అమెరికన్లు ప్రత్యేకం గా పుట్టారా? - SKU
ఈ పేజీ ని పంపండి

ఈ September 11 ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కారణం 1. ఆ రోజు నా పుట్టినరోజు, 2. అమెరికా మీద జరిగిన తీవ్రవాది దాడులు. ఈ దాడులు జరిగిన తరువాత చిత్రవిచిత్రమైన మలుపులుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు ఇంతవరకూ వున్న కొన్ని అభిప్రాయాలు తప్పు ఎమో అన్న అనుమానం మొదలైంది.

జెర్మనీ నుంచి పరుచూరి భానుచంద్ గారు ఒక మైల్ పంపించారు. ఎందుకీ విపరీతమైన ప్రచారం? ఏం ఈ దాడులు అమెరికా మీద జరిగాయనా లేక చనిపోయింది అమెరికన్లు అనా? ఇంత గోల పెడుతున్న ఈ వార్తాపత్రికలు, ప్రపంచ నేతలూ మరి అమెరికా దాడులు చేసి అమాయకులని పొట్టన పెట్టుకుని అది పొరపాటనో.. లేక గ్రహపాటనో.. లేక వారు తీవ్రవాదులనో చెప్పి తప్పించుకున్నప్పుడు ఏమయ్యారు?? ఏం ఆ అమాయకుల జీవితాలకి విలువ లేదా? అని ఆయన ప్రశ్నించారు.

నిజమే ఎందుకు ప్రపంచంలోని ప్రతీ దేశం తన విదేశీ విధానాలతో అమెరికాని మెప్పించటానికి చూస్తారు? తమ దేశంలో ఏ మారణహోమాలు జరిగినా కల్పించనంత ప్రచారం అమెరికాలో జరిగిన దాడులకి ఎందుకు కల్పిస్తున్నారు? మన భారతీయులు కూడా.. ఏం ఏనాడైనా కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడులకి ప్రాణాలు కోల్పోయిన మన దేశ సైనికులు గురించి ఏనాడైనా ఈ విధంగా చలించారా? పశువులు కాచుకుంటున్న అమాయక గ్రామ ప్రజలని తీసుకెళ్ళి వరుసగా నుంచోపెట్టి ధారుణంగా కాల్చి చంపి, అప్పటికీ తమ కసి తీరక వారి శిరస్సులు వేరు చేసిన సంఘటన గురించి కనీసం ఒక్క క్షణం ఆలోచించారా?

తీవ్రవాదుల దాడులలో మరణించే సంఖ్యలు మరీ ఈ అమెరికా దాడులలో మరణించిన వారి సంఖ్య అంత లేదు కనుక అంతగా పట్టించుకోము అంటారా?? సరే ఒకేసారి ఎంత మంది చనిపోతే మీకు ఆ వార్త ఆశక్తి ని కలిగిస్తుంది?? వేలల్లొ అయితేనా? గుజరాత్ లో జరిగిన భూకంపం గురించి తెలుసా? ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లలో వచ్చిన వరదలు, తుఫానులు గురించి తెలుసా? బొంబాయిలో జరిగిన పేళుళ్ళ గురించి తెలుసా? LTTE వల్ల శ్రీలంక లో ఎంత మంది రోజూ ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా? మావోయిస్ట్ లు నేపాల్ లో సృష్టిస్తున్న భీభత్సం గురించి తెలుసా? అస్సాం లో జరుగుతున్న అణచివేత గురించి తెలుసా? Gulf యుద్ధం లో మరణించిన వారి సంఖ్య తెలుసా? లాడెన్ వేటలో అమెరికా, వారి మిత్రులు ఆఫ్ఘనిస్తాన్ మీద వేసిన ఆంక్షల భారం వలన ఆ దేశం తీవ్ర దుర్భిక్ష్య పరిస్థితులు ఎదుర్కొని అక్కడ మరణించిన వారి సంఖ్య తెలుసా? ఈ అన్ని అందర్భాలలో మృతుల సంఖ్య వేలల్లోనే వుంది లేకపోతే తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. మరి ఈ సంఘటనలు వేటి మీదా చూపించని శ్రద్ధ, ఆసక్తి అమెరికా మీద జరిగిన దాడులమీద ఎందుకు? మన మనసులు అంతగా అమెరికనైజ్ అయిపోయాయా?? ఎంత శోచనీయం!

