KSM రోజులు - సతీష్ నూకల
ఈ పేజీ ని పంపండి

ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఇరగ చదివేసి EAMCET రాసేసి రాంక్ సంపాదించేసి ఎక్కడో REC లో చదివెయ్యాలి అని కోరిక ఉండేది నాకు. కానీ ఏం చేస్తాం? నేను చదివిన చదువుకి REC లో రాలేదు. ఎక్కడో అస్సాం REC లో ఒక సీట్ ఉంది. అంత దూరం ఎందుకు? అనిపించింది. ఇంకేమున్నాయా అని చూస్తే కౌన్సిలింగ్ లో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ లో ఒక్క సీట్ ఉంది మైనింగ్ ఇంజినీరింగ్ లో అన్నారు. ఈ కొత్తగూడెం ఎక్కడ? మైనింగ్ అంటే ఏమిటి అని అక్కడ ఉన్న ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ని అడిగితే ఎదో కొద్దిగా చెప్పారు. మీరు చేసేది ఏముంటుంది? పైన స్విచ్ నొక్కితే భూమి లోంచి బొగ్గు లటక్ మని బయటకి వస్తుంది. మీరు ఉండేది ఫైఫ్ స్టార్ హాస్టల్! ఒక గది లో స్టూడెంట్స్, పక్క గది లో ప్రొఫెసర్లు, ఎటాచ్డ్ బాత్ రూమ్స్! అబ్బో ఇంకా చాలా చెప్పారు. సరే అని రెండు నిమిషాలు ఆలోచించి, డిసైడ్ చేసా. సరే, బొగ్గు వెలికితేద్దాం ఈ జన్మ కి అని! అంటే, చేరిపోయా!

ఇంటికి వచ్చాక మా అమ్మకి చెప్తే, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. "మైనింగ్ ఏంటి?! ఒద్దు, ఆ బొగ్గు గనులు అంటే నాకు భయం" అని. ఏదో సర్ది చెప్పి, ఒప్పించాం.

వినాయక చవితి అయిన మరుసటి రోజు మంచి రోజు! ఆ రోజు కొత్తగూడెం బయలుదేరాలి అని డిసైడ్ చేసాం...

ఆ రోజు రానే వచ్చింది. ఏంటో గ్లాసులూ, ప్లేట్లూ తో సహా చాలా సామానులు మూట కట్టా మోసుకెళ్ళడానికి. పొద్దున అయిదు కి చేరుకున్నాం నేను మా నాన్నగారు కొత్తగూడెం కి. అక్కడ ఒక ఆటో వాడిని "మైనింగ్ కాలేజ్ కి వస్తావా?" అని అడిగితే, 25 రూపాయలు అడిగాడు.

"సరే" అని ఎక్కాం. ఏంటో అలా వెళ్తోనే నుంది ఒక అరగంట! తరువాత "వచ్చింది" అన్నాడు. చూస్తే, ఏంటో తలుపు కి పెద్ద తాళం వేసి ఉంది.

ఒకతను ఎవరో కనపడితే అడిగాము, "మైనింగ్ కాలేజ్ ఇదేనా?" అని.

అతను కొంచెం వివరాలు అడిగి, "మీరు వచ్చింది పోలిటెక్నిక్ కాలేజ్ కి. మీరు వెళ్ళాల్సింది ఇంజినీరింగ్ కాలేజ్! ఆ వచ్చిన దారికి సరీగ్గా ఆపోజిట్ గా వెళ్ళాలి." అని ఆ ఆటో వాడ్ని చివాట్లు పెట్టి, మళ్ళా మా కాలేజ్ దగ్గర దింపమని చెప్పాడు అతను.

సరే మళ్ళా ఆటో ఎక్కితే ఒక గంట సేపు వెళ్ళాక, ఏంటో రోడ్ కి ఎటువైపు చూసినా అడవే! అప్పుడు అనుకున్నా "ఓహో అన్నలు ఉండేది ఇలాంటి ప్రదేశాల్లోనే ఏమో!" అని.

