వైతరిణి- SKU Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఎంత మోసం చేసింది!!!! అలా అనుకుంటున్నప్పుడు కూడా ఎక్కడో ఏదో గిల్టీ ఫీలింగ్.. ఆ లెఖ్ఖన తను కూడా మంజు కి పూర్తిగా విషయం ముందే చెప్పలేదు.. అప్పుడు తనకి మంజు ని అనే హక్కు ఎక్కడ ఉంది? అయినా, పేరు లో సగం చెప్పి ఎలా కధ చెప్పింది!!

గంట నుండీ వంశీ కాలు గాలిన పిల్లి లా గదిలో ఒక్క చోట నిలవ కుండా తీవ్రంగా ఆలోచించేస్తున్నాడు. అసలు విషయం లోకి వెళ్ళాలి అంటే, కధ పధ్నాలుగేళ్ళు వెనక నుండీ చెప్పుకు రావాలి.

* * * పధ్నాలుగేళ్ళ క్రితం * * *

వంశీ వాళ్ళ ఇంట్లోకి పోస్టాఫీసు లో పనిచేసే ఆదేష్, ఆయన కుటుంబం - భార్య చండిక, కూతురు వైతరిణి వచ్చారు. వంశీ తండ్రి వ్యవసాయం. వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ కాకినాడ లో వంశీ చదువు కోసం కాపురం పెట్టారు. వంశీ అప్పుడు పది పూర్తయి ఇంటర్ లోకి వచ్చాడు.

వంశీ తల్లి సునంద కి ఆదేష్ భార్య, కూతురు పేర్లు కొంచెం వింతగా అనిపించాయి. దానితో వంశీ ఎదురుగా భార్య చండిక.. కూతురు వైతరిణి.. ఆయన ఆదేశించేవాడు.. అని వేళాకోళం గా మాట్లాడుకోవటం తో వంశీ కి కూడా అదేదో వెటకారం చెయ్యతగిన విషయం అనిపించింది.

వైతరిణి అప్పుడు పదో క్లాస్ లోకి వచ్చింది. వంశీ చదివిన టాగూర్ స్కూల్ లోనే చేరింది. ఒకటి రెండు సార్లు మాటలు కలిపే అవకాశం వచ్చినా వంశీ కావాలని ఆమెతో మాట్లాడలేదు, అలాగే, ఆమెకి వంశీ తో మాట్లాడాల్సిన అవసరం వచ్చినా వాళ్ళ అమ్మ చేత అడిగించటమో లేక తనే వచ్చి వంశీ వాళ్ళ అమ్మ ని అడగటమో చేసేది తప్ప వంశీ తో స్వయం గా ఎప్పుడూ మాట్లాడలేదు.

ఇలా ఒక రకం గా ఎవరు ముందు అనే పట్టుదల ఒకటి మొదలయింది.

* * *

ఒక సంవత్సరం వీళ్ళ ఇంట్లో ఉండి వైతరిణి వాళ్ళు వేరే చోటుకి మారిపోయారు. దానికి కొంతవరకూ కారణం వంశీ వాళ్ళ అమ్మ సునంద నోటిదురుసుతనం అనొచ్చు. ఎప్పుడూ బయట పడి గొడవ పడలేదు కానీ వాళ్ళు వెళ్ళే ముందు వినీ వినిపంచకా సునంద ఏవో విసుర్లు వేసేవారు.. దానికి సమాధానం గా చండిక వీళ్ళతో పూర్తిగా మాట్లాడటం మానేసారు.

* * *

వైతరిణీ వాళ్ళు ఇల్లు మారాక కొన్నాళ్ళకి ఎప్పుడన్నా కనిపించేది ఉమెన్స్ కాలేజ్ కి వెళ్తూ. వంశీ అప్పటికి EAMCET ఎంట్రన్స్ కోసం ట్యూషన్ కి వెళ్ళటం మొదలెట్టాడు. వీళ్ళ క్లాస్ ముందు వైతరిణీ వాళ్ళ క్లాస్ ఇంటర్ మొదటి సంవత్సరం ట్యూషన్ క్లాస్ ఉండేది. ఇద్దరూ యవ్వనం లో అడుగుపెట్టారు. వంశీ లో మౌన ప్రేమికుడు పుట్టుకొచ్చాడు.

