అరవై ఏళ్ళ స్వతంత్రం - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
ఈ వారం CNN-IBN లైవ్ వారి సైట్ లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన అరవై సంవత్సరాలలో జరిగిన 60 ముఖ్యమైన సంఘటనలు ఇచ్చి వాటిలో ఏవి పాఠకుల దృష్టి లో అతి ముఖ్యమైన పది సంఘటనలు అనేవి చెప్పమన్నారు.

వారి లిస్ట్ చూసినప్పుడు నాకు వాటిలో నా దృష్టి లో ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అనేది చెప్పాలని అనిపించింది.

ఇంక ఆ సంఘటనల లోకి వెళితే...

1947 - 1957
1. భారత దేశానికి స్వాతంత్రం - ఆగస్ట్ 15, 1947
2. కాశ్మీర్ భారత దేశం లో కలవటం - అక్టోబర్ 27, 1947
3. మహాత్మా గాంధి హత్య - జనవరి 1948
4. హైదరాబాదు భారతదేశం లో కలవటం - సెప్టెంబర్ 12, 1948
5. అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం - నవెంబర్ 26, 1949
6. భారత దేశం ఒక రిపబ్లిక్ - జనవరి 26, 1950
7. పంచ వర్ష ప్రణాళికల మొదలు 1951
8. భారత దేశపు మొదటి సార్వత్రిక ఎన్నికలు - జనవరి 1952
9. కుటుంబ సమ్కేమ (Family Planning) కార్యక్రమం మొదలు - 1952
10. హిందూ కోడ్ బిల్ ఆమోదం - 1956
11. భాష ప్రాతిపదికన రాష్ట్రాల విభజన - 1956

భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించటం కన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది? అది ఒక అత్యంత సంతోషకరమైన సంఘటన. ఇంక బాధ ని కలిగించే సంఘటన, మహాత్మా గాంధీ హత్య. జాతి పిత ని RSS కి చెందిన నాధూరాం ఘాట్సే హత్య చేయటం, ఆ సంఘటన దరిమిలా RSS కార్యకర్తలు దేశం లో పలుచోట్ల మిఠాయిలు పంచిపెట్టటం సభ్యత గల ప్రతీ భారతీయ పౌరుడూ గర్హించవలసిన సంఘటన. ఘట్సే అసలు RSS సభ్యుడు కాదు అని ఇప్పటికీ బుకాయిస్తారు కొందరు, అది వేరే విషయం. భారత దేశం ఇవాళ ప్రోజెక్ట్ లతో, నదులపై Dam ల కారణం చేత పచ్చగా వుందంటే కారణం ఈ దశాబ్ద కాలం లో మొదలయిన పంచ వర్ష ప్రణాలికలే. వాటిలో ఎన్ని పూర్తిగా సఫలమైయ్యాయి అనేది ప్రశ్నార్థకం అయినా, వాటి వలన భారత దేశం ఒక స్థిరమైన అభివృద్ధి సాధించింది అనేది మాత్రం సత్యం.

1957 - 1967
1. కేరళ లో కమ్యూనిస్ట్ పార్టీ విజయం - 1957
2. "మదర్ ఇండియా" చిత్రం విడుదల - 1957
3. గోవా భారత దేశం లో విలీనమవుట - డిసెంబర్ 19, 1961
4. చైనా తో యుద్ధం లో పరాజయం - నవెంబర్ 1962
5. పండిట్ నెహ్రూ మరణం - మే 27, 1964
6. హిందూ వ్యతిరేక ఆందోళనలు - ఫిబ్రవరి 1965
7. ప్రధాని గా ఇందిర - 1966
8. White Revolution - 1966
9. హరిత విప్లవం - 1967

