పవర్ కట్! - SKU
ఈ పేజీ ని పంపండి

గురువారం ఆఫీసులో ఎదో టెస్టింగ్ చేస్తున్నాం. ఏదీ సరిగ్గా కుదిరి చావటం లేదు. చెడ్డ చిరాగ్గా వుంది. Client దగ్గర వున్న నా కొలీగ్ అస్తమానూ ఫోన్ చేసి సతాయిస్తున్నాడు. నాకు కూడా ఏమీ తోచటం లేదు.. ఇక్కడ పని చేస్తున్న కోడ్ అక్కడకి వెళ్ళేసరికి ఏం తెగులు వచ్చింది? అని విసుగ్గా వుంది. ఇంకా గంటన్నర వుండాలి! ముందురోజు ఇదే సమస్య తో రాత్రి పదిన్నర దాకా పని చేసాము. ఇవాళ కూడా అలా అర్థరాత్రి వరకూ పని చేసే ఓపిక లేదు.. ఇలా ఇన్ని తలలో తిరుగుతుండగా టపక్కున కరెంటు పోయింది!

"పీడా పోయింది!" అనుకొని బాధ్యత కనుక మా కొలీగ్ కి ఫోన్ చేసాను ఏమన్నా అవసరం వస్తే నా సెల్ కి ఫోన్ చెయ్యమని చెప్పటానికి. చూస్తే.. అతనికి అక్కడ కూడా కరెంటు పోయింది అని తెలిసింది.

నాకు తెలీకుండానే ఒక విజిల్ వేసి, మా బాస్ కి చెప్పాను.. "అక్కడ client దగ్గర కూడా కరెంట్ లేదుట" అని.

మరి కొంత సేపట్లో మొత్తం డవున్ టౌన్ అంతా కరెంట్ లేదని తెలిసింది. "ఏమయిందో!" అనుకుంటూ "సరే నేను పక్కన వున్న స్నాక్ బార్ కి వెళ్తున్నా.. పది నిమిషాల్లో వస్తా" అని పక్క డస్క్ అమ్మాయికి చెప్పి, అదే విషయం ఎవరన్నా నా డెస్క్ దగ్గరకి వస్తే తెలియటానికి నా కంప్యూటర్ కి ఒక స్లిప్ మీద రాసి అంటించి బయలుదేరాను.

బయట చూస్తే, భీభత్సం.. కార్లూ హారన్లూ.. ప్రతీ వాళ్ళూ ఎదో ప్రపంచం అంతమై పోతున్నట్టు.. ఈ క్షణమే తమ వాళ్ళని ఆఖరి చూపు చూసుకోవటానికి పోవాలన్నట్టు పరుగులూ ఉరుకులూ, పెడుతున్నారు. తమ దారికి అడ్డం వచ్చిన వాళ్ళ మీద నిరభ్యంతరం గా honk చేస్తున్నారు. మా కెనడా లో honk చేయటం చాలా అమర్యాదకరమైన చర్య గ భావిస్తారు! మర్యాదస్తులు మరి!

చూస్తే, మా స్నాక్ బార్ లో కూడా కరెంట్ లేదు. "ఏమయింది?" అడిగాను అక్కడ ఎప్పుడూ నాతో సోది కొట్టే శ్రీలంక అబ్బాయిని. "అమెరికా లో ఎదో ప్లాంట్ లో పేలుళ్ళు ఎవో అయ్యాయిట. దాని కోసం మన nuke ని ఆపేసారుట". చెప్పారు.

అప్పుడు తెలిసింది ఇదెదో కొంచెం పెద్ద విషయమే అని. 30 డిగ్రీల ఎండ. మనం ఇండియా లో 40+ డిగ్రీలు చూసిన గట్టి పిండాలం.. కనుక అదెదో పండువెన్నెల అన్నట్టు నెమ్మదిగా ఆఫీసుకు నడిచి వచ్చాను. గుమ్మం దగ్గరే కనబడ్డాడు మా బాస్.

"ఎక్కడకి పోయావ్ సూర్యా? మనం వెంటనే ఇక్కడ ఖాళీ చేసేయ్యాలి. కమాన్.. త్వరగా నీ స్టఫ్ తెచ్చుకో" అన్నారు.