* * *

మౌనంగా ఆమె వెనకాల స్కూటర్ మీద వెళ్ళటం తో మొదలయింది వంశీ పిచ్చితనం. ఇతన్ని పట్టించుకోనట్టు ఉన్న ఆమె ప్రవర్తన వంశీ మరింతగా ప్రయత్నించేలా చేసింది. ఆమె కి వినిపించేలా ఆమె వెళ్తున్నప్పుడు గట్టిగా మాట్లాడటం, నవ్వటం ఏదో పిచ్చి చేష్ట చెయ్యటం కూడా పని చెయ్యలేదు. తరువాతి స్టేజ్ ఆమె ని డైరెక్ట్ గా కామెంట్ చెయ్యటం మొదలెట్టాడు. కొన్ని సార్లు అతని ప్రవర్తన ఆమెని నొప్పించింది, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింది. కానీ ఎప్పుడూ అతని ఉనికి నే గుర్తించనట్టు ప్రవర్తించేది. ఇది వంశీ అహం ని దెబ్బ తీసింది, మరింత తెగించేలా చేసింది. ఇలా అమెకి అతని గొడవ భరించలేని స్టేజ్ కి చేరింది.

ఆమె ఇంటి ఫోన్ నెంబర్ తెలుసు. ఆమె ఇంటికి రోజూ ఫోన్లు చేయ్యటం మొదలెట్టాడు. కానీ మాట్లాడే ధైర్యం లేదు. వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళు ఇంటి మీదకి గొడవకి వస్తే తనకి తండ్రి బుర్ర రామ కీర్తన పాడిస్తారని తెలుసు. ఇలా రోజూ బ్లాంక్ కాల్స్ వస్తుంటే అవి వంశీ నుండి అని అనుమానమే తప్ప దాని గురించి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి లో వైతరిణి ఈ కాల్స్ గురించి తన ఫ్రెండ్ కి చెప్పింది. ఆమె వాళ్ళ నాన్నగారితో మాట వరసకి చెప్పింది. ఆయన తనికి తెలిసిన టెలిఫోన్స్ డిపార్ట్ మెంట్ లోని వ్యక్తి తో మాట్లాడి కావాలంటే ఫోన్ మీద టాప్ పెట్టచ్చు దానికి వాళ్ళ నాన్నగారి అనుమతి ఉండాలి అని చెప్పారు.

చెప్పి ఊరుకోకుండా ఆ సాయంత్రం పార్క్ లో వైతరిణి తండ్రి ని కలిసినప్పుడు అదే విషయం ఆయనకి కూడా చెప్పారు. అసలు ఇంటికి ఇలా బ్లాంక్ కాల్స్ వస్తున్నాయన్న విషయం కూడా ఆదేష్ కి తెలియదు. వాటి గురించి తనకి చెప్పకుండా వేరే బయట వ్యక్తి తో తన కూతురు చెప్పటం ఆయనకి ఒక్కసారిగా BP ని పెంచింది.

అక్కడ ఆయనకి తమ ఇంటికి అలాంటి బ్లాంక్ కాల్స్ ఏమీ రావటం లేదు, అవసరం అయితే ఆయన సహాయం తీసుకుంటాను అని చెప్పి ఇంటికీ అగ్నిహోత్రుడి లా దూసుకొచ్చారు. కూతురి మీదా, తెలిసీ విషయం తనకి చెప్పలేదేమో అనే అనుమానం తో భార్య చండిక మీదా రంకెలు వేసారు. ఈ వరుస లో తనకి ఇష్టం లేని వైతరిణి కొన్ని స్నేహాల గురించి కూడా తన అభిప్రాయం చెప్పారు. ఆ స్నేహాల వలనే ఇలాంటి జులాయి వెధవలు కూతురి వెంట పడుతూ ఉండి ఉంటారు, వాళ్ళు అలా చేసేలా వీళ్ళు ఏమి వెకిలిపనులు చేస్తున్నారో అని అనుమానపడ్డారు.

మొత్తానికి వైతరిణి పరిస్థితి ధారుణం చేసారు.

* * *

తన తప్పు ఏమీ లేకుండా రోజు రోజూ జరిగుతున్న భాగోతాలని ఎలాగైనా ఆపాలనే పిచ్చి ఆలోచన తో మర్నాడు కాలేజ్ గేటు దగ్గర యధా ప్రకారం ఏవో కామెంట్లు చేస్తున్న వంశీ దగ్గరకి దూసుకెళ్ళింది .. ఆమె తన వైపు వస్తోంది అనే విషయం అతని బుర్రలో నాటుకునే లోపు వెళ్ళి అతని చెంప ఛెళ్ళు మనిపించింది.