ఆటో వెళ్తోన్నంత సేపూ మా నాన్నగారు ఇలా ఉండాలి, అలా ఉండాలి, బుద్ధిగా చదువుకోవాలి అని చెప్తోనే ఉన్నారు. నాకేమో గుండెల్లో దడ! రేగింగ్ చేస్తారు అని!

సరే వచ్చింది కొత్తగూడెం స్కూల్ ఒఫ్ మైన్స్! ఆటో తిన్నగా హాస్టల్ దగ్గరకి వచ్చి ఆగింది. "ఫైవ్ స్టార్ హోటల్ అన్నారే ప్రిన్సిపాల్ గారు?! ఇక్కడ కనపడదేంటీ?" అని చూసాను. ఒక భూత్ బంగళా లాగ ఉంది! రంగు వెలిసిపోయి! బిక్కు బిక్కు మంటూ నా ఇనప్పెట్టి ని ఆటో లోంచి దింపాను. హాస్టల్ మెట్ల మీద నలుగురు కూర్చొని ఈనాడు పేపర్ చదువుతూనే టీ తాగుతున్నారు. అందులో ఒక వ్యక్తి ఏంటీ.. పెద్ద చెంబు లో టీ తాగుతున్నాడు! చూడటానికి ఆరు అడుగులు పైనే ఉన్నాడు.

వెంటనే వచ్చేసి, "కొత్త ఎడ్మిషనా? రండి రండి" అని మా చేతిలోంచి పెట్టెలు తీసేసుకొని తన రూము లోకి తీసుకుపోయాడు మొదటి అంతస్థు లోకి. అతని వెనకే చాలా మంది వచ్చేసారు ఆ రూం లోకి. ఏంటో "జూ లో కొత్త జంతువు వచ్చింది" అన్నట్టు ఒక్కొక్కళ్ళు రావటం, "ఏం ఊరు? ఏంటి?" అని డీటైల్స్ అడగటం!

ఇంకో అరగంట లో బయట ఇంకో ఆటో వచ్చి ఆగింది. "ఇంకో ఫ్రెషర్ వచ్చాడు" అని అంతా కిందకి పరిగెట్టారు! ఆ వచ్చిన వాడిని చూస్తే "వీడి ఫేస్ ఎక్కడో చూసానే!?" అని కాస్సేపు ధింకితే, అప్పుడు బల్బు వెలిగింది! నిన్న రాత్రి హైదరాబాదు నుండి వచ్చే బస్ లో అతను, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. సూర్యాపేట బస్ స్టాండ్ లో చూసా వాడిని! "వారినీ! నువ్వూ ఇదే కాలేజా?" అనుకున్నా అప్పుడు!

కాలేజ్ లో పనులు అయిపోయాయి. హాస్టల్ లో రూము ఇచ్చారు. నేను, నిన్న రాత్రి బస్ లో నాతో వచ్చినవాడూ ఇద్దరం రూమ్మేట్స్ అని డిసైడ్ అయ్యాం. కానీ వాడికి తెలుగు రాదు! రాజస్థానీ జైన్ అంట. "సర్లే, పర్లేదు" అని అనుకున్నాను.

మా నాన్నగారు, రూమ్మేట్ నాన్నగారు ఆ రాత్రి తిరిగి హైదరాబాదు బయలుదేరారు. వాళ్ళు అలా హాస్టల్ ఒదిలి వెళ్ళారు అంతే, ఏంటో ఒకొక్కడు వచ్చి వింత వింత ప్రశ్నలు! ఇక మొదలు రాగింగు!

