ఆరేసిన బట్టలు.. - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
మొన్న ఒక ఇల్లు చూడటానికి వెళ్ళాము. అక్కడ ఇల్లు అంతా బాగానే వుంది కానీ, ఆ పక్కవాళ్ళు ఏమిటీ అ బట్టల దండేలు అలా ఈ గుమ్మానికి అడ్డంగా కట్టేసారు అని మా అమ్మగారు కామెంట్ చేసారు.

ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటే, Vermont, New Hampshire మరియూ Connecticut రాష్ట్రాలలో జనాలు బట్టలు ఆరుబయట దండేలు కట్టి ఆరేసుకోవటం తమ హక్కు అని దానికి అడ్డు చెప్పే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు అని వాదిస్తున్నారట. ఇండియా లో కూడా బట్టలు ఆరబెట్టుకునే డ్రయర్ లు చాలా మామూలు అయినప్పటికీ, ఏ మాత్రం ఇంట్లో పెద్ద వాళ్ళు వున్నా వాటిని వాడటానికి నొసటి విరుస్తూవుంటారు. నిజమే చీర వుందనుకోండి దానికి గంజి పెట్టి ఫెళ్ళున కాసే ఎండ లో తీగ మీద ఆరేసి ఫెళఫెళ లాడేలా ఇస్త్రీ చేసి కట్టిన చీర చూడండి ఎంత హుందా గా వుంటూందో.. అందులో అది ఏ వెంకటగిరి జరీ చీరో అయితే ఇంక చెప్పక్కర్లేదు. చిన్న వయసు వాళ్ళు కూడ అవి కట్టుకుంటే ఆ హుందా లుక్ అసలు వేరే రకం గా వస్తుందా?

మనకి ఇండియా లో పాత కాలం ఇళ్ళల్లో ఇలాంటి బట్టలు ఆరేసుకోవటం, నాలుగు నీడ ని ఇచ్చే మొక్కలూ చెట్లూ గురించి అప్పటి ఇంజినీర్లు ఆలోచించేవారు కనుక ఇంటి వెనుక కాస్త పెరడు గురించి ఆలోచించేవారు. అలా ఇంటి ప్లాన్ గీసేవారు. మరి ఇప్పుడూ ఆ పాత కాలం ఇళ్ళు అన్నీ కొట్టేసి అపార్ట్ మెంట్ లు కడుతునారు. ఇంటికి ఒక బాల్కనీ వంటింటి కి ఒక బాల్కనీ అంటున్నారు. కానీ బట్టలు ఆరేసుకోవటానికి ఎవరూ దాదాపు అభ్యంతరం పెట్టడం లేదు.

దానివలన ఏమి చూస్తున్నాము ఈ అపార్ట్ మెంట్ లలో బట్టలు ఆరేయటం వలన? ఏ అపార్ట్ మెంట్ కి వెళ్ళండి అసహ్యం గా బట్టలు వేలాడుతూ బాల్కనీ అసలు కనపడకుండా వుంటుంది. వెనకాల బాల్కనీ లేకుండా ఒక్క ముందు మాత్రమే బాల్కనీ వుంటే ముందు ఇల్లు బయటకి కనపడే బాల్కనీ నిండా బట్టలు. చూడటానికి చిరాగ్గా. కొంచెం కామన్ సెన్స్ వున్న వాళ్ళు అయితే ఆ ఆరేసే బట్టలు లోపల బట్టలు కాకుండా చూసుకుంటారు. అది లేని వాళ్ళు లోపల బట్టలు కూడా వీధి లో వెళ్ళే అందరికీ ప్రదర్శన పెడతారు.

మరి వాళ్ళని అనటానికి కూడా కష్టం. వాళ్ళు మాత్రం ఆ బట్టలు ఎలా ఆరబెట్టుకుంటారు?

చిన్న ఉపకధ చెప్పాలంటే, మా ఇంట్లో మేంఉ ముగ్గురం అప్పచెళ్ళెల్లం వస్తే భలే హడావిడి గా వుంటుంది. మా ఇంట్లో వెనకాల అరుగు మీదకి చక్కటి ఎండ వస్తుంది. సందు లోకి కూడా ఎండ వస్తుంది కానీ బట్టలు వచ్చేపోయే వాళ్ళందరి దృష్టి లోనూ పడతాయి. కనుక అన్నిరకాల బట్టలూ అక్కడ ఆరేయటం బాగోదు. పోనీ బాత్ రూం లో ఆరేద్దాం అంటే మా అమ్మగారికి అసలు అలా ఆరేయటం ఇష్టం వుండదు.