నేను నా స్నాక్ చేతిలోనే పట్టుకొని నా సామాను భుజాన తగిలించుకొని మళ్ళీ కిందకి వచ్చాను. కారు ఎక్కుతూ అన్నారు.. "subways లేవు. బస్ కోసం వెయిట్ చెయ్యకు. cab తీసుకొని వెళ్ళిపో. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వెళ్ళిపో. మనకి కరెంట్ వచ్చేసరికి కనీసం 4,5 రోజులు పడుతుంది." అనేసి నా సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు.

మా సర్గోయ్ ని అడిగాను.. ఏమిటీ.. కరెంట్ పోతేనే ఇంత బెంబేలెత్తి పోతున్నారు? కేండిల్ వెలిగించుకొని పడుకునేదానికి?!" తేలిగ్గా అడిగాను.

అతను రష్యా నుండి వచ్చిన వ్యక్తి. భారత దేశం లో మనంత కాకపోయినా అతనికీ పవర్ కట్ గురించి తెలుసు, అది వచ్చినప్పుడు బెంబేలెత్తకుండా నిబ్బరంగా పని ముగించుకోవటం తెలుసు. నవ్వుకుంటూ ఇద్దరం దగ్గర వున్న బస్ స్టాప్ కి నడిచాం. అతను అక్కడే వున్న తన పాత కొలీగ్ ఆఫీస్ కి వెళ్ళి, వుంటే అతనితో కార్ లో వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.

బస్ స్టాప్ లో నాలుగు రోడ్ల కూడలి లో ఒక సివిలియన్ రోడ్డు మధ్య నుంచొని ట్రాఫిక్ లైట్లు పనిచెయ్యవు కనుక తనే నోటితో విజిల్ వేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ వున్న నాలాంటి చాలా మంది అతన్ని అబ్బురంగా చూస్తూ వుండిపోయాం. అంత ఎండ లో ప్రతీ వాళ్ళూ ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలన్న హడావిడి లో వుండగా అతను ఆగి ఆ బిజీ సెంటర్ లో ట్రాఫిక్ ని నియత్రణ చెయ్యటం చాలా ముచ్చటేసింది.

బస్ వచ్చింది. పూర్తిగా నిండిపోయి వుంది. ప్రతీ వాళ్ళ మొఖం లో ఎదో ఆందోళన. అది చూసిన నాకు మొదటిసారిగా "ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు? నిజంగా నేను కూడా భయపడాల్సినది ఏమన్నా వుందెమో!" అన్న సందేహం వచ్చింది.

నా ప్రక్కన కూర్చున్న అమ్మాయిలు 23, 26 ఫ్లాట్ లలో వుంటున్నారుట. ఇద్దరూ ఇంటికి ఫోన్ చెయ్యటానికి తెగ కష్టపడ్తున్నారు.. లైన్లు దొరకక. ఎవరికీ లైన్ దొరకట్లేదని గ్రహించాను. నా ఫోన్ పని చేస్తోంది. ఆమెని నా ఫోన్ వాడమని ఇచ్చాను. ఆ హడావిడి లో ఫోన్ ప్రోబ్లెం కాదు, నెట్ వర్క్ బిజీ అని ఎవ్వరం గ్రహించలేకపోయాము. ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి నుంచుంది. ఇంకా స్కూలు కి వెళ్తున్నట్టుంది. మంచి హుషారుగా వుంది. సడెన్ గా ఉపన్యాసం మొదలు పెట్టింది ఆమె.

"ఇలాంటి సమయం లో మనకి తెలుస్తుంది.. నువ్వు ఏం వేసుకున్నావు.. ఎంత సంపాదించావు.. ఎక్కడ వుంటున్నావు.. ఎన్ని బెడ్ రూముల్లో దర్జా ఒలకపోస్తున్నావు.. ఎంత మంది బాయ్ ఫ్రెండ్ లని మెయిన్ టెయిన్ చేస్తున్నావు.. ఇవేమీ important కాదు. నిన్ను నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఎలా కాపాడుకుంటావు.. ఇలాంటి పరిస్థితిని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటావు అన్నదే important. ఒకవేళ ఇదే నీ ఆఖరు నిమిషం అయితే, ఎలాగ నువ్వు చేసిన తప్పులన్నిటినీ గుర్తు తెచ్చుకొని భగవంతుడిని ఆఖరి క్షమాపణలు కోరుకుంటావు అన్నదే ముఖ్యము. CN టవర్ మీద సగం దారిలో లిఫ్ట్ లో ఆగిపోతే, అప్పుడు ఏం చేస్తావన్నది ఆలోచించు. వెంటనే భయం తో ఏడుస్తావా లేక ఎలా బయటకి రావాలి అన్న ఆలోచన చేస్తావా? exhibition లో ఎదో ride లో పైకి వెళ్ళి అక్కడ ఆగిపోతే.. అక్కడ వుండి పిచ్చి పట్టినట్టు గావు కేకలు వేస్తావా లేక సాయం అందే వరకూ కాం' గా వుండి పక్కన భయపడుతున్న వాళ్ళకి ధైర్యం చెప్తావా?" ఇవే ముఖ్యం .. ఇలా ఎదేదో చెప్తోంది ఆ అమ్మాయి.

