నోస్టాల్జియా - సరిపల్లి రత్న
ఈ పేజీ ని పంపండి

అందరి కబుర్లూ వింటుంటే ముచ్చటేసి, నావి కూడా చెప్పుకుందామని అనిపించింది. నాకు అంత బాగా రాయటం చేతకాదు కానీ చెప్పకుండా ఉండలేకున్నా.

మాది కూడా వైజాగ్. ఎవరైనా వైజాగ్ కబుర్లు చెప్తే నాకు నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి.

నాకు ఆరు ఏళ్ళ వయసులో అనుకుంటా మొదటి దొంగతనం మొదలెట్టా. మా అమ్మగారికి పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు, ముఖ్యం గా స్కూల్ కి వెళ్ళేటప్పుడు అనే రూల్ ఉండేది. చిరుతిళ్ళు అలవాటు అవుతాయనో లేక డబ్బులు ఖర్చు చేస్తారని భయమో మరి. నాకు మాత్రం మిగతా వాళ్ళ లాగ చక్కగా బయట కొనుక్కుని తినటం మహా ఇష్టం. అయితే ఒక రోజు core ice (crushed ice with colored sugar water) తినాలని చాలా అనిపించి, అమ్మ గూట్లో దాచిన చిల్లర దొంగతనం చేసాను. హాపీ గా ఆ రోజు స్కూలు కి పోయి ఇంటర్వెల్ లో బేకర్ (ఐస్ బండి వాడి పేరు) ఓ core ice ఇవ్వు అని చాలా ధీమా గా చెప్పాను. రంగు రంగులు వేసి ఇచ్చాడు. ఇంక చూసుకోండి లొట్టలు వేసుకుంటూ తింటున్నా.

ఏ మూల నుండీ చూసాడో, మా పక్కింటి రమేష్, వాడికి తెలుసు మా అమ్మ డబ్బుల రూల్! ఆ రోజు సాయంకాలం వాడూ హేపీ గా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. మా ఇంటికి వచ్చి, "ఆంటీ ఈ రోజు మీ అమ్మాయి core ice తింది, నేను చూసా" అని ఆగలేక కక్కేసాడు.

మా అమ్మకి ఇంకో రూల్ ఉంది. "దండం దశగుణ భవేత్" అని. విషయం తెలిసిన మరుక్షణం లో చీపురు నా వీపున పడింది. రమేష్ గాడికి సంతోషమూ నాకేమో చీపురు దెబ్బలూనూ.

* * *

దెబ్బలు తిన్నా ఇంకా సిగ్గు రాలేదండి. అయితే ఈ సారి దొంగతనం కాదు లెండి, ఒక పెద్ద ప్లాన్ వేసా. ఈ సంఘటన జరిగినప్పటికి నాకు సుమారు పన్నెండు ఏళ్ళు ఉండవచ్చు. మా అమ్మ నన్ను AT college నుండి Forth Catholic Girls School అని ఒక కాన్వెంట్ లోకి మార్చింది. పక్క వాటా లో ఉన్న పిల్లల్ని చూసి. పక్క వాటా లో జైనులు ఉండేవాళ్ళు. అందులో సునీత నా క్లాస్. వాళ్ళ చెల్లి అనిత కి అప్పుడు ఏడెనిమిది ఏళ్ళు ఉండవచ్చు. ఇద్దరూ కాశ్మీర్ ఏపిల్ పళ్ళలా ఉంటారు. మేము ముగ్గురం డాబా గార్డెన్స్ లో బస్ ఎక్కి, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర మా స్కూల్ కి వెళ్ళి, సాయంత్రం తిరిగి కలిసి వచ్చేవాళ్ళం.

ఇంతకీ ప్లాన్ ఏంటంటే, ఒక రోజు లంచ్ అవర్ లో బయటకి వెళ్ళాం. సునీత తో చెప్పా.. మన ఇల్లు చాలా దగ్గరే, బస్ వాడు రోజూ మనని చుట్టి తిప్పి తీసుకెళ్తాడు, నాకు దగ్గరి దారి తెలుసు, సాయంత్రం నడిచి వెళ్దాం అన్నా. బహుశా ఒక పన్నెండు మైళ్ళు ఉంటుంది ఏమో, సునీత పాపం నా మాటలు నమ్మి, సరే అంది.

ఆహా టికెట్ డబ్బులు మిగులు అని ఆనందం గా ఉన్న డబ్బులుతో, ఎంత. ఒక అర్థరూపాయేమో, చక్కగా ఊర పెట్టిన ఉసిరి కాయలు, తాటి తాండ్ర (చేదుగా తియ్యగా చాలా బాగుంటుంది), ఇంకా జామ కాయ ఉప్పు కారం బాగా దట్టించి, కొనుక్కుని పండగ చేసుకున్నా. అన్నీ తినేసి క్లాస్ కి పోయి సాయంత్రం నాలుగు కి ఆఖరి పిరియడ్ బెల్ కొట్టగానే, సునీత, అనిత, నేను ఇంటికి పయనం సాగించాము. సాయంత్రం అయిదున్నర కి ఇల్లు చేరుకున్నాము. కాళ్ళు నొప్పి అని మూలుగుతూ ఒక మూల కూర్చున్నాను.

మా అమ్మ ఆవలిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం, "ఏంటే లేట్?" అని అడిగితే, "ఆ.. స్కూల్ లో ఏదో స్పోర్ట్స్ వున్నాయి" అని ఒక కధ చెప్పాను.

పక్కింట్లో సునీత, అనిత కాళ్ళు కందిపోయి, నిజం చెప్పేసారు, నడిచి వచ్చాము అని. దానికి వాళ్ళ అమ్మగారు (వాళ్ళ ఇంట్లో ఎక్కువ రూల్స్ లేవు) పాపం అని నేను ఎలా ఉన్నానో చూడటానికి మా ఇంటికి వచ్చి, మా అమ్మ చెవిలో విషయం ఊదారు.

ఓహో అని విషయం గ్రహించిన మా అమ్మ, ఆంటీ వెళ్ళగానే నాకు వీపురు తో చేసిన సన్మానం గురించి మీకు నేను వివరించనక్కర్లేదు అనుకుంటా!!!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి సరిపల్లి రత్న కి తెలియచేయండి.