ఎక్కడ పోయినా ప్రతి మనిషి ప్రాణం విలువా ఒకటే కదా? ఈ మధ్య ఎదో వార్తా పత్రికలో చదివాను. భారతీయులు సిఖ్ లమీద జరుగుతున్న దాడుల కి ప్రతిస్పందిస్తూ ఈ దాడుల్లో మరణించిన వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో వున్నారు అని చెప్పినప్పుడు వారికి వారి అమెరికన్ "friends" ఇచ్చిన సమాధానం.. "So what? We don't care about others" నిజమే ఈ దాడుల్లో వారికి సంబంధించినంత వరకూ వారి దేశంలో, వారికి ప్రతిష్టాత్మకమైన భవనాల మీద దాడి జరిగింది.. దానిలో వారి దేశ పౌరులు మరణించారు. కనుక అది చేసిన వారిని ఎక్కడ వున్నా వెతికి పట్టుకోవాలి.. ప్రతీకారం తీర్చుకోవాలి.

మరి ఇవే దాడులు వేరే ఏ దేశం మీదైనా జరిగి వారు కూడా ఇదే అభిప్రాయం తో ప్రతీకారానికి దిగితే అది ఈ ఘనమైన అమెరికా గానీ, అది విదిలించే ఎంగిలి మెతుకులకి అర్రులు చాచే మిగిలిన దేశాలు కానీ సమర్థిస్తాయా? తీవ్రవాద దేశం అని ముద్ర వేస్తాయి, మానవ హక్కులంటూ గోల చేస్తాయి. అమెరికా కి యిష్టమైన పద్దతిలో వారిని అణచటానికి చూస్తాయి. United Nations వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇందుకు అతీతం కాదు. బాధలూ, ప్రతీకారాలూ కేవలం అమెరికా కేనా?? మిగిలిన దేశాలు, వాటి ప్రజల మనోభావాలూ అన్నీ మిధ్యేనా?

ఈ దాడుల తరువాత వివిధ దేశాల అభిప్రాయాలలో వచ్చిన మార్పులూ, దానికి ప్రతిఫలం గా అవి ఆశించే అమెరికా తాయిలాలూ గమనించండి.

పాకిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్ మిత్రత్వం ఒదిలి అమెరికా పంచన చేరింది. ప్రతిఫలం: 30 బిలియన్ల విదేశీ ౠణం మాఫీ., కాశ్మీర్ విష్యంలో భారత దేశం వాదనలని వ్యతిరేకించటం.

భారతదేశం: మన విదేశీ విధానానికి వ్యతిరేకంగా అమెరికా సైన్యాన్ని మన గగనతలం, భూతలం ని వాడుకోవటానికి అనుమతి యివ్వటానికి అర్రులు చాస్తోంది. (కానీ పాపం.. అమెరికా సరే అనలేదు!) ప్రతిఫలం : కాశ్మీర్ తీవ్రవాదాన్ని అణచటానికి అవకాశం, తమ చర్యలకి అమెరికా సమర్థన.