బస్ లో అందరం మాకు తెలీకుండానే ఆమె మాటలని శ్రద్ధగా వినటం మొదలెట్టాం. నవ్వు వచ్చింది. ఆ సందర్భం లో ఇదే కనుక నా ఆఖరి దినం అయితే, ఇంటికి వెళ్ళగానే అమ్మకి ఒక లెటర్ రాయాలి అని అనుకున్నాను. మళ్ళీ వెంటనే, ఇంటికి వెళ్ళే దాకా ఎందుకు.. ఇప్పుడే రాద్దాం అని బేగ్ లో పెన్, నోట్ పేడ్ కోసం చూసాను. కానీ పెన్ కనపడలేదు. ఇండియాలో అమ్మనీ, నాన్నగారిని తలచుకుంటూ.. ఇక్కడ ఇంక ఎవ్వరి మాటలూ వినకుండ నా లోకం లోకి జారిపోయాను.

"ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి?" అన్న ప్రశ్న హఠార్తుగా వెలిగింది. subway లేదు కనుక పూర్తి North వెళ్ళాలి. నేను వుంటున్నది North-East లో. పని చేసేది South-West లో. ప్రస్తుతం వున్నది North వైపు వెళ్తున్న బస్ లో. కనుక ఇలాగే North ఈ బస్ ఎంత వరకూ వెళ్తే అంత వరకూ వెళ్ళిపోయి, East వెళ్ళే బస్ ఎక్కితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నేను వున్న West నుండి East వెళ్ళటానికి చాలా బస్ లు మారాలి. కనీసం 3. (అన్నీ సవ్యంగా జరిగితే!) "అన్నీ అయి ఇంటికి వెళ్ళేసరికి కనీసం 9.00 అవుతుంది" అనుకున్నా. అప్పటికి టైము 4.40

బస్ డ్రైవర్ ని అడిగాను నేను వెళ్ళాల్సిన ప్రదేశానికి ఎలా వెళ్తే మంచిది అని. ఆవిడ ఇంకా North వెళ్తే అస్సలు బస్ లు వుండక పోవచ్చు కనుక ఇక్కడ దిగిపోయి, East వెళ్ళిపోయి, అప్పుడు North బస్ తీసుకోమన్నారు. దిగిపోయాను. బస్ స్టాప్ లో జన ప్రవాహం! టాక్సీ అడిగితే, వంద డాలర్లు ఫ్లాట్ రేట్ అన్నారు డ్రైవర్. "ధారుణం!" అనిపించి, "సరేలే.. ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్తా ఇంటికి నాకోసం ఇంటి దగ్గర బెంగ పెట్టుకొని ఎదురుచూసే వాళ్ళు ఎవరన్నా వున్నారా ఏంటి!" అనుకొని "అక్కర్లేదు ఫొ"మ్మని చెప్పాను.

East వైపు వెళ్ళే బస్ వచ్చింది. అది ఎక్కి ఒంటి కాలు మీద నుంచున్నా. నాలుగు రోడ్లు దాటగానే ఎదో subway లోకి బస్ ని తిప్పి, అక్కడ ఆపేసారు డ్రైవరు. అక్కడ నుండి మరొక East బస్ తీసుకోవాలని ఎవరో చెప్పగా, దిగి ఆ బస్ వెతుక్కుని ఎక్కాను. ఎక్కుతుండగా ఆ బస్ డ్రైవర్ బస్ దిగి వెళ్ళిపోతూ కనపడ్డారు. నాలాగే ఆ బస్ ఎక్కుతున్న ఒకాయన "ఇది East వెళ్తుంది కదా?" అడిగారు.

దానికి డ్రైవర్ "ఏమో.. తెలీదు" అనేసి వెళ్ళిపోయారు.