ఎప్పుడు వీళ్ళ పెద్దాళ్ళు వెళ్తారా అని వైటింగ్ జనాలంతా! అప్పుడు చూసాను మా రూమ్మేట్ ని! ఆ తరువాత నాలుగు రోజులు వాడి మొఖం కనపడలే నాకు! అసలు నా రూము కే రాలేదు నేను! ఆ హాస్టల్ లో దారి తెలిసేది కాదు! ఎటు వెళ్తే మెట్లు వస్తాయో.. ఎటు వెళ్తే మెన్ హాల్ వస్తుందో.. అంతా అయోమయం అంధాకారం! ఎప్పుడు చూసినా నలుగురు అటూ ఇటూ ఉండి మోసుకొనిపోయేవారు! ఇక ఆ రాగింగ్ వివరాలు చెప్పడం మొదలెడితే నా చేతులు పడిపోతాయండో.. ఒక్క ముక్కలో నా స్టయిల్ లో చెప్పాలంటే.. "వాచిపోయింది!"

ఆ మర్నాడు ఫస్ట్ డే! క్లాసులు మొదలు.

పొద్దున్నే ఎనిమిది గంటలకే పంపేసారు హాస్టల్ నుండి. కొంత మంది సీనియర్ల తో కలిసి కాలేజ్ కి వచ్చాను. అక్కడ ఇంకో ముగ్గురు ఫ్రెషర్లు కనపడ్డారు. అంతా కలిసి మా క్లాస్ రూము లో కూర్చున్నాం. ఇంతలో ఒకతను రబ్బర్ చెప్పులు, మాసిపోయిన బట్టలూ వేసుకొని లోపలకి వచ్చాడు. ఎవడో వర్కర్ ఏమో అనుకున్నాం. చూస్తే ఏంటో డయాస్ ఎక్కి సీరియస్ గా ఏదో చెప్పడం మొదలెట్టారు! కొద్ది సేపటికి అతను చెప్పేది మేధమేటిక్స్ అని తెలిసింది. "ఓహో ఇతను మేధ్స్ చెప్పే ప్రొఫెసరా!?" అనుకున్నాం.

ఒక మూల నిద్ర ముంచుకొస్తోంది. రాత్రి అంతా రాగింగ్ పుణ్యమా అని నిద్ర పోలేదు. సరే లెక్కల క్లాస్ అయ్యాక మేము నలుగురు కూర్చొని పరిచయాలు చేసుకున్నాము. ఇంతలోకి పొట్టిగా ఒకతను క్లాస్ లోకి వచ్చి క్లిష్టమైన ఆంగ్ల భాష లో మాట్లాడుతూ "Holiday - Resnick" అని ఒక పుస్తకం తీసి ఎక్కడో ఎక్కడో విన్న ఫిజిక్స్ గురించి మాట్లాడటం మొదలెట్టారు.

"ఓహో! ఇతను ఫిజిక్స్ చెప్తారా మనకి!?" అనుకొని, సీరియస్ గా వినడం మొదలెట్టా. ఒక్క ముక్క ఎక్కట్లేదు! "వామ్మో ఏంటిది? మంచిగా concentrate చెయ్యాలి" అని ప్రయత్నించాను. లాభం లేదు! క్లాస్ అయిపోయింది, నోట్స్ లో ఏదో రాసా.. ఏంటో అని చూస్తే ఏవో equation లు. కానీ ఏం చెప్పారో బుర్రకి అసలు ఎక్కలేదు.

అప్పుడు అనుకున్నా.. "ఇంజినీరింగ్ అంటే అంత కష్టం ఉంటుందేమో" అని!

అప్పుడు గుర్తొచ్చింది. ముందు రోజు రాగింగ్ చేసేప్పుడు సీనియర్స్ చెప్పారు "ఫిజిక్స్ సార్ చెప్పే నోట్స్ మాత్రం మిస్ అవకూడదు, చాలా టఫ్ గా ఉంటుంది" అని.

నిజమే వాళ్ళు చెప్పింది. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవాలి అని డిసైడ్ చేసుకున్నాను.

క్లాస్ మధ్య లో టైము ఉన్నప్పుడు మేమంతా కలిసి మా సీనియర్స్ నేర్చుకోమని చెప్పిన సాహిత్యం బట్టీ పట్టేవాళ్ళం. మళ్ళా సాయంత్రానికి అవి అప్పచెప్పకపోతే రాగింగ్ ఎక్కువ అవుతుంది మరి!