ఆ కారణం చేత మా ఇంట్లో పై వాటా కి రెండు పెద్ద డాబాలు వున్నాయి. ఒక డాబా మీదకి మేము మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చు. రెండో డాబా మీదకి ఆ ఇంట్లో వంటింట్లోంచి వెళ్ళాలి. అందు చేత అద్దెలకి ఇచ్చే ప్రతీ వాళ్ళకీ మా అమ్మగారు ఈ బయటి డాబా మీద మేము బట్టలు ఆరేసుకుంటాము.. రెండో డాబా మీద మీరు బట్టలు ఆరేసుకోండి అని చెప్పి ఇస్తారుట. కానీ అద్దె కి దిగేముందు చెలకలా చిలకపలుకులు పలికిన వాళ్ళే తరువాత అసలు ఆ విషయమే గుర్తు లేనట్టు ప్రవర్తిస్తారు అని విసుక్కుంటూ వుంటారు.. తన డాబా మీద తను కట్టుకున్న దండేలమీద వాళ్ళు బట్టలు ఆరేసివుండటం చూసినప్పుడల్లా మా అమ్మగారు.

బోస్టన్ లో నేను వుండే అపార్ట్ మెంట్ లో 80 శాతం మన భారతీయులే ఇంకా చెప్పాలంటే అందులో అధికశాతం మన దక్షిణ భారతీయులే. మరి ఇవాళ రేపూ సాఫ్ట్ వేర్ రంగం లో ఎక్కువ కనపడుతున్నది మన వాళ్ళేకదా. నేను ఆమధ్య ఒక రూమ్మేట్ ని తీసుకున్నాను. ఆ అమ్మాయి కి డ్రయర్ లో $1.75 పెట్టి బట్టలు ఎండబెట్టుకోవాలంటే కొంచెం బాధ గా వుండేది. మరి కొత్తగా భారతదేశం నుండి దిగిన వాళ్ళకి ఇంకా ప్రతీ డాలర్ నీ రూపాయిల్లోకి మార్చుకొని లెక్క పెట్టుకోవటం ఒకటి వుంటుంది కదా.

ఆ బాధ తో బట్టలు తనే ఉతికేసుకుని మా బల్కనీ లో ఆరేసింది. ఆ అమ్మాయికి ఇల్లు ఇచ్చేముందే చెప్పాను బట్టలు బయట ఆరేయటం ఇక్కడ అపార్ట్ మెంట్ రూల్స్ కి వ్యతిరేకం అని. కానీ మా ఇంటి చుట్టుపక్కల అందరూ బల్కనీల్లో బట్టలు ఆరేయటం చూసి మన దేశం లో హెల్మెట్ రూల్ తరహా తూ తూ మంత్రం రూల్ ఏమో ఈ బాల్కనీ లో బట్టల రూల్ అని ఆ అమ్మాయి మా రైలింగ్ కి బట్టలు ఆరేయటం మొదలెట్టారు.

నేను అడిగాను అలా అరేయద్దు అని. దానితో బాత్ రూం లో ఆరేయటం మొదలెట్టారు. నేను అక్కడ ఆరేయటానికీ అడ్డు చెప్పాను. దానితో ఆమెకి కోపం నశాళానికి అంటింది. ఎక్కడా అరేయద్దు అంటావ్ ఎలా వేగేది.. ఏం నీకు స్టయిలా అందరూ ఆరేసుకోవటం లేదా బయట నీకెందుకు నేను ఆరేసుకుంటే బాధ అని గట్టిగానే అడిగారు.

నేను మరి ఆ రోజు కొంచెం తిక్క గా వున్నాను.. వాళ్ళు సెన్స్ లెస్ బ్రూట్స్ అయితే నువ్వు కూడా అలా చెయ్యాలా.. చదువుకో అపార్ట్ మెంట్ అగ్రిమెంట్ అని మా లీజ్ అగ్రిమెంట్ తీసి ఇచ్చాను. అలా వుంటుంది ఇక్కడి పరిస్థితి. ఆ తరువాతి భారతం ఏమయిందో తెలుసుకోవాలని కుతూహలం మీకు వున్నా చిన్న గా ముగిస్తా. నేనూ ఆ అమ్మాయీ ఎంతో ఆత్మీయమైన స్నేహితులం అయ్యాము తరువాత.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.