"అదేమిటీ? తెలియదంటారు?" అయోమయంగా అనుకుంటూ బస్ ఎక్కాం. అప్పటికే బస్ లో ఖాళీ లేదు. జనాలని తోసుకుంటూ లోపలికి నడిచాను.

చేతిలో ఇందాక కొన్న సాన్ విచ్ ఇంకా అలానే వుంది. మధ్యాహ్నం ఈ వర్క్ టెన్షన్ లో వుండి తిండి తినలేదు. నిన్న రాత్రి కూడా లేట్ గా వచ్చి ఇంక వండుకునే ఓపిక లేక మంచినీళ్ళు తాగి పడుకుండి పోయాను. "ఏమిటో నేను తిండి ఆశ్రద్ధ చేసిన రోజే ఇలాంటివి జరుగుతాయి!" ఆశ్చర్యం గా అనుకున్నాను. "పోనీ బస్ దిగి వెళ్ళి స్టేషన్ లో కూర్చుని తిని అప్పుడు వద్దామా?" అనిపించింది.

మళ్ళి బస్ బయట నుంచుని వున్న జన ప్రవాహాన్ని చూసి బస్ దిగే ధైర్యం చెయ్యలేకపోయాను. ఇలా బస్ లో 40 నిమిషాలు మెడలో గుదిబండ లాంటి బేగ్ బరువుతో, వేసుకున్న నైలాన్ బట్టలు చమట కి వంటికి గుచ్చుకుంటుంటుంటే, పక్కన జనాలనుంచీ, నా నుంచీ వస్తున్న చమట వాసనలకి తల అటూ ఇటూ తిప్పి కష్టపడుతూ నుంచున్నాను. నా ప్రక్కన ఒక గర్భవతి పాపం ఏడో నెల అనుకుంటా నుంచున్నారు. ఉట్టప్పుడు అలాంటి వాళ్ళు కనపడితే, కూర్చున్న వాళ్ళు లేచి సీట్ ఇస్తారు. కానీ ఇప్పుడు సీట్ ఇవ్వటం అంటే, తాము ఎంతసేపు నుంచోవటానికి సిద్ధపడటమో అన్న భయం తో ఎవరూ ఆమెని చూడనట్టు, ఎదో వేరే ఆలోచనలో వున్నట్టో, లేక నిద్ర లో వున్నట్టో నటించటం మొదలెట్టారు.

ఇంతలో బయట నుంచున్న వాళ్ళలో ఒకావిడ ఈమె నుంచుని వుండటం చూసి, ఆమె ఎదురుగా కూర్చున్న ఒక మహిళ తో "పాపం ఆమె గర్భవతి కదా.. మీ సీట్ ఇవ్వచ్చు కదా?" అని అడిగారు.

దానికి కూర్చున్న ఆమె ఏం సమాధానం చెప్పాలా అని తడుముకుంటుండగా, ఈమె, "లేదు.. నేను బస్ దిగిపోతున్నాను. ఇక్కడ నుంచోలేను." అని బస్ దిగి వెళ్ళిపోయారు.

ఇంతలో బయట నుండి ఎవరో అరచారు.. దాని సారాంశం.. ఈ బస్ డ్రైవర్ డ్యూటీ అయిపోయింది. తరువాతి డ్యూటీ అతను.. ఎక్కడో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.. కనుక అతను వచ్చేవరకూ ఈ బస్ కదలదు!

సగం మంది ఉసూరు మంటూ బస్ దిగిపోయారు. నేను కూడా!

బయట ఇసక వేస్తే నేల రాలనట్టు జనం వున్నారు. ప్రతీవాళ్ళు బిజీ బిజీ గా తమ సెల్ ఫోన్ లతో కుస్తీ పడుతున్నారు. లైన్ దొరకని వాళ్ళు బూతులు తిట్టుకుంటుండగా, దొరికిన వాళ్ళు మళ్ళీ అవకాశం రాదెమో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతలో మరొక బస్ వచ్చింది. బస్ స్టేషన్ లోకి వచ్చేసరికి పూర్తిగా నిండిపోయి వుంది. నేను మొండిగా ఎక్కాను. వెనక తలుపులు వున్న మెట్ల మీద నుంచున్నాను. మెట్ల మీద మనుష్యులు నుంచున్నంత సేపూ వెనక తలుపులు మూసుకోవు. బస్ ముందుకి కదలదు.