"నీకు అసలు సిగ్గు ఉందా? మనిషివా లేకా పశువ్వా? ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే ఇంట్లో చదువు మానిపించి కూర్చోపెడతారు. నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకుని చస్తాను. ఆ పాపం నీకే." ఇంకా ఎన్నో విషయాల గురించి అతన్ని కడిగిపారేయాలనుకుంది కానీ కళ్ళల్లో నీళ్ళు, గొంతు లో వెక్కిళ్ళూ కలిపి ఇంక మాట రాలేదు.

తను ఏం చేసిందో గ్రహించేలోపల వైతరిణి ని ఆమె స్నేహితురాళ్ళు అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు.

* * *

వంశీ ఆ షాక్ నుండి తేరుకుని ఆమె చేసిన పనికి ఎలా రియక్ట్ అవాలో ఆలోచించే సమయానికి కొంతమంది జాలి చూపులూ, ఆడ పిల్లల అసహ్యం చూపులూ, వైతరిణి లా ధైర్యం చెయ్యాలి అనుకునీ చెయ్యలేని వాళ్ళ బిత్తర చూపులూ ఒకట్రెండు మంది కాలేజ్ లెక్చరర్ల కుతూహలపు చూపులూ అన్నీ కలిపి గందరగోళం చేసాయి.

ఇక్కడ జరిగిన దానికి కులం రంగు పులమటానికి ఇద్దరిదీ ఒకటే కులమో లేక అప్పటికి కులాల పేరుమీద పుట్టుకొచ్చిన విధ్యార్థి నాయకులు అక్కడ లేకపోవటం వలనో ఆ రకమైన గొడవలు మొదలవలేదు కానీ వంశీ కి ప్రిన్సిపాల్ గదికి రమ్మని కబురు వచ్చింది. రెండు రోజులలోపు తండ్రి ని తీసుకొని కాలేజ్ కి రమ్మని ఆయన ఆర్డర్ వేసారు.

తండ్రి కి దీని గురించి ఎలా చెప్పాలో తర్జనభర్జనలు పడుతుండగా ఆ పుణ్యం కాస్తా ఈ భాగోతం అంతా చూసిన ఒక తండ్రి పరిచయస్థుడు తండ్రి కి చెప్పటం తో ఆయన వంశీ కి ఇంట్లో స్వాగత సన్నాహాలు మొదలెట్టారు.

"నీ చదువు కోసం ఇక్కడ ఈ ఊర్లో ఉంటున్నాం, నీ కోసం రోజూ నాకు ఎంత కష్టమైనా తిండీ తిప్పల సంగతి వదిలేసి నేను అటూ ఇటూ వెళ్ళి వస్తున్నాను. నువ్వు చదువు పేరు చెప్పి చేసే నిర్వాకాలు ఇవా. నీకు చదువెందుకు. నీకు అసలు చదువు మీద ధ్యాస ఉందా?" నిలదీసారు.

అప్పటికి వంశీ ఒంట్లో రక్తం మరుగులు పడుతోంది. ఆ ఉడుకు రక్తం తో తండ్రి తనమీద ఇలా విరుచుకుపడటం తో ఎదురు తిరిగాడు. క్షణాల్లో పరిస్థితి చెయ్యి దాటింది. ఒకటికి ఒకటి తోడయ్యి మొత్తానికి వంశీ ఇంజనీరింగ్ చదవటం దండగ అని, "చదవాలనుకుంటే మన ఊరు గొల్లలమామిడాడ లో B.Sc చదువు లేక పోతే చదువు మానేసి పొలం పనుల్లో సాయం చెయ్" అని ఆర్డర్ వేసారు.

* * *

వైతరిణి తండ్రి కి కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ నుండి కబురు వచ్చింది. వంశీ తండ్రి, వైతరిణి తండ్రి ఇద్దరినీ కూర్చోపెట్టి కాలేజ్ లో ఇలాంటి వ్యవహారాలు సాగవనీ, పిల్లలని అదుపు లో పెట్టుకోలేకపోతే వాళ్ళని తను అదుపులో పెడతాననీ, మళ్ళీ ఇలాంటి గొడవ జరిగితే పోలీసులని పిలవ వలసి వస్తుంది అని హెచ్చరించారు ప్రిన్సిపాల్.

