టీచర్లూ .. టెన్షన్లూ - SKU
ఈ పేజీ ని పంపండి

మేము 10 లో వున్నపుడు మా school లో ఇద్దరు సార్లు వుండేవారు. ఒకాయన నేచురల్ సైన్స్ చెప్పేవారు, యింకొకాయన మేధ్స్ చెప్పేవారు. యిద్దరూ మాకు యిష్టమైన మేష్టార్లే. కానీ ఆ యిద్దరికీ పడేది కాదు. మా NS Sir (xyz అనుకుందాం) చాలా రోజులునుంచీ మా school లో పనిచేసేవారు. అందరికీ ఆయనంటే యిష్టం. ఆయన మకుటం లేని మహరాజులాగా వుండేవారు. తర్వాత ఈ మేధ్స్ సార్ (abc అనుకుందాం) వచ్చారు. ఆయన చాలా సరదాగా మానసిక వికాసం పేరున ఆ వయసులో మా అందరికీ వినాలనే కోరిక వున్న ప్రేమలూ, అనుబంధాలు తదితర గాలి కబుర్లు చెప్పేవారు. దానితో చాలా మందికి... ముఖ్యంగా అమ్మాయిలకి ఆయనంటే యిష్టం మొదలైంది. యిద్దరూ ట్యూషన్లు చెప్పేవారు.

అంతవరకూ రాజులాగ వెలిగిన xyz గారికి abc గారి రాకతో కొంచెం చికాకులు మొదలైయ్యాయి... కొన్ని బేరాలు (ట్యూషన్లకి) పోయాయి, ఆయన చెప్పే కబుర్లు అదివరకులా అంతా doe-eyes తో వినటం లేదు. టీచర్లలో కూడా అంతా abc గారి మాటకి విలువ యివ్వటం మొదలెట్టారు.. టీచర్స్ డే నాడు తనతో సమానంగా abc గారిని కూడా పిల్లలు gifts తో ముంచెత్తారు.. తన అసహనం ని ట్యూషన్ పిల్లల దగ్గర మాటల్లో వ్యక్తపరచడం మొదలెట్టారు... నెమ్మదిగా ఆ పని క్లాసులో కూడా మొదలేట్టారు.. యిది విని abc గారి ట్యూషన్ పిల్లలు ఊరుకుంటారా? abc గారికి వెళ్ళి చెప్పారు.. ఆయన కూడా క్లాస్ లో xyz గారి గురించి మాట్లాడటం మొదలెట్టారు.. మేము కూడా వారిద్దరి మధ్యా దూరం పెరగటానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేసాం... ఒకరి మాటలు మరొకరికి చేరవేయటం ద్వారా..

వారిద్దరి మధ్యా ద్వేషం ఎంతగా పెరిగిందంటే.. abc గారు తన సబ్జెక్ట్ మేధ్స్ ఒదిలేసి xyz గారు చెప్పే NS లో తప్పులెన్నటం మొదలెట్టారు.. xyz గారు లెఖ్ఖలు చెప్పడం లో abc గారి బ్లండర్స్ చూపించడం మొదలెట్టారు. xyz గారు అసలు నిజంగా M.Sc చేయలేదని abc గారు సెలవిస్తే.. xyz డిగ్రీ అసలు పాస్ అవలేదన్న నిజం సాక్ష్యాలతో abc గారు చూపించారు. యింతే కాదు.. xyz గారికి పిల్లలు లేకపోవటానికి కారణం, abc గారికి ఎవరూ పిల్లనివ్వకపోవటానికీ కారణం, xyz గారి జీతం, abc గారి యింటి అద్దె.. వివరాలు.. యింకా చాలా విష్యాలు.. ఈ ఘర్షణ వల్ల మాకు తెలుసు!

మాకు బాగుంది.. వాళ్ళు ఆ విధంగా ఒకరిమీద ఒకరు బురద జల్లుకుంటూ మమ్మల్ని entertain చేయటం! పిల్లలు రెండు వర్గాలు గా విడిపోయాయి.. abc గారి వర్గ పిల్లలు xyz గారి వర్గ పిల్లలతో friendship చేయరు.. చేసినా.. తమ సార్ గురించి వాళ్ళ సార్ ఏం మాట్లాడారో తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు మా సార్ గొప్ప అంటే మా సార్ గొప్ప అని వాదన, కొండొకచో దెబ్బలాడుకోవటంతో ముగిసేవి. మాలో కొంతమంది గూఢచర్యం కూడా నేర్చుకున్నాం.. వీరి చలవ వల్ల!

యింక వీరి గొడవల వల్ల మేం ఒకరకంగా లాభపడ్డాం కూడా.. యిద్దరూ తమ స్టూడెంట్స్ కే క్లాస్ ఫస్ట్ రావాలన్న పట్టుదల , ఎదుటి వారికి విమర్శించడానికి అవకాశం యివ్వకూడద్దన్న ఉద్దేశ్యం తో మాకు పాఠాలు చాలా బాగా చెప్పేవారు. ఒక పోటి వాతావరణం ఎవరి వర్గంలోని వారు ఎక్కువ మార్కులతో 10 వ తరగతి పాస్ అవుతారు అనే పోటీ.. మా అందరి తలితండ్రులూ మేము ఈ రకంగా మా మేష్టార్ల గురించి రోజుకి ఒకో గాసిప్ న్యూస్ చెప్పడం చిరాకు, కోపం తెప్పించినా.. మేము మరింత శ్రద్దగా చదవటం వలన అంతగా పట్టించుకోలేదు. మేము అంతా 10వ తరగతి అంతా మంచి మార్కులతో పాస్ అయ్యాం.. ఆ యిద్దరూ వాళ్ళలో ఒకాయనకి వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయేంతవరకూ ఆ విధంగానే ఘర్షణ పడ్డారు.