అది గ్రహించి, నా ముందు బేగ్ పాక్ పట్టుకున్న వ్యక్తి ని దాన్ని దించమని చెప్పి, ఆ సందులో నేను దూరాను. పై మెట్టు మీద ఒక కాలు పెట్టే చోటు దొరికింది. రెండవ కాలు పెట్టడానికి చోటు దొరకలేదు. తలుపుల మధ్య వున్న రాడ్ పట్టుకొని బేలన్స్ చేస్తూ మొత్తానికి మెట్టు మీదనుంచి పైకి వెళ్ళాను. తలుపులు మూసుకొని బస్ కదిలింది. టైము 6.00

బస్ ఇరవై నిమిషాలు ప్రయాణించి వేరే subway దగ్గరకి వచ్చింది. బస్ subway లోకి మరలుతుండగా మా బస్ వెనకాల నేను తీసుకోవలసిన తరువాతి బస్ వస్తూ కనిపించింది. ఈ బస్ ఆగీ ఆగటం తోటే, దిగి దాన్ని ఎక్కాను. అప్పటి వరకూ నేను వేసుకున్న ప్లాన్ వేరు. ఈ బస్ దిగగానే North బస్ ఎక్కి, అక్కడ వున్న మాల్ లో కనీసం కేండిల్స్, బ్రెడ్ కొనుక్కుని అక్కడ East బస్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ East బస్ దొరక గానే, వెంటనే దానిని ఎక్కేసాను.

జనాలూ, ఫోన్ సంభాషణలూ అవీ చూసి నవ్వు వచ్చింది. నేను ఇవాళ ఇక్కడ ఎక్కడో చిక్కుకుపోయి, రాత్రంతా ఇంటికి రాకపోయినా ఎవరూ గ్రహించరు! మా ఇంటాయన అనుకుంటాడెమో.. నేను ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో వున్నా అని.. ఆయన తప్ప ఎవరూ ఇక్కడ నా గురించి ఆదుర్థా పడరు.. ఇదేమిటి? స్వేచ్చా లేక ఒంటరితనమా?

బస్ నేను వెళ్ళాల్సిన East-End కి దాదాపు వచ్చేసింది. కేండిల్స్ కొనలేదు. పోనీ కనీసం ఇక్కడ దిగిపోయి, North వెళ్ళిపోతే, అక్కడ ఒక గేస్ స్టేషన్ వుంది. అక్కడ మంచినీళ్ళు అయినా కొనుక్కోవచ్చు షాపు తెరచి వుంటే అని బస్ దిగిపోయాను.

North వెళ్ళే బస్ కోసం మరొక అరగంట ఎదురుచూసి బస్ ఎక్కేసరికి టైము 7.45

ఎక్కడనుండి వస్తున్నాయి ఈ కారులన్నీ? రోజూ ఇంత ట్రాఫిక్ ఎప్పుడూ చూడలేదు? ప్రతీవాళ్ళు బయటే తిరుగుతున్నారా ఏమిటి? బస్ నత్త నడక లాగా నడుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా వాటి దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. కానీ చిన్న చిన్న జంక్షన్ లలో మాత్రం సివిలియన్స్ కంట్రోల్ చేస్తున్నారు.

నేను వెళ్ళాల్సిన North రోడ్ కి బస్ వచ్చేసరికి టైము 8.30 పక్కన వున్న గేస్ స్టేషన్ కి వెళ్ళేసరికి అది కట్టేసి వుంది. లోపక మనుష్యులు వున్నారు. ప్రక్కన కౌంటర్ దగ్గర మనుష్యులు లైన్ లో వుండటం చూసి నేను కూడ వెళ్ళి లైన్ లో నుంచున్నాను. నా వంతు వచ్చేసరికి బేగ్ లో వున్న ప్లాస్టిక్ డబ్బులు కాక వున్న అసలు డబ్బులు లెఖ్ఖ పెట్టాను. 5 డాలర్ల 45 సెంట్లు వుంది. "మంచి నీరా లేక కేండిల్సా?" ఆలోచించి, కేండిల్స్ రెండు, మంచినీళ్ళ బాటిల్స్ అనుకొని అడిగేసరికి అతను "సారీ కొట్టు కట్టేసాము" అన్నాడు.

ఈసురో మంటు "సరే, ఏమవుతే అదే అవుతుందిలే.. ఒక్కరోజుకి చచ్చిపోను!" అని మొండిధైర్యం తో వచ్చి నా ఆఖరు మజిలీ చేర్చే మరొక East బస్ కోసం బస్ స్టాప్ కొచ్చి నిలబడ్డాను.