అమెరికా CIA అంత ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూఢచారి సంస్థ కదా? మరి వారికి ఇంతవరకూ తెలీదా కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారో?? వారికి ఇక్కడ ఎవరు మరణించినా పట్టదు. రష్యాని అణచటానికి బిల్ లాడెన్ కీ, పాకిస్తాన్ కీ శిక్షణ, ఆయుధాలు ఇచ్చింది వారే.. రష్యా మట్టి కరచాక వారి అవసరం లేదు. ఒదిలేసారు. భారతదేశం తో వ్యాపారం కావాలి.. కనుక భారతదేశం ని దువ్వటం మొదలెట్టారు. తమ దేశం కి ఆయువుపుట్టయిన oil కోసం Gulf గొడవల్లో వేలు పెట్టారు, ఇజ్రాయెల్ వెనుక వుండి పాలస్తీనియన్లని అణచివేయటానికి ప్రయత్నించారు.. దీనివల్ల మొత్తం ముస్లిం దేశాలలో శత్రువులని పెంచుకొన్నారు. అనుభవించారు. ఇప్పుడు ప్రతీకారం కోసం చూస్తున్నారు. కానీ ఒకసారి లాడెన్ స్థావరాల మీద దాడి చేసి మొట్టికాయ తిన్నారు. కనుక ఈసారైనా అక్కడ పరిస్థితులు తెలుసుకొని అడుగు వేయాలన్న నిజం తెలుసుకున్నారు. మరి అది చేయాలంటే అక్కడ పరిస్థితులు తెలిసిన వాళ్ళు కావాలి.. ఆ వ్యక్తులు ఎవరు? ఇంకెవరూ? వున్నారుగా! తాము ఒదిలేసిన పాకిస్తాన్ వాళ్ళు! మీరూ మేమూ విడదీయలేని మిత్రులం అంటూ మళ్ళీ దోస్తీ కట్టారు. ఇది ఎంత వరకూ?? బిల్ లాడెన్ దొరికేంత వరకూ. అతన్ని పట్టుకున్న మరుక్షణం ఏమవుతుంది? మళ్ళీ మామూలే.. పాకిస్తాన్ వల్ల తమకి ఏదైనా అవసరం వుందనుకుంటే వాళ్ళని ఇంకా దువ్వుతారు. కానీ అక్కడ వున్న ముస్లిం ల మనోభావాల వల్ల అక్కడ పెట్టుబడులు పెడతారా?? పెట్టరు.. కనుక వారి వల్ల అంతగా లాభం లేదు. కనుక ఈ గొడవలు సద్దుమునిగాక మళ్ళీ భారతదేశం ని మంచి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు.

ఇటువంటి మేనిప్యులేటర్ల ని ఏ విధంగా ఎదుర్కోవాలి? టెర్రరిజం ఎక్కడ, ఎవరు చేసినా ఖండించవలసిందే. ఈ రకమైన పోరాటాల వల్ల కావలసినది సాధించవచ్చు అనుకుంటే దానికి ఋజువు ఏదీ? ఎందుకు మిడిల్ ఈస్ట్ లో ఇంకా గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు కాశ్మీర్ సమస్య పరిష్కారం అవలేదు? ఎందుకు LTTE కోరుతున్న ప్రత్యేక తమిళ దేశం ఏర్పడలేదు?

మన దేశం కానీ, పాకిస్తాన్ కానీ ప్రపంచం లోని మరే దేశం కానీ అమెరికానో.. లేకపోతే మరొక పెద్దన్న ఎవరో వచ్చి తమని తమ ఇబ్బందులలోంచి బయటకి లాగుతారనో లేక తమ వాదనలకి మద్దతు ఇచ్చి తమ ఆత్మవిశ్వాసం పెంచుతారనో ఎదురుచూడటం మూర్ఖత్వం. ఎందుకు ఎవరో వచ్చి తమని ఆదుకుంటారని ఎదురుచూపులు? వాళ్ళు ఇచ్చే చిన్ని చిన్ని తాయిలాల కోసం వాళ్ళకి అణగి మణగి వుండి బాధ పడేకన్నా ఆ గొడవలు ఎవరితో వున్నాయో దానికి మూల కారణం ఏమిటో గుర్తించి తమ పట్టుదల నుంచి కొంచెం దిగి వస్తే సమస్యలు పరిష్కారం కావా?

