కుళ్ళితే కుళంబం - చురకలు 100 - SKU
Share ఈ పేజీ ని పంపండి

కొన్నేళ్ళ క్రితం భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒకరు ఉత్తర ప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ని నోతికొచ్చినట్టు తిట్టారు. రాజకీయాల్లో ఈ రకమైన నోటి దురుసుతనం మామూలే అయినా, మాయావతి మహిళ కావటం తో నిప్పు మరికొంత వేగం గా అంటుకుంది.

దానిలో భాగం గా మాయావతి తనని అగౌరపరచిన భా.జ.పా తో పాటు అదే ధాటి న ఆ సమయం లో సభ లో కూర్చు కునికిపాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నీ కడిగిపారేసారు. అప్పట్లో వాళ్ళిద్దరూ ఇంకా ప్రత్యరుథులు. ప్రస్తుతం భా.జా.పా ని ఆపటానికి దేశం లో ఉన్న పార్టీలు అన్నీ ఒక కుళంబం ఒండుతున్నారు. కనుక ఇప్పుడు అదే మళ్ళీ జరిగితే, మాయావతి రాహుల్ గాంధీ ని క్షణం లో క్షమించేస్తారు.

మాయావతి ని కొంచెం మన దక్షినాది అమ్మ (జయలలిత) తో పోలుస్తారు. ఆ మాటకి వస్తే మన దేశం లో రాజకీయాల్లో ఉన్న మహిళలు గట్టి పిండాలు. అమ్మ గారు (జయలలిత), అక్క గారు (మమతా బెనర్జీ), సోదరి గారు (మాయవతి) పదవి లో లేనప్పుడు పదవి లో ఉన్న ప్రభుత్వాలని పెట్టిన ముప్పుతిప్పలు నిజంగా తెలుసుకొని తీరాలి.

ఆ మాట చెప్పాలంటే, మాయవతి క్షమాగుణం నిజంగా గొప్పది. ఒకానొక కాలం లో (1995) ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు మాయావతి గురువు కాన్షీ రామ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. పేపర్ల ద్వారా ఏ క్షణం లో అయినా కాన్షీ రామ్ తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారు అనే పుకార్లు చదివినా, చివరికి ఆ పుకారు కాస్తా నిజం అయ్యేసరికి ములాయం సింగ్, ఆయన రౌడీ మూక అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.

ఆ కోపం లో బహుజన పార్టీ ప్రధాన కార్యదర్శి మాయావతి తమ పార్టీ M.L.A లతో తదుపరి చర్యగురించి చర్చల్లో ఉన్న భవనం మీద లాఠీలూ, తూపాకుల తో 300 పైగా సమాజవాది పార్టీ దుండగులు దాడి చేసి మాయావతి, ఆమె పార్టీ M.L.A. ల మీద దౌర్జన్యం చేసారు. ఆ సమయం లో ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక గదిలో తల దాచుకున్న మాయావతి ని ఒక భారతీయ జనతా పార్టీ M.L.A. రక్షించారు. ఈ సంఘటన తరువాత, ములాయం సింగ్ ప్రభుత్వాన్ని అప్పట్లో కేంద్రం లో ఉన్న P.V.నరసింహ రావు ప్రభుత్వం ములాయం సింగ్ కి అసెంబ్లీ లో బలం నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రద్దు చేసింది. భారతీయ జనతా పార్టీ మద్దతు తో మాయావతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఈ సంఘటన తరువాత ములాయం సింగ్, మాయావతి జన్మ లో మళ్ళీ దోస్తీ చెయ్యం అని కుండలు బద్దలు కొట్టేసుకున్నారు.

ఆ కుండలని ఇప్పుడు కేంద్రం లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పుణ్యమా అని మళ్ళీ అతికించేసుకొని, మా ఇద్దరి దోస్తీ కి మధ్య కాంగ్రెస్ పార్టీ ఎందుకు పానకం లో పుడక లాగ అని కాంగ్రెస్ లేని సయోధ్య చేసేసుకున్నారు. ఇప్పుడు 2019 లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయే లోపల ఈ స్నేహ బంధం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

నా చిన్నప్పుడు మా ఇంట్లో నాన్నగారు ఒక్కరూ జనతా పార్టీ అభిమాని. మా అమ్మ గారు, తాతయ్య గారు, అమ్మమ్మ అందరూ ఇందిరమ్మ భక్తులు. ఇందిరా గాంధీ ని విమర్శించటానికి నాన్నగారు అమె ఎమర్జెన్సీ ధారుణాలు గురించి మాట్లాడితే, మా అమ్మగారు రోషం తో ఉడికిపోయేవారు. ఆవిడని ఎదుర్కోవటానికి పేరూ ఊరూ లేని పార్టీలు అన్నీ కలిసి ఒక అతుకుల బొంత ని కుట్టారు. ఏమయ్యింది? జనాలు నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు మాకీ చండాలం గా సొంత వేస్ట్ ని తాగే ప్రధాన మంత్రి వద్దు అని మళ్ళీ ఆవిడనే కుర్చీ మీద కూర్చోబెట్టారు అని కడిగి పారేసేవారు.

మన ఆంధ్ర ప్రదేశ్ లో N.T.R. ఏలిక లోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న తిక్క లంపటాల తరువాత నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ కి జై అన్నారు అది వేరే సంగతి.

N.T.R. అంటే గుర్తొచ్చింది. మొన్న తెలంగాణా ఎన్నికలలో K.C.R. ని ఎదుర్కోవటానికి తెలంగాణా లో చంద్రబాబు తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టాయి. ఈ విషయం పేపర్లలో చదివి N.T.R. బతికి ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకమే వ్యక్తిత్వం గా తను స్థాపించిన తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ తో చేతులు కట్టడం చూసి ఏం చేసుండేవారో అనుకున్నాను. అది వచ్చే నెలలో విడుదల అయే మహనాయకుడు సినిమా లో ఏమన్నా చూపిస్తారేమో!

ఇంతకీ ఈ చురక కి కుళ్ళితే కుళంబం అని పేరెందుకు పెట్టానా అని ఆలోచిస్తున్నారా? ఈ సినిమా మీకు ఆల్రెడీ ఒక పాతిక సారులు చూపించేసి ఉంటే క్షమించాలి.

మా నాన్నగారు హోటల్ సాంబార్ కి పెట్టిన పేరు కుళంబం. ఇది తమిళ మాట అనుకుంటా. ఈ కుళంబం ని ఎలా చేస్తారు అనేది మా నాన్నగారు ఎక్కడ నేర్చుకున్నారో తెలీదు కానీ, మాకు చెప్పినది ఏమంటే, ఇంట్లో సగం సగం పాడైపోయిన కూరలూ, సగం సగం ముక్కలూ మిగిలిపోతే వాటిని అన్నిటినీ కలిపి ఓ గంటా రెండు గంటలు మరిగించేసి కుళంబం అని ఒడ్డిస్తారుట. ఇప్పుడు ఈ సగం సగం పార్టీలు అన్నీ కలిసి మహాఘటబంధన్ అని పేరు పెట్టుకున్నారు కానీ మా నాన్నగారు ఉండి ఉంటే దాన్ని కుళంబం అనే పిలిచేవారు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.