తరువాత వచ్చారు మా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు.

టిప్ టాప్ గా అరవై ల్లో ఇరవై టైపు మన్మధుడి లా తయారయి నీట్ గా తల దువ్వుకొని ఉన్నారు! రాగానే కాస్సేపు "రాగింగ్ ఏమీ లేదు కదా? హాస్టల్ బాగుందా?" అని అడిగారు.

అన్నిటికీ తల ఆడించాము. ఇక మొదలెట్టారు. "Introduction to Mining" అనే సబ్జెక్ట్. ఒక్క ముక్క బుర్ర కి ఎక్కితే ఒట్టు!

"స్విచ్ నొక్కితే బొగ్గు అన్నారు మరి! ఇదేమిటీ ఈ త్రవ్వకాలు ఏమిటీ? పేలుళ్ళు ఏంటీ? బొగ్గు గని లో నీరు రావడం ఏంటీ? కప్పు కూలిపోవడం ఏంటి? "చావు కబురు చల్లగా చెప్పాడు" అన్నట్టు ఆయనగారు మొదటి రోజే గని ప్రమాదాలు గురించి మాట్లాడారు. "ఒకసారి గని లో నీళ్ళు వచ్చి 375 మంది చనిపోయారు. దాని మీద సినిమా కూడా తీసారు. అదే, "kala patthar" సినిమా" అని చెప్పి బెదరగొట్టారు!

"వామ్మో ఎరక్కపోయి వచ్చానే ఈ మైనింగ్ కి" అనుకున్నా కాస్సేపు!

ఇంతలో లంచ్ టైము అన్నారు. హాస్టాల్ కి వెళ్తే రాగింగ్ ఉంటుంది. ఇక్కడ ఉందాము అనుకుంటే ఒక సీనియర్ వచ్చి "రండి, పోదాం హాస్టల్ కి" అని తీసుకుపోయారు! తీవ్రం గా ఖండించి హాస్టల్ కి వెళ్ళాము. మళ్ళా మామూలే! హాస్టల్ లోకి అడుగుపెట్టగానే ఎదుట పడే వాళ్ళందరికీ, "good afternoon sir" అని సెల్యూట్!

గబ గబా అన్నం తినేసి మళ్ళా వచ్చేశాం కాలేజ్ కి. ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ క్లాస్ అని, కొత్తగా కొనుక్కున్న డ్రాఫ్టర్ చేతిలో పట్టుకొని, దాన్ని చూసి మురిసిపోతూ వచ్చా కాలేజ్ కి. ఇంతలోకి చూడటానికి హిట్లర్ లా ఉన్న ఒకాయన ఏంటో స్పీడ్ గా నడుచుకుంటూ స్టేజ్ ఎక్కేసి మొదలెట్టేసారు క్లాస్.

ఎంత విందాం అని చూసినా అతని మాటల్లో "sssss..shhhh...ssss" అనే శబ్దాలు తప్ప ఏమీ అర్థం కావట్లే! డ్రాఫ్టర్ ఎలా వాడాలో చెప్పారు. మళ్ళా నాకు బౌన్సర్ లు (అదే, నాకు అర్థం కాని విషయాలు) పడ్డాయి. పక్కవాడు ఎలా చేస్తున్నాడో చూసి నేను ఎలాగో ఫిక్స్ చేసాను. మూడు గంటలు సాగింది ఆ క్లాసు!

తెల్ల కాగితం మాత్రం నలుపు చేసాను. క్లాస్ అయ్యాక ఆ ప్రొఫెసర్ గారు నా దగ్గరకి వచ్చి చూసి, "మీరు డ్రా చేసింది ఏంటి?" అని అడిగారు.

"అదేమిటి? అతను బోర్డ్ మీద చెప్పినదే కదా నేను గీసాను?" అనుకున్నాను.