రోడ్ మీద వెళ్తున్న కారు ఒకటి నా ముందు ఆగి, అందులోని ఆవిడ "ఎవరికైనా East వైపు ride కావాలా?" అని అడిగారు. నేను ఇంకా ఒంట్లో ఓపికతో వున్నా. ఇందాకే స్నాక్ తిన్నాను. కనుక నాకు అక్కర్లేదు అన్నట్టు అక్కడ మిగిలిన వాళ్ళ వైపు చూసాను. అక్కడ వున్న వృద్ధులలో ముగ్గురిని ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి మంచి మనసులని, సాటి మనిషిని కష్టకాలం లో ఆదుకోవాలన్న ఆలోచన కలిగిన వాళ్ళనీ చూసినప్పుడు ఎదో inspirataion వస్తుంది! మానవత్వం మీద నమ్మకం చిగురిస్తుంది!

బస్ కోసం మరొక 15 నిమిషాలు ఎదురుచూసాక నా బస్ వచ్చింది. ఎక్కి, ఇంటికి వచ్చేసరికి 9.15. మా ఇంటి దగ్గర అంతా వచ్చి వీధుల్లో కుర్చీలు వేసుకొని, పక్కవాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వాళ్ళని చూస్తుంటే ఇండియా లో వాతావరణం గుర్తు వచ్చింది. కరెంటు పోయినప్పుడు అరుగుమీద కూర్చుని చెప్పుకున్న కబుర్లు గుర్తొచ్చాయి. ఆ మనసువిప్పి చెప్పుకున్న ఊసులు జ్ఞప్తికి వచ్చాయి. పక్కింటి వాళ్ళతో ఆడిన అంత్యాక్షరి ఆటలు గుర్తొచ్చాయి, TV సీరియల్స్ గురించి చేసుకున్న వాదనలూ, అందులోని కేరెక్టర్ల గురించి ఇచ్చిన జడ్జ్ మెంట్లు గుర్తొచ్చాయి.. మొత్తానికి ఇండియా గుర్తొచ్చింది.. అమ్మ గుర్తొచ్చింది!

నా ఇంటి వైపు నడుస్తుంటే, ఇంటి ఓనర్ ఎదురొచ్చారు.. "సూర్యా కేండిల్స్ వున్నాయా?" అని అడుగుతూ.

"లేవు అనీల్.. కొందామని చూసాను కానీ షాప్ కట్టేసారు" రోజు మొత్తం పడిన అలసట మొఖం లో ప్రతిబింబిస్తుండగా చెప్పాను. ఎక్కడ నుండి వచ్చిందో ఇంతవరకూ లేని ఆత్రం.. వెంటనే వెళ్ళి అలా మంచం మీద వాలిపోవాలన్న ఆత్రం! తిండి, ఏమీ వద్దు.. చల్లటి మంచినీళ్ళు తాగి, కటిక చీకటి అయినా సరే.. అన్నీ మర్చిపోయి నిద్ర ఎప్పుడెప్పుడు పోతానా అన్న ఆత్రం!

"ఆగు..కొన్ని ఇస్తాను" అని వెళ్ళి నాలుగు కేండిల్స్ తెచ్చి ఇచ్చారు. గేస్ స్టొవ్ మీద వంట చేసుకోవచ్చు. వేడి నీళ్ళు వస్తున్నాయి. రేపటికి మరి వేడి నీళ్ళు రాకపోవచ్చు. మంచినీళ్ళు వస్తున్నాయి" నాకు పరిస్థితి update చేసారు.

"థాంక్స్.. ఎప్పటికి వస్తుందో కరెంటు ఏమన్నా తెలుసా?" అడిగాను.

"4 రోజులు అంటున్నారు. నీకేం ఫర్లేదు. మా ఇంటికి డిన్నర్ కి వచ్చేయి. గీత ఇందాక హెవీ డిన్నర్ చేసింది" భోజనానికి ఆహ్వానించారు.

"ఫర్లేదు అనీల్.. నేను బయట తినేసాను." చెప్పి లోపలికి వచ్చాను.

శూన్యం లోకి వచ్చినట్టు చీకటి గదిలోకి వచ్చిన నాకు అంతా నేను అనుకున్నంత శూన్యం ఏమీ కాదు అన్నట్టు హాల్ లో వున్న కుర్చీ ఠపీ మని చిన్న jhalak ఇచ్చి చెప్పింది!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.