ఈ మధ్య నాకు పరిచయం అయిన ఒకాయన చెప్పారు చిన్నప్పుడు వాళ్ళ మేష్టార్లు వీళ్ళచేత కాఫీలు, టిఫిన్లూ తెప్పించుకునేవారట! పిల్లలకి ఏముందీ ఆ వయసులో తెలియదు.. కేవలం మాష్టారికి సాయం చేస్తే.. ఆయన అభిమానాన్ని పొందవచ్చనే ఆశ తో వాళ్ళు ఏమి చెప్పినా చేస్తారు.

నేను కొంతకాలం ఒక school లో టీచర్ గా చేసాను. అప్పుడు నాకు పిల్లల అభిమానం ఎలా పొందుదామా అని ఆతృతగా వుండేది.. వాళ్ళ కోసం కధల పుస్తకాలు చదివి, చిన్న చిన్న గేమ్స్ నేర్చుకునీ, రకరకాలుగా పాట్లు పడే దాన్ని.

నాకు జాతిపిత గాంధీ గారు అంటే ఒక కోపం.. దానికి కారణం పాకిస్తాన్ ఏర్పడటానికి కారణం ఆయనే అనే ఒక అభిప్రాయం. నేను అప్పుడు R.S.S. ప్రభావంలో వుండే దాన్ని. ఒకరోజు 4, 5వ తరగతి పిల్లలకి భారత్ - పాకిస్తాన్ మధ్య విభేధాలకి కారణాలు చెపుతూ.. గాంథీ గారి మీద నా కోపం, దానికి కారణం చెప్పాను. పిల్లలు అంతా దాదాపు నాతో ఏకీభవించారు.. మర్నాడు నన్ను మా ప్రిన్సిపాల్ పిలిచారు. నేను ఆ విధంగా జాతిపిత గురించి పిల్లలకి చెప్పకూడదని మందలించారు. నేనూ అప్పటికే నేను ఎక్కువ మాట్లాడానెమో అని బాధ పడుతున్నాను.. కనుక మర్నాడు పిల్లలకి చెప్పడం కోసం గాంధీ గారి గురించి చదివి నేను వాళ్ళకి ఆయనంటే కల్పించిన అభిప్రాయం మార్చడానికి ప్రయత్నించాను.

యిట్లాంటిదే టీచర్ గా వుండగా నేను చేసిన మరొక పొరపాటు..

భోజన అలవాట్లు గురించి science పాఠం చెప్తున్నాను. పిల్లలకి vegetarian food గురించి చెప్పాలి. పిల్లల్ని 'విష్వక్సేనుడు ' అనే మాటని పలకమన్నాను. నా ఉద్దేశ్యం మాంసాహారం తినేవాళ్ళు తమ నాలుక మొద్దుబారడం వలన స్పష్టంగా మాట్లాడలేరని చెప్పడం.. నేను యిచ్చిన ఉదాహరణ వలన పిల్లలు శాఖాహారం మంచిది అన్న conclusion కి వచ్చారు.

మా క్లాసులో మా ప్రిన్సిపాల్ గారి అబ్బాయి కూడా వున్నాడు. ఆ రోజు ఆవిడ ఎదో మాంసాహారం వండారుట. ఎప్పుడూ ఎంతో యిష్టంగా తినే అబ్బాయి ఆ రోజు నుంచీ తను కేవలం శాఖాహారం మాత్రమే తింటానని చెప్పాడుట. ఎందుకు అని అడిగితే.. ఆ రోజు నా క్లాసులో నేను చెప్పినది చెప్పాడుట. మర్నాడు మళ్ళీ నాకు మా ప్రిన్సిపాల్ నుంచి శ్రీముఖం.. తనని వచ్చి కలవమని!

నీవు చెప్పినది బాగానే వుంది.. కానీ ఈ లెసన్ తర్వాత మాంసాహారం వలన ఉపయోగాలు అనే పాఠం వుంది.. అప్పుడు ఏం చెపుతావు? అని ఆవిడ నన్ను అడిగారు.. పిల్లలు ఈ వయసులో అన్నీ తినాలి అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు అని నాకు చెప్పారు.. టీచర్ గా నేను చెప్పే ప్రతీ మాట క్లాసులోని పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపుతుందనీ.. కనుక నేను ఒక మాట మాట్లాడే ముందు వంద ఆలోచించి మాట్లాడాలనీ.. లేకపోతే ఒక ఎదిగే మొక్కని నాశనం చేసిన దాన్ని అవుతాననీ చెప్పారు.

నాకు చాలా సిగ్గు వేసింది.. మా school రోజులు, మా యిద్దరు మేష్టార్లూ గుర్తు వచ్చారు.. నేను ఎంత బాధ్యతాయితమైన వృత్తి లో వున్నానో.. దానిని ఎంత జాత్రర్తగా చేయాలో తెలిసింది.. ఆనాటి నుంచీ నేను చాలా జాగ్రర్త గా వుండేదాన్ని.. ప్రతీ దానికీ నా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దకుండా.. ఒక సం యమనం పాటించడానికి ప్రయత్నించాను. తర్వాత నేను వేరొక ఉద్యోగం రావటం వలన ఆ వృత్తి ఒదిలేసాను.. లేకపోతే.. యింకా ఎన్ని చిత్రాలు చేసి వుండేదాన్నో.. ఎన్ని తిట్లు తినేదాన్నో!!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.