* * *

పరీక్షలు ఎలాగూ దగ్గరకి రావటం తో మిగిలిన కొద్ది రోజులూ అక్కడ ఒకరికి ఒకరు ఎదురు పడకుండా జాగర్త పడ్డారు. అవమాన భారం తో వంశీ కాలేజ్ కి వెళ్ళటం తగ్గించేసాడు. అదే అవమాన భారం తో వైతరిణి కూడా దించిన తల ఎత్తకుండా ఆ సంవత్సరం ఆ కాలేజ్ లో పూర్తి చేసింది. ఇంటర్ రెండో సంవత్సరం వేరే కాలేజ్ కి ట్రాన్స్‌ఫర్ తీసుకొని వెళ్ళిపోయింది. వంశీ గొల్లలమామిడాడ లో తండ్రి చెప్పినట్టు B.Sc లో చేరాడు. తరువాత M.C.A చేసి హైదరాబాదు లో ఉద్యోగం సంపాదించాడు.

వైతరిణి కంప్యూటర్ ఇంజినీర్ అయింది. ఇంజనీరింగ్ లో మంజు తో పరిచయం అయింది. విప్రో లో ఉద్యోగం వచ్చి పని మీద ఇద్దరూ US వెళ్ళారు. ఒకే చోట పని చేయటం, ఒకే అపార్ట్‌మెంట్ లో ఉండటం తో ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.

* * *

వంశీ పెళ్ళి మంజు తో కుదిరింది. అప్పటికి మంజు US లో ప్రోజెక్ట్ అయిపోయి ఇండియా వచ్చేసింది. వైతరిణి ఇంకా US లోనే ఉంది. మొదటి సారి "నా ఫియాన్సే" అని వంశీ ఫొటో చూపించినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు వైతరిణి కి. వంశీ తో తన పరిచయం గురించి చెప్పలేని పరిస్థితి. అది ఎప్పుడో సంవత్సరాల క్రితం మాట. మనుషులు అలాగే ఉంటారని ఏముంది? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దవాళ్ళు కలిసి కూర్చుని కుదిర్చిన సంబంధం. పాత చేదు జ్ఞాపకాలని తవ్వి ఆమె సంతోషం పాడు చెయ్యబుద్ధి కాలేదు.

ఒక రెండు నెలల పని మీద మంజు మళ్ళీ US వచ్చింది. అప్పుడు ఒకటి రెండు సార్లు ప్రక్క గదిలోంచి వాళ్ళిద్దరి skype ముచ్చట్లు వైతరిణి చెవిన పడ్డాయి. జెలసీ కాదు.. ఏదో కసి.. తన వెంట అలా పడ్డాడు. నువ్వు లేకపోతే జీవితం లేదు అదీ ఇదీ అంటూ ఏవేవో కవిత్వాలు రాసాడు..ఇప్పుడు అన్ని మర్చిపోయి మంజు తో ప్రేమ లో మళ్ళీ పడ్డాడా లేకపోతే ఇది ఒక ఆటా? ప్రేమ మగవాళ్ళకి అంత సుళువా లేక అతనికి అది సుళువా?

ఏం చెయ్యాలో తోచని పరిస్థితి లో అనాలోచితం గా ఒక రోజు మంజు కి వంశీ తో తన పరిచయం గురించి చెప్పింది.

ఈ విషయాన్నీ జీర్ణించుకోలేక పెళ్ళి గురించి అయోమయం లో ఉన్న మంజు కి తనే మళ్ళీ నచ్చ చెప్పింది. "మనుషులు మారరు అని ఏముంది? అతను మారాడేమో. నువ్వంటే ప్రేమ గా ఉంటాడు కదా. మీ ఇంట్లో వాళ్ళు అతని గురించి అన్నీ తెలుసుకొనే ఈ సంబంధం కుదిర్చి ఉంటారు కదా.. ఏదో చిన్నప్పుడు చేసిన పని బట్టి అతను ఎప్పుడూ అలానే ఉంటాడు అని ఏముంది?"

మంజు ఎంతో తర్జనభర్జనలు పడింది ఎలాగ అతని గురించి తెలుసుకోవాలని. ఇంట్లో చెప్దామనుకుంది, మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్పాలో, చెప్తే అది పెద్దవాళ్ళ వరకూ వెళ్ళి మొత్తానికి చెడుతుంది. పోనీ వంశీ ని డైరెక్ట్ గా అడుగుదాం అనుకుంది.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఇండైరెక్ట్ గా అతని పాత గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగితే? ఎవరూ లేరు అని చెప్తే అతని బ్లఫ్ ని రట్టు చేయగలదా?