ఈ దశాబ్దం లో ఎన్ని ముఖ్యమైన సంఘటనలు వున్నా, చైనా చేతి లో యుద్ధం లో పరాజయం మన దేశానికి ఒక పాఠం నేర్పింది. ఈ పరాజయం తో నేర్చుకున్న పాఠాలతో తదుపరి జరిగిన బంగ్లాదేశ్ యుద్ధం లో పాకిస్తాన్ మీద సునాయాశ విజయం సాధించగలిగాము. మన త్రివిధ దశాలు కూడా ఈ పరాజయం దరిమిలా అమూల్యమైన పాఠాలు నేర్చుకున్నాయి. ఈ దశాబ్దం లోనే మనకి అపర దుర్గ గా వాజ్ పేయి చేత వర్ణింపబడిన ఇందిరా గాధి ప్రధాని పదవి ఎక్కారు. మనకి ఇంతవరకు వున్న ప్రధానుల్లో ఒకే ఒక్క మగాడు ఆమె. (sexist రిమార్క్ అనుకుంటున్నారా.. ఏం చేయమంటారు.. guts ని వర్ణించటానికి మన బాష లో అంతకన్నా గొప్ప పదం లేదు!) మన దేశం దిశ ని మార్చిన మరొక ముఖ్య సంఘటన హరిత విప్లవం. స్వాతంత్రం సిద్ధించిన దశాబ్దం తరువాత వివిధ రంగాలలో జరిగిన కృషి వలన మన దేశ సౌభాగ్యానికి ఈ దశాబ్దం లో పునాదులు పడ్డాయి.

1967 - 1977
1. ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల విజయం - ఫిబ్రవరి 19, 1967
2. నక్సల్ ఉద్యమం - మే 25, 1967
3. బ్యాంకుల జాతీయకరణ - జూలై 20, 1969
4. ఇంగ్లాండ్ లో భారత క్రికెట్ టీం' ఇంగ్లాండ్ పై విజయం - ఆగస్ట్ 24, 1971
5. ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం - డిసెంబర్ 1971
6. చిప్కో ఉద్యమం - మార్చ్ 1973
7. ప్రోజెక్ట్ టైగర్ - 1973
8. పోఖ్రాన్ లో మొదటి అణు పరీక్ష - 1974
9. ఎమర్జెన్సీ రోజులు - జూన్ 26, 1975
10. "షోలే" చిత్రం విడుదల - 1975

ఎన్ని విజయాలు వున్నా ఈ దశాబ్దం లో చీకటి ని నింపిన ఘటన ఇందిరాగాంధీ పుణ్యం. అదే, ఎమర్జేన్సీ. ఆమె చేసిన మంచి, గొప్ప పనులు ఎంత ఘనమో ఆమె వలన జరిగిన అత్యాచారాలు కూడా అంతే ఘనం. వాటిలో మొదటిది ఈ ఎమర్జెన్సీ. ఆనాటి నుండి ఈనాటికి మన రాజకీయ నాయకులలో మార్పు రాలేదు, వారి అధికార దుర్వినియోగం లో తేడా లేదు. ఈ దశాబ్దం లోనే జరిగిన బంగ్లాదేశ్ ఆవిర్భావం ని సగటు భారతీయుని మాదిరి నేను సగర్వం గా చెప్పుకోలేను. ఇందిరాగాంధీ పాకిస్తాన్ లో పెట్టిన ఈ చిచ్చు ఈ నాటికి మనని ISI రూపం లో వెంటాడుతోంది. మన దేశం లో ఆ తరహా చిచ్చు రగల్చటానికి దారులు వెతుకుతోంది. ఇంక సంపూర్ణం గా గర్వించవలసిన ఘటన, అర్థరాత్రి ఒక్క వేటు తో చేసిన బ్యాంకుల జాతీయకరణ. ఎన్ని అవకతవకలు వున్నప్పటికీ బ్యాంకులు పేదవారికి అందుబాటులోకి వచ్చాయంటే కారణం ఈ జాతీయకరణే.