ఈ మధ్య నాకు ఎవరో ఒక email పంపించారు. అది ఒక Flash movie. దానిని తయారు చేసింది ఒక "proud Canadian"! ఆయన చెప్పేది ఏమిటంటే.. తాను తన పొరుగు అయిన అమెరికా ని ఎంతో అభిమానిస్తాననీ.. ప్రపంచం లో అమెరికా ఇతరులకి సాయపడినంతగా మరే దేశం సాయపడదనీ.. ప్రపంచం లో ఎక్కడ ప్రజలు కష్టాలు, విపత్తులూ ఎదుర్కొన్నా ముందుండి సాయపడేది అమెరికానేననీ.. కానీ ఎప్పుడూ ఏ దేశమూ అమెరికా విపత్తులని ఎదుర్కొన్నప్పుడు సాయానికి రాలేదనీ.. అమెరికా సాయపడిన దేశాలే కృతజ్ఞత లేకుండా ఆ దేశాన్ని విమర్శించటానికి వచ్చిన ఏ అవకాశమూ ఒదలరనీ.. కనుక ఈ విపత్తు కాలంలో అమెరికాకి తాను అండగా వున్నాననీ.. అమెరికన్ల కోసం ప్రార్థిస్తానని.

నిజమే అమెరికా ఇతర దేశాలకి సాయపడినట్టుగా మరే దేశం ఇతర దేశాలకి సాయపడటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ కి కూడా అందుతున్న విదేశీ సాయంలో పెద్ద భాగం అమెరికానుంచే వస్తోంది. మంచిదే. ఇక్కడ అందరూ convenient గా మరచిపోతున్న విష్యం ఒకటి వుంది. అది.. ప్రపంచం లో అమెరికా జోక్యం, కుట్రల వల్ల గొడవలు రేగుతున్న సందర్భాలు కూడా తక్కువేమీ కాదు. అమెరికా ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితిలో అందరూ టెర్రరిజం కి వ్యతిరేకంగా ఆ దేశం చేస్తున్న పోరు లో అండగా నిలవాలి. కానీ అమెరికాకి సంబంధించినంత వరకూ అది కేవలం వారి దేశం మీద దాడి చేసిన వారి మీద ప్రతీకారం. మిగిలిన దేశాలు అది ఎదో తమ సమస్యలకీ పరిష్కారం చూపుతుందని భ్రమ పడటం దండగ!

ఈ సందర్భం లో నేను చెప్పాలనుకున్న మరొక విష్యం. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కష్టాల గురించి. ఈ సమయంలో బిల్ లాడెన్ తనని కాపాడటానికి అతని చుట్టూ రక్షణ వలయంలా వున్న ఆఫ్ఘన్ ప్రజలు లేదా మరెవరో ఒకరు వారితో ఏమి చెప్తూ వుండి వుంటారు? నన్ను రక్షించడం, అమెరికన్లని చంపటం వలనే మన మతం గొప్పతనం నిరూపించిన వాళ్ళం అవుతాము. మీ జీవితాలు నాశనం అయిపోయినా సరే, మీరు తిన్నా, తినక పోయినా, మిమ్మల్ని అందరూ ఏవగించుకున్నా సరే మీరు తీవ్రవాదం ఒదలద్దు, నా ప్రాణాలు కాపాడతామన్న మీ పట్టుదల ఒదలద్దు, ఈ రకమైన అర్థం లేని పోరాటం లో మరణించటం లోనే మీ బ్రతుకులకి ఒక అర్థం.. ఇంతేనా..? లేక మరేదైనా చెప్తూ వుంటారా? మిగిలిన ప్రపంచం అంతా అతనిని దూరంగా వుంచితే, దరి చేర్చుకొని ఆదరిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలు తనని కాపాడటానికి ఎదుర్కొంటున్న కష్టాలు అతని మనసుని కరిగించవా? అతనిని సమర్థిస్తున్న ప్రపంచం నలుమూలలా వున్న అతని మద్దతుదారులు అందరూ అతను చేస్తున్న ప్రతీ పనినీ సమర్థిస్తున్నారా? సాటి మనుష్యుల మీద వారికి ఎందుకు ఇంత కసి? ఏం సాధించదలచుకుంటున్నారు ఈ రకమైన తీవ్రవాదం ద్వారా? రోజూ పత్రికలలో వస్తున్న ఆఫ్ఘన్ ప్రజల కష్టాల తాలూకు చిత్రాలు చూస్తుంటే వారికి సంబంధం లేని ఎవరికైనా మనసు ద్రవిస్తుంది. అతని మనసు అంత శిలైపోయిందా అస్సలు కరగక పోవటానికి? ఇతని చర్యలు ఏ విధంగా సమర్థనీయం?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.