* * *

"పోనీ.. నేను వంశీ ని కాంటాక్ట్ చెయ్యనా? ఇప్పుడు నేను మళ్ళి అతన్ని పలకరించి మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. దానిని బట్టి అతను గ్రంధసాంగుడో లేక మారాడో తెలుస్తుంది కదా?" వైతరిణే సలహా చెప్పింది.

ఇద్దరూ ఎంతో ఆలోచించి దీని వలన ఎక్కడా ఏదీ ఇబ్బంది ఎదురు అవదు అని నిర్ణయించుకొన్నారు. ఇంత ఆలోచిస్తున్నా మంజు కి ఎక్కడో ఏదో నమ్మకం. వంశీ మారాడు అని, తనంటే జెన్యూన్ గా ఇష్టం ఉండటం వలనే పెళ్ళి కి ఒప్పుకున్నాడు అని ఆశ.

* * *

మర్నాడు వంశీ కి వైతరిణి నుండి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ని పేరు బట్టి గుర్తించి, ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని ఒక 30 సెకన్లు ఆలోచించి ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం తో ఏక్సెప్ట్ చేసాడు. వెంటనే ఫేస్‌బుక్ మెసెంజర్ లో ఒక మెసేజ్ వచ్చింది వైతరిణి నుండి .. "హలో.." అని.

మళ్ళీ ఆలోచన ఆమెకి జవాబు ఇవ్వాలా వద్దా అని. అది కూడ కొద్ది క్షణాల ఆలోచన. అంతే. "Hi". జవాబిచ్చాడు.

ఎలా ఉన్నారు, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు .. ఏం చేస్తున్నారు ఇలాంటి మర్యాద పలకరింపులు అక్కడ మెసెంజర్ లో అవుతున్నాయి.. ఇటు ఆమె ప్రొఫైల్ మొత్తం వెతికేయటం మొదలెట్టాడు.

పెళ్ళవలేదు అనుకంటా. ఫొటోలు ఏమీ పెట్టలేదు. BJP MP సుబ్రమణ్యస్వామి భక్తురాలు అనుకుంటా అతని పోస్ట్ లు చాలా షేర్ చేసింది. ఎక్కడ ఉద్యోగం చేస్తోందో ఆ వివరాలు ఏమీ పబ్లిక్ గా లేవు. అమెరికా లో మంజూ పనిచేసిన ఊర్లోనే ఉంది. అయినా బోస్టన్ ఏమన్నా చిన్న ఊరా? ఒక చోటే పని చేస్తున్నారని ఏముంది? ఫేస్‌బుక్ లో తన ఫొటోలు అన్నీ పువ్వులూ కాయలూ ఫొటోలే. బ్రౌజర్ లో ఇంకొక టాబ్ తెరచి గూగుల్ ఇమేజస్ కి వెళ్ళి ఆమె పేరు తో వెతికాడు. వచ్చిన వందల ఫొటోల్లో దొరికింది ఆమె ఫొటొ. ఎందుకు వెతికాడో తెలీదు.. కానీ వెతికాడు.

* * *

శునకమును కనకపు సింహాసనం మీద.. పద్యం తరువాత గుర్తు రాలేదు.. అక్కడితో ఆపేసింది వైతరిణి తన ఫేస్‌బుక్ మెసెంజర్ లో వంశీ జవాబు చూడగానే.

అడగాలా వద్దా అని ఆలోచించి ఆఖరికి టైప్ చేసింది.. "married?"

"లేదు నిశ్చితార్థం అయింది. తను అక్కడే బోస్టన్ లోనే ఉంది ప్రస్తుతం." జవాబిచ్చాడు వంశీ.

"లవ్ మేరేజ్?"

"రెండూ. క్రితం సంవత్సరం తను ఇండియా లో ఉన్నప్పుడు కలుసుకున్నాం. వచ్చే నెల 29 తారీఖు మా పెళ్ళి. మరి మీ సంగతి ఏమిటి? పెళ్ళి అయిందా?"

"లేదు. దాని గురించే మీతో మాట్లాడదామనీ.. మనకి కొంచెం హిస్టరీ ఉంది కదా.." టైపు చేసింది.. మళ్ళీ ఎందుకు చేసానా అని టెన్షన్. దానికి వంశీ నుండి ఏమీ జవాబు రాలేదు. ఒక నిమిషం తరువాత వంశీ స్తేటస్ offline అని వచ్చింది.