1977 - 1987
1. ఎమర్జెన్సీ రోజులు సమాప్తం, ప్రధాని గా మొరార్జీ దేశాయ్ - మార్చ్ 24, 1977
2. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ విజయం, 30 సంవత్సరాల పాలన - మార్చ్ 1977
3. SLV-3 శాటిలైట్ ప్రయూగం - జూలై 18, 1980
4. రంగుల TV - నవంబర్ 19, 1982
5. వరల్డ్ కప్ క్రికెట్ ఇండియా పరం - జూన్ 25, 1983
6. మార్కెట్ లో మారుతి 800 - డిసెంబర్ 1983
7. TV ధారావాహికలు హంలోగ్, రామాయణ్ - 1984 - 86
8. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిర హత్య - జూన్ 1984
9. భోపాల్ గాస్ దుర్ఘటన - డిసెంబర్ 3, 1984
10. ఈక్విటీ మార్కెట్ ల రంగప్రవేశం - ఫిబ్రవరి 11, 1986

కాంగ్రెస్ ని గద్దె దించి దేశానికి స్వాతంత్రం వచ్చిన 30 సంవత్సరాలకి మొదటిసారిగా దేశం లో కిచిడీ ప్రభుత్వం గద్దె ని ఎక్కింది. ఆనాటి నుండీ ఈ నాటికి ఈ కిచిడీ ప్రభుత్వాల తీరు మారలేదు. చిత్రం ఏమిటంటే ఇవాళ కాంగ్రెస్ కిచిడి ప్రభుత్వాల మధ్య ఇరుక్కుపోయి వుండటం! ప్రతీ భారతీయుడూ సగర్వం గా చెప్పుకోదగ్గ సంఘటన, SLV-3 ప్రయోగం. మరొక్క గర్వపడవలసిన ఘటన కపిల్ డెవిల్స్ మన దేశానికి గెలిచిన ప్రపంచ కప్. ఆ విజయం ఫలితమే మన జీవితాలలో క్రికెట్ ప్రాముఖ్యం. అది వరమో శాపమో దేవుడికెరుక! సభ్యత వున్న ప్రతీ కంగ్రెస్ వాదీ సిగ్గు తో తల దించుకోవలసిన ఘటన ఇందిరా హత్య అనంతరం దేశం యవత్తూ సిక్కుల మీద జరిగిన అత్యాచారాలు. ఆనాటి ధారుణాలకి ఈ మధ్య కాలం దాకా కాంగ్రెస్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేకపోయింది. Better late than never! ఈ దశాబ్దం లోనే జరిగిన మరొక ధారుణం, భోపాల్ గాస్ దుర్ఘటన. ఆనాటి బాధితులకి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది ఈనాటికి కోర్టులూ యూనియన్ కార్బైడ్ సంస్థలు తేల్చలేకపోయారు!

1987 - 1997
1. శాటిలైట్ కేబుల్ - 1990
2. అద్వానీ రధయాత్ర - 1980
3. మండల్ కమీషన్ చిచ్చు - ఆగస్ట్ 1980
4. రాజీవ్ గాంధీ హత్య - మే 21, 1991
5. మన్మోహన్ మాయాజాలం - జూన్ 1991
6. బాబ్రీ మసీద్ విధ్వంశం - డిసెంబర్ 6, 1992
7. ఉత్తర ప్రదేశ్ లో మొట్టమొదటి దళిత ముఖ్య మంత్రి గా మాయావతి - 1993
8. మార్కెట్ లో Infotech ప్రవేశం - ఫిబ్రవరి 1993
9. అందాల పోటీలు - 1984
10. టెలీకం విప్లవం - 1995