అపుడు తెలిసింది! డయామీటర్ ని సగం చేసి రేడియన్ ఆ సర్కిల్ కొట్టని లని. నేనేమో డయామీటర్ తోటే సర్కిల్ గీస్తే అది నా వైట్ షీట్ బయటకి ఉరికింది! తెల్ల మొఖం వేసాను అతని ముందు! ఒక అయిదు నిమిషాలు చిన్న క్లాస్ పీకి వెళ్ళిపోయారు.

సరే, అంతా సామాన్లు సర్దేసుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ హాస్టల్ కి నడుస్తున్నాం.

మేము ముందు నడుస్తుంటే హాస్టల్ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అని మనసులో అనుకుంటున్నాం. కానీ హాస్టల్ రానే వచ్చింది. ఒకొక్కరి గుండెల్లో దడ! అంతే! లోపలికి అడుగుపెట్టగానే, రకరకాల గోల! ఒకొక్కడినీ తలో మూలకీ పట్టుకుపోయారు. అప్పుడు నేను ఒక వ్యక్తి చేతికి దొరికిపోయాను.

మనిషి చూడటానికి "అంకుశం" రామిరెడ్డి లా ఉన్నాడు! మెడలో ఏంటో విచిత్రమైన హారాలు ధరించాడు! అతని ఆకారం చూస్తే "ఇతను స్టూడెంటా లేక..?" అని అనుమానం! పక్కన ఉన్న వాళ్ళు "ఒరేయ్ ఈ సార్ T-shirt మీద ఏమి రాసి ఉందో చదువు" అన్నారు.

నేను చదవటం మొదలెట్టా "మే డే క్రీడోత్సవాలు.." అంతే, నా చొక్కా పట్టుకొని, చేతిలో పైకి లేపాడు అతను "ఏరా? ఒళ్ళు ఎలా ఉంది?" అని!

అంతే, నా కళ్ళల్లోకి నీళ్ళు గిర్రుమని వచ్చేసాయి! అతని రూము కి తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు. ఆ మనిషి ని చూస్తే చాలు భయం నాకు. కానీ మెల్లగా కొద్దిసేపయ్యాక అర్థం అయింది. చూడటానికే ఇలా ఉన్నాడు, మనిషి చాలా మంచోడు అని.

పాపం! మనసు చాలా మంచిది! తరువాత తెలిసింది, అతను ఫైనల్ ఇయర్, NCC కేండిడేట్ అని! అప్పటి నుండి రెండు రోజుల పాటు అతని రూము లోనే పడుకున్నా. అన్నం తినగానే అతని రూము దగ్గరకు వెళ్ళి నిలబడేవాడిని. "ఏంటోరే.. ఏం కావాలి?" అంటే ఏమీ మాట్లాడేవాడిని కాదు.

అతనికి అర్థం అయింది. పైకి వెళ్తే మా రెండో సంవత్సరం సీనియర్ లు మా టెంకె పేలుస్తారు మరి! పాపం అలాగే అతని రూము లో కూర్చోపెట్టుకొని, పాటలు పాడించి నాతో, అతని నోట్స్ రాయించి, మిగతా ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చి ఆడుకునే వారు నాతో!

కానీ ఆ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలంటే నాకు టెర్రర్! కిందే గడిపేసేవాడిని రోజంతా. ఆ మరుసటి రోజు ఆ NCC సీనియర్ పుట్టినరోజంట! స్వీట్ పేకెట్లు తెచ్చి అతని డెస్క్ లో పెడితే చీమలు పట్టేసాయి. ఆ డబ్బా తెరిచి "ఒరేయ్ ఒక్కొక్క చీమనూ చంపకుండా బయటకి తీసి ఎన్ని చీమలు ఉన్నాయో లెక్క చెప్పు" అన్నాడు.

ఇదేమి విపరీత ఆలోచనరా బాబూ అనుకొని సరే టైము పాస్ చేద్దాం అని అలాగే ఒక మూడు గంటలు కూర్చుని ఏదో లెక్క చెప్పా అతనికి!