ఏమిటీ.. నా మెసేజ్ చూసి కట్ చేసేసాడా లేక ఏమన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రోబ్లమా?

సందేహం తో వైతరిణి ఒక పది నిమిషాలు అలాగే కప్యూటర్ వైపు చూస్తూ కూర్చుండిపోయింది. బయటకి ఎదో పని మీద వెళ్ళిన మంజు లోపలికి వస్తున్న చప్పుడయి కంప్యూటర్ మూసేసి ముందు గది లోకి వచ్చింది తనని పలకరించటానికి.

వంశీ తో మాట్లాడాను. ఫేస్‌బుక్ లో అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. ఏక్సెప్ట్ చేసాడు. మెసెంజర్ లో కొంచెం సేపు చాట్ చేసాము.

ఏమంటాడు? ఒకింత నిరాశ గా అడిగింది. వంశీ ఇలా వైతరిణి తో మాట్లాడటం ఏమిటో అస్సలు నచ్చలేదు.

ఏం లేదు. మీ పెళ్ళి కుదిరిన విషయం చెప్పాడు. ప్రేమా, పెద్దలు కుదిర్చిన రెండూ కలిసిన సంబంధం అన్నాడు. బోస్టన్ లో ఉన్నావన్నాడు. తను ఆఖరున పంపించిన మెసేజ్ గురించి చెప్పలేదు. అసలు అది ప్లాన్ లో లేదు మరి.

* * *

పెళ్ళి అయిందా ని అడిగి దానికి తన జవాబు వచ్చే లోపు కరెంటు పోయింది. దానితో వైతరిణి పంపించిన ఆఖరి మెసేజ్ వంశీ చూడలేదు. ఇంతలో రూమ్మేట్ భోజనానికి వెళ్దాము అని పిలిచేసరికి కంప్యూటర్ మూసేసి బయటకి నడిచాడు.

ఇక్కడ ఎవరితోనూ తన స్వవిషయాలు చెప్పుకునేంత చనువు లేదు. కనుక మనసులోనే వైతరిణి గురించి ఆలోచిస్తూ భోజనం పూర్తి చేసి తిరిగి తమ అపార్ట్‌మెంట్ కి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి మంజు దగ్గర నుండి మెసేజ్ ఉంది. ఆమె కాల్ రిటర్న్ చేసాడు.

ఎవో రోజూ ముచ్చట్లు మాట్లాడుకుంటూ చెప్పాలనిపించింది.. ఇవాళ ఒకటి జరిగింది.

ఏమిటి? అడిగింది మంజు.

కాలేజ్ లో ఉన్నప్పుడు తెలిసిన ఒక అమ్మయి ఇవాళ ఫేస్‌బుక్ లో పలకరించింది. ఆ అమ్మాయ్ పరిచయం అయి ఉండక పోతే నేను ఇంజినీర్ ని అయి ఉండేవాడిని. చిన్నప్పుడు ఇంజినీర్ అవాలని భలే కోరిక గా ఉండేది. ఎదో స్టుపిడ్ పని చేసాను.. దానితో నాన్న గారు బుర్ర గొరిగించి B.Sc చదువు లేకపోతే వ్యవసాయం చేసుకో అన్నారు. ఎక్కడ నువ్వు రైతు భార్య అవటం నాకు ఇష్టం లేదు అంటావో అని B.Sc చేరాను. లైట్ గా విషయం చెప్పాడు.

అతని నోటన వైతరిణి ఊసు వినగానే మంజు మనసు దూది పింజ లా తేలికయిపోయింది. అతని తత్వం అర్థం అయిపోయినట్టు అనిపించింది. అంతలోనే తను చేసినది కూడా చెప్పేద్దామా అనిపించింది. కానీ మళ్ళీ జంకు ఎలా రియాక్ట్ అవుతాడో అని. ఆ జంకు తో తన భాగోతం గురించి చెప్పకుండా సంభాషణ పూర్తి చేసింది.