అంతవరకూ నామ మాత్రం వున్న మత సఖ్యత బీటలని శాశ్వతం చేసిన ఘటన అద్వానీ చేపట్టిన రధ యాత్ర. VP సింగ్ పెట్టిన మండల్ చిచ్చు నుంచి ఓటర్ల దృష్టి మరల్చటానికి రామ మందిరం ఆశలు పెట్టి BJP లోక్ సభ లో 2 నుండి 120 కి తమ బలం పెంచుకుంది. బంగారం ని తాకట్టు పెట్టుకునే దయానీయమైన స్థితి లో వున్న భారత ఘజానా ని ఆదుకొనటానికి PV నరసిమ్హ రావు, మన్మోహన్ సింగ్ లు మొదలెట్టిన వైద్యం ఎకనామిక్ లిబరలైజేషన్. ఆనాడు వారిద్దరూ చేసిన కృషి ఫలితం ఈనాడు భారత దేశ పురోభివృద్ధి. భారత రాజకీయ చిత్రాన్నే మార్చివేసిన ఘటన త్తర ప్రదేశ్ లో దళిత విజయం. ఆనాటి నుండి ఈ నాటికి దళితుల జీవితం లో వచ్చిన మార్పు దాదాపు శూన్యం అయినప్పటికీ వారు ముఖ్యమైన ఓట్ బ్యాంక్ గా మాత్రం అవతరించారు. కేంద్రం లో కిచిడీ ప్రభుత్వాల ఏర్పాటు కి కారణం అయ్యారు. చూడబోతే ప్రధాని పదవి ఎక్కాలన్న మాయావతి కోరిక కూడా తీరేటట్టు వుంది.

1997- 2007
1. మల్టీప్లెక్స్ సినిమాలు, షాపింగ్ మాల్స్ - 1997
2. లాహోర్ బస్ యాత్ర, కార్గిల్ యుద్ధం - 1999
3. బిలియన్ దాటిన భారత జనాభ - మే 2000
4. $10 బిలియన్ల పరిశ్రమ గా సాఫ్ట్ వేర్ - 2001-2002
5. సబర్మతి దుర్ఘటన, గుజరాత్ మారణహోమం - ఫిబ్రవరి 2002
6. విమాన యానం రైలు ప్రయాణం కన్నా చవక - ఆగస్ట్ 25, 2003
7. అధికారం లో అయిదేళ్ళు పూర్తి చేసుకున్న మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం - మే 2004
8. RTI Act - జూన్ 15, 2005
9. ఇండియా - US అణు ఒప్పందం - జూలై 18, 2005
10. టాటా కోరస్, ఆర్సిలొర్ మిట్టల్ ఒప్పందాలు - 2006-07

భారతీయులలో జాతీయతత్వాన్ని తట్టి లేపిన ఘటన కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధం లో అమరులైన వీరుల పేర్లు అనామకుల మాదిరి మిగిలిపోకుండా TV పుణ్యమా అని ప్రతీ ఇంటిలో నానాయి. మరొక గర్వపడవలసిన విషయం సాఫ్ట్ వేర్. ప్రపంచం లో ప్రతి అయిదుగురు సాఫ్ట్ వేరు నిపుణులలో ఒకరు భారతీయుడు అవటం నిజం గా గర్వపడవలసిన విషయం. (దానికి కారణం నేనే అని చంద్రబాబు చంకలు గుద్దుకుంటారు అది వేరే విషయం) భారత దేశం లోని విద్యావ్యవస్థ మీద విమర్శలు గుప్పించే వారిని నివ్వెర పరిచిన విషయం ఈ అపూర్వ విజయం. ఇంగ్లీష్ చదువు, పరాధీన బతుకు అని ఎవరు వెక్కిరించినా, ఈనాడు ప్రపంచం లో ఎక్కడకైనా భారతీయుడు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించగలుగుతున్నారంటే కారణం ఆ ఇంగ్లీష్ చదువే! మతం పేరుతో మనుష్యులని ఊచకోత కోసి దానిని సగర్వం గా చెప్పుకునే మృగాలని పరిచయం చేసింది గుజరాత్ ఈ దశాబ్దం లో.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.