"ఇప్పుడు వాటిని ఈ డబ్బా లోకి ఎక్కించు" అన్నాడు.

"నీ బుర్ర కి చెదలు పట్టా!" అని తిట్టుకొని, "అవి పారిపోయాయి సార్" అని సమాధానం చెప్పాను. పాపం అప్పుడు రెండు కళాఖండ్ ముక్కలు పెట్టాడు నాకు!

ఇంతలోకి మా రెండో సంవత్సరం సీనియర్లు నా సంగతి పసిగట్టేసారు. వీడు క్రింద ఉండిపోతున్నాడు అని వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళారు! ఇంకేముందీ.. క్రింద స్వర్గలోకం, పైన నరకం! మళ్ళా వారం రోజులపాటు "వాచిపోయింది!"

మేము ఉన్న పది మంది ఫ్రెషర్స్ లో ఒక ఆరుగురు పారిపోయారు ఇంటికి. మిగిలింది నేను, నా రూమ్మేట్, ఇంకో ఇద్దరు.

ఆ రోజు వినాయక నిమజ్జనం. మా హాస్టల్ వినాయకుడిని భద్రాచలం గోదావరి లో కలిపేందుకు హాస్టల్ జనాలంతా వేన్ లో వెళ్ళారు. హాస్టల్ నిర్మానుష్యం గా ఉంది. అంతే, ఇదే సమయం అనుకొని, బట్టలు సర్దుకొని, మేము నలుగురం చప్పుడు చెయ్యకుండా హాస్టల్ బయటకి వచ్చేసి రోడ్ మీడకి పరుగు తీసాము, వెనక్కి తిరిగి చూడకుండా!

అలా పరుగెత్తి బొగ్గు లారీ ఎక్కి కొత్తగూడెం బస్ స్టాండ్ కి వచ్చేదాకా మా గుండెల్లో భయమే! ఎక్కడ ఈ సీనియర్లు చూసి మళ్ళీ వెనక్కి తీసుకుపోతారో అని! కానీ, ఎవరూ చూడలేదు. అంతే, తెల్లారేసరికి ఇంట్లో ఉన్నాను. మళ్ళా దసరా పండగ అయ్యేదాకా వెళ్ళలేదు.

అలా రెండు సార్లు పారిపోయేలా చేసి, మొత్తానికి డిసెంబర్ లో మాకు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చి రాగింగ్ ముగిసింది అనిపించారు.

ఆ మధుర స్మృతులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఒక్కసారి నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను గడిపిన ప్రతీ రోజూ మరపురానికి మా కొత్తగూడెం హాస్టల్ లో. అదొక స్వర్గం! ఎంత భయపడుతూ అడుగుపెట్టానో, నాలుగు సంవత్సరాల తరువాత అంతకి పదింతలు బాధ తో ఆ హాస్టల్ వదలలేక వదిలి వచ్చాను. "ఇంక మనం ఈ హాస్టల్ ఒదిలి వెళ్ళిపోవాలి కొద్దిరోజుల్లో" అనేసరికి ఏమీ సహించేది కాదు! అన్నం ఒంట బట్టేది కాదు!

ఆ చివరి రోజు మాత్రం.. ఏంటో నా హాస్టల్ రూం ని విడిచి తాళం మా కేర్ టేకర్ కి ఇచ్చేసే సమయం లో, చెప్పలేని బాధ!

అలా ఆ బొగ్గు గనుల కాలేజ్ నుండీ వచ్చి ఈ దేశం లో పడ్డాను. ఇప్పటికీ మా అమ్మ కి చెప్తా.. "ఆ రోజు తిట్టావు.. మైనింగ్ ఎందుకురా? అని అన్నావు. చూడు.. ఇప్పుడు నాకేమయింది? చక్కగా Ph.D చేస్తున్నాను కదా?" అని!

Long live KSM!!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత సతీష్ నూకల కి తెలియచేయండి.