* * *

మంజు తో సంభాషణ పూర్తి చేసి skype విండో మూసేసరికి అంతకు ముందు వైతరిణి ఫొటోల కోసం సెర్చ్ చేసిన బ్రౌజర్ విండో వచ్చింది. అందులో వైతరిణి ఫొటో చూస్తుండగా ఒక్కసారి ఏదో వెలిగింది వంశీ మెదడు లో. వైతరిణి ఫొటో లో సోఫా లో కూర్చుని ఉంది. వెనకాల పసుపు రంగు కర్టెన్లు వున్నాయి. పక్కన టేబుల్ మీద గణేషుడి విగ్రహం, దాని ప్రక్కన కేరళ లో ఉండే అమృతానందమయి ఫొటో దండ వేసి ఉంది.

ఆ కర్టెన్లు ఎక్కడో చూసాను.. ఎక్కడ.. అనుకుంటూ "ఇది నిజం కాదు" అనుకుంటూ పెళ్ళి కుదిర్చినప్పుడు మంజు తండ్రి పంపించిన మంజు ఫొటో తెరచి చూసాడు. అవే కర్టెన్లు.. టేబుల్ చూస్తే అలానే ఉంది.. దానిమీద ఫొటో కనిపించటం లేదు కానీ గణేశుడి విగ్రహం వైతరిణి ఫొటో లోని విగ్రహమే. దాని అర్థం ఏంటో వెంటనే బోధపడలేదు. అసలు ఏమి జరిగుంటుందో కూడా ఊహించటానికి భయం వేస్తోంది.

ఇన్నాళ్ళ తరువాత వైతరిణి సడెన్ గా పలకరించటం.. ఏదీ నమ్మబుద్ధి కాక మంజు కి మళ్ళీ ఫోన్ చేసాడు.

* * *

"నువ్వు అమృతానందమయి శిష్యురాలివా? నీ ఫొటో చూస్తున్నాను అందులో ఆవిడ ఉన్నారు?" నిజానికి మంజు ఫొటో లో అమృతానందమయి అసలు లేకపోయినా విషయ నిర్థారణ కోసం అన్నాడు.

లేదు. నా రూమ్మేట్.

ఎవరు?

తనా.. వై.. అదే వాణి అని.. నాతో ఇంజినీరింగ్ చదివింది.

తన పేరు వాణి నా వైతరిణి నా? తనకీ నాకూ పరిచయం ఉంది అని నీకు ముందే తెలుసా?

వంశీ... నేను చెప్పేది కొంచెం నెమ్మదిగా విను. నచ్చచెప్పే ధోరణి లో అంది మంజు.

నాకు ఇప్పుడు మాట్లాడాలనిపించటం లేదు. తరువాత మాట్లాడదాం. చెప్పేసి ఫోన్ కట్ చేసాడు.

* * * ప్రస్తుతం * * *

మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మంజు. గంట నుండీ ప్రయత్నిస్తోంది. మాట్లాడాలి. కోపం కూడా తగ్గింది. ఇప్పుడు చెప్పాలంటే కోపం గా మాట్లాడటం కన్నా నెమ్మదిగా అమె అసలు ఎందుకు ఇలా వైతరిణి తో కలిసి ఏం తెలుసుకోవాలని ఇది చేసిందో.. తనని డైరెక్ట్ గా ఎందుకు అడగలేకపోయిందో అడగాలి. ఇప్పుడు తను ఒక అడుగు వెనక్కి వెయ్యటం వలన తన అహం ఏమీ దెబ్బతినదు.. ఒక నిర్ణయానికి వచ్చాడు.

"హలో.." అన్నాడు.

వంశీ నేను అసలు..

లేదు మంజూ.. నీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే నన్ను అడిగి ఉండాల్సింది. ఇప్పుడైనా ఆలశ్యం లేదు. అడుగు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు?

ఏమీ తెలుసుకోవాలని అనుకోవటం లేదు. ఇందాకా నువ్వు వైతరిణి గురించి చెప్పినప్పుడే నాకు అర్థం అయింది నిన్ను ప్రత్యేకం గా అడగాల్సినది ఏమీ లేదని. ఒకవేళ ఏమన్నా సందేహాలు ఉన్నా ఇప్పుడు నేను వాటికి సమాధానాల కోసం తప్పు దారి పట్టాను. మరొక సారి సరైన పద్ధతి లో ఆ ప్రశ్నలు అడుగుతాను. ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపోదాం.

వంశీ కి కూడా మంజు ఈ విషయాన్ని ఇలా వెనక్కి నెట్టడం మంచిదే అనిపించింది.

.. అంతే, కధ కంచి కి.. మనమింటికి.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.