది అన్న ప్రతీదాన్నీ ఒదిలి వచ్చి ఇక్కడ తన జీవనపోరాటం తో పాటు ఒంటరితనంతో కూడా పోరాడటం లేదా? ఇక్కడ ఒక్కరూ.. తెలియని చోట ఒంటరిగా.. తమ పాట్లు తాము పడుతున్నారు తప్ప.. అక్కడ వున్న చాలా మందిలా ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ.. అవకాశాలు రాకపోతే.. అవకాశాలు కల్పించాలి, హక్కులు రక్షించాలీ అంటూ ఏ ఆందోళనలూ చేయట్లేదే!

నేను నా site లో కెనడాలో అవకాశాలు గురించి చెప్పటం.. కేవలం ఇక్కడికి వద్దామనుకుంటున్న వారికి ఇక్కడి వివరాలు చెప్పటం కోసమే. సమాచారం తెలియక పోవటం వలన.. దళారుల చేతుల్లో మోసపోయి, అనవసరంగా బోలెడు డబ్బు ఖర్చు పెట్టీ.. వారు నష్టపోకూడదనే నేను ఆ వివరాలు చెప్తున్నాను. నేను గొప్ప పని చేయకపోయినా.. చెడ్డ పని మాత్రం చేయట్లేదు. దానికి సాక్ష్యం.. రోజూ నాకు మరిన్ని వివరాలు చెప్పమని అడుగుతూ వచ్చే e-mails.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.